తల్లి ప్రేమను పంచారు
పద్మావతి ఆత్రేయ చెల్లెలు కుటుంబసభ్యులు
తాడేపల్లిగూడెం : తన పిల్లలతో సమానంగా ప్రేమ, వాత్స్యలాలను తమకు పంచారని ఆచార్య ఆత్రేయ సతీమణి పద్మావతి గురించి ఆమె చెల్లెలు మధురవల్లి కుటుంబసభ్యులు అన్నారు. పద్మావతి ఆత్రేయ శుక్రవారం తాడేపల్లిగూడెం మండలంలోని తాళ్లముదునూరుపాడులో తుదిశ్వాస విడిచారు. పెద్దమ్మ అయినా సొంత తల్లిలా తమ ఆలనాపాలనా చూసుకున్నారని విషణ్ణ వదనలతో వారు గుర్తుచేసుకున్నారు.
సంతాపాల వెల్లువ
ఆచార్య ఆత్రేయ సతీమణి పద్మావతి మృతికి పలువురు సంతాపం తెలిపారు. తెలుగు సినీ రంగానికి ఆత్రేయ కుటుంబం అందించిన సేవలు మరువలేనివని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. మానవతావాదిగా, కవి, రచయితగా ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసిన ఆత్రేయ విజయాల వెనుక పద్మావతి పాత్ర ఎంతో ఉందని చెప్పారు. బీజేపీ జిల్లా కార్యదర్శి కంచుమర్తి నాగేశ్వరరావు, నియోజకవర్గ కన్వీనర్ ఖండభట్టు శ్రీనివాసరాజు తదితరులు సంతాపం తెలిపారు. ఆత్రేయ అభిమాన పుత్రుడు పైడిపాల, సినీ రచయిత మాడభూషి దివాకర్‌బాబు, కిళాంబి జవహర్‌లాల్‌నెహ్రూ, వెలగల చంద్రశేఖరరెడ్డి, ఎస్‌టీవీఎన్ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధి కుదుళ్ల నారాయణరావు తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.
నడవడిక నేర్పారు
పెద్దమ్మ అయినా సొంత తల్లిలా చూసుకున్నారు. 1990 నుంచి మా ఇంటి వద్దే ఉంటున్నారు. మా ఇంటికి పెద్దదిక్కుగా ఉంటూ మాకు నడవడిక నేర్పారు. వృద్ధాప్యం మీదపడుతున్నా కళ్లజోడు సాయం లేకుండా అన్నింటిని చదివేవారు. కావాల్సినవి తింటూ ఇప్పటి వరకు ఆరోగ్యంగానే ఉన్నారు. వాతావరణం, వయోభారంతో ఇబ్బంది పడి దైవసాన్నిధ్యానికి చేరుకున్నారు. ఆత్రేయ గారి విజయాల వెనుక మా పెద్దమ్మ పాత్ర ఎంతో ఉంది. సంస్కృతం, హిందీ, తమిళ భాషల్లో ప్రవేశం గల ఆమె కొన్ని రచనలు కూడా చేశారు. ఆమె మరణం మాకు తీరనిలోటు.
-వింజమూరి రంగనాథ్, పద్మావతి చెల్లెలు కుమారుడు
పెద్ద దిక్కుగా ఉన్నారు
పద్మావతి ఇంటికి పెద్దదిక్కుగా ఉన్నారు. ఆత్రేయ కాలం చేసిన దగ్గర నుంచి మా ఇంటిలోనే ఉంటున్నారు. పెద్దదిక్కుగా ఉండటంతో పాటు, పిల్లలకు నైతికత, విలువలు తదితర విషయాల గురించి చెప్పేవారు. ఆమె మరణం మాకు కుటుంబానికి తీరనిలోటు.
- వింజమూరి వెంకటేశ్వర్లు, పద్మావతి మరిది