సాక్షి, తిరువళ్లూరు: మనం గొప్ప పనులు చేయలేకపోచ్చు.. కానీ చేసే పనులను మనసు పెట్టి చేస్తే అదే మనిషి ఔన్నత్యానికి కొలబద్దతగా మారుతుందన్న మదర్‌థెరిస్సా మాటలు వారిలో స్ఫూర్తి నింపాయి. ఇదే స్ఫూర్తితో కెనడాకు చెందిన క్లోవీఎలిజబెత్, స్కాట్లాండ్‌కు చెందిన హన్నారోస్ తిరువళ్లూరు సమీపం, సేవాలయ ఆశ్రమంలోని అనాథలకు సేవ, విద్యార్థులకు ఆంగ్లం బోధిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు ఎలిజబెత్, హన్నారోస్. ఈ సందర్భంగా వారిని పలుకరించిన సాక్షికి తెలిపిన వివరాలు వారి మాటల్లోనే..
సామాజిక సేవపై ఆసక్తి
చిన్నప్పటి నుంచి సామాజిక సేవ చేయాలన్న ఆసక్తి ఉండేది. దీంతో భారతదేశానికి వెళ్లి ఏదైనా ఆశ్రమంలో సేవచేస్తూ.. సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది ఎలిజబెత్. ఇంగ్లాండ్‌కు చెందిన క్లోవీఎలిజబెత్ తండ్రి జాన్ పర్యావరణ పరిరక్షణ అధికారి. తల్లి సారా ప్లేస్కూల్, స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నారు. ‘2016లో వ్యవసాయ సాగు– ఆహార పదార్థాల్లో విషతుల్యం అనే అంశంపై ప్రాజెక్టు చేయడానికి స్కాట్లాడ్‌కు వెళ్లా. అక్కడే నెదర్లాండ్‌కు చెందిన హన్నారోస్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి ఆసక్తి సేవచేయడమే కావడంతో ఇంటర్ పూర్తిచేశాక భారత్‌కు వెళ్లాలనుకున్నాం. అక్కడ ఏదైనా ఓ ఆశ్రమంలో సేవ చేస్తూనే సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించాం’ అని వివరించారు ఎలిజబెత్. తల్లిదండ్రులను ఒప్పించి మాకు అనువైన చెన్నై సమీపం, కసువ వద్ద ఉన్న సేవాలయ ఆశ్రమాన్ని ఎంచుకున్నామని హన్నారోస్, ఎలిజబెతు లు వివరించారు.
ఉదయం వ్యవసాయం – సాయంత్రం సంప్రదాయం
నవంబర్‌లో సేవాలయకు వచ్చాం. మాకు ఉన్న ఏడాది సమయంలో వ్యవసాయం, సనాతన భారతీయ సంప్రదాయాలను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం వ్యవసాయ పనులు, తొమ్మిదింటికి అవ్వతాతల బాగోగులు చూసుకోవడం, తరువాత మధ్యాహ్నం మూడు గంటల వరకు చిన్నపిల్లలకు స్పోకెన్ ఇంగ్లిష్ చెప్పడం మా దినచర్య. పాఠశాల ముగియగానే మళ్లి అరకపట్టి దున్నడం, కలుపుతీయడం, కూరగాయలను కోసి ఆశ్రమానికి పంపించడం చేస్తాం, మిగతా సమయంలో సంప్రదాయ వంటకాలు, భరతనాట్యం, వస్త్రధారణ నేర్చుకుంటున్నాం. తమిళం మాట్లాడడం, రాయడం నేర్చుకుంటున్నామన్నారు హన్నారోస్. పాఠశాల ముగిసే సమయానికి పిల్లల కోసం తల్లిదండ్రులు గేటు వద్దే వేచి ఉండడం, పిల్లలు రాగానే వారిని ప్రేమగా ముద్దాడడం చూస్తే ప్రేమకు దూరమయ్యామనే బాధ కలుగుతుందన్నారు క్లోవీఎలిజబెత్, హన్నారోస్.
సేంద్రియ సాగుపై ఆసక్తి ఎందుకంటే:
2016లో వ్యవసాయ సాగు పద్ధతులు – ఆహార పదార్థాల విషతుల్యం అనే అంశంపై ప్రత్యేక ప్రాజెక్టును రూపొదించడానికి స్కాట్లాండ్‌కు వెళ్లాం. అక్కడ వివిధ వర్గాల ప్రజలు, ప్రముఖ వైద్యుల అభిప్రాయాల మేరకు మనిషి తినే ఆహరంలో ఉన్న రసాయనాలే అనారోగ్యానికి కారణమనే విషయం మాకు స్పష్టంగా అర్థమైంది. ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలన్న ఉద్దేశంతో సేంద్రియ సాగుపై ఆసక్తి ప్రదర్శిస్తున్నామన్నారు ఎలిజబెత్, హన్నారోస్. ప్రస్తుతం సేవాలయలో కూరగాయలు, పప్పుదినుసులు, వరి తదితర ఆహార«ధాన్యాలను సాగు చేస్తున్నాం. మొదట కొంచెం భూమిని చదును చేసి విత్తనాలను చల్లిన సమయంలో వర్షాలు పడడంతో వృథాగా పోయింది. అయినా నిరాశ చెందలేదు. అక్కడున్న రైతుల సూచనలు స్వీకరించి కూరగాయలు సాగు చేసాం. ప్రస్తుతం పంట భాగానే పండింది.
సేఫ్ డ్రస్సింగ్
భారతదేశంలో మహిళలు ధరించే వస్త్రాలు చాలా సేఫ్‌గా ఉంటాయి. కట్టుబొట్టు, బంగారు అలంకరణ బాగుంది. అందుకే భారతీయ సంప్రదాయం బాగా నచ్చిందని వివరించారు హన్నారోస్. ఎప్పుడూ పీజా బర్గర్ తినే మాకు ఆరటి ఆకు భోజనాలు ఇష్టం. మొదట తాము సేంద్రియ వ్యవసాయ సాగు, ఆశ్రమంలో సేవ చేయడం, స్పోకెన్ ఇంగ్లిష్ బోధించడానికే వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక నేర్చుకోవాల్సింది చాలా ఉందని వివరించారు ఎలిజబెత్. విదేశాల మోజులో వ్యవసాయానికి స్వస్తి పలుకుతున్న ఇప్పటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు క్లోవీ ఎలిజబెత్, హన్నారోస్.
Comments
Please login to add a commentAdd a comment