2021 Padma Shri Award Winners: Pappammal Organic Farming, Shyam Sundar Paliwal | ఆ ఇద్దరు వృక్షమా... వందనం - Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరు వృక్షమా... వందనం

Published Sat, Jan 30 2021 12:29 AM | Last Updated on Sat, Jan 30 2021 1:14 PM

Special Story On social activist Shyam Sundar Paliwal and organic farmer Papammal - Sakshi

పాప్పమ్మాళ్‌, మరణించిన తన కుమార్తె జ్ఞాపకార్ధం నాటిన కదంబం మొక్క ఇప్పుడు వృక్షమైంది. ఆ వృక్షంతో శ్యామ్‌సుందర్‌

చెట్టు ఆక్సిజన్‌ ఇస్తుంది. అన్నమూ పెడుతుంది. అయితే అది ‘పద్మశ్రీ’ కూడా ఇస్తుంది. ఈ సంవత్సరం చెట్టునే నమ్ముకున్న ఇద్దరు వ్యక్తులు పద్మశ్రీ పొందారు. ఒకరు రాజస్థాన్‌కు చెందిన శ్యామ్‌ సుందర్‌ పాలివాల్‌. మరొకరు తమిళనాడుకు చెందిన పాప్పమ్మాళ్‌. కూతురి తుదిశ్వాస నుంచి ఒక వనాన్నే సృష్టించాడు శ్యామ్‌ సుందర్‌. నానమ్మ పోతూ పోతూ ఇచ్చిన చిన్న కిరాణా అంగడి నుంచి భూమి కొని సేంద్రియ వ్యవసాయం చేసేంతగా ఎదిగింది పాప్పమ్మాళ్‌. కొంత నేల దొరికితే అందులో విత్తు నాటితే ఎలాగూ ఆనందం వస్తుంది. కాని ఆ కొమ్మకు పద్మశ్రీ పూస్తే ఇంకా ఆనందం కదా. ఆ ఇరువురి స్ఫూర్తిదాయకమైన పరిచయం ఇది.

‘నేనేం చదువుకోలేదు. నాకు ఇంగ్లిష్‌ రాదు’ అంటాడు 55 ఏళ్ల శ్యామ్‌సుందర్‌ పాలివాల్‌. కాని అతడు మాట్లాడేది ఇవాళ ప్రపంచమంతా అర్థం చేసుకుంటోంది. కారణం అతడు మాట్లాడేది ప్రకృతి భాష. చెట్టు భాష. పచ్చదనపు భాష.

2021 సంవత్సరానికి గాను శ్యామ్‌సుందర్‌కు ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించింది ప్రభుత్వం. నిజానికి ఈ పురస్కారం అతనికొక్కడికి మాత్రమే కాదు. అతని ఊరు ‘పిప్లాంత్రి’కి. ఆ ఊరి గ్రామస్తులకి. ఈ ఊళ్లో ప్రస్తుతం తలలూపుతున్న దాదాపు మూడు లక్షల చెట్లకి.

‘ఆడపిల్లని, చెట్టుని కాపాడుకుంటే చాలు ఈ ధరిత్రి సుఖంగా ఉంటుంది’ అంటాడు శ్యామ్‌సుందర్‌. అతడు కూడా రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌ జిల్లాలోని తన ఊరు పిప్లాంత్రిలో 2007 వరకూ ఒక సామాన్య రైతే. తను తన ఇల్లు అనుకుంటూ వచ్చాడు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు అతనికి. అయితే 2007లో అతని జీవితంలో పెనుమార్పు వచ్చింది. ఆ సంవత్సరం ఆగస్టులో అతని రెండో కూతురు 16ఏళ్ల కిరణ్‌ స్కూల్‌ నుంచి సగంలో తిరిగి వచ్చింది కడుపు నొప్పితో. డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లేలోపు డీహైడ్రేషన్‌తో మరణించింది. ఎంతో ఇష్టమైన కుమార్తె మరణించడంతో కదిలిపోయాడు శ్యామ్‌సుందర్‌. ‘ప్రమాదవశాత్తు మరణిస్తేనే నాకు ఇంత దుఃఖంగా ఉంది. చేతులారా చంపేస్తే ఆ తల్లిదండ్రులకు ఇంకెత దుఃఖం ఉండాలి అనిపించింది’ అంటాడు అతడు.

ఎకో–ఫెమినిజమ్‌ మొదలు
ఆడపిల్ల చెట్టును కాపాడుతుంది... చెట్టు ఆడపిల్లను కాపాడుతుంది అని ఉద్యమం మొదలెట్టాడు శ్యామ్‌సుందర్‌. ఆ సమయంలో అతను తన ఊరి సర్పంచ్‌ కూడా. అప్పటికి రాజస్తాన్‌లో అమ్మాయి కట్నకానుకలకు భయపడి వడ్లగింజలు నోట్లో పోసి శిశుహత్యలు చేస్తుండేవారు. ‘మా ప్రాంతంలో ఇక అలా జరక్కూడదు అనుకున్నాను’ అంటాడు శ్యామ్‌సుందర్‌. మొదట తన కూతురి పేరున ఒక కదంబ మొక్క నాటాడు. ‘మా ఊరిలో ప్రతి సంవత్సరం యాభై అరవై కాన్పులు జరుగుతాయి. ఆడపిల్ల పుడితే ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి పేరున 111 మొక్కలు నాటాలి. వాటి బాగోగులు చూడాలి. వాటి మీద రాబడి భవిష్యత్తులో ఆ పిల్లకే చెందుతుంది. అలాగే ఆడపిల్లను చదివిస్తామని, వయసుకు ముందు పెళ్లి చేయమని వాళ్లు నోటు రాయాలి.

ఆడపిల్ల పుడితే ఊరు మొత్తం 21 వేలు చందా ఇవ్వాలి. ఆడపిల్ల తల్లిదండ్రులు ఇంకో పది వేలు ఇవ్వాలి. దానిని డిపాజిట్‌ చేస్తాం. 18 ఏళ్ల తర్వాత దానిపై వచ్చే డబ్బు ఆ అమ్మాయి పెళ్లికి ఉపయోగపడేలా భరోసా కల్పించాం. దాంతో మా ప్రాంతంలో ఆడపిల్ల మరణాలు బాగా తగ్గాయి’ అంటాడు శ్యామ్‌సుందర్‌. దీనిని నిపుణులు ఎకో ఫెమినిజం అంటున్నారు. ఇది మాత్రమే కాదు... శ్యామ్‌సుందర్‌ తన గ్రామంలో దాదాపు రెండున్నర లక్షల అలొవెరా మొక్కలు నాటి వాటి నుంచి జెల్, జ్యూస్‌ వంటి ప్రాడక్ట్స్‌ తయారు చేయించి మార్కెటింగ్‌ చేస్తున్నాడు. ‘ఒక్కో మహిళ నెలకు కనీసం ఆరు వేల రూపాయలు ఆదాయం గడిస్తోంది’ అన్నాడతను సంతోషంగా.

గత దశాబ్ద  కాలంలో
గత దశాబ్ద కాలంలో పిప్లాంత్రిలో నాటిన వేప, మామిడి, ఉసిరి చెట్ల వల్ల పిప్లాంతి పచ్చదనం నింపుకోవడమే కాదు కరువు బారిన పడటం లేదు. భూసారం పెరిగి వలస ఆగింది. భూగర్భ జలాల మట్టం పెరిగింది. శ్యామ్‌సుందర్‌ను అనేక పురస్కారాలు వరించాయి. రాజస్థాన్‌ ప్రభుత్వం ఈ ఊరిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ‘నేను చేయగలగితే దేశంలో ఎవరైనా చేయొచ్చు’ అంటాడు శ్యామ్‌సుందర్‌. అతడు చెప్పే ఆ ‘ఎవరైనా’ అనే వ్యక్తి ప్రతి గ్రామంలో ఉండాలని కోరుకుందాం.

చెట్ల మధ్య ఒక తెల్లజుట్టు చెట్టు
105 ఏళ్ల పాప్పమ్మాళ్‌ ఉదయం ఐదు గంటలకు టంచన్‌గా నిద్రలేచి ఆరోగంటకంతా తన పొలంలో ఉంటుంది. కోయంబత్తూరు సమీపంలోని తక్కెంపట్టి అనే గ్రామంలో భవాని నది ఒడ్డున ఆ పొలం ఉంటుంది. రెండున్నర ఎకరా ఉన్న ఆ పొలం ఆమె పైసా పైసా కూడగట్టి కొనుక్కున్నది. అందులోని ప్రతి మొక్కా ప్రతి పాదూ ఆమె చేతుల మీదుగా రూపుదిద్దుకున్నవే. పాప్పమ్మాళ్‌ గత యాభైఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ తమిళనాడులో పేరు తెచ్చుకుంది. ‘నా నానమ్మ పోతూ పోతూ నాకు చిన్న కిరాణా షాపు ఇచ్చి వెళ్లింది’ అంది పాప్పమ్మాళ్‌. ఆమెకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. వచ్చి నానమ్మ దగ్గర చెల్లెలితో పాటు ఉండిపోయింది. కిరాణా షాపును, చిన్న హోటల్‌ను నడుపుతూ దానిమీద రాబడితో పది ఎకరాల పొలం కొంది.

అరటి, బెండ పండించడంలో ఆమె ఎక్స్‌పర్ట్‌. అయితే  చెల్లెలి పెళ్లి, ఆమె పిల్లల పెంపకం కోసం ఏడున్నర ఎకరాల పొలం ధారాదత్తం చేసేసింది. మిగిలిన రెండున్నర ఎకరాల పొలంలో ఇప్పటికీ అరటి పండిస్తోంది. పాప్పమ్మాళ్‌ను తమిళనాడు గవర్నమెంట్‌ చాలా త్వరగా గుర్తించింది. తమిళనాడు వ్యవసాయ యూనివర్సిటీ ఆమెను తరచూ ఆహ్వానిస్తుంటుంది. 105 ఏళ్ల వయసులో గట్టిగా పనులు చేసుకుంటూ ఉండటానికి కారణం వారంలో రెండుసార్లు మటన్‌ సూప్‌ తాగడమే కావచ్చునని ఆమె చెబుతుంది. ఆమె మటన్‌ బిరియాని కూడా ఇష్టంగా తింటుంది. ఆకులో తినడం ఆమె అలవాటు. వేడి నీరు తాగుతుంది. ఈ వయసులో ఆమె తాను ఉత్సాహంగా ఉంటూ తనవారిని ఉత్సాహంగా ఉంచుతోంది. ఈసురోమనేవారెవరైనా ఈమెను చూసి కదా నేర్చుకోవాలి.
– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement