Acharya Atreya
-
Acharya Aatreya: అక్షర లక్షలు... ఆ గీతాలు!
‘ఆత్రేయ సాహితి’ సంపాదకులు డా‘‘ జగ్గయ్య – ‘సినిమా పాటకు సాహిత్య మందిరంలో పట్టాభిషేకం చేయించిన అపర శ్రీనాథుడు. మనిషికీ, మనసుకీ కొత్త భాష్యాలు పలికిన అక్షర యోగి...’ అంటూ ఆత్రేయను ప్రశంసించారు.‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ అనే స్వీయ వ్యాస సంపుటిలో వేటూరి ‘శబ్దాడంబరం లేకుండా నిర్మల గంగా ప్రవాహం లాగ చిరు చిరు అలలతో అగాథాల్ని దాస్తూ... ప్రకటిస్తూ సాగిన సాహితీగంగ ఆత్రేయది’ అని మెచ్చుకున్నారు. వెన్నెలకంటి ఆత్రేయను ‘సినీ వేమన’ అన్నారు. శ్రీశ్రీ తెలుగు కవిత్రయంగా తిక్కన, వేమన, గురజాడలను పేర్కొంటే వారి సరసన సినీరంగం నుంచి ఆత్రేయను చేర్చారు వెన్నెలకంటి! ఆత్రేయ మాటలు పాటలు లాగా, పాటలు మాటలు లాగా వుంటాయనీ, ఆత్రేయ పత్రికల్లో వార్తలా వచనం రాసినా, అది మామ మహదేవన్ స్వరకల్పనలో పాటగా ఒదిగేదనీ నిర్మాత మురారి అంటుండేవారు. అటువంటి ఆత్రేయ పాటల్లో పంక్తులు కొన్ని తెలుగునాట నానుడులుగా, నిత్య సత్యాలుగా, హితోక్తులుగా స్థిర పడిపోయాయి కూడా! అలాంటి ఆణిముత్యాలను కొన్నిటిని ఏరుకుందాం.ఆత్రేయకు జనం పెట్టిన పేరు మన‘సు’ కవి. అది జనం మనసుల్లో ఆయనకు పడిన ముద్ర తప్ప, ఏ సన్మాన సభలోనో, సాహితీ సంస్థో, ప్రభుత్వమో ప్రదానం చేసిన బిరుదు కాదు. ఆత్రేయ మనసు పాటల్లో తరళరత్నం ‘ప్రేమనగర్’ చిత్రంలోని ‘మనసు గతి యింతే/ మనిషి బ్రతుకింతే/ మనసున్న మనిషికి/ సుఖము లేదంతే...’ అనే పంక్తులు. అవి విని మురిసిపోయిన దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు ఆత్రేయను మెచ్చుకుంటూనే చిన్న సందేహం వచ్చి ‘చివర్లో ‘అదంతే’ ఎందుకు?’ అని అడిగారట. ‘అదంతే’ అని చిరునవ్వుతో బదులిచ్చారట... మాటల్ని ఆచితూచి ప్రయోగించే అక్షరయోగి ఆత్రేయ.‘ప్రేమలు–పెళ్లిళ్లు’ చిత్రంలోని – ‘మనసులేని దేవుడు మనిషి కెందుకో మనసిచ్చాడు/ మనసు మనసును వంచన చేస్తే/ కనుల కెందుకో నీరిచ్చాడు’ అనే పంక్తులు కూడా నిత్యజీవితంలో అంద రికీ గుర్తొచ్చే గొప్ప అభివ్యక్తులు. పద క్రీడలతో సార్వకాలిక సత్యాలను వెల్లడించిన ఆత్రేయ ‘ఉండడం’, ‘లేకపోవడం’ అనే రెండు పదాలను తీసుకొని అమ్మ గొప్పతనం గురించి ఎంతక్లుప్తంగా, ఆప్తంగా చెప్పారో చూడండి – ‘అమ్మ ఉంటే లేనిదేమీ లేదు/ అమ్మ లేక ఏమున్నా ఉన్నది కాదు’ (కలసిన మనసులు)! ప్రేమ గురించి ‘అది’, ‘ఇది’ అంటూ ఆత్రేయ అంత గోప్యంగా చెప్పిన కవులు అరుదు. ‘నువ్వంటే నాకెందుకో ఇంత యిది, ఇంత యిది’ (అంతస్తులు); ‘ఇదే నన్నమాట – ఇది అదే నన్నమాట/ మది మదిలో లేకుంది – మనసేదో లాగుంది/ అంటే ఇదేనన్నమాట – ఇది అదేనన్న మాట’ (కొడుకు–కోడలు).మరో రెండు వాక్చిత్రాలను కూడా పేర్కొనాలి. అందులో మొదటిది అందరికీ తెలిసిన ‘మూగ మనసులు’ చిత్రంలో నూతన వధూవరులు, పెద్దల సమక్షంలో కథానాయకుడు గోపి పాడిన ‘ముద్ద బంతి పూవులో...’ పాటలోని – ‘నవ్వినా ఏడ్చినా... కన్నీళ్లే వస్తాయి.’ ఇది పది వాక్యాల పెట్టు అని డాక్టర్ సి.నా.రె. వ్యాఖ్యానించిన తర్వాత ఇంకే వివరణ కావాలి? ఇలా అక్షర లక్షల విలువైన జీవిత సత్యాలను గమనిస్తే ఆత్రేయ... వేమనలా కవి మాత్రమే కాదు– ఒక యోగి కూడా అనిపిస్తారు. – డా‘‘ పైడిపాల, సినీ గేయ సాహిత్య పరిశోధకులు, 99891 06162ఇవి చదవండి: కాసేపట్లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు -
తల్లి ప్రేమను పంచారు
పద్మావతి ఆత్రేయ చెల్లెలు కుటుంబసభ్యులు తాడేపల్లిగూడెం : తన పిల్లలతో సమానంగా ప్రేమ, వాత్స్యలాలను తమకు పంచారని ఆచార్య ఆత్రేయ సతీమణి పద్మావతి గురించి ఆమె చెల్లెలు మధురవల్లి కుటుంబసభ్యులు అన్నారు. పద్మావతి ఆత్రేయ శుక్రవారం తాడేపల్లిగూడెం మండలంలోని తాళ్లముదునూరుపాడులో తుదిశ్వాస విడిచారు. పెద్దమ్మ అయినా సొంత తల్లిలా తమ ఆలనాపాలనా చూసుకున్నారని విషణ్ణ వదనలతో వారు గుర్తుచేసుకున్నారు. సంతాపాల వెల్లువ ఆచార్య ఆత్రేయ సతీమణి పద్మావతి మృతికి పలువురు సంతాపం తెలిపారు. తెలుగు సినీ రంగానికి ఆత్రేయ కుటుంబం అందించిన సేవలు మరువలేనివని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. మానవతావాదిగా, కవి, రచయితగా ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసిన ఆత్రేయ విజయాల వెనుక పద్మావతి పాత్ర ఎంతో ఉందని చెప్పారు. బీజేపీ జిల్లా కార్యదర్శి కంచుమర్తి నాగేశ్వరరావు, నియోజకవర్గ కన్వీనర్ ఖండభట్టు శ్రీనివాసరాజు తదితరులు సంతాపం తెలిపారు. ఆత్రేయ అభిమాన పుత్రుడు పైడిపాల, సినీ రచయిత మాడభూషి దివాకర్‌బాబు, కిళాంబి జవహర్‌లాల్‌నెహ్రూ, వెలగల చంద్రశేఖరరెడ్డి, ఎస్టీవీఎన్ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధి కుదుళ్ల నారాయణరావు తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. నడవడిక నేర్పారు పెద్దమ్మ అయినా సొంత తల్లిలా చూసుకున్నారు. 1990 నుంచి మా ఇంటి వద్దే ఉంటున్నారు. మా ఇంటికి పెద్దదిక్కుగా ఉంటూ మాకు నడవడిక నేర్పారు. వృద్ధాప్యం మీదపడుతున్నా కళ్లజోడు సాయం లేకుండా అన్నింటిని చదివేవారు. కావాల్సినవి తింటూ ఇప్పటి వరకు ఆరోగ్యంగానే ఉన్నారు. వాతావరణం, వయోభారంతో ఇబ్బంది పడి దైవసాన్నిధ్యానికి చేరుకున్నారు. ఆత్రేయ గారి విజయాల వెనుక మా పెద్దమ్మ పాత్ర ఎంతో ఉంది. సంస్కృతం, హిందీ, తమిళ భాషల్లో ప్రవేశం గల ఆమె కొన్ని రచనలు కూడా చేశారు. ఆమె మరణం మాకు తీరనిలోటు. -వింజమూరి రంగనాథ్, పద్మావతి చెల్లెలు కుమారుడు పెద్ద దిక్కుగా ఉన్నారు పద్మావతి ఇంటికి పెద్దదిక్కుగా ఉన్నారు. ఆత్రేయ కాలం చేసిన దగ్గర నుంచి మా ఇంటిలోనే ఉంటున్నారు. పెద్దదిక్కుగా ఉండటంతో పాటు, పిల్లలకు నైతికత, విలువలు తదితర విషయాల గురించి చెప్పేవారు. ఆమె మరణం మాకు కుటుంబానికి తీరనిలోటు. - వింజమూరి వెంకటేశ్వర్లు, పద్మావతి మరిది -
ఆత్రేయ అత్తవారింటికి వందేళ్లు
సూళ్లూరుపేట : తెలుగు సినీ చరిత్రలో ఎన్నో వైవిధ్య భరితమైన పాటలు రాసి తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న మనసు కవి ఆచార్య ఆత్రేయ అత్తవారిల్లు నిర్మించి వంద సంవత్సరాలైంది. ఆయన పాటలులాగే ప్రజల హృదయాల్లో నేటికీ ఎలా పదిలంగా ఉన్నాయో.. ఆ ఇల్లు అంతే చెక్కు చెదరలేదు. సూళ్లూరుపేట మండలం మంగళంపాడులో 1915లో ఈ ఇల్లు నిర్మించారు. దొరవారి సత్రం మండలం ఉచ్చూరు గ్రామానికి చెందిన ఆత్రేయ పక్కనే ఉన్న మంగళంపాడులో వివాహం చేసుకున్నారు. ఉచ్చూరులో ఆత్రేయకు చెందిన ఇళ్లు, ఆస్తులు పోయినా మంగళంపాడులో అత్తవారిల్లు మాత్రం అలాగే ఉంది. జీవిత చరమాంకంలో మంగళంపాడులోనే స్థిరపడాలని అనుకునే వారని ఆయన సమీప బంధువులు చెబుతారు. ఆ కోరిక తీరకుండానే ఆయన మృతి చెందారు. అయితే ఆ ఇంటిని మాత్రం ఆయన జ్ఞాపకాల కోసం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంచారు. -
ఆచార్య ఆత్రేయ 25వ వర్ధంతి
చంద్రుడి వెన్నెలకు దూరమై కృష్ణ పక్షం మాత్రమే దక్కడంనా దురదృష్టం! - శ్రీమతి పద్మావతీ ఆత్రేయ నేడు ఆచార్య ఆత్రేయ 25వ వర్ధంతి మన‘సు’ కవి ఆత్రేయ రాసినన్ని మనసు పాటలు ప్రపంచవ్యాప్తంగా ఏ కవీ రాయలేదు. ఆయన రాసిన 1400 సినిమా పాటలలో సుమారు నూరు మనసు పాటలున్నాయి! కానీ నిజ జీవితంలో ఆయన ‘మనసు’లేని వాడని కొందరి అభియోగం! నిజం చెపితే - ఆత్రేయ మనసు మూగది; మాటలు రానిది! ఆత్రేయ అర్ధాంగి శ్రీమతి పద్మావతి మనసు గొప్పది; మమత మాత్రమే తెలిసినది! దంపతులిద్దరూ మనస్కులే అయినా - ‘వీణలోనా తీగలోనా ఎక్కడున్నది అపశ్రుతి? అది ఎలాగైనది విషాద గీతి?’ అని ఆత్రేయ రాసినట్టు వారి ‘సంసార వీణ’లో అపశ్రుతులు దొర్లడం విధివిలాసమంటారు ఇద్దరూ! ఈ అనుబంధంతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాల్ని... ఆత్రేయకు చరమాంకంలో ఆయనకు సన్నిహితునిగానే కాక, తన అభిమాన పుత్రునిగా భావించే పైడిపాల ముందు మనసు విప్పి వెల్లడించిన శ్రీమతి పద్మావతి అంతరంగ ఆవిష్కరణం ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... నమస్కారం అమ్మా! మీ ఆరోగ్యం ఎలా ఉంది? పద్మావతి: ఆరోగ్యం ఏమాత్రం బావుండలేదు. నాకిప్పుడు 86 ఏళ్లు. సరిగ్గా కనిపించడం లేదు, వినిపించడం లేదు. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలోని తాళ్ల ముదునూరు పాడులో మా మరిదిగారైన వింజమూరి వెంకటేశ్వర్లు గారింట్లో ఉంటున్నా. మిమ్మల్ని చూసి చాలా కాలమైంది. గుర్తుపడతారా లేదా అనుకున్నాను. మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం, మర్చిపోవడం ఉండదు. మీతో పాటు మురారి, జగ్గయ్యగార్లను కూడా మర్చిపోలేను. ఆత్రేయ అసలు భార్య పేరు పద్మావతి అని, ఆమె బతికే ఉందని లోకానికి తొలిసారిగా చాటిచెప్పిన మీ ‘మనస్వినీ ట్రస్టు’ను ఎలా మర్చిపోగలను? 1990లో ఆత్రేయగారి పుట్టినరోజున (మే 7వ తేదీ) మద్రాసులో జరిగిన ‘ఆత్రేయ సాహితి’ ఆవిష్కరణ సభలో నన్ను స్టేజీ మీదకు పిలిచి సన్మానించి, ‘ఆత్రేయ సాహితి’ మొదటి ప్రతిని నాకు అందించారు కదా. ఆత్రేయ గారి అసలు పేరు....???? ఆత్రేయగారి అసలు పేరు కూడా ఉచ్చూరి కిళాంబి వేంకట నరసింహాచార్యులే! ఆయన తర్వాత ఉచ్చూరు అనే ఊరి పేరును తీసేశారు. అసలు పేరు ఆచార్యను మాత్రం ముందు తెచ్చుకుని, గోత్ర నామాన్ని కలుపుకొని ‘ఆచార్య ఆత్రేయ’ అనే కలం పేరు పెట్టుకున్నారు. ఆయన మీకు పెళ్లికి ముందే తెలుసా? మీకు బంధుత్వముందా? వాళ్ల అయ్య శ్రీకృష్ణమాచార్యులు నాకు వరుసకు మేనమామ. మాది ముందు నుంచీ అనుకొన్న సంబంధమే. మా ఇద్దరికీ వయసులో ఆరేళ్ల తేడా. నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో నా పుస్తకాలకు అట్టలు వేసిపెట్టడం, తెల్ల కాగితాల మీద రూళ్లు గీసిపెట్టడం ఆయనే చేసేవారు. మీది మొదటినుంచీ అనుకున్న మేనరికమే అయితే, ఆయన పద్యాల్లో రాసుకొన్న ఆత్మకథలోని ‘తొలిగాయం’లో ‘బాణ’మనే ప్రియురాల్ని సగోత్రం కారణంగా పెళ్లిచేసుకోలేకపోయానని బాధపడుతూ రాశారే? అది నిజమే. ఆయన స్కూల్ ఫైనల్ చదివే రోజుల్లో ‘బాణ’మనే అమ్మాయిని ప్రేమించారు. బాణమనేది ఆమె ముద్దు పేరు. ఆమె పేరు కూడా పద్మావతే. ఆయన జీవితంలో ముగ్గురు పద్మలున్నారు. ప్రేమించిన పద్మ సగోత్రం కారణంగా మా మావగారు అభ్యంతరం చెప్పడం వల్ల దూరమయ్యింది. పెళ్లాడిన పద్మను నేను. నేను కూడా కారణాంతరాల వల్ల ఎక్కువ కాలం ఆయనకు దూరంగానే ఉండాల్సి వచ్చింది. మూడో పద్మ నెల్లూరులో టైఫాయిడ్ జ్వరం వల్ల హాస్పిటల్లో చేరినప్పుడు ఆయనకు సేవ చేసిన నర్సు. వృత్తి ధర్మమైన విధి నిర్వహణగా కాక, వ్యక్తిగతంగా తనను అభిమానించి, సేవ చేసి బతికించిందని ఆత్రేయ ఆమెను చాలా మెచ్చుకొనేవారు. ఆ తర్వాత ఆమెకు కంచి బదిలీ అయితే కూడా, అప్పుడప్పుడూ వెళ్లి చూసి వస్తుండేవారు. ఆ పద్మ అకాల మరణానికి ఆయన ఎంతో బాధపడ్డారు. నర్స్ పద్మ గురించి మీరు చెప్పడం తప్ప, ఎవరికీ తెలియదు. కాని బాణం మాత్రం తన మనసుకు తొలిగాయం చేసి దూరమైందని అందరితో చెప్పుకునేవారట! వీణ వాయించడంలో నేర్పరి అయిన బాణానికి వేరొకరితో వివాహమైన తర్వాత ‘వీణ’ ప్రసక్తి వస్తే చాలు, బోరుమని ఏడ్చేవారని, ఆయన సినిమాల్లో అన్ని వీణ పాటలు రాయడానికి బాణం జ్ఞాపకాలే కారణమని చెపుతారు. మరి బాణాన్ని అంతగా ప్రేమించారని తెలిసి కూడా ఆత్రేయతో పెళ్లికి మీరెందుకు తలూపారు? ప్రేమ వేరు, పెళ్లి వేరు. టీనేజ్‌లో సర్వసాధారణమైన ప్రేమను తర్వాత మర్చిపోవడం సహజమనే అభిప్రాయంతో పెద్దలు మా పెళ్లి కుదిర్చారు. ఏమాటకామాట... నేను కూడా ఆత్రేయ గారిని చూసి ఇష్టపడ్డాను. అయినా మా అయ్యను పెళ్లికొడుకు అభిప్రాయం కూడా తెలుసుకోమన్నాను. మా అయ్య ఆ విషయం అడగటానికి ఆత్రేయ ఉంటున్న వాళ్ల మేనమామ జగన్నాథాచార్యుల గారింటికి వెళ్తే, ఆత్రేయ కనపడి ‘మీరొచ్చిన విషయం నాకు తెలుసు. పద్మతో పెళ్లి నాకిష్టమే’ అని చెప్పారట. అలా ఉభయుల అంగీకారంతో నా 13వ యేట 1940లో మా పెళ్లి జరిగింది. చెప్పడం మర్చిపోయాను. ‘శారదా యాక్టు’ వల్ల మా పెళ్లి కొంత కాలం వాయిదా పడింది కూడా. మీ పెళ్లికి ఆత్రేయగారి తరఫున పెద్దగా వ్యవహరించింది ఆయన తండ్రి కాకుండా మేనమామగారన్నమాట. తండ్రితో ఆత్రేయకు అంత సత్సంబంధాలు లేవా? లేకేం? ఆయన మీద గౌరవంతోనే బాణాన్ని పెళ్లి చేసుకోవడం మానుకొన్నారు. ఎటొచ్చీ తల్లి సీతమ్మ అనారోగ్యంగా ఉండగా, ఆయన అంతగా పట్టించుకోలేదని కోపం. తన చిన్నతనంలో తల్లికి దాయాదులు విషప్రయోగం చేసి చంపేశారని ఆత్రేయ అపోహ. ఆయనకు తల్లంటే అపరిమితమైన ఇష్టం. తల్లి దూరమైన ఊరు అనే ద్వేషంతోనే ఆయన ఉచ్చూరును విడిచిపెట్టి మేనమామ జగన్నాథాచార్యులగారి నీడన చేరారు. తల్లి మీద ప్రేమతో ఆత్రేయ అద్భుతమైన అమ్మ పాటల్ని రాశారు. ‘కలసిన మనసులు’, ‘పాపం పసివాడు’, ‘రామ్ రాబర్ట్ రహీమ్’ మొదలైన చిత్రాల్లో ఆయన ‘అమ్మ’ మీద ఆణిముత్యాల్లాంటి పాటల్ని రాశారు.ఈ తరహా పాటలన్నింటికీ జ్ఞాపకాలే కారణమా? ఆయన స్వభావమే అంత! ఒక్క అమ్మనే కాదు - ఎవర్ని అభిమానించినా మర్చిపోలేననేవారు. పెళ్లయిన తర్వాత కూడా బాణాన్ని గుర్తుచేసుకోవడం వల్లనే మామధ్య పెళ్లయిన కొత్తలో స్పర్థలు కూడా వచ్చాయి. పెళ్లప్పటికి ఆయన ఏం చేస్తుండేవారు? ఆయన చినమామ జగన్నాథాచార్యులుగారు చిత్తూరులో మేజిస్ట్రేట్‌గా పని చేసేవారు. ఆయన తన పలుకుబడిని ఉపయోగించి తిరుత్తణి సెటిల్మెంట్ ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం వేయించారు. నెలకు 40 రూ జీతం. పెళ్లయిన కొన్నాళ్లకు ఉద్యోగం వదిలేసి, నాటకాల వ్యాపకంతో తిరిగేవారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత వస్తే, మామ భార్య రహస్యంగా అన్నంపెట్టేది. ఇలా నాటకాల వాళ్లతో తిరిగి చెడిపోతారని వాళ్ల మామ బలవంతంగా చిత్తూరు టీచర్స్ ట్రైనింగ్ స్కూల్లో చేర్పించారు. ట్రైనింగ్‌లో ఉంటూ కూడా నాటకాల పిచ్చితో ఓసారి గోడ దూకి పారిపోయారట! ఆ తర్వాత నెల్లూరు మున్సిఫ్ కోర్టులో కొంతకాలం, ‘జమీన్ రైతు’ పత్రికలో కొంతకాలం పనిచేశారు. ‘స్వర్గ సీమ’ చిత్రం గురించి అన్ని పత్రికల్లోనూ పొగుడుతూ సమీక్షలు రాస్తే, ఈయన మాత్రం ఆ చిత్రం బాగాలేదని రాశారట! దాంతో పత్రికల వాళ్లు కోప్పడితే, ఆ ఉద్యోగం కూడా వదిలేశారు. అలా ఏ ఉద్యోగంలోనూ ఇమడలేకపోవడం ఆత్రేయగారి తత్త్వం! జగన్నాథాచార్యులుగారి కుమార్తె వివాహం మద్రాసులో మీ ఇంట్లో ఆత్రేయగారే ఘనంగా జరిపించారని, ఆ సందర్భంగా రాసిన కొన్ని పాటలు ఆ తర్వాత సినిమాల్లో పాటలుగా రూపుదిద్దుకున్నాయని గతంలో మీ ఉత్తరంలో నాకు తెలియజేశారు. మళ్లీ ఓసారి చెబుతారా? ఆ అమ్మాయి పెళ్లి సందర్భంగా రాసిన, ఓ పాటనే ‘సుమంగళి’ సినిమా కోసం తమిళ బాణీ ఆధారంగా మార్చి ‘కొత్త పెళ్లికూతురా రారా, నీ కుడికాలు ముందు మోపి రారా’ అని రాశారు. అలాగే, ‘పెళ్లంటే పందిళ్లు సందళ్లు...’ అనే ‘త్రిశూలం’ చిత్రంలోని పాట కూడా అప్పుడు రాసిందే! ‘కారులో షికారుకెళ్లే పాల బుగ్గల పసిడి చాన..’ అనే ‘తోడికోడళ్లు’ చిత్రంలోని పాట గురించి కూడా ఎవరూ నమ్మలేని ఓ నేపథ్యాన్ని చెప్పారు. అది మీ మాటల్లో మళ్లీ వినాలనుంది... ఆత్రేయ నాటకాలు రాస్తూ, నాటకాలు వేస్తూ పొట్ట పోషించుకోవడం కోసం చిరుద్యోగాలు చేసే కాలంలో, నెల్లూరులోని ‘కస్తూరిబా’ బాలికల పాఠశాలలో ఆడపిల్లలకు నాటకాలు నేర్పేవారు. ఆ సందర్భంగా శ్రీమంతులైన రెడ్ల పిల్లలు జట్కాల మీద, కార్ల మీద స్కూలుకి రావడం చూసి వాళ్ల దర్జాను, తన అవస్థను తల్చుకుని ఈ పాట రాశారట! దీనిని మొదట ‘సంసారం’ చిత్రంలో పెడదామనుకొని, తర్వాత ‘తోడి కోడళ్లు’లో ఉపయోగించారు. ఆత్రేయగారికి మీరెలా దూరమయ్యారు? అన్ని సినిమాలకు రాసి సంపాదించిందంతా ఆత్రేయ ఏం చేశారు? మీకు మద్రాసులో సొంత ఇల్లు ఉండేది కదా! నిజానికి మీరడిగిన ప్రశ్నల్లో చాలా వాటికి నా దగ్గర కాని, ఆయన దగ్గర కాని సరైన జవాబులు ఉండవు. ఆయన సినిమా ఫీల్డ్కి వెళ్లిన తర్వాత, కొన్ని సమస్యల్లో ఇరుక్కొని కాపురం పెట్టలేదు. కొంతకాలం పుల్లయ్యగారి ఆఫీసులో ఒక్కరే ఉన్నారు. 1954లో నన్ను మద్రాసు తీసుకెళ్లారు. ఆళ్వారుపేటలో చిన్న ఇంట్లో కాపురం. చుట్టూ పల్లెవాళ్లతో వాతావరణం ఇబ్బందికరంగా ఉండేది. అయినా ఎలాగో భరించి సహించేదాన్ని. ఆయన రోజూ ఇంటికొచ్చేవారు కాదు. అప్పుడప్పుడూ మాత్రమే వచ్చేవారు. ఇంటి యజమానులకు సకాలంలో బాడుగ కూడా చెల్లించేవారు కాదు. మీరన్నట్టు యాభైలలో అంత సంపాదన ఉండి మాకా దరిద్రం ఎందుకో నాకర్థమయ్యేది కాదు. ఇదిలా ఉండగా, 1956లో మా అమ్మకు కాళ్లు చచ్చుపడిన కారణంగా, నేను మంగళంపాడు వెళ్లి వచ్చేసరికి పరిస్థితులు మారి, ఆయన నాకు కాకుండా పోయారు. సారీ, మీ వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ మిమ్మల్ని నొప్పిస్తున్నాను. ఆ తర్వాత ఆయన ‘నల్ల కమల’ అనే ఆమెను పెళ్లి చేసుకున్నారని, ఆమె ఇద్దరు కూతుళ్లనూ చివరి వరకూ తన పిల్లలుగా భావించి, పెళ్లిళ్ల బాధ్యతను కూడా ఆయనే తీసుకొన్నారని మద్రాసులో ఆత్రేయ కుటుంబం గురించి చెప్పుకునేవారు. అవన్నీ నిజాలా? ఆయన నల్ల కమలను చేరదీసిన మాట నిజం. అయితే, ఆమెను పెళ్లి మాత్రం చేసుకోలేదు. సహజీవనం చేశారు... అంతే! ఆత్రేయ కూతుళ్లుగా చెలామణీ అయినవాళ్లు, కమల అక్కగారి సంతానం. ఆవిడ 1978లో చనిపోయింది. అప్పుడు ఆత్రేయ భార్య చనిపోయిందని, అసలు భార్య ఎప్పుడో తెరమరుగైపోయిందని అందరూ అనుకొన్నారట! ఆ కుటుంబ భారం మీద పడేసరికి ఆయన సంపాదన, సొంత ఇల్లు... అన్నీ హరించుకుపోయాయి. జరిగిన అన్యాయానికి ఆత్రేయగారి పట్ల కోపం లేదా? లేవు. ఆయన దుర్మార్గుడు కాదు. నన్ను ఆయనెప్పుడూ ద్వేషించలేదు, దూషించలేదు. నా గురించి చాలా బాధపడేవారు. నా జీవితాన్ని పాడుచేశాను అని పశ్చాత్తాపపడేవారు. ఊబిలో దిగాను, పైకి రాలేకపోతున్నాననేవారు. విధి మమ్మల్ని దూరం చేసింది. అంతే! ఆత్రేయగారితో ముడిపడి, ఇలా దగా పడినందుకు సహధర్మచారిణిగా మీరేమనుకుంటున్నారు? (కళ్లొత్తుకొంటూ) ఆత్రేయ అంతటి కవికి భార్యనైనందుకు గర్విస్తాను. ఆత్రేయుడు అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడి వెన్నెలకు దూరమై కృష్ణ పక్షం మాత్రమే దక్కడం నా దురదృష్టంగా భావిస్తాను. చివరిగా ఈ వృద్ధాప్యంలో మీ జీవితాన్ని గురించి మీకేమనిపిస్తోంది? ఆ మహానుభావుడే చెప్పినట్టు - పోయినోళ్లందరూ మంచోళ్లు ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు! అని! - డా॥పైడిపాల paidipala_p@yahoo.com నీ పరిశోధన పూర్తయ్యేనాటికి చచ్చిపోతాను..! ఆత్రేయ సంపూర్ణ రచనలపై పీహెచ్డీ పట్టా కోసం పైడిపాల మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన చేద్దామని వెళ్లారు. కాని అప్పుడు ఆ విశ్వవిద్యాలయంలో ‘సజీవులైన వ్యక్తుల మీద పరిశోధన చేయకూడద’నే ఆంక్ష ఉండటం వల్ల, పైడిపాల పరిశోధనాంశాన్ని మార్చుకోవలసి వచ్చింది. ఆ సందర్భంగా ఆత్రేయ ‘నేను సగం చచ్చే ఉన్నాను. నీ పరిశోధన పూర్తయ్యేనాటికి చచ్చిపోతాను. ఈ విషయం మీ యూనివర్సిటీవారికి చెప్పి, నా రచనల మీద నీ పరిశోధన కొనసాగించు’ అన్నారు. ‘పరిశోధన మీవంటి కవులను బతికించడానికి తప్ప, చంపడానికి కాదు’ అని జవాబిచ్చారు. కానీ ఆ ఏడే (89) సెప్టెంబర్ 13న ఆత్రేయ కన్నుమూశారు. -
మరో మొహెంజొదారో ప్రయోగాలకు నాంది
50 ఏళ్ళ నాటకం: తెలుగు నాటకాన్ని ప్రయోగ ధోరణి వైపు వడిగా అడుగులేయించిన నాటకం ‘మరో మొహెంజొదారో’. ఇది ప్రయోగాత్మకంతో పాటు ‘ప్రయోజనాత్మక’ నాటకం కూడా అని ఆ రోజులలో ఒక పత్రిక రాసిందట. నిజమే. జోడుగుళ్లు ఒకేసారి పేల్చినట్టు రచయిత ఎన్ఆర్ నంది ఈ నాటకంలో ఒకేసారి రెంటినీ సాధించారు. 1964లో మొదటి ప్రదర్శన నోచుకున్న సందర్భంగా... ‘మరో మొహెంజొదారో’ను ఆచార్య ఆత్రేయకు అంకితమిచ్చారు నంది. మన సాంఘిక నాటకానికి కొత్త దృష్టిని ఇచ్చినవాడు ఆయనే. ఆత్రేయ రాసిన ‘ఎవరు దొంగ’ అన్న నాటికలో ఒక పాత్ర ప్రేక్షకుల మధ్య నుంచి రంగస్థలం మీదకు వెళుతుంది- ప్రశ్నిస్తూ. రెండవ ప్రపంచ యుద్ధానంతర దారుణ దృశ్యాలతో ఆయన రాసిన ‘విశ్వశాంతి’ నాటకంలో అంతర్నాటకంతో పాటు, నీడలతో కథను నడపడం వంటి కొత్త పోకడలు కొన్ని కనిపిస్తాయి. ఇలాంటి ఆధునిక దృష్టికే నంది ‘మరో మొహెంజొదారో’లో పట్టం కట్టారు. ఈ నాటకం మీద కొందరు చేసిన వ్యాఖ్యలు నందిని ఎంత బాధించాయో ముందుమాట చదివితే తెలుస్తుంది. కానీ నాటకం చదివిన తరువాత ఆ వ్యాఖ్యలు చేసినవారు అర్థం కాక చేసి ఉండాలి, లేదా కొత్తదనాన్ని స్వాగతించడానికి సిద్ధంగా లేనివారెవరో చేసి ఉంటారని అనిపిస్తుంది. ఇది యాభయ్ సంవత్సరాల క్రితం రాసిన నాటకం. కానీ ఇప్పుడు చదువుకున్నా ఆ అనుభూతి తాజాగానే ఉంటుంది. నంది తీసుకున్న ఇతివృత్తం సార్వకాలికమైనది. మనుషులలోనే కనిపించే దోపిడీ తత్వం, అలాంటి అవ్యవస్థను నిర్మూలించడానికి మళ్లీ మనిషి పడే తపన ఇందులో చిత్రించారాయన. చారిత్రక దృష్టి, తాత్విక చింతనలతో గాఢంగా ముడిపడి ఉన్న అంశమిది. వీటి వల్ల సాధారణంగా నాటక ప్రక్రియకు ఏ మాత్రం సరిపడని ఉపన్యాస ధోరణి చొరబడుతుంది. నాటకానికి ప్రయోక్త పాత్రను కూడా నిర్వహించిన ‘శాస్త్రజ్ఞుడు/ప్రొఫెసర్’ పాత్రలో కనిపించేది ఈ ధోరణే. ఇంత సుదీర్ఘమైన చరిత్రను చూస్తుంటే చరిత్ర నుంచి మనిషి ఏమీ నేర్చుకోలేదని అనిపిస్తుంది అంటాడొక చరిత్ర తత్వవేత్త. ఇందులో శాస్త్రజ్ఞుడు కూడా ప్రకృతితో సమరం చేసిన మనిషి నాగరిక సమాజాన్ని రూపొందిస్తున్నానని అనుకుంటూనే అనేక తప్పులు చేశాడు అంటాడు. వాటిని సరి చేయడానికి మళ్లీ ఎన్నో సమరాలు, విప్లవాలు అవసరమయ్యాయని గుర్తు చేస్తాడు. రకరకాల సిద్ధాంతాలు పుట్టుకొచ్చి నది ఆ క్రమంలోనే అంటాడు. ఈ సంఘర్షణలోనే నాగరికతలు పుట్టాయి, గిట్టాయి అన్నదే ఆ ప్రొఫెసర్ సిద్ధాంతం. ఇలాంటి ఉపన్యాస ధోరణిని తన ఇతివృత్తాన్ని ఆవిష్కరిం చడానికి చక్కగా ఉపయోగించుకోవడంలోనే నంది నే ర్పరితనం కనిపిస్తుంది. ఇక్కడ శ్రీశ్రీ ‘దేశ చరిత్రలు’ కవితలో పంక్తులను రచయిత విరివిగా ఉపయోగించు కున్నారు. ఇవన్నీ కలసి మంచి ప్రయోగాత్మక నాటకాన్ని తెలుగు వాళ్లకి అందించాయి. తన ప్రయోగశాలలోని కొన్ని పరిశోధక గ్రంథాలను శాస్త్రజ్ఞుడు మనకు పరిచయం చేయడం దగ్గర నాటకం ఆరంభమవుతుంది. నిజానికి ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క జీవితం. ఒక్కొక్క వర్గానికి ప్రాతినిధ్యం వహించే జీవితమది. పాత్రల పేర్లు కూడా ఆయా వర్గాలనే ప్రతిబింబిస్తుంటాయి. అవి- భిక్షాలు (పేద), పరంధామయ్య (మధ్య తరగతి), భూషణ్(తిరుగుబాటు ధోరణి), కోటీశ్వరయ్య (ధనికుడు), లాయర్, డాక్టర్ (చదువుకున్న వర్గం), తులసి (బలి పశువు). పేదవాడు మరింత పేదవాడు అవుతుంటే, ధనికుడు మరింత ధనవంతుడవుతున్నాడని ప్రొఫెసర్ ప్రకటించి భిక్షాలును పలకరిస్తాడు. భిక్షాలు ఇప్పుడు కూలి. కానీ అతడి తండ్రి రైతు. ఈ పరిణామం ఏం మారింది? ఇలా ఒక్కొక్క పాత్రను మొదట పరిచయం చేసి నెమ్మదిగా ప్రొఫెసర్ వేదికను అసలు పాత్రలకు విడిచి పెడతాడు. కానీ ఇన్ని సిద్ధాంతాలు ఎందుకు పుట్టుకు రావలసి వచ్చిందో భూషణ్ పాత్ర ద్వారా చాలా చక్కగా ఆవిష్కరించారు నంది. మార్పును కోరే విప్లవకారులు ఎన్నయినా చెప్పవచ్చు. కానీ వాళ్ల అభ్యుదయం మాటున ఎక్కడో ఒకింత పిడివాదం దాగి ఉందన్న విషయాన్ని కూడా రచయిత విడిచి పెట్టలేదు. మధ్య తరగతిలో ఉండే అవకాశవాద ధోరణిని పరంధామయ్యలో చూస్తుంటే జాలి కలుగుతుంది. చివరికి భూషణ్ లేవదీసిన విప్లవానికి వెన్నుపోటు పొడిచేది కూడా ఇతడే. కానీ కోటీశ్వరయ్య చ నిపోయేది కూడా ఇతడి చేతులోనే. నిజానికి ఇది 1963 ప్రాంతంలో వచ్చిన రచన. తొలి ప్రదర్శన అనంతపురంలో 1964లో జరిగింది. మరో మొహెంజొదారో అంటే మరో మట్టి దిబ్బ. గొప్ప నాగరికత అవశేషం. ఆ సమాజం వరదలతోనో, మరో ఉత్పాతంతోనో ధ్వంసమైంది. ఇప్పటి సమాజం కూడా అనేక తప్పిదాలతో మరో మొహెంజొదారోను పునరావృతం చేయడానికి తొందరపడుతోందంటూ రచయిత చేసిన హెచ్చరికే ఈ నాటకం. ప్రయోగ దృష్టి నంది తరువాత వచ్చిన నాటకకర్తలలో కూడా కనిపిస్తుంది. ఆశ ఖరీదు అణా (గోరా శాస్త్రి), రాజీవం (కేవీఆర్, వేణు), మళ్లీ మధుమాసం (గణేశ్‌పాత్రో), త్రిజాకీ యమదర్శనం (అబ్బూరి గోపాలకృష్ణ), కుక్క (యండమూరి), ఓ బూతు నాటకం (ఇసుకపల్లి మోహనరావు), కొక్కొరోకో, గార్దభాండం (తనికెళ్ల భరణి), పెద్ద బాలశిక్ష (ఆకెళ్ల), పడమటిగాలి (పాటిబండ్ల ఆనందరావు) వంటి వాటిలో ప్రశంసనీయమైన ప్రయోగధోరణులు కనిపిస్తాయి. - గోపరాజు నారాయణరావు -
మన సుకవి
సత్వం ఆత్రేయ అంటే అర్థం చంద్రుడు. సినీవినీలాకాశంలో ఆయన కాచిన పున్నమి వెన్నెళ్లు ఎన్నని! ‘మనసు మూగదేకాని బాసుంటది దానికి/ చెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇదీ’. ‘నేనొక ప్రేమ పిపాసిని/ నీవొక ఆశ్రమవాసివి’. మనసంత సున్నితమైన మాటలు అల్లినవాడూ, మనసు మర్మాన్ని ఎరిగినవాడూ, మనసయ్యేలా రాసినవాడూ కాబట్టే ఆత్రేయ ‘మనసు కవి’ అయ్యాడు. ఆత్రేయ అన్న గోత్రనామాన్నే కలంపేరుగా చేసుకున్న కిళాంబి వెంకట నరసింహాచార్యులు... కప్పలు, ఈనాడు, ఎన్జీవో, విశ్వశాంతి లాంటి నాటకాలతో ప్రజాదరణ పొంది సినీరంగంలోకి వచ్చాడు. ‘ఈభూమి తిరిగేది రూపాయిచుట్టూ’ అని ఆయనకు తెలుసు. ‘కాటికెళ్లితే అందరూ ఒకటే అనుకోబోకు/ అక్కడ కూడా తేడాలున్నాయి కాలేవరకు’ అనీ తెలుసు. కాబట్టే, సమసమాజం ఆదర్శంగా రచనలు చేశాడు. ‘మన భూమి వేదభూమిరా తమ్ముడూ/ మన కీర్తి మంచుకొండరా’ అని పనికిరాని గతాన్ని ఎద్దేవా చేశాడు. ‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడిచాన (ను) బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా’ అని ప్రశ్నించాడు. అంతులేని కథ, అభినందన, అర్ధాంగి, ఆరాధన, జయభేరి, డాక్టర్ చక్రవర్తి, దసరా బుల్లోడు, నీరాజనం, ప్రేమనగర్, సెక్రటరీ లాంటి సుమారు రెండు వందల చిత్రాలకు మాటలూ, రెండు వేల వరకు పాటలూ రాశాడు ఆత్రేయ. ‘మనిషికి చాలా కాలం బ్రతుకుతాడన్న అబద్ధం కంటే, నేడో రేపో చచ్చిపోతాడన్న నిజం తెలియడం చాలా మంచిది. చేయదల్చుకున్న మంచి ఏదైనా ఉంటే అప్పుడే చేస్తా’ (వెలుగు నీడలు)డని మాటలతో దుఃఖపెట్టాడు. ‘పెళ్లంటే- పందిళ్లు సందళ్లు/ తప్పట్లు తాళాలు తలంబ్రాలు/ మూడే ముళ్లు ఏడే అడుగులు/ మొత్తం కలిపి నూరే’ (త్రిశూలం)ళ్లని పాటలతో సంతోషపెట్టాడు. ‘అమ్మంటే అమ్మ/ ఈ అనంతసృష్టికి ఆమె అసలు బ్రహ్మ’ అన్న ఆత్రేయ చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు. ప్రేమించిన ప్రియురాలి చేయిని అందుకోలేకపోయాడు. ‘అనుకున్నామని జరగవు అన్ని/ అనుకోలేదని ఆగవు కొన్ని/ జరిగేవన్నీ మంచికని/ అనుకోవడమే మనిషి పని’ అంటాడో చోట. జీవితం పట్లా, పొందలేనిదాని పట్లా సమాధానం పడటానికి పడే తపన కావొచ్చది. తన యౌవనంలో ఇష్టపడ్డ ‘బాణం అనే అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయిన నలుగుబాటు ఆయన్ని జీవితాంతం వెంటాడింది. ‘నిన్ను ఏమీ సుఖపెట్టలేకపోయాను, నేనూ సుఖపడ్డదీ లేదు,’ అని భార్య పద్మావతికి రాసిన ఉత్తరంలో ఆయన పడిన క్షోభ తెలుస్తుంది. మనసున్నవాడికి మథనమే మిగిలేది! అది లేకపోవడమే ఒక్కోసారి మేలేమో! ‘తీపి మాటలు గొంతు కోతలు/ నరులకు మాకే సొంతం’ అన్నట్టుగా చరించే మనుషుల మధ్య, మనసనే మధుకలశంలో విషపుచుక్కలు జార్చే కఠిన పాషాణుల మధ్య మనసున్నవాడుగా బతకడం కష్టం. ఆ నిష్టూరంలోంచే కాబోలు, ‘మనసు గతి యింతే/ మనిషి బ్రతుకింతే/ మనసున్న మనిషికీ సుఖము లేదంతే’ అన్నాడు. ‘బ్రతికుండగా నిన్ను ఏడిపించినోళ్లు/ నువ్వు చస్తే ఏడుత్తారు దొంగనాయాళ్లు’ అని వెక్కిరించాడు. ‘మనిషి చాలా దొడ్డాడమ్మా చెల్లెమ్మా/ తెలివి మీరి చెడ్డాడమ్మా చిన్నమ్మా’ అని హితవు పలికాడు. ‘అనుకున్నామని జరగవు అన్ని/ అనుకోలేదని ఆగవు కొన్ని/ జరిగేవన్నీ మంచికని/ అనుకోవడమే మనిషి పని’ అంటాడు. పొందలేనిదాని పట్ల సమాధానం పడటానికి పడే తపనది. ‘మగువ మనసు సగం చదివితే మగవాడప్పుడు డాక్టరాఫ్ రొమాన్స్’ అన్నాడేగానీ తప్పనిసరైన భోగంపాటలకు ఆత్రేయ నొచ్చుకున్నట్టే కనబడతాడు. ‘సినిమా కవి బ్రతుకు అనేకానేక అభిరుచులుగల విటులను సంతృప్తి పరచవలసిన పడుపు వృత్తి’ అన్న నిరసన బహుశా ఆయన మీద పడిన ‘బూత్రేయ’ ముద్రకు ఒక సంజాయిషీ అనుకోవాలి. ఇలాంటి వేదనలో మనిషికి నిద్ర ఎలా పడుతుంది? ‘కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది/ కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది’. అన్నింటికీ నిద్రే మందు మరి. ఒక్కోసారి అది శాశ్వత నిద్రయినా కావొచ్చు. అంతేగా, కాలం పాపమని దేన్నీ ఆపదు. ‘నేడు నిన్నౌతుంది/ రేపు నేడౌతుంది/ ఆ రేపుకూడా నిన్నగా మారుతుంది’. ఆత్రేయ అయినా అంతే! ‘మట్టి బొమ్మలే మనమంతాను/ గిట్టిపోవలె మట్టిలోపలే’. కాకపోతే ఉన్నన్నాళ్లూ, ‘నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ/ నవ్వుతూ చావాలిరా’!