రేకుల ఇంటిపై కూరగాయలు పండిస్తున్న ప్రవీణ్
మనసుంటే మార్గం లేకపోదు. ఇంటి పంటలకు మనసులో చోటిస్తే చాలు.. మనకున్న అతికొద్ది చోటులోనూ పచ్చని కూరల వనాన్నే పెంచవచ్చు అనడానికి ఈ రేకుల మిద్దె తోటే ప్రత్యక్ష సాక్ష్యం!
పక్కా భవనాల్లో ఉంటున్న వారు కూడా ఇంటి పైన కుండీలు, మడులు పెట్టి మొక్కలు పెంచాలంటే శ్లాబ్ దెబ్బతింటుందేమో అని సందేహ పడి తటపటాయిస్తున్న రోజులివి. అయితే, పదేళ్ల క్రితం నుంచే రేకుల ఇంటిపైన సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఓ యువ పూజారి. కరోనా లాక్‌డౌన్ ఎండా కాలంలో కూడా బయటకు వెళ్లి కొనకుండా పూర్తిగా తన ఇంటిపంటలే సరిపోయాయని అంటున్నారు.
అతని పేరు పుట్టా ప్రవీణ్‌కుమార్. సికింద్రాబాద్‌లోనే పుట్టి పెరిగాడు. తన తల్లి కృష్ణవేణికి ఇంటి చుట్టూ మొక్కలు పెంచటం అంటే మహాఇష్టం. అలా చిన్నప్పటి నుంచే ప్రవీణ్‌కు సేంద్రియ ఇంటిపంటల సాగుపై ఆసక్తి కలిగింది. తల్లి మర ణించిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. బన్సీలాల్‌పేట్ డివిజన్ బోయిగూడ ప్రాంతంలో శ్రీధనలక్ష్మీ ఉప్పలమ్మ ఆలయంలో ప్రవీణ్ పూజారిగా పనిచేస్తూ, అక్కడే నివాసం ఉంటున్నారు. అల్ల నేరేడు చెట్టు కింద ఈ గుడి ఉంటుంది. గుడిలో భాగంగానే (ఇనుప కమ్ముల మీద వేసిన) సిమెంటు రేకుల షెడ్డు ఉంది. దాని విస్తీర్ణం 60 గజాలు ఉంటుంది. ఆ రేకుల ఇంటిపైన పిట్టగోడల మీద ఒడుపుగా ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. రేకులకు ఇబ్బందేమీ లేదా అంటే.. పదేళ్ల క్రితం నుంచే తాను ఇలా కూరగాయలు, ఆకుకూరలు పండించుకొని వండుకు తింటున్నానని, ఎప్పుడూ ఏ ఇబ్బందీ రాలేదని ప్రవీణ్ తెలిపారు.
పూలు, వంటింటి వ్యర్థాలకు ఆవు పేడ కలిపి తానే ఎరువు తయారు చేసుకొని వాడుతున్నారు. రేకుల ఇల్లు కాబట్టి చూట్టూతా పిట్ట గోడపైనే మడులు, కుండీలు, బాటిల్స్ పెట్టి సాగు చేస్తున్నారు. దూరం నుంచి చూస్తే చిన్న స్థలమే కదా అనిపిస్తుంది. కానీ, చిన్న కవర్లు, ట్రేలు, కుండీలు, టబ్‌లలో అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తుండటం విశేషం. మడుల్లో కన్నా బాటిల్స్‌లోనే తక్కువ నీటితో సాగు చేయవచ్చని అనుభవపూర్వకంగా చెబుతున్నారు ప్రవీణ్. అమ్మ చెప్పిందని బొగ్గులను నెలకోసారి ఎరువుగా వేస్తున్నానన్నారు.
బచ్చలికూర, పాలకూర, తోటకూర, గోంగూర ఉన్నాయి. చిక్కుడు, గుమ్మడి, బీర, సొర తీగలను కట్టెల పందిరికి పాకించారు. 60–70 టమాటా, 30 స్వీట్‌కార్న్, 15 బెండ, 15 వంగ మొక్కలతోపాటు ఉల్లి, పచ్చిమిర్చి మొక్కలు కూడా ప్రవీణ్ రేకుల మిద్దె తోటలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు.
పదులకొద్దీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌కు అడుగు కత్తిరించి మొక్కలు పెంచుతున్నారు. పంటల మార్పిడి తప్పకుండా పాటిస్తున్నారు. తాను తినగా మిగిలిన కూరగాయలను ఇతరులకు పంచిపెడుతున్నారు. గత ఏడాది ఈ బాటిల్స్‌లో 5 కిలోల వరి ధాన్యం కూడా పండించారు. ఆ ధాన్యాన్ని పూజా కార్యక్రమాల్లో వాడుకున్నానని తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్, అంజీర గింజలు విత్తి నర్సరీ పెంచుతున్నారు. మొక్కల మీద, అమృతాహారం మీద, శ్రమైకజీవనం మీద ప్రవీణ్‌కు ఉన్న ప్రేమ అవ్యాజమైనది.
ఇంతకన్నా ఆనందం ఏముంది?
మొక్కలు పెంచటం నాకెంతో ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది. ఇంటి పంటల మధ్య ఉంటే ఒత్తిడి పోతుంది. హాయిగా ఉంటుంది. ప్రతి రోజు రెండు గంటల సమాయాన్ని కేటాయిస్తున్నా. ఇతరత్రా ఏ పనుల్లోనూ ఈ ఆనందం లేదు.
– పుట్టా ప్రవీణ్‌కుమార్ (86868 08194), బోయిగూడ, సికింద్రాబాద్
– ఇ.చంద్రశేఖర్, సాక్షి, బన్సీలాల్‌పేట్ (సికింద్రాబాద్)
Comments
Please login to add a commentAdd a comment