(నేడు ఆత్రేయ వర్ధంతి: ఈ నెల 22న విజయవాడలో ‘అక్షర శిల్పి ఆత్రేయ’ పుస్తకావిష్కరణ)
ఆత్రేయ
‘ఆత్రేయ సాహితి’ సంపాదకులు డా‘‘ జగ్గయ్య – ‘సినిమా పాటకు సాహిత్య మందిరంలో పట్టాభిషేకం చేయించిన అపర శ్రీనాథుడు. మనిషికీ, మనసుకీ కొత్త భాష్యాలు పలికిన అక్షర యోగి...’ అంటూ ఆత్రేయను ప్రశంసించారు.
‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ అనే స్వీయ వ్యాస సంపుటిలో వేటూరి ‘శబ్దాడంబరం లేకుండా నిర్మల గంగా ప్రవాహం లాగ చిరు చిరు అలలతో అగాథాల్ని దాస్తూ... ప్రకటిస్తూ సాగిన సాహితీగంగ ఆత్రేయది’ అని మెచ్చుకున్నారు. వెన్నెలకంటి ఆత్రేయను ‘సినీ వేమన’ అన్నారు. శ్రీశ్రీ తెలుగు కవిత్రయంగా తిక్కన, వేమన, గురజాడలను పేర్కొంటే వారి సరసన సినీరంగం నుంచి ఆత్రేయను చేర్చారు వెన్నెలకంటి! ఆత్రేయ మాటలు పాటలు లాగా, పాటలు మాటలు లాగా వుంటాయనీ, ఆత్రేయ పత్రికల్లో వార్తలా వచనం రాసినా, అది మామ మహదేవన్ స్వరకల్పనలో పాటగా ఒదిగేదనీ నిర్మాత మురారి అంటుండేవారు. అటువంటి ఆత్రేయ పాటల్లో పంక్తులు కొన్ని తెలుగునాట నానుడులుగా, నిత్య సత్యాలుగా, హితోక్తులుగా స్థిర పడిపోయాయి కూడా! అలాంటి ఆణిముత్యాలను కొన్నిటిని ఏరుకుందాం.
ఆత్రేయకు జనం పెట్టిన పేరు మన‘సు’ కవి. అది జనం మనసుల్లో ఆయనకు పడిన ముద్ర తప్ప, ఏ సన్మాన సభలోనో, సాహితీ సంస్థో, ప్రభుత్వమో ప్రదానం చేసిన బిరుదు కాదు. ఆత్రేయ మనసు పాటల్లో తరళరత్నం ‘ప్రేమనగర్’ చిత్రంలోని ‘మనసు గతి యింతే/ మనిషి బ్రతుకింతే/ మనసున్న మనిషికి/ సుఖము లేదంతే...’ అనే పంక్తులు. అవి విని మురిసిపోయిన దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు ఆత్రేయను మెచ్చుకుంటూనే చిన్న సందేహం వచ్చి ‘చివర్లో ‘అదంతే’ ఎందుకు?’ అని అడిగారట. ‘అదంతే’ అని చిరునవ్వుతో బదులిచ్చారట... మాటల్ని ఆచితూచి ప్రయోగించే అక్షరయోగి ఆత్రేయ.
‘ప్రేమలు–పెళ్లిళ్లు’ చిత్రంలోని – ‘మనసులేని దేవుడు మనిషి కెందుకో మనసిచ్చాడు/ మనసు మనసును వంచన చేస్తే/ కనుల కెందుకో నీరిచ్చాడు’ అనే పంక్తులు కూడా నిత్యజీవితంలో అంద రికీ గుర్తొచ్చే గొప్ప అభివ్యక్తులు. పద క్రీడలతో సార్వకాలిక సత్యాలను వెల్లడించిన ఆత్రేయ ‘ఉండడం’, ‘లేకపోవడం’ అనే రెండు పదాలను తీసుకొని అమ్మ గొప్పతనం గురించి ఎంతక్లుప్తంగా, ఆప్తంగా చెప్పారో చూడండి – ‘అమ్మ ఉంటే లేనిదేమీ లేదు/ అమ్మ లేక ఏమున్నా ఉన్నది కాదు’ (కలసిన మనసులు)! ప్రేమ గురించి ‘అది’, ‘ఇది’ అంటూ ఆత్రేయ అంత గోప్యంగా చెప్పిన కవులు అరుదు. ‘నువ్వంటే నాకెందుకో ఇంత యిది, ఇంత యిది’ (అంతస్తులు); ‘ఇదే నన్నమాట – ఇది అదే నన్నమాట/ మది మదిలో లేకుంది – మనసేదో లాగుంది/ అంటే ఇదేనన్నమాట – ఇది అదేనన్న మాట’ (కొడుకు–కోడలు).
మరో రెండు వాక్చిత్రాలను కూడా పేర్కొనాలి. అందులో మొదటిది అందరికీ తెలిసిన ‘మూగ మనసులు’ చిత్రంలో నూతన వధూవరులు, పెద్దల సమక్షంలో కథానాయకుడు గోపి పాడిన ‘ముద్ద బంతి పూవులో...’ పాటలోని – ‘నవ్వినా ఏడ్చినా... కన్నీళ్లే వస్తాయి.’ ఇది పది వాక్యాల పెట్టు అని డాక్టర్ సి.నా.రె. వ్యాఖ్యానించిన తర్వాత ఇంకే వివరణ కావాలి? ఇలా అక్షర లక్షల విలువైన జీవిత సత్యాలను గమనిస్తే ఆత్రేయ... వేమనలా కవి మాత్రమే కాదు– ఒక యోగి కూడా అనిపిస్తారు. – డా‘‘ పైడిపాల, సినీ గేయ సాహిత్య పరిశోధకులు, 99891 06162
ఇవి చదవండి: కాసేపట్లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment