యూపీలో మరో నిర్భయ | 50-year-old Anganwadi worker molestation in | Sakshi
Sakshi News home page

యూపీలో అంగన్‌వాడీ వర్కర్‌పై దారుణం

Published Thu, Jan 7 2021 4:40 AM | Last Updated on Thu, Jan 7 2021 1:07 PM

50-year-old Anganwadi worker molestation in  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బధాయూ(యూపీ): యాభై ఏళ్ల అంగన్‌వాడీ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం చేసి, చిత్ర హింసలు పెట్టి, చంపేసిన దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. బధాయూ జిల్లాలో జరిగిన ఈ ఘోరం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2012 నాటి నిర్భయ హత్యాచార ఘటనను తలపించింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన పూజారి పరారీలో ఉండగా,  అతడి ఇద్దరు సహాయకులను పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. పోస్ట్‌మార్టం నివేదికలో అత్యాచారం జరిగినట్లుగా తేలిందని, అలాగే బాధితురాలి మర్మాంగాలపై తీవ్ర గాయాలున్నాయని, కాలు, ఛాతీ ఎముక విరిగాయని పోలీసులు వెల్లడించారు.

ఆదివారం జరిగిన ఈ ఘటన రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ పూజారి తన సహాయకుల సాయంతో మృతదేహాన్ని బాధితురాలి ఇంటికి తీసుకువెళ్లడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దేవాలయ ప్రాంగణంలోని ఎండిపోయిన బావిలో ఈ మృతదేహం కనిపించిందని బాధితురాలి కుటుంబ సభ్యులకు వారు వివరించారు. పోస్ట్‌మార్టం నివేదికలో రేప్‌ జరిగినట్లుగా తేలిన తరువాత పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. దోషులపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని బరేలీ జోన్‌ ఏడీజీని ఆదేశించారు. జాతీయ మహిళా కమిషన్‌ కూడా దీనిపై స్పందించింది.

ఒక బృందాన్ని ఘటనా స్థలికి పంపించాలని నిర్ణయించింది. ఈ ఘటన సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించడంలో జాప్యం చేసిన, తక్షణమే స్పందించి, చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపిన ఉఘయితి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓను సస్పెండ్‌ చేసినట్లు సీనియర్‌ ఎస్పీ సంకల్ప్‌ శర్మ వెల్లడించారు. ‘ఆదివారం సాయంత్రం దేవాలయానికి ప్రార్థనల కోసం వెళ్లిన మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఆమెపై సామూహికంగా అత్యాచారం చేసి చంపేశారని గుడి పూజారి (మహంత్‌), అతడి ఇద్దరు సహాయకులపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశాం. నిందితుల్లో ఇద్దరిని మంగళవారం రాత్రి అరెస్ట్‌ చేశాం. పూజారి పరారీలో ఉన్నాడు’ అని వివరించారు. నిందితులపై ఐపీసీలోని 376డీ (గ్యాంగ్‌ రేప్‌), 302 (హత్య) సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.

  మహంత్‌ను పట్టుకునేందుకు ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఘటనాస్థలిని బరేలీ ఏడీజీ అవినాశ్‌ చంద్ర పరిశీలించారు. పరారీలో ఉన్న పూజారి గురించిన సమాచారం ఇచ్చినవారికి రూ. 50 వేలు ఇస్తామని ప్రకటించారు. పోస్ట్‌మార్టం నివేదికపై వైద్య నిపుణుల నుంచి రెండో అభిప్రాయం కోరామని తెలిపారు.  ఈ ఘటనను 2012 నాటి నిర్భయ ఘటనతో పోల్చడాన్ని ఆయన తప్పుపట్టారు. దీన్ని గత ఘటనలతో పోల్చడం సరికాదన్నారు. అధిక రక్త స్రావంతో ఆమె చనిపోయారని బుధాన్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ యశ్‌పాల్‌ సింగ్‌ తెలిపారు. అంగన్‌వాడీ సహాయకురాలైన బాధితురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని బుధాన్‌ కలెక్టర్‌ కుమార్‌ ప్రశాంత్‌ ప్రకటించారు.

ఆదివారం సాయంత్రం పూజ చేసేందుకు వెళ్లిన తన తల్లి తిరిగి రాలేదని, రాత్రి 11 గంటల సమయంలో మహంత్, అతడి ఇద్దరు సహాయకులు తమ ఇంటికి మృతదేహాన్ని తీసుకువచ్చారని బాధితురాలి కుమారుడు వివరించారు. దేవాలయ ప్రాంగణంలోని బావిలో పడిపోయిందని, బయటకు తీసి ఇక్కడకు తీసుకువచ్చామని చెప్పి వారు వెంటనే వెళ్లిపోయారని తెలిపారు. పోలీసులకు సోమవారం ఉదయం ఫిర్యాదు చేశామన్నారు. ‘మానవత్వానికి సిగ్గుచేటు. ఇంకా ఎంతమంది నిర్భయలు? యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఎప్పుడు నిద్ర లేస్తుంది?’ అని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా ట్వీట్‌ చేశారు. ‘మహిళల భద్రతపై గొప్పలు చెప్పుకునే ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో చచ్చిపోవాలి’ అని సమాజ్‌వాదీ పార్టీ మండిపడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement