DVG sankara rao
-
వైద్యుల దుఃస్థితికి ప్రతీక!
కోల్‌కతా నగరంలో ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో విధుల్లో ఉన్న మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి, హత్య చేసిన దారుణ సంఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి, తీవ్ర ఆందోళనకు గురి చేసింది. దేశంలో ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో, రక్షణ కొరవడిన స్థితిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముఖ్యంగా మహిళలు విధుల్ని నిర్వహించాల్సి వస్తోందో ఇంకోసారి తేటతెల్లం చేసిన ఘటన ఇది. ఆ పీజీ వైద్య విద్యార్థి 36 గంటలుగా విధుల్లో ఉన్నారు. అర్ధరాత్రి దాటాక కాసేపు సెమినార్ రూమ్‌లో విశ్రమించిన సమయంలో దారుణానికి బలయ్యారు. అక్కడ సీసీ కెమెరాలు పని చెయ్యడం లేదట. ఆగంతకులు రాకుండా సరిపడా భద్రత, సరియైన వెలుతురు లేని క్యాంపస్... ఇవన్నీ ఆ కిరాతక చర్యకు దోహద పడ్డాయి.ఇది వ్యవ స్థాగత లోపం. మహిళా ఉద్యోగులకు పూర్తి స్థాయి భద్రత కల్పించలేని నిర్వాకం. ముఖ్యంగా వైద్య రంగంలో పనిచేస్తున్న వారు ఆరోగ్య సేవలు అందించడంలో తీవ్రంగా శ్రమ పడుతున్నారు. అయినా రోగి బంధువుల నుండి భౌతిక దాడులకు గురవ్వడం లాంటి సంఘటనలు పెరుగుతూ వస్తున్నాయి. వాటిని అరికట్టే కఠిన చట్టాలు, చట్ట ప్రకారం సత్వరం శిక్ష పడేలా ఏర్పాట్లు వ్యవస్థలో అవసరం. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. ప్రాణాలు నిలిపే డాక్టరు, తానే ప్రాణభయంతో చికిత్స అందించాల్సి వస్తే అది రోగికి మాత్రమే కాదు ప్రజారోగ్య వ్యవస్థకే ప్రమాదం. ఇక హత్యోదంతం విషయంలో ఆ వైద్య కళాశాల పెద్దలే కాకుండా, ప్రభుత్వం కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది.హత్యాచారం జరిగిన పిమ్మట ఆ కళాశాల ప్రిన్సిపాల్ రిపోర్ట్ ఇవ్వడానికి కూడా ఆలస్యం చేస్తే, ఆయనపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రభుత్వం ఆయనకు వేరే చోట బాధ్యతలు అప్పగించడం ద్వారా గౌరవించింది. సమయానికి హైకోర్టు స్పందించి ఆయన్ని సెలవుపై పంపమని ఆదేశించడం ద్వారా, కేసుని సీబీఐకి అప్పగించడం ద్వారా కొంత న్యాయం చేసింది. ఇలాంటి హీన నేరం జరిగిన తర్వాత కూడా అక్కడి ప్రభుత్వం కోర్టు చెబితే గానీ సరైన విధంగా స్పందించక పోవడం దారుణం. ఈ హత్యోదంతం నుండి పాఠాలు నేర్చుకుని ప్రభుత్వాలు వైద్యుల, ఆరోగ్య సిబ్బంది... రక్షణకు, భద్రతకు పూర్తి బాధ్యత వహించాలి. వారు పనిచేసే స్థలం పూర్తి సేఫ్ జోన్‌గా ఉండాలి. – డా. డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ -
నరకాలుగా నగరాలు..
ఢిల్లీ నడిబొడ్డున పేరొందిన ఒక కోచింగ్ సెంటర్లో వరద నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. సివిల్ సర్వీసు పరీక్షలకు మంచి కోచింగ్ సెంటర్‌గా ఆ సంస్థకు దశాబ్దాల చరిత్ర ఉంది. రాజధాని నగరంలో ఉన్న ఆ సెంటరు నిబంధనలకు వ్యతిరేకంగా భవనం బేస్మెంట్లో లైబ్రరీ నిర్వహిస్తోంది. విద్యార్థులు ముగ్గురూ అందులో చిక్కుకుని మరణించిన వారే. ఎన్నో ఆశలతో, ఎంతో ధనం ఫీజుల రూపంలో వెచ్చించి ఆ సంస్థలో చేరిన విద్యార్థులు, సంస్థ నిర్వాహకుల అత్యాశ, అధికారుల అలసత్వం, అవినీతి, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జీవితాల్ని కోల్పోయారు.బేస్‌మెంట్‌ని పార్కింగు కోసం, లేదా స్టోర్ రూమ్‌గా మాత్రమే వినియోగించాలని ఒక నిబంధన. దాన్ని లైబ్రరీగా మార్చి సొమ్ము చేసుకోవడం ఆ సంస్థ కక్కుర్తి. అలా ప్రాణాపాయం కలిగే అవకాశం ఉన్నా, నిబంధనల్ని అతిక్రమించినా పట్టనట్టు వ్యవహరించడం, లేదా లంచాలు తిని ఉపేక్షించడం నగర పాలక సంస్థ నిర్వాకం. ఆ సెంటరులోకి వరద నీరు ఒక్క ఉదుటున చేరడానికి కారణం యథేచ్చగా అక్రమ కట్టడాల్ని అనుమతించడం. డ్రయిన్ వ్యవస్థ పూడుకున్నంత వరకూ వదిలేయడం. అయితే ఈ సమస్య ఆ ఒక్క కోచింగ్ సెంటర్‌కో, ఆ ప్రాంతానికో పరిమితం కాదు.పుట్టగొడుగుల్లా నగరమంతా వ్యాపించిన కోచింగ్ సెంటర్లు, వాణిజ్య సముదాయాలు, అక్రమ కట్టడాలు... ఇలా పట్టణ ప్రణాళికల్ని తుంగలో తొక్కేవి కోకొల్లలు. అలాగే ఢిల్లీ ఒక్కటే ఇలా దయనీయంగా లేదు. దేశంలో ప్రతీ పట్టణమూ ఇలా అఘోరిస్తున్నవే. రాష్ట్రాలకు పెరుగుతున్న ఒత్తిడి మేరకు కేంద్రం నిధులు, మార్గదర్శకాలు ఇవ్వాలి. పట్టణాల అభి వృద్ధిని రాష్ట్రాలు దగ్గరగా పర్యవేక్షించాలి. నగర పాలక సంస్థలు సమర్థంగా వ్యవహరించాలి. దురదృష్టవశాత్తూ అలాంటి రోజులు దగ్గరలో కనబడడం లేదు. – డా. డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం మాజీ ఎంపీ, విజయనగరం -
సభా సంప్రదాయాలు పాటించాలి!
18వ లోక్ సభ కొలువు తీరిన వెంటనే అధికార, ప్రతిపక్షాలు తమ తమ రంగులు బయట పెట్టాయి. మాటలు పార్లమెంటు గోడలు దాటినా... పనులు పాతవే అని నిరూపించాయి. ప్రొటెం స్పీకరు ఎంపిక మొదలుకొని తమ మధ్య ముందు ముందు విభేదాలు తప్ప ఏకాభిప్రాయం ఉండబోదని తెలియజెప్పాయి.సభలో అత్యంత సీనియర్‌ను ప్రోటెం స్పీకరుగా ఎంచుకొని గౌరవిస్తారు. అలా అయితే విపక్షానికి చెందిన సురేష్‌ని నియమించాలి. కానీ అధికార పక్షం తమ పార్టీకి చెందిన సభ్యుణ్ణి నియమించింది. అలా పరిమిత అధికారం, రెండు మూడు రోజుల తాత్కాలిక పదవీ కాలం ఉన్న గౌరవ స్థానం విషయంలోనే అధికార పక్షం సంకుచితంగా ఆలోచించింది. తర్వాత పాటించాల్సిన సంప్రదాయం పట్ల కూడా మౌనం దాల్చింది.అదేమిటంటే డిప్యూటీ స్పీకరు పదవి విపక్షాలకు ఇవ్వడం! అధికార పక్షం మౌనంలో నిరాకరణ అర్థమై, స్పీకరు పదవికి పోటీ నిలబెట్టింది విపక్షం. అది కూడా సంప్రదాయానికి విరుద్ధమే. ఎలాగూ గెలిచే బలం లేదు. పెద్ద మనసుతో స్పీకరు ఎన్నికను ఏకాభిప్రాయంతో జరగనిస్తే హుందాగా ఉండేది. అధికార పక్షపు వైఖరి కన్నా మెరుగైనదిగా భావించబడేది.ఇక స్పీకరు, తన మొదటి తీర్మానంలోనే తన ఉద్దేశ్యం తెలియబర్చారు. 49 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ హయాంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, దేశంలో పెట్టిన ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానం అది. ఎమర్జెన్సీని వ్యతిరేకించడం వందశాతం ఒప్పే కానీ ఇప్పుడా పని చెయ్యడం అంత ఎమర్జెన్సీయా? నిష్పక్షపాతంగా ఉండాల్సిన స్పీకరు కాంగ్రెస్ పార్టీని రక్షణలో పడేయడానికి అర్జెంటుగా పూనుకున్నట్లు ఉంది తప్పించి ఇదేమంత అత్యవసర కార్యక్రమం అనిపించలేదు.అధికార, ప్రతిపక్షాలు పార్లమెంటులో ఏకాభిప్రాయంతో మెలగనక్కర లేదు. అలా మెలగడం మంచిది కూడా కాదు. సంప్రదాయాలనూ, ఉన్న చట్టాలనూ, ఎదుటి పక్షాలనూ, వారి వాదనలోని ఔచిత్యాన్నీ గౌరవించాలి. అంతిమంగా ప్రజల పట్ల తమ బాధ్యతను గుర్తించాలి. ఈ సారి ప్రజా తీర్పు ఇరు పక్షాలకూ పాఠాలు నేర్పింది. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఏకపక్ష ధోరణులు విడిచిపెట్టి ప్రజా పక్షం వహించాలని స్పష్టం చేసింది. ఆ స్ఫూర్తి ఇరు పక్షాలూ నిలపాలి. అర్థవంతమైన చర్చలకూ, ఆరోగ్యకరమైన సంప్రదాయాలకూ మరలా పట్టంగట్టాలి. – డా. డి.వి.జి శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం -
త్రిలింగ దేశానికి మూడు రాజధానులు
మూడు రాజధానుల ముచ్చటైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని చూడాలనుకుంటున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఒక వినూత్నమైన ఆలోచన. ఆంధ్ర మహావిష్ణువు పాలనలో మన రాష్ట్రం ఒకప్పుడు మూడు వైపులా మూడు శైవక్షేత్రాల (లింగాల) నడుమ రాజ్యంగా విస్తరించి త్రిలింగ రాజ్యంగా పేరొం దింది. కోస్తాలో ద్రాక్షారామం, సీమలో శ్రీశైలం, ప్రస్తుత తెలంగాణాలో కాళేశ్వరం అవి. ఇప్పుడు ఏపీలో మూడు చోట్ల మూడు విభాగాల రాజధానులు నెలకొల్పాలనుకోవడం కొట్టిపారెయ్యదగ్గ ఆలోచన ఎంతమాత్రం కాదు. లోతుగా చర్చించి గమనంలోకి తీసుకోదగ్గది. గత సీఎం బాహుబలి స్థాయి ఏకైక అంతర్జాతీయ మహానగరం రాజధానిగా కలగంటే, నేటి యువ ముఖ్యమంత్రి బహుళ నగరాల్ని రాజధానులుగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే బాగుంటుం దని భావిస్తున్నారు. అధికార వికేం ద్రీకరణ, అభివృద్ధి కార్యక్రమాల వికేంద్రీకరణ అన్నవి మంచి ఆదర్శాలే. ఆచరింపదగ్గవే. ఐతే అంతర్జాతీయ నగరం స్థాయి ప్రచారం పొందిన నగరం అతిమామూలు స్థాయికి మిగిలితే కలగబోయే నష్టమెంత, లేదా జరుగుతూన్న నష్టనివారణ ఏమేరకు అన్నది మదింపు జరగాలి. ఆదా మార్గాలూ, ఆదాయ మార్గాలూ ఎలా ఉండబోతున్నాయి, ఆయా పట్టణాలపై, ప్రాంతాలపై ఏయే ప్రభావాలు, ఏమేరకు అన్నది చర్చించాలి. వాస్తవానికి అసలు ఈ డిజిటల్ యుగంలో రాజధాని పరి మాణంగానీ, ప్రాంతంకానీ సమ స్యేకాదు. అమెరికాలో కూర్చుని అనకాపల్లిలో వ్యాపారం చెయ్యొచ్చు. పారిస్‌లో కూర్చొని పలాసలో వ్యవహారం నడపొచ్చు. ఇక పాలనా వ్యవహారాలు ఏమూల కూర్చొని ఏమూలనైనా జరపొచ్చు. అయితే ముఖ్యకేంద్రాలన్నవి మా ప్రాంతాలకూ ఉన్నాయి అన్న భరోసా ప్రాంతాల మధ్య వివక్షని తగ్గిస్తుంది. ఒక రాష్ట్రానికి పాలనా రాజధాని, న్యాయ రాజధాని, శాసన రాజధాని వేర్వేరుగా ఏర్పరిచే ఆలోచన మే«ధోమథనం చేయదగ్గది. – డా. డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం -
దళితులపై దాడులు అమానుషం
ఇన్‌బాక్స్ రాజకీయ, ఆర్థిక,సామాజిక సమానత్వం, సోదరభావం ధ్యేయంగా రాజ్యాంగం రూపు దిద్దుకుంది. ఆ స్ఫూర్తిని కాపాడేందుకు అవస రమైన వ్యవస్థని స్వతంత్ర భారత్ ఏర్పాటు చేసు కుంది. చట్టాల రూపంలో అందుకు తగ్గ ఆయుధాలు పాలకులకు అందుబాటులోనే ఉన్నాయి. అయితే విస్తృత సామాజిక లబ్ధిస్థానే, సంకుచిత రాజకీయ లబ్ధిని వివిధ పక్షాలు ముఖ్యమైనదిగా భావిస్తున్న కారణంగానే సామాజిక సమస్యలకు పరిష్కారాలు దొరకడంలేదు సరిగదా సమస్యలు సంక్లిష్ట రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ప్రస్తుతం దళితులపై జరు గుతున్న దాడులు, వాటిపై నేతల మౌనం నాగరిక దేశానికి సిగ్గుచేటు. వాటిపై కఠినంగా వ్యవ హరించాల్సిన కేంద్ర ప్రభుత్వం నీళ్లు నమలడం బాధ్యతా రాహిత్యం. ఉత్తర్రపదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయావతిపై ఆ రాష్ర్ట బీజేపీ ఉపాధ్యక్షుడు చేసిన సంస్కార రహితమైన వ్యాఖ్యలు రాజకీయ కాలుష్యానికి అద్దం పడుతున్నాయి. కొంతమంది పనిగట్టుకుని మరీ వ్యాపింపజేస్తున్న ఈ రకమైన విష పూరిత కాలుష్యం సమాజాన్ని తీవ్రంగా నష్ట పరుస్తోంది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా సమర్ధవంతంగా సామాజిక కాలుష్య నివా రణా చర్యలు చేపట్టాలి. రాజ్యాంగ రక్షణల్ని అర్హులకు అందించడంతో పాటు నేరస్తుల్ని నియం త్రించాలి. అన్ని పక్షాలూ తమ స్వలాభాలకు అతీ తంగా ఆలోచించి దేశాన్ని సుస్థిరపర్చాలి. కుల, మతాలపై రాజకీయ భవిష్యత్ నిర్మించుకునే కౌటి ల్యాన్ని విడనాడాలి. డాక్టర్ డీవీజీ శంకరరావు మాజీ ఎంపీ, పార్వతీపురం శ్రీశైలం జలాలు రాయలసీమకే... పట్టిసీమ నుంచి విజయవాడకు ప్రభుత్వం గోదావరి నీళ్లను పాక్షికంగా మళ్లించి అదే ఘన విజయమంటూ సంబరపడిపోయింది. మరింత చిత్తశుద్ధితో శ్రీశైలం నుంచి రాయలసీమకు పోతి రెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా నీరు అందిస్తే రాయలసీమ ప్రజలకు నిజమైన ప్రయో జనం లభిస్తుంది. అయితే మాటవరుసకు మాత్రమే నదుల అనుసంధానం చేసిపడేశా నని గొప్పలు చెప్పుకుంటే ఏ ప్రాంత ప్రజలూ నమ్మరు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం ప్రయోజనాలు అటు కోస్తా ప్రజలకు, ఇటు రాయలసీమ ప్రజలకు కూడా సమప్రాతిపదికన అందాలి. గత రెండేళ్లుగా తెలు గుగంగ ప్రాజెక్టు పరిధిలో సాగునీరు అందక రాయలసీమలో కరువు తాండవిస్తోంది. దానికితోడు తాగునీరు కూడా కరువై పోయింది. రాయలసీమకు నిజంగా న్యాయం చేయాలంటే శ్రీశైలం నీటిని ఇచ్చిన మాట ప్రకారం తెలు గుగంగ, కేసీ కెనాల్ వంటి వాటికి అందించే ప్రయత్నం చేయాలి. త్వరలో కృష్ణానదికి వర దలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇకనుంచైనా శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల మేరకు నీటిని నిల్వచేసి అంతకు తగ్గకుండా తగు చర్యలు తీసుకోవాలి. కృష్ణా డెల్టా సాగునీటి అవసరాలకు మళ్లించకుండా సంవత్సరం పొడవునా శ్రీశైలం డ్యాంలో నీరు నిల్వ ఉంటే రాయలసీమ ప్రజలకు మేలు జరుగుతుంది. శ్రీశైలం డ్యాం నీటిని మొత్తంగా రాయలసీమకు మాత్రమే కేటాయిస్తే సీమ దిశా, దశా పూర్తిగా మారినట్లే. కావలసిందల్లా ప్రభుత్వం నుంచి కాస్త చిత్తశుద్ధి, నిజాయితీ మాత్రమే. ఈశ్వర్, పొద్దుటూరు, కడపజిల్లా మల్లన్న సాగర్‌పై మంకుపట్టు ఎందుకు? మల్లన్న సాగర్ రిజర్వాయర్‌పై తెలంగాణ ప్రభుత్వం మంకుపట్టు ముంపుప్రాంత రైతులపై పాశవిక దాడితో పరాకాష్టకు చేరుకున్నట్లయింది. ప్రతిపక్షాన్ని ఏకమొత్తంగా తమ ప్రభుత్వంలో, పార్టీలో కలుపుకున్నంత సులభంగా.. అన్నం పెట్టే రైతును ముంపుకు గురి చేయటం సాధ్యం కాదని నయాదొరలకు అర్థం అవుతున్నట్లు లేదు. అనేక ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడిన తెలం గాణ ప్రజలను మభ్యపర్చి సాగునీటి ప్రాజెక్టుల పేర్లు మార్చి, లక్షన్నర కోట్ల రూపాయలను ఈ రెండేళ్లలోనే ఖర్చు చేయడం ప్రజలు కోరుకున్నది కాదు. గతంలో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల పరిధిలోనే సమీపంలోని తడ్కపల్లి వద్ద 1.5 టీఎంసీల నీటి నిల్వ స్థాయి సరిపోతుందని నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయించగా, దాన్ని పక్కనపెట్టి కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టులో 50 టీఎంసీల నీటి నిల్వతో నిర్మించాలనుకోవడంలో ప్రజాప్రయోజ నాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు ప్రజలపై పోలీసు దాడులకు కూడా సిద్ధమైపోవడం తెలంగాణ ప్రజాస్వామ్యంలో భాగమేనా? మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గత 45 రోజులుగా దీక్షలు చేపడుతున్న ఏటిగడ్డ కిష్టా పూర్, వేములఘాట్, పల్లెపహాడ్ గ్రామాల్లో సందర్శించి వారెందుకు రిజర్వాయర్‌ను వ్యతిరేకి స్తున్నారు అని అడిగితే ఊళ్లు పోతే సావేనంటూ ముక్తకంఠంతో చెప్పారు. జీవనోపాధిని కోల్పో వటం ఒకటైతే, ప్రజల స్థిర నివాసాన్నీ, వారి మధ్య ఏనాటి నుంచో ఏర్పడ్డ సంబంధాలను తుంచివేయడం దేనికోసం? పైగా భూమి ఉన్న వారికి పరిహారమంటున్నారు కానీ భూమి లేని కులవృత్తులవారిని గాలికి వదిలేశారు. ఊరు విడవాలన్న ఊహనే భరించలేకపోతున్నామని ప్రజలుమొత్తుకుంటుంటే పోలీసు భాషను తప్ప పాలకులు ప్రజల భాషను అర్థం చేసుకోవటం లేదు. తెలంగాణలో ఎక్కడా లేనివిధంగా రెండు పంటలు పండుతూ పట్టుపరిశ్రమ వంటి ఉపాధి అవకాశాలతో స్వయంపోషితంగా ఉన్న 14 గ్రామాలను ముంచే రిజర్వాయర్‌ను ఏ ప్రయోజనాలకోసం నిర్మిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వాల మాదిరి గానే తెలంగాణ ప్రభుత్వం కూడా బహుళజాతి సంస్థలకు భూమిని కట్టబెట్టడం కోసం నేలమీద వ్యవసాయం చేసుకుని బతికే ప్రజల జీవనో పాధిని దెబ్బతీయడం మానవహక్కుల ఉల్లం ఘనే. అందుకే మల్లన్న సాగర్ రిజర్వాయర్ పేరుమీద జరిగే భూసేకరణను వెంటనే నిలిపే యాలని డిమాండ్ చేస్తున్నాం. అనంతుల రమేష్, అధ్యక్షులు పౌరహక్కుల సంఘం, వరంగల్ బియ్యమొక్కటే చాలా? నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి పోతున్నాయి, బియ్యం ధరలు రూ. 45 నుంచి రూ.55లకు చేరాయి. సన్న బియ్యం కొని తినలేని పరిస్థితి ఉంది, పప్పుల ధరలు కొండె క్కాయి. నూనె ధరలు భగ్గుమంటున్నాయి. వచ్చే పండుగల సీజన్లో సామాన్యులు పండుగలు ఎలా జరుపుకోవాలో అర్థం కావటం లేదు. బతుకమ్మ పండుగ, వినాయక చవితి, దసరా ఇలా వరుసగా పండుగలు ఉన్నాయి. ధరలు అదుపులో లేకపోతే పేదవారి పరిస్థితి ఎట్లా, గతంలో రేషన్‌షాప్‌లో తక్కువ ధరకే ప్యాకేజీగా కొన్ని వస్తువులు ఇచ్చేవారు. ఇప్పుడు బియ్యం ఒక్కటే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా ధరలు అదుపు చేయవలసిన బాధ్యత ప్రభు త్వంపై ఉంది. జైని రాజేశ్వర్ కాప్రా, హైదరాబాద్