pujari
-
అయోధ్య: నేటి నుంచి మరో 20 మంది పూజారుల సేవలు
అయోధ్య: రామనగరి ఆయోధ్యలో నేటి నుంచి (జూలై 1) మరో 20 మంది పూజారులు సేవా విధుల్లో చేరారు. వీరికి బాధ్యతలు అప్పగించే ముందు వివిధ పూజలకు సంబంధించిన శిక్షణ అందించారు. ఇకపై వీరు ఇప్పటికే నియమితులైన పూజారులతో పాటు పూజాదికాలు నిర్వహించనున్నారు. నూతనంగా చేరిన పూజారులకు డ్రెస్ కోడ్ కూడా జారీ చేశారు. రామాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇతర సిబ్బందికి కూడా త్వరలోన్ డ్రెస్ కోడ్ జారీ చేయనున్నారు.ఈ సందర్భంగా సహాయక పూజార్ అశోక్ మాట్లాడుతూ 20 మంది పూజారులకు ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని తెలిపారు. అరంతరం నియామక పత్రాలు అందజేశారన్నారు. ఒక్కో ఉన్నతస్థాయి పూజారి దగ్గర కొత్తగా నియమితులైన ఐదుగురు పూజారులు విధులు నిర్వహించనున్నారన్నారు. పూజారులెవరూ ఆండ్రాయిడ్ ఫోన్లను ఆలయంలోనికి తీసుకురాకూడదనే నిబంధన విధించారన్నారు.రామాలయంలో విధులు నిర్వహిస్తున్న ప్రకాశ్ గుప్తా మాట్లాడుతూ కొత్త పూజారులకు శిక్షణ పూర్తయ్యిందని, వీరంతా ఇకపై ఆలయంలో జరిగే పూజాదికాలలో పాల్గొంటారని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో మరికొన్ని ఆలయాలు నిర్మితం కానున్నాయని, వాటిలో కూడా పూజారుల అవసరం ఉంటుందని అన్నారు. ఆలయ పూజారులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఇవ్వడం ద్వారా భక్తులు వారిని సులభంగా గుర్తు పట్టగలుగుతారన్నారు. -
ఒడిశా సీఎంగా సురేశ్ పూజారి?
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో దాదాపు 24 ఏళ్లకు బీజేపీ గెలుపు సొంతం చేసుకోవడం తెల్సిందే. ముఖ్యమంత్రి కుర్చీని అధిరోహించేదెవరన్న విషయంలో మాత్రం సందిగ్ధం కొనసాగుతోంది. అయితే, సీనియర్ నేత, తాజాగా ఎమ్మెల్యే సురేశ్ పూజారిని పార్టీ హైకమాండ్ ఢిల్లీకి రావాలంటూ కబురు పంపించింది. దీంతో, సీఎం పదవి ఆయనకే దక్కవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. శాసనసభా పక్ష నేత ఎవరనేది అధిష్టానమే చూసుకుంటుందని రాష్ట్ర వర్గాలు అంటున్నాయి. ఇలా ఉండగా, ప్రధానమంత్రి బిజీ షెడ్యూల్ దృష్ట్యా కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఈ నెల 10కి బదులుగా 12న చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి. -
‘ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయాల్సిందే’.. అయోధ్య ప్రధాన పూజారి ఆగ్రహం
ప్రభాస్ లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ టీజర్‌పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ విడుదలైనప్పటి నుంచి దీనిపై సాధారణ ప్రజలు, ఫ్యాన్స్‌తో పాటు రాజకీయ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రామాయణాన్ని తప్పుగా చూపించారంటూ డైరెక్టర్ ఓం రౌత్‌పై మండిపడుతున్నారు. రామాయణంలో రావణుడు, హనుమంతుడి పాత్రలు దర్శకుడిగా తెలియదా.. అధ్యయనం చేయకుండానే ఆదిపురుష్‌ను తెరకెక్కించాడంటూ బీజేపీ అసహనం వ్యక్తం చేస్తోంది. మరోవైపు వీఎఫ్ఎక్స్ అసలు బాగోలేదని, ఇది బొమ్మల సినిమాగా ఉందంటూ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ‘మై విలేజ్ షో’ గంగవ్వ నెల సంపాదన ఎంతో తెలుసా? టీజర్‌పై వస్తున్న వ్యతీరేకత చూసి ఇప్పటికే మూవీ టీం, డైరెక్టర్ అయోమయ స్థితిలో పడ్డారు. ఈ తరుణంగా ఆదిపురుష్ టీం మరో షాకిచ్చింది అయోధ్య. ఈ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. వార్షిక రథయాత్ర సందర్భంగా ఇక్కడకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదిపురుష్ టీజర్‌పై స్పందించారు. రామాయణంలో పేర్కొన్న విధంగా ఆదిపురుష్‌లో రాముడు, రావణుడు, హనుమంతుడి పాత్రలను డైరెక్టర్ ఓంరౌత్ చూపించలేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ సినిమాలోని రాముడు, రావణుడు, హనుమంతుడి పాత్రలు హిందుమత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయి. చదవండి: ‘పొన్నియన్ సెల్వన్’ వివాదం, కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు ఆ పాత్రలను డైరెక్టర్ రామాయణంలో ఉన్న విధంగా చూపించలేదు. ఇది వారిని అగౌరవ పరిచేలా ఉంది. తక్షణమే ఆదిపురుష్‌ను నిషేధించాలని మేం డిమాండ్ చేస్తున్నాం’ అని అయన పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ సైతం ఆదిపురుష్ టీజర్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే బాలీవుడ్ ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఇతీహాసాలు, చరిత్రపై సినిమా తీయడం నేరం కాదని, అయితే తమ సొంత ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా వివాదాలు సృష్టించడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. కాగా అక్టోబర్ 2న అయోధ్య వేదికగా ఆదిపురుష్ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. -
హృదయ విదారక ఘటన: నవజాత శిశువుని మెట్లపై వదిలేశారు
సిమ్లా: పిల్లలు కలగాలని కొందరు దంపతులు ఆసుపత్రుల చుట్టు తిరుగుతుంటే.. మరికొందరు గుళ్ల చుట్టు తిరుగుతూ దేవుడికి మొక్కులు చెల్లింస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే, దీనికి భిన్నంగా కొంత మంది మాత్రం.. తమకు పుట్టిన సంతానాన్ని వేర్వేరు కారణాలతో వదిలివేస్తున్న సంఘటనలను తరచుగా వార్తల్లో చూస్తుంటాం. నిన్న(సోమవారం) జరిగిన ఈ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిమచల్ ప్రదేశ్‌లోని సోలాన్ అనే ప్రాంతంలో ఒక శివాలయం ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే ఆలయం ముందు నుంచి స్థానికులు వాకింగ్‌కు వెళ్తుంటారు. ఈ క్రమంలో సోమవారం ఒక చిన్నారి ఏడుపు వాకర్లకు వినిపించింది. దీంతో వారు అక్కడికి వెళ్లి చూశారు. ఆలయం మెట్లమీద ఒక నవజాత ఆడ శిశువు టవల్లో చుట్టి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆ చిన్నారి చలికి వణికిపోతుంది. వెంటనే స్థానికులు ఆలయ పూజారీ బ్రహ్మనంద్కు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి ఏవరో.. అని ఆరాతీస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నెలలు నిండకుండానే చిన్నారి పుట్టడం వలన వదిలేసుంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ పూజారీ బ్రహ్మనంద్ చిన్నారిని.. తాను దత్తత తీసుకుని పెంచుకుంటానని గ్రామస్తులకు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: బిడ్డ వేదనను చూడ లేక.. విషపు ఇంజెక్షన్ ఇచ్చి.. -
అర్చకత్వంలోనూ సగం..
దేవాలయాల్లో అర్చకులుగా ఎక్కువగా పురుషులే కనిపిస్తుంటారు. ఇప్పుడా స్థానాల్లోకి సైతం మహిళలు అడుగుపెట్టేస్తూ ఔరా అనిపిస్తున్నారు. తమిళనాడుకు చెందిన 28 ఏళ్ల సుహంజన గోపీనాథ్ వడియార్ (పూజారి) బుధవారం బాధ్యతలు చేపట్టి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అర్చకత్వం చేస్తూ మరెంతోమంది మహిళలకు ప్రేరణగా నిలవనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ సుహంజనను పూజారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం తో తమిళనాడులో రెండో మహిళా పూజారిగా నిలిచింది సుహంజన. 208 మంది అర్చకులను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా.. దీనిలో మహిళా పూజారిగా సుహంజన, ఇతర కులాల నుంచి శిక్షణ పొందిన అర్చకులు 24 మంది ఉన్నారు. మాడంబాకమ్‌లోని ధేనుపురీశ్వరర్ ఆలయంలో సుహంజన వడియార్‌గా సేవలందించనుంది. సుహంజనను అర్చకత్వం చేయడానికి ఆమె భర్త, మామగారు ముందుండి ప్రోత్సహించడం విశేషం. తమిళనాడులో మహిళ అర్చకత్వం చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. తండ్రి మరణించడంతో అతడు చేసే అర్చకత్వాన్ని వారసురాలిగా అతని కుమార్తె చేయవచ్చని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిన్నియక్కళ్ తమిళనాడులోనే తొలి మహిళా పూజారిగా బాధ్యతలు చేపట్టింది. పిన్నియక్కాళ్ తండ్రి పిన్న తేవార్ మధురైలోని అరుల్మిగు దురై్గ అమ్మన్ కోవెలలో పూజారిగా పనిచేసేవారు. ఆయనకు ఆరోగ్యం బాగోకపోవడంతో ఆలయంలో ఆయన చేయాల్సిన పనులను పిన్నియక్కాళ్ చేసేది. కొంత కాలం గడిచాక ఆరోగ్యం క్షీణించి పిన్నతేవార్ 2006లో మరణించాడు. దీంతో ఆయన స్థానంలో పిన్నియక్కాళ్కు ఆ బాధ్యతలు ఇవ్వడానికి గ్రామస్థులు ఒప్పుకోలేదు. ఆమె హైకోర్టును ఆశ్రయించడం తో పిన్నియక్కాళ్ అర్చకత్వం నిర్వహించవచ్చని కోర్టు తీర్పు చెప్పింది. దాంతో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి 2007లో పిన్నియక్కాళ్ను పూజారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేగాక ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ఇదే విషయాన్ని వక్కాణించి చెప్పడం విశేషం. ‘‘నేను కరూర్ సామినాథన్‌లో మూడేళ్లు అర్చకత్వాన్ని చదివాను. ఇది ఒక ఉద్యోగ అవకాశంగా నేను చూడడం లేదు. నిర్మాణాత్మకమైన సాంప్రదాయం ఇది. అర్చకత్వాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ మహిళలు కూడా ఇది చేయగలరని సందేశాన్ని సమాజానికి ఇవ్వాలనుకుంటున్నాను’’అని సుహంజన చెప్పింది. -
మైనర్లను రేప్ చేసిన వ్యక్తికి జీవిత ఖైదు
న్యూఢిల్లీ: 7, 9 వయసులు ఉన్న ఇద్దరు మైనర్లపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడినందుకుగానూ 76 ఏళ్ల పూజారికి ఢిల్లీలోని ఓ కోర్టు జీవిత ఖైదు విధించింది. తీర్పు సందర్భంగా మెజిస్ట్రేట్ విజేత సింగ్ రావత్ మాట్లాడుతూ.. పవిత్రమైన గుడి ఆవరణలోనే పూజారి విశ్వ బంధు మైనర్లపై అత్యాచార పర్వం కొనసాగించాడని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల ఫలితంగా బాధితులైన మైనర్లు భవిష్యత్తుపై భయం పెట్టుకున్నారని తీర్పులో తెలిపారు. ఇలాంటి మృగాన్ని బయటకు వదిలేస్తే కోర్టు కూడా తన బాధ్యతలో విఫలమైనట్లే అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. విశ్వబంధుకు యావజ్జీవ ఖైదుతో పాటు రూ. 60 వేల జరిమానా విధించారు. బాధితులకు రూ. 7.5 లక్షల చొప్పున సాయం అందించాలని ఆదేశించారు. -
ఉపాధి పనికి ఆలయ అర్చకుడు
కొడకండ్ల: జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని పురాతన శివాలయం అర్చకుడు పిండిప్రోలు నాగదక్షిణామూర్తి ఉపాధిహామీ పథకం పనుల్లో పాల్గొన్నాడు. ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ పీఆర్సీ ఫిట్మెంట్ 30% కల్పిస్తూ వేతనాలు పెంచిన తెలంగాణ సర్కారు అర్చకులను విస్మరించడాన్ని నిరసిస్తూ ఉపాధి పనులకు వెళ్లినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల గౌరవవేతనంలో రూ. 2 వేల వరకు సామగ్రికి వెచ్చిస్తున్నామని, అదికూడా రెండు, మూడు నెలలకు ఒకసారి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్చకులకు నెలకు రూ.15 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
యూపీలో మరో నిర్భయ
బధాయూ(యూపీ): యాభై ఏళ్ల అంగన్వాడీ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం చేసి, చిత్ర హింసలు పెట్టి, చంపేసిన దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. బధాయూ జిల్లాలో జరిగిన ఈ ఘోరం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2012 నాటి నిర్భయ హత్యాచార ఘటనను తలపించింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన పూజారి పరారీలో ఉండగా, అతడి ఇద్దరు సహాయకులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోస్ట్‌మార్టం నివేదికలో అత్యాచారం జరిగినట్లుగా తేలిందని, అలాగే బాధితురాలి మర్మాంగాలపై తీవ్ర గాయాలున్నాయని, కాలు, ఛాతీ ఎముక విరిగాయని పోలీసులు వెల్లడించారు. ఆదివారం జరిగిన ఈ ఘటన రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ పూజారి తన సహాయకుల సాయంతో మృతదేహాన్ని బాధితురాలి ఇంటికి తీసుకువెళ్లడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దేవాలయ ప్రాంగణంలోని ఎండిపోయిన బావిలో ఈ మృతదేహం కనిపించిందని బాధితురాలి కుటుంబ సభ్యులకు వారు వివరించారు. పోస్ట్‌మార్టం నివేదికలో రేప్ జరిగినట్లుగా తేలిన తరువాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. దోషులపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని బరేలీ జోన్ ఏడీజీని ఆదేశించారు. జాతీయ మహిళా కమిషన్ కూడా దీనిపై స్పందించింది. ఒక బృందాన్ని ఘటనా స్థలికి పంపించాలని నిర్ణయించింది. ఈ ఘటన సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించడంలో జాప్యం చేసిన, తక్షణమే స్పందించి, చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపిన ఉఘయితి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓను సస్పెండ్ చేసినట్లు సీనియర్ ఎస్పీ సంకల్ప్ శర్మ వెల్లడించారు. ‘ఆదివారం సాయంత్రం దేవాలయానికి ప్రార్థనల కోసం వెళ్లిన మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఆమెపై సామూహికంగా అత్యాచారం చేసి చంపేశారని గుడి పూజారి (మహంత్), అతడి ఇద్దరు సహాయకులపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశాం. నిందితుల్లో ఇద్దరిని మంగళవారం రాత్రి అరెస్ట్ చేశాం. పూజారి పరారీలో ఉన్నాడు’ అని వివరించారు. నిందితులపై ఐపీసీలోని 376డీ (గ్యాంగ్ రేప్), 302 (హత్య) సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. మహంత్‌ను పట్టుకునేందుకు ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఘటనాస్థలిని బరేలీ ఏడీజీ అవినాశ్ చంద్ర పరిశీలించారు. పరారీలో ఉన్న పూజారి గురించిన సమాచారం ఇచ్చినవారికి రూ. 50 వేలు ఇస్తామని ప్రకటించారు. పోస్ట్‌మార్టం నివేదికపై వైద్య నిపుణుల నుంచి రెండో అభిప్రాయం కోరామని తెలిపారు. ఈ ఘటనను 2012 నాటి నిర్భయ ఘటనతో పోల్చడాన్ని ఆయన తప్పుపట్టారు. దీన్ని గత ఘటనలతో పోల్చడం సరికాదన్నారు. అధిక రక్త స్రావంతో ఆమె చనిపోయారని బుధాన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యశ్పాల్ సింగ్ తెలిపారు. అంగన్వాడీ సహాయకురాలైన బాధితురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని బుధాన్ కలెక్టర్ కుమార్ ప్రశాంత్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం పూజ చేసేందుకు వెళ్లిన తన తల్లి తిరిగి రాలేదని, రాత్రి 11 గంటల సమయంలో మహంత్, అతడి ఇద్దరు సహాయకులు తమ ఇంటికి మృతదేహాన్ని తీసుకువచ్చారని బాధితురాలి కుమారుడు వివరించారు. దేవాలయ ప్రాంగణంలోని బావిలో పడిపోయిందని, బయటకు తీసి ఇక్కడకు తీసుకువచ్చామని చెప్పి వారు వెంటనే వెళ్లిపోయారని తెలిపారు. పోలీసులకు సోమవారం ఉదయం ఫిర్యాదు చేశామన్నారు. ‘మానవత్వానికి సిగ్గుచేటు. ఇంకా ఎంతమంది నిర్భయలు? యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎప్పుడు నిద్ర లేస్తుంది?’ అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. ‘మహిళల భద్రతపై గొప్పలు చెప్పుకునే ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో చచ్చిపోవాలి’ అని సమాజ్‌వాదీ పార్టీ మండిపడింది. -
ఇంటి పంటల పూజారి!
మనసుంటే మార్గం లేకపోదు. ఇంటి పంటలకు మనసులో చోటిస్తే చాలు.. మనకున్న అతికొద్ది చోటులోనూ పచ్చని కూరల వనాన్నే పెంచవచ్చు అనడానికి ఈ రేకుల మిద్దె తోటే ప్రత్యక్ష సాక్ష్యం! పక్కా భవనాల్లో ఉంటున్న వారు కూడా ఇంటి పైన కుండీలు, మడులు పెట్టి మొక్కలు పెంచాలంటే శ్లాబ్ దెబ్బతింటుందేమో అని సందేహ పడి తటపటాయిస్తున్న రోజులివి. అయితే, పదేళ్ల క్రితం నుంచే రేకుల ఇంటిపైన సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఓ యువ పూజారి. కరోనా లాక్డౌన్ ఎండా కాలంలో కూడా బయటకు వెళ్లి కొనకుండా పూర్తిగా తన ఇంటిపంటలే సరిపోయాయని అంటున్నారు. అతని పేరు పుట్టా ప్రవీణ్‌కుమార్. సికింద్రాబాద్‌లోనే పుట్టి పెరిగాడు. తన తల్లి కృష్ణవేణికి ఇంటి చుట్టూ మొక్కలు పెంచటం అంటే మహాఇష్టం. అలా చిన్నప్పటి నుంచే ప్రవీణ్‌కు సేంద్రియ ఇంటిపంటల సాగుపై ఆసక్తి కలిగింది. తల్లి మర ణించిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. బన్సీలాల్‌పేట్ డివిజన్ బోయిగూడ ప్రాంతంలో శ్రీధనలక్ష్మీ ఉప్పలమ్మ ఆలయంలో ప్రవీణ్ పూజారిగా పనిచేస్తూ, అక్కడే నివాసం ఉంటున్నారు. అల్ల నేరేడు చెట్టు కింద ఈ గుడి ఉంటుంది. గుడిలో భాగంగానే (ఇనుప కమ్ముల మీద వేసిన) సిమెంటు రేకుల షెడ్డు ఉంది. దాని విస్తీర్ణం 60 గజాలు ఉంటుంది. ఆ రేకుల ఇంటిపైన పిట్టగోడల మీద ఒడుపుగా ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. రేకులకు ఇబ్బందేమీ లేదా అంటే.. పదేళ్ల క్రితం నుంచే తాను ఇలా కూరగాయలు, ఆకుకూరలు పండించుకొని వండుకు తింటున్నానని, ఎప్పుడూ ఏ ఇబ్బందీ రాలేదని ప్రవీణ్ తెలిపారు. పూలు, వంటింటి వ్యర్థాలకు ఆవు పేడ కలిపి తానే ఎరువు తయారు చేసుకొని వాడుతున్నారు. రేకుల ఇల్లు కాబట్టి చూట్టూతా పిట్ట గోడపైనే మడులు, కుండీలు, బాటిల్స్ పెట్టి సాగు చేస్తున్నారు. దూరం నుంచి చూస్తే చిన్న స్థలమే కదా అనిపిస్తుంది. కానీ, చిన్న కవర్లు, ట్రేలు, కుండీలు, టబ్‌లలో అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తుండటం విశేషం. మడుల్లో కన్నా బాటిల్స్‌లోనే తక్కువ నీటితో సాగు చేయవచ్చని అనుభవపూర్వకంగా చెబుతున్నారు ప్రవీణ్. అమ్మ చెప్పిందని బొగ్గులను నెలకోసారి ఎరువుగా వేస్తున్నానన్నారు. బచ్చలికూర, పాలకూర, తోటకూర, గోంగూర ఉన్నాయి. చిక్కుడు, గుమ్మడి, బీర, సొర తీగలను కట్టెల పందిరికి పాకించారు. 60–70 టమాటా, 30 స్వీట్‌కార్న్, 15 బెండ, 15 వంగ మొక్కలతోపాటు ఉల్లి, పచ్చిమిర్చి మొక్కలు కూడా ప్రవీణ్ రేకుల మిద్దె తోటలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. పదులకొద్దీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌కు అడుగు కత్తిరించి మొక్కలు పెంచుతున్నారు. పంటల మార్పిడి తప్పకుండా పాటిస్తున్నారు. తాను తినగా మిగిలిన కూరగాయలను ఇతరులకు పంచిపెడుతున్నారు. గత ఏడాది ఈ బాటిల్స్‌లో 5 కిలోల వరి ధాన్యం కూడా పండించారు. ఆ ధాన్యాన్ని పూజా కార్యక్రమాల్లో వాడుకున్నానని తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్, అంజీర గింజలు విత్తి నర్సరీ పెంచుతున్నారు. మొక్కల మీద, అమృతాహారం మీద, శ్రమైకజీవనం మీద ప్రవీణ్‌కు ఉన్న ప్రేమ అవ్యాజమైనది. ఇంతకన్నా ఆనందం ఏముంది? మొక్కలు పెంచటం నాకెంతో ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది. ఇంటి పంటల మధ్య ఉంటే ఒత్తిడి పోతుంది. హాయిగా ఉంటుంది. ప్రతి రోజు రెండు గంటల సమాయాన్ని కేటాయిస్తున్నా. ఇతరత్రా ఏ పనుల్లోనూ ఈ ఆనందం లేదు. – పుట్టా ప్రవీణ్‌కుమార్ (86868 08194), బోయిగూడ, సికింద్రాబాద్ – ఇ.చంద్రశేఖర్, సాక్షి, బన్సీలాల్‌పేట్ (సికింద్రాబాద్) -
విష్ణు సహస్రనామావళితో పరివర్తన
సాక్షి, హైదరాబాద్: ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆలపించిన విష్ణు సహస్రనామ స్తోత్రం వింటుంటే మనసులోని అలజడులు అదృశ్యమై ప్రశాంతత చేకూరుతుందనే వారి సంఖ్య ఎక్కువే. అందుకే ఉదయం వేళ చాలామంది ఇళ్లలో విష్ణు సహస్ర నామావళి వినిపిస్తూ ఉంటుంది. కానీ, వాటి పఠనం వినసొంపుగానే ఉన్నా, చాలామందికి దాని తాత్పర్యం మాత్రం తెలియదు. తాత్పర్యం తెలిస్తే, ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడేలా మనసు కొత్తగా మారిపోతుందంటున్నారు గట్టు వేణుగోపాలా చార్య. అమెరికాలోని ఆర్కన్సాస్ రాష్ట్రం బెంటన్విల్లె సిటీలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ఆయన.. విష్ణు సహస్ర నామావళి తాత్పర్యంతో సహా జనంలోకి చేరాలని కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. విష్ణు సహస్ర నామాల్లోంచి నిత్యం ఓ నామాన్ని దాని తాత్పర్యంతో వివరిస్తూ ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో దాన్ని అన్వయించుకునే విధానాన్ని వివరిస్తూ ఒక నిమిషం పాటు ఉన్న వీడియోను ఆయన వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేస్తారు. ఆ గ్రూపు సభ్యులు ఆ వీడియోను చూసి నామాన్ని పఠించి, దాని తాత్పర్యాన్ని మననం చేసుకోవాలి. దీన్ని ఓ తపస్సులాగా భావించాలని, అలా విష్ణు సహస్ర నామాలను రోజుకు ఒకటి చొప్పున వేయి రోజుల పాటు జనంలోకి తీసుకెళ్తానని చెబుతున్నారు. దీనికి ఇప్పటికే అమెరికా, భారత్ సహా ఇతర దేశాలకు చెందిన వేల మంది భక్తులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. భీష్ముడే పాండవులకు ఉపదేశించినట్లుగా ఆ నామాలను వేదవ్యాసుడు అందించాడని పురాణాలు చెబుతున్నాయి. భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్ర నామావళి అందుబాటులోకి వచ్చాయని చెబుతున్నందున ఈనెల 5న భీష్మ ఏకాదశి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఎట్టకేలకు ఫలించిన కమల కల
జయపురం : ఒడిశా రాష్ట్ర ప్రణాళికా బోర్డు సభ్యురాలు, దేశీ వ్యవసాయ రంగంలో అద్భుత విజయాలను సాధిం చి ప్రపంచ స్థాయిలో ఎట్టకేలకు ఫలించిన కమల కల అవార్డులు, బహుమతులు పొంది రాష్ట్రానికే వన్నె తెచ్చిన కొరాపుట్ జిల్లా జయపురం సమితిలోని పాత్రోపుట్ గ్రామవాసి కమల పూజారి చిరకాల వాంఛ నెరవేరింది. నేటి వరకు ఆమె పాడుబడిన పూరి గుడిసెలో ఉంటోంది. ప్రభుత్వం ఆమెకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు నిర్మించి ఇవ్వడంతో శుక్రవారం నూతన గృహప్రవేశం చేశారు. గతంలో ఆమెకు ప్రధాన మంత్రి గ్రామీణ అవాస్ యోజనలో ఇల్లు మంజూరు కాగా మొదటి విడత డబ్బు మంజూరు చేసిన అదికారులు తరువాత మిన్నకున్నారు. అందుచేత ఆమె తన పాడుబడిన ఇంటిలోనే ఉంటోంది. ఆమెను రాష్ట్ర ప్రణాళికా బోర్డు సభ్యురాలిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తరువాత ఈ విషయం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందింది. ముఖ్యంగా ఆమె చిరకాల వాంఛ ఒక మంచి ఇల్లు అని పత్రికలు, మీడియా ప్రధానంగా హైలైట్ చేయడంతో అధికారులు స్పందించారు. వెనువెంటనే ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకంలో ఒక చక్కటి ఇల్లును నిర్మించారు. ఆమె నూతన గృహ ప్రవేశ ఉత్సవంలో కొçరాపుట్ జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ దేవణ ప్రధాన్, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన డైరెక్టర్ గౌరీశంకర సాహు, జయపురం సమితి బీడీఓ మనోజ్ కుమార్ నాయక్, జూనియర్ ఇంజినీర్ సరోజ్ కుమార్ మహంతి, పంచాయతీ సమితి కార్యనిర్వాహక అధికారి అంభికా పాఢి, జీఆర్‌ఈఎస్ తదితర అధికారులు, గ్రామప్రజలు పాల్గొన్నారు. -
పూజ పేరిట వచ్చి.. వ్యాపారికి శఠగోపం!
మంగళగిరి (గుంటూరు): దైవపూజ నిర్వహించేందుకు వచ్చిన ఓ పూజారి.. భక్తుడి నెత్తిమీద శఠగోపం పెట్టారు. వ్యాపారి కళ్లుగప్పి రూ. 50వేల విలువైన బంగారాన్ని మాయం చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగింది. మంగళగిరికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యాపారి ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఓ పూజారిని పిలిపించారు. అయితే, పూజలో కొంత బంగారాన్ని ఉంచాల్సిందిగా పూజారి శ్రీనివాసరావుకు చెప్పారు. ఆయన రూ. 50 వేల విలువైన బంగారాన్ని పూజలో పెట్టారు. కాసేపు పూజ చేస్తున్నట్టు అభినయించిన సదరు వ్యక్తి.. వ్యాపారి కళ్లు గప్పి బంగారంతో సహా ఉడాయించాడు. కాసేపటి తర్వాత తేరుకున్న వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పుష్కరస్నానానికి వెళ్లి పూజారి మృతి
తూడిచెర్ల(జూపాడుబంగ్లా): ఉదయాన్నే పుష్కరస్నానం చేసేందుకు ఎస్సార్బీసీకి వెళ్లిన ఓ పూజారి నీటిలో మునిగి తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఘటన జూపాడుబంగ్లా మండలం తూడిచెర్ల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పారుమంచాల గ్రామానికి చెందిన చెంచురామయ్య కుమారుడు ఫణీంద్రశర్మ(22) తూడిచెర్ల శంకరమల్లయ్యస్వామి గుడి వద్ద నివాసం ఉంటున్న అవ్వతాతలు లక్ష్మిదేవి, రామ్మూర్తి వద్ద ఉంటూ వేదపారాయణం చేస్తున్నాడు. సోమవారం ఉదయం పుష్కరస్నానం చేసేందుకు గుడికి సమీపంలోని ఎస్సార్బీసీ కాల్వ ర్యాంపులోకి దిగాడు. స్నానం ఆచరిస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి లోతుగా ఉన్న కాల్వలో పడి ఊపిరాడక మరణించాడు. కాల్వలో గాలించినా ఫలితం లేకపోవడంతో వెలుగోడు నుంచి గజఈతగాళ్లను రప్పించి వెతికించగా మతదేహంగా బయటపడ్డాడు. ఘటనా స్థలం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
మహిళలను మోసం చేస్తున్న పూజారీ అరెస్ట్!