మన సుకవి
సత్వం
ఆత్రేయ అంటే అర్థం చంద్రుడు. సినీవినీలాకాశంలో ఆయన కాచిన పున్నమి వెన్నెళ్లు ఎన్నని! ‘మనసు మూగదేకాని బాసుంటది దానికి/ చెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇదీ’. ‘నేనొక ప్రేమ పిపాసిని/ నీవొక ఆశ్రమవాసివి’. మనసంత సున్నితమైన మాటలు అల్లినవాడూ, మనసు మర్మాన్ని ఎరిగినవాడూ, మనసయ్యేలా రాసినవాడూ కాబట్టే ఆత్రేయ ‘మనసు కవి’ అయ్యాడు.
ఆత్రేయ అన్న గోత్రనామాన్నే కలంపేరుగా చేసుకున్న కిళాంబి వెంకట నరసింహాచార్యులు... కప్పలు, ఈనాడు, ఎన్జీవో, విశ్వశాంతి లాంటి నాటకాలతో ప్రజాదరణ పొంది సినీరంగంలోకి వచ్చాడు. ‘ఈభూమి తిరిగేది రూపాయిచుట్టూ’ అని ఆయనకు తెలుసు. ‘కాటికెళ్లితే అందరూ ఒకటే అనుకోబోకు/ అక్కడ కూడా తేడాలున్నాయి కాలేవరకు’ అనీ తెలుసు. కాబట్టే, సమసమాజం ఆదర్శంగా రచనలు చేశాడు. ‘మన భూమి వేదభూమిరా తమ్ముడూ/ మన కీర్తి మంచుకొండరా’ అని పనికిరాని గతాన్ని ఎద్దేవా చేశాడు. ‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడిచాన (ను) బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా’ అని ప్రశ్నించాడు.
అంతులేని కథ, అభినందన, అర్ధాంగి, ఆరాధన, జయభేరి, డాక్టర్ చక్రవర్తి, దసరా బుల్లోడు, నీరాజనం, ప్రేమనగర్, సెక్రటరీ లాంటి సుమారు రెండు వందల చిత్రాలకు మాటలూ, రెండు వేల వరకు పాటలూ రాశాడు ఆత్రేయ. ‘మనిషికి చాలా కాలం బ్రతుకుతాడన్న అబద్ధం కంటే, నేడో రేపో చచ్చిపోతాడన్న నిజం తెలియడం చాలా మంచిది. చేయదల్చుకున్న మంచి ఏదైనా ఉంటే అప్పుడే చేస్తా’ (వెలుగు నీడలు)డని మాటలతో దుఃఖపెట్టాడు. ‘పెళ్లంటే- పందిళ్లు సందళ్లు/ తప్పట్లు తాళాలు తలంబ్రాలు/ మూడే ముళ్లు ఏడే అడుగులు/ మొత్తం కలిపి నూరే’ (త్రిశూలం)ళ్లని పాటలతో సంతోషపెట్టాడు.
‘అమ్మంటే అమ్మ/ ఈ అనంతసృష్టికి ఆమె అసలు బ్రహ్మ’ అన్న ఆత్రేయ చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు. ప్రేమించిన ప్రియురాలి చేయిని అందుకోలేకపోయాడు. ‘అనుకున్నామని జరగవు అన్ని/ అనుకోలేదని ఆగవు కొన్ని/ జరిగేవన్నీ మంచికని/ అనుకోవడమే మనిషి పని’ అంటాడో చోట. జీవితం పట్లా, పొందలేనిదాని పట్లా సమాధానం పడటానికి పడే తపన కావొచ్చది. తన యౌవనంలో ఇష్టపడ్డ ‘బాణం అనే అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయిన నలుగుబాటు ఆయన్ని జీవితాంతం వెంటాడింది. ‘నిన్ను ఏమీ సుఖపెట్టలేకపోయాను, నేనూ సుఖపడ్డదీ లేదు,’ అని భార్య పద్మావతికి రాసిన ఉత్తరంలో ఆయన పడిన క్షోభ తెలుస్తుంది.
మనసున్నవాడికి మథనమే మిగిలేది! అది లేకపోవడమే ఒక్కోసారి మేలేమో! ‘తీపి మాటలు గొంతు కోతలు/ నరులకు మాకే సొంతం’ అన్నట్టుగా చరించే మనుషుల మధ్య, మనసనే మధుకలశంలో విషపుచుక్కలు జార్చే కఠిన పాషాణుల మధ్య మనసున్నవాడుగా బతకడం కష్టం. ఆ నిష్టూరంలోంచే కాబోలు, ‘మనసు గతి యింతే/ మనిషి బ్రతుకింతే/ మనసున్న మనిషికీ సుఖము లేదంతే’ అన్నాడు. ‘బ్రతికుండగా నిన్ను ఏడిపించినోళ్లు/ నువ్వు చస్తే ఏడుత్తారు దొంగనాయాళ్లు’ అని వెక్కిరించాడు. ‘మనిషి చాలా దొడ్డాడమ్మా చెల్లెమ్మా/ తెలివి మీరి చెడ్డాడమ్మా చిన్నమ్మా’ అని హితవు పలికాడు.
‘అనుకున్నామని జరగవు అన్ని/ అనుకోలేదని ఆగవు కొన్ని/ జరిగేవన్నీ మంచికని/
అనుకోవడమే మనిషి పని’ అంటాడు. పొందలేనిదాని పట్ల సమాధానం పడటానికి పడే తపనది.
‘మగువ మనసు సగం చదివితే మగవాడప్పుడు డాక్టరాఫ్ రొమాన్స్’ అన్నాడేగానీ తప్పనిసరైన భోగంపాటలకు ఆత్రేయ నొచ్చుకున్నట్టే కనబడతాడు. ‘సినిమా కవి బ్రతుకు అనేకానేక అభిరుచులుగల విటులను సంతృప్తి పరచవలసిన పడుపు వృత్తి’ అన్న నిరసన బహుశా ఆయన మీద పడిన ‘బూత్రేయ’ ముద్రకు ఒక సంజాయిషీ అనుకోవాలి.
ఇలాంటి వేదనలో మనిషికి నిద్ర ఎలా పడుతుంది? ‘కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది/ కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది’. అన్నింటికీ నిద్రే మందు మరి. ఒక్కోసారి అది శాశ్వత నిద్రయినా కావొచ్చు.
అంతేగా, కాలం పాపమని దేన్నీ ఆపదు. ‘నేడు నిన్నౌతుంది/ రేపు నేడౌతుంది/ ఆ రేపుకూడా నిన్నగా మారుతుంది’. ఆత్రేయ అయినా అంతే! ‘మట్టి బొమ్మలే మనమంతాను/ గిట్టిపోవలె మట్టిలోపలే’. కాకపోతే ఉన్నన్నాళ్లూ, ‘నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ/ నవ్వుతూ చావాలిరా’!