18వ లోక్ సభ కొలువు తీరిన వెంటనే అధికార, ప్రతిపక్షాలు తమ తమ రంగులు బయట పెట్టాయి. మాటలు పార్లమెంటు గోడలు దాటినా... పనులు పాతవే అని నిరూపించాయి. ప్రొటెం స్పీకరు ఎంపిక మొదలుకొని తమ మధ్య ముందు ముందు విభేదాలు తప్ప ఏకాభిప్రాయం ఉండబోదని తెలియజెప్పాయి.
సభలో అత్యంత సీనియర్‌ను ప్రోటెం స్పీకరుగా ఎంచుకొని గౌరవిస్తారు. అలా అయితే విపక్షానికి చెందిన సురేష్‌ని నియమించాలి. కానీ అధికార పక్షం తమ పార్టీకి చెందిన సభ్యుణ్ణి నియమించింది. అలా పరిమిత అధికారం, రెండు మూడు రోజుల తాత్కాలిక పదవీ కాలం ఉన్న గౌరవ స్థానం విషయంలోనే అధికార పక్షం సంకుచితంగా ఆలోచించింది. తర్వాత పాటించాల్సిన సంప్రదాయం పట్ల కూడా మౌనం దాల్చింది.
అదేమిటంటే డిప్యూటీ స్పీకరు పదవి విపక్షాలకు ఇవ్వడం! అధికార పక్షం మౌనంలో నిరాకరణ అర్థమై, స్పీకరు పదవికి పోటీ నిలబెట్టింది విపక్షం. అది కూడా సంప్రదాయానికి విరుద్ధమే. ఎలాగూ గెలిచే బలం లేదు. పెద్ద మనసుతో స్పీకరు ఎన్నికను ఏకాభిప్రాయంతో జరగనిస్తే హుందాగా ఉండేది. అధికార పక్షపు వైఖరి కన్నా మెరుగైనదిగా భావించబడేది.
ఇక స్పీకరు, తన మొదటి తీర్మానంలోనే తన ఉద్దేశ్యం తెలియబర్చారు. 49 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ హయాంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, దేశంలో పెట్టిన ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానం అది. ఎమర్జెన్సీని వ్యతిరేకించడం వందశాతం ఒప్పే కానీ ఇప్పుడా పని చెయ్యడం అంత ఎమర్జెన్సీయా? నిష్పక్షపాతంగా ఉండాల్సిన స్పీకరు కాంగ్రెస్ పార్టీని రక్షణలో పడేయడానికి అర్జెంటుగా పూనుకున్నట్లు ఉంది తప్పించి ఇదేమంత అత్యవసర కార్యక్రమం అనిపించలేదు.
అధికార, ప్రతిపక్షాలు పార్లమెంటులో ఏకాభిప్రాయంతో మెలగనక్కర లేదు. అలా మెలగడం మంచిది కూడా కాదు. సంప్రదాయాలనూ, ఉన్న చట్టాలనూ, ఎదుటి పక్షాలనూ, వారి వాదనలోని ఔచిత్యాన్నీ గౌరవించాలి. అంతిమంగా ప్రజల పట్ల తమ బాధ్యతను గుర్తించాలి. ఈ సారి ప్రజా తీర్పు ఇరు పక్షాలకూ పాఠాలు నేర్పింది. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఏకపక్ష ధోరణులు విడిచిపెట్టి ప్రజా పక్షం వహించాలని స్పష్టం చేసింది. ఆ స్ఫూర్తి ఇరు పక్షాలూ నిలపాలి. అర్థవంతమైన చర్చలకూ, ఆరోగ్యకరమైన సంప్రదాయాలకూ మరలా పట్టంగట్టాలి. – డా. డి.వి.జి శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం
Comments
Please login to add a commentAdd a comment