ఆత్రేయ అత్తవారింటికి వందేళ్లు
సూళ్లూరుపేట : తెలుగు సినీ చరిత్రలో ఎన్నో వైవిధ్య భరితమైన పాటలు రాసి తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న మనసు కవి ఆచార్య ఆత్రేయ అత్తవారిల్లు నిర్మించి వంద సంవత్సరాలైంది. ఆయన పాటలులాగే ప్రజల హృదయాల్లో నేటికీ ఎలా పదిలంగా ఉన్నాయో.. ఆ ఇల్లు అంతే చెక్కు చెదరలేదు. సూళ్లూరుపేట మండలం మంగళంపాడులో 1915లో ఈ ఇల్లు నిర్మించారు. దొరవారి సత్రం మండలం ఉచ్చూరు గ్రామానికి చెందిన ఆత్రేయ పక్కనే ఉన్న మంగళంపాడులో వివాహం చేసుకున్నారు.
ఉచ్చూరులో ఆత్రేయకు చెందిన ఇళ్లు, ఆస్తులు పోయినా మంగళంపాడులో అత్తవారిల్లు మాత్రం అలాగే ఉంది. జీవిత చరమాంకంలో మంగళంపాడులోనే స్థిరపడాలని అనుకునే వారని ఆయన సమీప బంధువులు చెబుతారు. ఆ కోరిక తీరకుండానే ఆయన మృతి చెందారు. అయితే ఆ ఇంటిని మాత్రం ఆయన జ్ఞాపకాల కోసం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంచారు.