
జనాభాతో పాటుగా ఇంటి నిర్మాణాలు పెరిగి పర్యావరణ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలను నివారించడానికి ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూల జీవన శైలిని కొనసాగించడానికి హరిత భవనాలు ఎంతో ఉపయోగపడతాయి. పర్యావరణ అనుకూల మెటీరియల్, డిజైన్‌తో భవనాన్ని నిర్మించి, పర్యావరణ అనుకూలంగా ఏ భవనాలనైతే నిర్వహిస్తారో వాటిని ‘హరిత భవనాలు’ అంటారు.
ఈ భవన నిర్మాణంలో స్థలం ఎంపికకూ ప్రాధాన్యం ఉంది. అంటే పర్యావరణ సున్నితమైన ప్రదేశాలలో హరిత భవనాలను నిర్మించరాదు. ఉదాహరణకు అధిక మొత్తంలో వ్యవసాయ దిగుబడిని ఇచ్చే సారవంతమైన వ్యవసాయ భూములను హరిత భవనాల నిర్మాణాల కోసం వాడరాదు. దీని వలన మనం ప్రకృతి సిద్ధంగా లభించిన విలువైన వ్యవసాయ భూమిని కోల్పోతాము. ఇది ఆహార ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది.
సహజసిద్ధంగా గాలి, వెలుతురు వచ్చే విధంగా వీటి నిర్మాణాన్ని చేపడతారు. వెలుతురు బాగా ఉండే గదులలో చదివే విద్యార్థులు నేర్చుకునే సామర్థ్యం, వెలుతురు సరిగ్గా లేని గదిలో చదివే విద్యార్థుల కన్నా 20 నుండి 26 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలలో తేలింది. హానికర రసాయన పదార్థాలు కలిగిన లెడ్ పెయింట్లు భవనాల లోపల గాలి నాణ్యతను హానికరంగా మారుస్తాయి కావున వాటి స్థానంలో సహజ సిద్ధమైన రంగులను వాడతారు. ఇండోర్ ప్లాంట్స్ ఏర్పాటు కూడా ఈ భవనాలలో ఉంటుంది. దీనివలన భవనాల లోపల గాలి నాణ్యత పెరుగుతుంది.
తక్కువ విద్యుత్‌ను వినియోగించే ఎల్‌ఈడీ బల్బ్‌లను, ఇతరత్రా తక్కువ విద్యుత్‌ను వినియోగించుకొనే ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటం వలన ఈ భవనాలలో తక్కువగా విద్యుత్ ఖర్చవుతుంది. అదేవిధంగా సోలార్, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక విద్యుత్‌ను వాడటం వలన గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడంలో హరిత భవనాలు కీలక పాత్ర వహిస్తాయి. హరిత భవన పైకప్పులో కాంతిని రిఫ్లెక్ట్ చేసే పదార్థాలను వాడటం వల్ల ఇంటి పైకప్పు వేడి తగ్గుతుంది. పైకప్పు భాగంలో చిన్న, చిన్న మొక్కలను పెంచడం వలన వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ వాయువులను ఇవి గ్రహిస్తాయి. అదేవిధంగా ఇంటి పై కప్పు భాగంలో జీవ వైవిధ్యం పెరిగి సీతాకోకచిలుకలు, పక్షులు వంటి వాటిని ఆకర్షించడం వలన భవనం ఆకర్షణీయంగా మారుతుంది.
ఈ భవనాలలో సేంద్రియ వ్యర్థ పదార్థాలను బయో గ్యాస్‌గా మార్చడం లేదా సేంద్రియ ఎరువుగా మార్చి ఉపయోగించే ఏర్పాట్లు ఉంటాయి. వాడిన నీటిని శుద్ధిచేసి తిరిగి గార్డెనింగ్, ఇతరత్రా పనులకు వినియోగించడం వలన నీరు వృథా కాదు. ఈ నిర్మాణాలలో వర్షపు నీరును పట్టి భూమిలోకి ఇంకిపోయేలా చేసే ఏర్పాట్లు ఉండడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న హరిత భవనాలు వాతావరణ మార్పుల నుండి మానవాళిని రక్షించగలుగుతాయి అనడం అతిశయోక్తి కాదు. – డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, హైదరాబాద్