కోల్‌కతా నగరంలో ఆర్‌జీ కార్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో విధుల్లో ఉన్న మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి, హత్య చేసిన దారుణ సంఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి, తీవ్ర ఆందోళనకు గురి చేసింది. దేశంలో ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో, రక్షణ కొరవడిన స్థితిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముఖ్యంగా మహిళలు విధుల్ని నిర్వహించాల్సి వస్తోందో ఇంకోసారి తేటతెల్లం చేసిన ఘటన ఇది. ఆ పీజీ వైద్య విద్యార్థి 36 గంటలుగా విధుల్లో ఉన్నారు. అర్ధరాత్రి దాటాక కాసేపు సెమినార్ రూమ్‌లో విశ్రమించిన సమయంలో దారుణానికి బలయ్యారు. అక్కడ సీసీ కెమెరాలు పని చెయ్యడం లేదట. ఆగంతకులు రాకుండా సరిపడా భద్రత, సరియైన వెలుతురు లేని క్యాంపస్... ఇవన్నీ ఆ కిరాతక చర్యకు దోహద పడ్డాయి.
ఇది వ్యవ స్థాగత లోపం. మహిళా ఉద్యోగులకు పూర్తి స్థాయి భద్రత కల్పించలేని నిర్వాకం. ముఖ్యంగా వైద్య రంగంలో పనిచేస్తున్న వారు ఆరోగ్య సేవలు అందించడంలో తీవ్రంగా శ్రమ పడుతున్నారు. అయినా రోగి బంధువుల నుండి భౌతిక దాడులకు గురవ్వడం లాంటి సంఘటనలు పెరుగుతూ వస్తున్నాయి. వాటిని అరికట్టే కఠిన చట్టాలు, చట్ట ప్రకారం సత్వరం శిక్ష పడేలా ఏర్పాట్లు వ్యవస్థలో అవసరం. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. ప్రాణాలు నిలిపే డాక్టరు, తానే ప్రాణభయంతో చికిత్స అందించాల్సి వస్తే అది రోగికి మాత్రమే కాదు ప్రజారోగ్య వ్యవస్థకే ప్రమాదం. ఇక హత్యోదంతం విషయంలో ఆ వైద్య కళాశాల పెద్దలే కాకుండా, ప్రభుత్వం కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది.
హత్యాచారం జరిగిన పిమ్మట ఆ కళాశాల ప్రిన్సిపాల్ రిపోర్ట్ ఇవ్వడానికి కూడా ఆలస్యం చేస్తే, ఆయనపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రభుత్వం ఆయనకు వేరే చోట బాధ్యతలు అప్పగించడం ద్వారా గౌరవించింది. సమయానికి హైకోర్టు స్పందించి ఆయన్ని సెలవుపై పంపమని ఆదేశించడం ద్వారా, కేసుని సీబీఐకి అప్పగించడం ద్వారా కొంత న్యాయం చేసింది. ఇలాంటి హీన నేరం జరిగిన తర్వాత కూడా అక్కడి ప్రభుత్వం కోర్టు చెబితే గానీ సరైన విధంగా స్పందించక పోవడం దారుణం. ఈ హత్యోదంతం నుండి పాఠాలు నేర్చుకుని ప్రభుత్వాలు వైద్యుల, ఆరోగ్య సిబ్బంది... రక్షణకు, భద్రతకు పూర్తి బాధ్యత వహించాలి. వారు పనిచేసే స్థలం పూర్తి సేఫ్ జోన్‌గా ఉండాలి. – డా. డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment