Padmasri Award
-
‘ఆపిల్ చక్రవర్తి’కి పద్మశ్రీ.. జాతీయ వినూత్న వ్యవసాయవేత్తగానూ గుర్తింపు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో ప్రతిభ చూపినవారు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్ జిల్లాకు చెందిన హరిమాన్ శర్మ ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికై రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేశారు.ఉద్యానవన రంగంలో కొత్త ప్రయోగాలు చేపట్టినందుకు హరిమాన్ శర్మను పద్మశ్రీ అవార్డుకు ఎంపికచేశారు. మైదాన ప్రాంతాల్లో ఆపిల్‌ను పండించడం ద్వారా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ నేపధ్యంలోనే ఆయనను ‘ఆపిల్ చక్రవర్తి’(సేబ్ సమ్రాట్) అని కూడా పిలుస్తారు. హరిమాన్ శర్మ 1998లో తన తోటలో ఆపిల్స్‌ను పండించడంపై ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. మొదట్లో శర్మ ప్లం చెట్టుకు ఆపిల్ చెట్టును అంటుకట్టారు.ఆపిల్ తోటల పెంపకంలో ఆయన చూపిన అంకితభావం ఈరోజు ఆయన ‘పద్మశ్రీ’ అందుకునేలా చేసింది. హరిమాన్ శర్మ గతంలో జాతీయ వినూత్న వ్యవసాయవేత్త అవార్డును కూడా అందుకున్నారు. 2017లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డుతో ఆయనను సత్కరించారు. ఆపిల్ పండ్లను చల్లని ప్రాంతాలలోనే కాకుండా వెచ్చని వాతావరణంలో కూడా పండించవచ్చని హరిమాన్ శర్మ నిరూపించారు.హరిమాన్ శర్మ హెచ్‌ఆర్‌ఎంఎన్-99 రకం ఆపిల్‌ను అభివృద్ధి చేశారు. ఇది దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలలో కూడా ప్రసిద్ధి చెందింది. ఆయన అభివృద్ధి చేసిన రకాన్ని పంజాబ్, బెంగళూరు, తెలంగాణలతో పాటు నేపాల్, దక్షిణాఫ్రికా, జర్మనీ, బంగ్లాదేశ్ మొదలైన రాష్ట్రాలలో కూడా పండిస్తున్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ రకాన్ని పెంచడంలో కూడా ఆయన సహాయం చేశారు. ఈ ఆపిల్ ప్రత్యేకత ఏమిటంటే ఈ రకం జూన్ నెలలో అందుబాటులోకి వస్తుంది. ఈ సమయంలో మార్కెట్లలో సిమ్లా ఆపిల్స్ అందుబాటులో ఉండవు. ఫలితంగా హెచ్‌ఆర్‌ఎంఎన్-99 రకం ఆపిల్ మంచి డిమాండ్‌ను అందుకుంటుంది.ఇది కూడా చదవండి: ట్రంప్ నిర్ణయం: అమాంతం పెరిగిన గుడ్ల ధరలు -
Lok sabha elections 2024: బీజేపీలో చేరిన అనురాధా పౌడ్వాల్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రముఖ బాలీవుడ్ గాయని అనురాధా పౌడ్వాల్ బీజేపీలో చేరారు. శనివారం ఆమె ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేతలు అరుణ్ సింగ్, అనిల్ బలూనీ తదితరుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సనాతన ధర్మం కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని, బీజేపీ విధానాలు ఎంతగానో నచ్చాయని అన్నారు. అందుకే బీజేపీలో చేరుతున్నట్లు ఆమె మీడియాతో పేర్కొన్నారు. మొదట్లో సినిమా పాటలు పాడిన అనురాధా పౌడ్వాల్ తర్వాత ఆధ్యాత్మిక గీతాల ద్వారా ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. 2017లో కేంద్రం ఆమెను ‘పద్మశ్రీ’తో గౌరవించింది. -
ప్రముఖ గాయకుడు మృతి.. పద్మశ్రీ అవార్డు అందుకోకుండానే విషాదం
భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన ధృపదాచార్య పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్ (93) మరణించారు. కొద్దిరోజుల క్రితం జనవరి 26వ తేదీన భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును అందుకోవడానికి కొద్ది రోజుల ముందు పండిట్ తైలాంగ్ మరణించారు. నేషనల్ మీడియా కథనాల ప్రకారం పండిట్ తైలాంగ్ న్యుమోనియాతో పాటు ఇతర వ్యాధులతో చికిత్స పొందుతూ జైపూర్‌లోని దుర్లబ్జీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ వార్తను ధృవీకరిస్తూ, పండిట్ తైలాంగ్ కుమార్తె, స్వయంగా ప్రఖ్యాత ధృపద్ గాయని అయిన ప్రొఫెసర్ మధు భట్ తైలాంగ్ ఇలా అన్నారు, "గత కొన్ని రోజులుగా నాన్నగారి ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం దుర్లభ్జీ ఆసుపత్రిలో చేర్పించాం. చికిత్స సమయంలోనే ఆయన ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.' అని తెలిపారు. జైపూర్‌కు చెందిన పండిట్ లక్ష్మణ్ భట్ తన జీవితమంతా సంగీత సాధనకు అంకితం చేశారు. ఇందులో తన పిల్లలతో పాటు అనేక మంది విద్యార్థులకు విస్తృతమైన జ్ఞానం, విద్యను అందించాడు. ఆయన తన కుమారుడు రవిశంకర్‌తో పాటు కుమార్తెలు శోభ, ఉష, నిషా, మధు, పూనమ్, ఆర్తిలను వివిధ సంగీత కళా ప్రక్రియలలో ప్రావీణ్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించారు. బనస్థలి విద్యాపీఠ్, రాజస్థాన్ సంగీత సంస్థలో సంగీత ఉపన్యాసకుడిగా ఆయన పనిచేశారు. 1985లో జైపూర్‌లో 'రసమంజరి' పేరుతో ఒక సంగీతోపాసు కేంద్రాన్ని ఆయన స్థాపించారు. అక్కడ ఎందరికో ఉచితంగానే విద్యను అందించారు. 2001లో జైపూర్‌లో 'అంతర్జాతీయ ధ్రుపద్-ధామ్ ట్రస్ట్'ని స్థాపించి చాలామందికి సాయం అందించారు. ఈ క్రమంలో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఆ అవార్డు అందుకోకుండానే ఆయన మరణించడం బాధాకరం అని చెప్పవచ్చు. -
మ్యాంగో మ్యాన్
ఒకే మామిడి చెట్టుకు 300 కాయలు కాస్తాయి. అయితే ఆ కాయలు ఒక్కోటి ఒక్కో రకం. ఒక కొమ్మకు రసాలైతే ఒక కొమ్మకు తోతాపురి.. ఇలా ప్రపంచంలో ఏ చెట్టూ కాయదు. దీనిని సాధ్యం చేసి ‘మ్యాంగో మేన్ ఆఫ్ ఇండియా’గా పేరు పొందాడు లక్నోకు చెందిన కలీముల్లా ఖాన్. జీవితం మొత్తాన్ని మామిడి సాగుకు అంకితం చేసిన కలీముల్లా మామిడి తోట ఒక దర్శనీయ స్థలం. ‘ప్రపంచంలో మామిడి పండు అంత అందమైన పండు మరొకటి లేదు’ అంటారు కలీముల్లా ఖాన్. ఆయనికిప్పుడు 80 దాటాయి. లక్నో నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే మలిహామాద్లో ఆయన మామిడి ఉద్యానవనం ఉంది. ‘ఇది ప్రపంచ మామిడి చెట్లకు కాలేజీ లాంటిది. ఎవరైనా మామిడి పండ్ల గురించి ఇక్కడ చదవాల్సిందే’ అంటాడాయన. మలిహాబాద్ ఉత్తరప్రదేశ్‌లో మామిడితోటలకు ప్రసిద్ధి. కలీముల్లా కుటుంబం కూడా మామిడి తోటల పెంపకంలో తాత తండ్రుల కాలం నుంచి ఉంది. ‘నేను సెవెన్త్ ఫెయిల్ అయ్యాను. మా ఊళ్లో పిల్లల్ని ఇళ్ల నుంచి కూడా బయటకు రానీయరు తల్లిదండ్రులు. అలా పెరిగాను. కొన్నాళ్లు ఆ పనీ ఈ పనీ చేసి మామిడి నర్సరీలో పని చేయడం మొదలుపెట్టాను. నాకు 18 ఏళ్ల వయసులో అంటు కట్టి మొదటి మామిడి మొక్కను నాటాను. కాని ఆ రోజు నుంచి భారీ వర్షం. దేవునికి ఇష్టం లేదనుకున్నాను. ఆ మొక్క బతకలేదు. కాని అంటు కట్టే విధానంతో కొత్త కొత్త మామిడి రకాలు సృష్టించాలన్న నా పిచ్చి పోలేదు. 1970లో నా పెళ్లయ్యింది. అప్పుడే ఈ మామిడి తోటలో ప్రయోగాలు మొదలెట్టాను’ అంటాడాయన. ఒకేచెట్టుకు 315 రకాలు ఒకేచెట్టు కొమ్మలకు రకరకాల పండ్ల అంటు కడుతూ చెట్టును విస్తరించడమే కాదు, దాని ప్రతికొమ్మకూ కొత్తరకం కాయలను సృష్టించాడు కలీముల్లా. ‘ఇన్ని రకాల కాయలు ఒకే చెట్టుకు కాసినప్పుడు మనుషులందరూ ఒకేరీతిన ఎందుకు కలిసి ఉండకూడదు’ అని ప్రశ్నిస్తాడాయన. ‘నేను సృష్టించిన ఒకరకం కాలాపహాడ్ పండును జుర్రుకుంటే మూడు రకాల రుచులు వస్తుంది’ అంటాడాయన. కొన్ని రకాల అంటు మామిళ్లకు కలీముల్లా ‘అమితాబ్, ‘సచిన్’, ‘నమో’ అనే పేర్లు పెట్టాడు. కరోనాలో సేవచేసి మరణించిన డాక్టర్లకు నివాళిగా ఒక మామిడిరకాన్ని సృష్టించి ‘డాక్టర్’వెరైటీ అని నామకరణం చేశాడు. కలీముల్లాకు 2008లో పద్మశ్రీ వచ్చింది. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా నాకు 400 అవార్డులు ఉద్యానవన విభాగంలో వచ్చాయి. చాలా వాటిని మా పిల్లలు వెళ్లి తీసుకొస్తుంటారు అంటాడాయన. ‘నాకు మన దేశం అంటే ప్రేమ. అమెరికా నుంచి చాలామంది వచ్చి నా విధానాలు తెలుసుకుని వెళ్లారు. మన దేశం వాళ్లే నా వల్ల ఎక్కువ ప్రయోజనం పొందడం లేదని అనిపిస్తోంది. నా జ్ఞానాన్ని నా వాళ్లకు పంచాలనే నా తపన అని భావోద్వేగంతో అంటాడు కలీముల్లా. ‘మా తోటకు రండి. మామిడి తినిపోండి’ అని సదా ఆహ్వానిస్తుంటాడాయన. -
సైకిల్ దీదీ... :సుధా వర్గీస్ సేవకు షష్టిపూర్తి
చదువు బతకడానికి అవకాశం ఇస్తుంది. అదే చదువు ఎంతోమందిని బతికించడానికి ఓ కొత్త మార్గాన్ని చూపుతుంది. బీహార్‌లో సామాజికంగా అత్యంత వెనకబడిన ముసహర్ కమ్యూనిటీకి చెందిన బాలికల సాధికారతకు ఆరు దశాబ్దాలుగా కృషి చేస్తున్న సుధా వర్గీస్ చదువుతో పాటు ప్రేమ, ధైర్యం, కరుణ అనే పదాలకు సరైన అర్థంలా కనిపిస్తారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి సామాజిక నాయికగా ఎలా ఎదిగిందో తెలుసుకుందాం... ముసహర్ సమాజంలో సైకిల్ దీదీగా పేరొందిన సుధా వర్గీస్ పుట్టి పెరిగింది కేరళలోని కొట్టాయంలో. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒక పేపర్లోని వార్త ఆమెను ఆకర్షించింది. అందులో.. బీహార్‌లోని ముసహర్ల సమాజం ఎదుర్కొంటున్న భయానకమైన జీవనపరిస్థితులను వివరిస్తూ ఫొటోలతో సహా ప్రచురించారు. ‘ముసహర్’ అంటే ‘ఎలుకలు తినేవాళ్లు’ అనేది తెలుసుకుంది. తాను పుట్టి పెరిగిన కేరళలో ఇలాంటివి ఎన్నడూ చూడని ఆ సామాజిక వెనుకబాటుతనం సుధను ఆశ్చర్యపరిచింది. ‘వీరి పరిస్థితిని మెరుగుపరచడానికి ఏమీ చేయలేమా..?!’ అని ఆలోచించింది. తనవంతుగా కృషి చేయాలని అప్పుడే నిర్ణయించుకుంది. కాలేజీ రోజుల్లోనే... ముసహర్ ప్రజలకోసం పనిచేయాలని నిర్ణయించుకొని బీహార్‌లోని పాట్నా నోట్రే డామ్ అకాడమీలో చేరింది. అక్కడ శిక్షణ పొందుతున్న సమయంలోనే ఇంగ్లిష్, హిందీ నేర్చుకుంది. 1986లో తన సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి ముసహర్లతో కలిసి జీవించాలని, వారికి విద్యను అందించాలని, వారి జీవితాలను మెరుగుపరచడానికి తన సమయాన్ని, వనరులను వెచ్చించాలని నిర్ణయించుకుంది. గుడిసెలో జీవనం... ముసహర్లు గ్రామాల సరిహద్దుల్లో ఉండేవారు. ఆ సరిహద్దు గ్రామాల్లోని వారిని కలుసుకోవడానికి సైకిల్ మీద బయల్దేరింది. అక్కడే ఓ పూరి గుడిసెలో తన జీవనం మొదలుపెట్టింది. ‘ఇది నా మొదటి సవాల్. ఆ రోజు రాత్రే భారీ వర్షం. గుడిసెల్లోకి వరదలా వర్షం నీళ్లు. వంటపాత్రలతో ఆ నీళ్లు తోడి బయట పోయడం రాత్రంతా చేయాల్సి వచ్చింది. కానీ, విసుగనిపించలేదు. ఎందుకంటే నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుని వచ్చాను. ఎలాంటి ఘటనలు ఎదురైనా వెనక్కి వెళ్లేదే లేదు’ అనుకున్నాను అంటూ తన ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటారు సుధ. పేదరికంతోనేకాదు శతాబ్దాలనాటి కులతత్వంపై కూడా పోరాటానికి సిద్ధమవడానికి ప్రకృతే ఓ పాఠమైందని ఆమెకు అర్ధమైంది. ముసహర్లు తమజీవితంలోని ప్రతి దశలోనూ, ప్రాంతీయ వివక్షను ఎదుర్కొంటున్నారు. వారికి చదువుకోవడానికి అవకాశాల్లేవు. స్కూల్లోకి ప్రవేశం లేదు. సేద్యం చేసుకోవడానికి భూమి లేనివారు. పొట్టకూటికోసం స్థానికంగా ఉన్న పొలాల్లో కూలీ పనులు చేస్తుంటారు. ఈ సమాజంలోని బాలికలు, మహిళలు తరచు అత్యాచారం, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. మొదటి పాఠశాల... ముసహర్ గ్రామంలో వారిని ప్రాధేయపడితే చదువు చెప్పడానికి అంగీకరించారు. బాలికలకు చదువు, కుట్లు, అల్లికలు నేర్పించడానికి ఆమె ప్రతిరోజూ పోరాటమే చేయాల్సి వచ్చేది. దశాబ్దాల పోరాటంలో 2005లో సామాజికంగా వెనుకబడిన సమూహాలకు చెందిన బాలికల కోసం ఓ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నుంచి వెనకబడిన సమాజానికి చెందిన బాలికల కోసం అనేక రెసిడెన్షియల్ స్కూళ్లను నడుపుతోంది. ఆమె కృషిని అభినందిస్తూ 2006లో భారతప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. కుటుంబం నుంచి ఆరుగురు తోబుట్టువులలో పెద్ద కూతురుగా పుట్టిన సుధ కళల పట్ల ప్రేమతో స్కూల్లో నాటకాలు, నృత్యం, పాటల పోటీలలో పాల్గొనేది. పెద్ద కూతురిగా తల్లీ, తండ్రి, తాత, బామ్మలు ఆమెను గారాబంగా పెంచారు. ‘స్కూల్లో నేను చూసిన పేపర్లోని ఫొటోల దృశ్యాలు ఎన్ని రోజులైనా నా తలలో నుంచి బయటకు వెళ్లిపోలేదు. అందుకే నేను బీహార్ ముసహర్ సమాజం వైపుగా కదిలాను’ అని చెబుతారు ఈ 77 ఏళ్ల సామాజిక కార్యకర్త. ‘మొదటగా నేను తీసుకున్న నిర్ణయానికి మా అమ్మ నాన్నలు అస్సలు ఒప్పుకోలేదు. నేనేం చెప్పినా వినిపించుకోలేదు. కానీ, నా గట్టి నిర్ణయం వారి ఆలోచనలనూ మార్చేసింది’ అని తొలినాళ్లను గుర్తుచేసుకుంటారు ఆమె. బెదిరింపుల నుంచి... అమ్మాయిలకు చదువు చెప్పడానికి ముసహర్ గ్రామస్తులను ఒక స్థలం చూపించమని అడిగితే తాము తెచ్చుకున్న ధాన్యం ఉంచుకునే ఒక స్థలాన్ని చూపించారు. అక్కడే ఆమె బాలికల కోసం తరగతులను ప్రారంభించింది. ‘ఈ సమాజానికి ప్రధాన ఆదాయవనరు మద్యం తయారు చేయడం. మద్యం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వస్తుండటంతో యువతుల చదువుకు ఆటంకం ఏర్పడేది. దీంతో నేనుండే గుడిసెలోకి తీసుకెళ్లి, అక్కడే వారికి అక్షరాలు నేర్పించేదాన్ని. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ క్లాసులు కూడా తీసుకునేదాన్ని. రోజు రోజుకూ అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. వారిలో స్వయం ఉపాధి కాంక్ష పెరుగుతోంది. కానీ, అంతటితో సరిపోదు. వారి హక్కుల కోసం గొంతు పెంచడం అవసరం. తిరుగుబాటు చేస్తారనే ఆలోచనను గమనించిన కొందరు వ్యక్తులు బెదిరింపులకు దిగారు. చంపేస్తారేమో అనుకున్నాను. దీంతో అక్కణ్ణుంచి మరో చోటికి అద్దె ఇంటికి మారాను. కానీ, ఇలా భయపడితే నేననుకున్న సహాయం చేయలేనని గ్రహించాను. ఇక్కడి సమాజానికి అండగా ఉండాలని వచ్చాను, ఏదైతే అది అయ్యిందని తిరిగి మొదట నా జీవనం ఎక్కడ ప్రారంభించానో అక్కడికే వెళ్లాను’ అని చెబుతూ నవ్వేస్తారు ఆమె. ముసహర్ల కోసం సేవా బాట పట్టి ఆరు దశాబ్దాలు గడిచిన సుధి ఇప్పుడు వెనకబడిన సమాజపు బాలికల కోసం అనేక రెసిడెన్షియల్ స్కూళ్లను నడుపుతోంది. యువతులకు, మహిళలకు జీవనోపాధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ దళిత సంఘాలను అగ్ర కులాల సంకెళ్ల నుండి శక్తిమంతం చేస్తోంది. ఈమె శతమానం పూర్తి చేసుకోవాలని కోరుకుందాం. నైపుణ్యాల దిశగా.. సుధ వర్గీస్ ఏర్పాటు చేసిన ముసహర్ రెసిడెన్షియల్ పాఠశాలలోని బాలికలు చదువులోనే కాదు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ పోటీలలో పతకాలను సాధించుకు వస్తున్నారు. ఇక్కడ నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, నాయకులు కావడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ సమాజంలోని మహిళలు బృందాలుగా కూరగాయలు పండిస్తూ జీవనోపాధిని మెరుగుపరుచుకుంటున్నారు. వీరు చేస్తున్న హస్తకళలను ప్రభుత్వ, ఉన్నతస్థాయి ఈవెంట్లలో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నుంచి చవకగా లభించే శానిటరీ న్యాప్కిన్లను తయారుచేస్తున్నారు. -
‘పద్మశ్రీ’కి ఎంపికైన రామచంద్రయ్యకు కేసీఆర్ సర్కార్ బంపరాఫర్
సాక్షి, హైదరాబాద్: పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన డోలు వాయిద్య కళాకారుడు సకిని రామచంద్రయ్యకు అతని సొంత జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటిస్థలం, నిర్మాణ ఖర్చుకు రూ.కోటి రివార్డును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పద్మశ్రీ అవార్డును అందుకోనున్న నేపథ్యంలో సీఎంను మంగళవారం ప్రగతిభవన్‌లో మర్యాద పూర్వకంగా రామచంద్రయ్య కలిశారు. అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతిక కళను బతికిస్తున్నందుకు సీఎం అభినందించారు. ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును పొందడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య యోగక్షేమాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇంటి స్థలం, నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును సీఎం ఆదేశించారు. పద్మశ్రీ కనకరాజుకు రివార్డు ప్రకటించిన సీఎం గతేడాది పద్మశ్రీ అవార్డు అందుకున్న గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు తన స్థానిక జిల్లా కేంద్రంలో ఇంటి స్థలాన్ని, నిర్మాణం ఖర్చుల కోసం రూ.1 కోటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే ఆత్రం సక్కును సీఎం ఆదేశించారు. -
పిక్ ఆఫ్ ది డే.. తులసమ్మకు జేజేలు!!
‘పిక్చర్ ఆఫ్ ది డే’ అంటూ ఈ ఫొటోను సోషల్ మీడియాలో నెటిజనులు షేర్ చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన పద్మ పురస్కారాలు ప్రదానోత్సవం సందర్భంగా తీసిన చిత్రమిది. ప్రత్యేక వస్త్రాలంకరణతో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా అవార్డు అందుకోవడానికి వెళుతున్న వృద్ధురాలికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముకుళిత హస్తాలతో అభివాదం చేస్తుండడం ఈ ఫొటోలో కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఉన్న వృద్ధురాలి పేరు తులసి గౌడ. సామాజిక సేవ విభాగంలో ఆమెకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. అటవీ విజ్ఞాన సర్వస్వం కర్ణాటకకు చెందిన 73 ఏళ్ల తులసి గౌడ.. అడవుల్లోని సమస్త జీవజాతుల గురించిన తెలిసిన, అటవీ విజ్ఞాన సర్వస్వంగా ప్రఖ్యాతి గాంచారు. గత ఆరు దశాబ్దాలుగా పర్యావరణ పరిక్షరణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. 30 వేలకు పైగా మొక్కలు నాటి ప్రకృతి పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు. ఇప్పటికీ ఆమె ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తూ ఆదర్శమూర్తిగా నిలిచారు. ఆమె నిస్వార్థ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. (చదవండి: పద్మ పురస్కారాలు.. ఏపీ నుంచి ముగ్గురు) సింప్లిసిటీకి జేజేలు పద్మశ్రీ అవార్డును అందుకోవడానికి దేశరాజధాని ఢిల్లీకి వచ్చిన తులసి గౌడ ఎటువంటి ఆడంబరాలకు పోకుండా తనకు అలవాటైన వస్త్రాధారణనే కొనసాగించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడానికి నిరాడంబరంగా వచ్చిన ఆమెను చూసి ప్రధాని మోదీ సహా ఇతర మంత్రులు, ఉన్నత అధికారులు వినమ్రంగా నమస్కరించారు. తులసి గౌడ నిరాడంబరతకు నెటిజనులు సైతం జేజేలు పలుకుతున్నారు. ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో విరివిగా షేర్ చేస్తూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు. శభాష్.. హజబ్బ! కాగా, కర్ణాటక రాష్ట్రానికే చెందిన హరేకల హజబ్బ కూడా కాళ్లకు చెప్పులు లేకుండా నిరాడంబరంగా రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అక్షరం ముక్క రాని హజబ్బ ఎంతోమంది పిల్లలకు చదువుకునే భాగ్యం కల్పించారు. మంచి పనికి పేదరికం అడ్డుకాదని ఆయన నిరూపించారు. పళ్లు అమ్ముకుని జీవనం సాగిస్తున్న హజబ్బ.. సొంతిల్లు కూడా కట్టుకోకుండా తన ఊరి పిల్లల కోసం ఏకంగా పాఠశాల కట్టించారు. పద్మ అవార్డుతో వచ్చిన 5 లక్షల రూపాయలను కూడా స్కూల్‌కే ఇచ్చేసి మంచి మనసు చాటుకున్నారు. నెటిజనులు ఆయనకు కూడా సలాం చేస్తున్నారు! (Harekala Hajabba: అవమానం నుంచి పుట్టిన ఆలోచన..) -
అవమానం నుంచి పుట్టిన ఆలోచన.. నేడు పద్మశ్రీ
సాక్షి, వెబ్‌డెస్క్: ఆపదలో ఉన్న వారికి.. సాయం కోరే వారికి చేయూతనివ్వడానికి మన దగ్గర ఎనలేని సంపద ఉండాల్సిన పని లేదు. తోటి వారి కష్టాన్ని చూసి స్పందించే హృదయం.. చేయూత ఇవ్వాలనే ఆలోచన ఉంటే చాలు. ఈ కోవకు చెందిన వ్యక్తే కర్ణాటకకు చెందిన హరేకల హజబ్బ. పళ్లు అమ్ముకుని జీవనం సాగించే హజబ్బ తన ఊరి పిల్లల పాలిట దైవం అయ్యాడు. రెక్కడాతే కాని డొక్కాడని స్థితిలో ఉన్న హజబ్బ.. తన ఊరి పిల్లల కోసం ఏకంగా పాఠశాల నిర్మించాడు. 1-10వ తరగతి వరకు ఇక్కడ ఉచితంగా చదువుకోవచ్చు. హజబ్బ సేవా గుణాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. ఆయన సేవా గుణం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ వివరాలు.. హజబ్బ జీవితాన్ని మార్చిన సంఘటన.. మంగుళూరుకు చెందిన హరేకల హజబ్బ స్థానికంగా ఉన్న సెంట్రల్ మార్కెట్లో కమలాలు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫారిన్ దంపతులు హజబ్బ దగ్గరకు వచ్చి.. కిలో కమలాలు ఎంత అని ఇంగ్లీష్‌లో అడిగారు. హజబ్బకు కన్నడ, మాతృభాష అరబ్బీ తప్ప మరో భాష రాదు. అందుకే ఆ ఫారిన్ దంపతులు అడిగిన ప్రశ్నకు అతను సమాధానం చెప్పలేకపోయాడు. ఆ దంపతులు హజబ్బను చూసి ఎగతాళిగా నవ్వుకుంటూ వెళ్లిపోయారు. (చదవండి: పద్మశ్రీకి ఎంపికైనా పింఛను కరువే) తన పరిస్థితి మరేవరికి రాకూడదని.. జరిగిన అవమానం హజబ్బను చాలా కుంగదీసింది. ఇంగ్లీష్ రాకపోవడం వల్లే తాను ఇలా అవమానాలు పొందాల్సి వచ్చిందని భావించాడు. తన గ్రామంలోని పిల్లలు ఎవరు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొకుండా ఉండాలంటే.. వారికి ఇంగ్లీష్ తప్పనిసరిగా రావాలని భావించాడు. కానీ తన గ్రామంలో మంచి స్కూల్ లేకపోవడం.. మదర్సాలో అరబ్బీ తప్ప మరో భాష నేర్పకపోవడం హజబ్బను కలవరపరిచింది. రూ.5000తో ముందడుగు.. ఈ క్రమంలో హజబ్బ తానే స్వయంగా ఓ పాఠశాలను ప్రారంభించాలిన నిర్ణయించుకున్నాడు. అయితే అది అనుకున్నంత సులభంగా జరగలేదు. ఎన్నో అవమానాలు.. అడ్డంకులు ఎదురుకున్నాడు. వాటన్నింటిని దాటుకుని.. 1999, జూన్‌లో తన కలని నిజం చేసుకున్నాడు. అప్పటి వరకు తాను పొదుపు చేసుకున్న ఐదువేల రూపాయలతో సొంతంగా కొంత భూమి కొనుగోలు చేసి.. పాఠశాల నిర్మాణం ప్రారంభించాడు. (చదవండి: ‘ఆడపిల్లని, చెట్టుని కాపాడుకుంటే చాలు') ప్రభుత్వం, దాతల సాయంతో అలా 2001 జూన్ నాటికి 8 తరగతి గదులు, రెండు మరుగుదొడ్లతో స్కూలు నిర్మాణం పూర్తయింది. అయితే పాఠశాల నిర్మించాలనే అతని కల నెరవేరింది. ఆ తర్వాత హైస్కూలు స్థాపించాలని నిర్ణయించుకున్నాడు హజబ్బ. పదేళ్లు కష్టపడి దాన్ని కూడా సాకారం చేసుకున్నాడు. 2012 నాటికి ప్రాథమిక పాఠశాల పక్కనే ఉన్నత తరగతి విద్యార్థుల కోసం మరో బిల్డింగ్ నిర్మించాడు. ప్రస్తుతం తన గ్రామంలో ప్రీ యూనివర్శిటీ కళాశాలను ప్రారంభించాలని ఆశిస్తున్నాడు. సాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. అవార్డుల డబ్బులన్ని స్కూల్ అభివృద్ధి కోసమే.. హజబ్బ సేవా నిరతని గుర్తించి ఇప్పటికే పలు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం అనేక అవార్డులతో సత్కరింnebr. ఇక అవార్డులతో పాటు లభించే మొత్తాన్ని పాఠశాల అభివృద్ధి కోసమే వినియోగించాడు. ఈ క్రమంలో ఓ సారి అవార్డుతో పాటు వచ్చిన 5 లక్షల రూపాయలను స్కూల్ కోసం కేటాయించాడు. ఇక భవిష్యత్తులో వచ్చే మొత్తాన్ని కూడా పాఠశాల అభివృద్ధికే వినియోగిస్తానంటున్న హజబ్బకు సొంత ఇళ్లు లేదు. కానీ తన గురించి ఆలోచించకుడా.. పిల్లల భవిష్యత్తు గురించి ఇంతలా ఆరాటపడుతున్న హజబ్బను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజనులు. చదవండి: పద్మ అవార్డుల ప్రదానోత్సవం -
వనజీవి రామయ్యకు అస్వస్థత.. ఐసీయూలో చికిత్స
-
పద్మశ్రీ రాధామోహన్ ఇకలేరు
భువనేశ్వర్: పద్మశ్రీ ప్రొఫెసర్ రాధా మోహన్ స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పలువురు ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. దివంగత ప్రొఫెసర్ నేపథ్యం నయాగడ్‌లో 1943వ సంవత్సరం జనవరి నెల 30వ తేదీన జన్మించిన ఆయన అర్థశాస్త్రం ఆనర్స్‌తో డిగ్రీ ఉత్తీర్ణులై 1965వ సంవత్సరంలో స్థానిక ఉత్కళ విశ్వ విద్యాలయం నుంచి అప్లైడ్ ఎకనమిక్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుడిగా పని చేశారు. 2001వ సంవత్సరంలో పూరీ ఎస్సీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ హోదాలో విరామం పొందారు. కీలక బాధ్యతలు రాష్ట్ర సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం, విద్య, యువజన సేవలు, గ్రామీణ అభివృద్ధి శాఖల్లో కీలక పదవుల్లో ఆయన విజయవంతంగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే రాష్ట్ర ప్రణాళిక బోర్డు, రాష్ట్ర వాటర్ షెడ్ మిషన్ సలహా కమిటీ, విద్య టాస్క్‌ఫోర్స్, వన్య ప్రాణుల సలహా కమిటీ, ఎన్ఎస్ఎస్ సలహా కమిటీ, సంయుక్త అటవీ నిర్వహణ స్టీరింగ్ కమిటీ, భారత ప్రభుత్వ ఎన్ఎస్ఎస్ ఎవాల్యూషన్ కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్‌గా ప్రతిష్టాత్మక హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ప్రజాసేవకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రతిష్టాత్మక ఉత్కళ సేవా సమ్మాన్ పౌరసత్కార పురస్కారం ప్రదానం చేసింది. కుమార్తెతో కలిసి పద్మశ్రీ వ్యవసాయ రంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు కేంద్రప్రభుత్వం గత ఏడాది ఆయనతో పాటు కుమార్తె సబరమతికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. ఆహార అరణ్యం ఆవిష్కర్తలుగా తండ్రీకూతుళ్లు విశేష గుర్తింపు పొందారు. సంభవ్ సంస్థ ఆధ్వర్యంలో ఔత్సాహిక వ్యక్తులు, రైతులకు సేంద్రియ సాగులో మెలకువలు తెలియజేసి వ్యవసాయ రంగంలో కొత్త మలుపులు ఆవిష్కరించిన తండ్రీకూతుళ్లను పద్మశ్రీ పురస్కారం వరించింది. గ్లోబల్ రోల్ ఆఫ్ ఆనర్ ఆర్థికవేత్త పర్యావరణవేత్తగా మారి సేంద్రియ సాగులో విభిన్న రీతుల ఆవిష్కరణలో కీలక పాత్రధారిగా ఆయన గుర్తింపు సాధించారు. పర్యావరణ రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా ఐక్య రాజ్య పర్యావరణ కార్యక్రమం యూఎన్ఈపీ కింద గ్లోబల్ రోల్ ఆఫ్ ఆనర్ ఆయనకు ప్రదానం చేయడం విశేషం. ఆయన ఆవిష్కరించిన సంభవ్ సంస్థ సేంద్రియ సాగులో దేశ వ్యాప్తంగా రైతాంగానికి రిసోర్స్ సెంటర్‌గా వెలుగొందుతోంది. -
పద్మ అవార్డుల్లో ‘బుర్రా’కు తీరని అన్యాయం
తెనాలి: భరతముని నాట్య శాస్త్రాన్ని రంగస్థలంపై అనుసరించిన మహానటుడు బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రికి రాష్ట్ర ప్రభుత్వం 14 పర్యాయాలు సిఫార్సు చేసినా, కేంద్రం పద్మశ్రీ అవార్డు ఇవ్వలేకపోయిందని సినీనటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. రంగస్థ్థలంపై స్త్రీ పాత్రలో సహజంగా నటించిన సుబ్రహ్మణ్యశాస్త్రిని అతని భార్యే గుర్తుపట్టలేకపోయారని దీనికి మించిన అవార్డు మరొకటి లేదని తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బుధవారం కళల కాణాచి సంస్థ ఆధ్వర్యంలో బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని ప్రఖ్యాత నటుడు జీఎస్ఎన్ శాస్త్రికి ప్రదానం చేశారు. ఆర్.నారాయణమూర్తి, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌లు రూ.25 వేల నగదు, జ్ఞాపికతో శాస్త్రి దంపతులను సత్కరించారు. ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ..హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో తెనాలికి చెందిన మహనీయుల విగ్రహాలతో తెనాలి బండ్‌ను త్వరలోనే సాకారం చేయనున్నట్లు చెప్పారు. అవార్డు గ్రహీత శాస్త్రి తనకు పురస్కారంతో పాటు వచ్చిన రూ.25 వేలను సంస్థ కార్యకలాపాలకే వినియోగించాలని కోరుతూ దాన్ని నిర్వాహకులకు అందజేశారు. సభకు వేదగంగోత్రి ఫౌండేషన్, విజయవాడ వ్యవస్థాపకుడు వరప్రసాద్ అధ్యక్షత వహించారు. -
పద్మశ్రీకి ఎంపికైనా పింఛను కరువే
అయోధ్య: 25 ఏళ్లలో 25 వేల అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు దగ్గరుండి జరిపించారు.. అందరితో ఆప్యాయంగా ‘షరీఫ్ చాచా’ అని పిలిపించుకున్నారు. కేంద్రం 2020లో ‘పద్మశ్రీ’ అవార్డుకు ఎంపికైనట్లు సమాచారం ఇచ్చింది. అయితే, ప్రభుత్వం కనీసం పింఛను కూడా ఇవ్వకపోవడంతో కటిక పేదరికంతో వైద్యం కూడా చేయించుకోలేక మంచానికే పరిమితమయ్యారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొహల్లా ఖిర్కి అలీబేగ్‌కు చెందిన మొహమ్మద్ షరీఫ్(83). అనాథలకు షరీఫ్ అందించిన సేవలకుగాను ‘పద్మశ్రీ’కి ఎంపిక చేసినట్లు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి గత ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరం అందిందని ఆయన కుమారుడు షగీర్ తెలిపారు. అయితే, ఇప్పటికీ ఆయనకు ఆ అవార్డు అందలేదన్నారు. పద్మశ్రీకి తన తండ్రి పేరును సిఫారసు చేసిన స్థానిక ఎంపీ లాలూ సింగ్ కూడా అవార్డు ఇవ్వకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు షగీర్ చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తండ్రికి పింఛను మంజూరు చేయాలని కోరారు. ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న తనకు నెలకు రూ.7వేల వేతనం మాత్రం వస్తుందనీ, అది కుటుంబ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని షగీర్ తెలిపారు. పేదరికం కారణంగా తన తండ్రికి వైద్యం చేయించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ఆడపిల్లని, చెట్టుని కాపాడుకుంటే చాలు'
చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది. అన్నమూ పెడుతుంది. అయితే అది ‘పద్మశ్రీ’ కూడా ఇస్తుంది. ఈ సంవత్సరం చెట్టునే నమ్ముకున్న ఇద్దరు వ్యక్తులు పద్మశ్రీ పొందారు. ఒకరు రాజస్థాన్‌కు చెందిన శ్యామ్ సుందర్ పాలివాల్. మరొకరు తమిళనాడుకు చెందిన పాప్పమ్మాళ్. కూతురి తుదిశ్వాస నుంచి ఒక వనాన్నే సృష్టించాడు శ్యామ్ సుందర్. నానమ్మ పోతూ పోతూ ఇచ్చిన చిన్న కిరాణా అంగడి నుంచి భూమి కొని సేంద్రియ వ్యవసాయం చేసేంతగా ఎదిగింది పాప్పమ్మాళ్. కొంత నేల దొరికితే అందులో విత్తు నాటితే ఎలాగూ ఆనందం వస్తుంది. కాని ఆ కొమ్మకు పద్మశ్రీ పూస్తే ఇంకా ఆనందం కదా. ఆ ఇరువురి స్ఫూర్తిదాయకమైన పరిచయం ఇది. ‘నేనేం చదువుకోలేదు. నాకు ఇంగ్లిష్ రాదు’ అంటాడు 55 ఏళ్ల శ్యామ్‌సుందర్ పాలివాల్. కాని అతడు మాట్లాడేది ఇవాళ ప్రపంచమంతా అర్థం చేసుకుంటోంది. కారణం అతడు మాట్లాడేది ప్రకృతి భాష. చెట్టు భాష. పచ్చదనపు భాష. 2021 సంవత్సరానికి గాను శ్యామ్సుందర్కు ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించింది ప్రభుత్వం. నిజానికి ఈ పురస్కారం అతనికొక్కడికి మాత్రమే కాదు. అతని ఊరు ‘పిప్లాంత్రి’కి. ఆ ఊరి గ్రామస్తులకి. ఈ ఊళ్లో ప్రస్తుతం తలలూపుతున్న దాదాపు మూడు లక్షల చెట్లకి. ‘ఆడపిల్లని, చెట్టుని కాపాడుకుంటే చాలు ఈ ధరిత్రి సుఖంగా ఉంటుంది’ అంటాడు శ్యామ్‌సుందర్. అతడు కూడా రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని తన ఊరు పిప్లాంత్రిలో 2007 వరకూ ఒక సామాన్య రైతే. తను తన ఇల్లు అనుకుంటూ వచ్చాడు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు అతనికి. అయితే 2007లో అతని జీవితంలో పెనుమార్పు వచ్చింది. ఆ సంవత్సరం ఆగస్టులో అతని రెండో కూతురు 16ఏళ్ల కిరణ్ స్కూల్ నుంచి సగంలో తిరిగి వచ్చింది కడుపు నొప్పితో. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లేలోపు డీహైడ్రేషన్‌తో మరణించింది. ఎంతో ఇష్టమైన కుమార్తె మరణించడంతో కదిలిపోయాడు శ్యామ్‌సుందర్. ‘ప్రమాదవశాత్తు మరణిస్తేనే నాకు ఇంత దుఃఖంగా ఉంది. చేతులారా చంపేస్తే ఆ తల్లిదండ్రులకు ఇంకెత దుఃఖం ఉండాలి అనిపించింది’ అంటాడు అతడు. ఎకో–ఫెమినిజమ్ మొదలు ఆడపిల్ల చెట్టును కాపాడుతుంది... చెట్టు ఆడపిల్లను కాపాడుతుంది అని ఉద్యమం మొదలెట్టాడు శ్యామ్‌సుందర్. ఆ సమయంలో అతను తన ఊరి సర్పంచ్ కూడా. అప్పటికి రాజస్తాన్‌లో అమ్మాయి కట్నకానుకలకు భయపడి వడ్లగింజలు నోట్లో పోసి శిశుహత్యలు చేస్తుండేవారు. ‘మా ప్రాంతంలో ఇక అలా జరక్కూడదు అనుకున్నాను’ అంటాడు శ్యామ్‌సుందర్. మొదట తన కూతురి పేరున ఒక కదంబ మొక్క నాటాడు. ‘మా ఊరిలో ప్రతి సంవత్సరం యాభై అరవై కాన్పులు జరుగుతాయి. ఆడపిల్ల పుడితే ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి పేరున 111 మొక్కలు నాటాలి. వాటి బాగోగులు చూడాలి. వాటి మీద రాబడి భవిష్యత్తులో ఆ పిల్లకే చెందుతుంది. అలాగే ఆడపిల్లను చదివిస్తామని, వయసుకు ముందు పెళ్లి చేయమని వాళ్లు నోటు రాయాలి. ఆడపిల్ల పుడితే ఊరు మొత్తం 21 వేలు చందా ఇవ్వాలి. ఆడపిల్ల తల్లిదండ్రులు ఇంకో పది వేలు ఇవ్వాలి. దానిని డిపాజిట్ చేస్తాం. 18 ఏళ్ల తర్వాత దానిపై వచ్చే డబ్బు ఆ అమ్మాయి పెళ్లికి ఉపయోగపడేలా భరోసా కల్పించాం. దాంతో మా ప్రాంతంలో ఆడపిల్ల మరణాలు బాగా తగ్గాయి’ అంటాడు శ్యామ్‌సుందర్. దీనిని నిపుణులు ఎకో ఫెమినిజం అంటున్నారు. ఇది మాత్రమే కాదు... శ్యామ్‌సుందర్ తన గ్రామంలో దాదాపు రెండున్నర లక్షల అలొవెరా మొక్కలు నాటి వాటి నుంచి జెల్, జ్యూస్ వంటి ప్రాడక్ట్స్ తయారు చేయించి మార్కెటింగ్ చేస్తున్నాడు. ‘ఒక్కో మహిళ నెలకు కనీసం ఆరు వేల రూపాయలు ఆదాయం గడిస్తోంది’ అన్నాడతను సంతోషంగా. గత దశాబ్ద కాలంలో గత దశాబ్ద కాలంలో పిప్లాంత్రిలో నాటిన వేప, మామిడి, ఉసిరి చెట్ల వల్ల పిప్లాంతి పచ్చదనం నింపుకోవడమే కాదు కరువు బారిన పడటం లేదు. భూసారం పెరిగి వలస ఆగింది. భూగర్భ జలాల మట్టం పెరిగింది. శ్యామ్‌సుందర్‌ను అనేక పురస్కారాలు వరించాయి. రాజస్థాన్ ప్రభుత్వం ఈ ఊరిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ‘నేను చేయగలగితే దేశంలో ఎవరైనా చేయొచ్చు’ అంటాడు శ్యామ్‌సుందర్. అతడు చెప్పే ఆ ‘ఎవరైనా’ అనే వ్యక్తి ప్రతి గ్రామంలో ఉండాలని కోరుకుందాం. చెట్ల మధ్య ఒక తెల్లజుట్టు చెట్టు 105 ఏళ్ల పాప్పమ్మాళ్ ఉదయం ఐదు గంటలకు టంచన్‌గా నిద్రలేచి ఆరోగంటకంతా తన పొలంలో ఉంటుంది. కోయంబత్తూరు సమీపంలోని తక్కెంపట్టి అనే గ్రామంలో భవాని నది ఒడ్డున ఆ పొలం ఉంటుంది. రెండున్నర ఎకరా ఉన్న ఆ పొలం ఆమె పైసా పైసా కూడగట్టి కొనుక్కున్నది. అందులోని ప్రతి మొక్కా ప్రతి పాదూ ఆమె చేతుల మీదుగా రూపుదిద్దుకున్నవే. పాప్పమ్మాళ్ గత యాభైఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ తమిళనాడులో పేరు తెచ్చుకుంది. ‘నా నానమ్మ పోతూ పోతూ నాకు చిన్న కిరాణా షాపు ఇచ్చి వెళ్లింది’ అంది పాప్పమ్మాళ్. ఆమెకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. వచ్చి నానమ్మ దగ్గర చెల్లెలితో పాటు ఉండిపోయింది. కిరాణా షాపును, చిన్న హోటల్‌ను నడుపుతూ దానిమీద రాబడితో పది ఎకరాల పొలం కొంది. అరటి, బెండ పండించడంలో ఆమె ఎక్స్పర్ట్. అయితే చెల్లెలి పెళ్లి, ఆమె పిల్లల పెంపకం కోసం ఏడున్నర ఎకరాల పొలం ధారాదత్తం చేసేసింది. మిగిలిన రెండున్నర ఎకరాల పొలంలో ఇప్పటికీ అరటి పండిస్తోంది. పాప్పమ్మాళ్‌ను తమిళనాడు గవర్నమెంట్ చాలా త్వరగా గుర్తించింది. తమిళనాడు వ్యవసాయ యూనివర్సిటీ ఆమెను తరచూ ఆహ్వానిస్తుంటుంది. 105 ఏళ్ల వయసులో గట్టిగా పనులు చేసుకుంటూ ఉండటానికి కారణం వారంలో రెండుసార్లు మటన్ సూప్ తాగడమే కావచ్చునని ఆమె చెబుతుంది. ఆమె మటన్ బిరియాని కూడా ఇష్టంగా తింటుంది. ఆకులో తినడం ఆమె అలవాటు. వేడి నీరు తాగుతుంది. ఈ వయసులో ఆమె తాను ఉత్సాహంగా ఉంటూ తనవారిని ఉత్సాహంగా ఉంచుతోంది. ఈసురోమనేవారెవరైనా ఈమెను చూసి కదా నేర్చుకోవాలి. – సాక్షి ఫ్యామిలీ -
పద్మశ్రీ– మాతృశ్రీ
ఏక్తాకపూర్ రెట్టింపు సంతోషాలలో మునిగి తేలుతోంది. జనవరి 25న ఆమెకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించింది. జనవరి 26న ఆమె తన కుమారుడు ‘రవి కపూర్’ మొదటి పుట్టిన రోజును ముంబైలో ఘనంగా నిర్వహించింది. ఏక్తాకపూర్అవివాహిత. కాని సహజాతమైన మాతృత్వ వాంఛను పరిపూర్ణం చేసుకోవడానికి సరొగసి ద్వారా ఆమె బిడ్డకు తల్లి అయ్యారు. పెళ్లికి దూరంగా ఉండదలిచిన ఆమె సోదరుడు, నటుడు తుషార్ కపూర్ కూడా సరొగసి ద్వారానే కుమారుడిని పొందాడు. టీవీనిర్మాతగా, నం.1 ప్రొడక్షన్ హౌస్ అధినేతగా ఏక్తాకపూర్ సాధించిన విజయాలు చిన్నవి కాదు. భారతీయ టీవీ సీరియళ్ల ధోరణిని మార్చేసిన వినోద సామ్రాజ్ఞి ఆమె. అయితే ఆ గొప్పదనాలన్నీ తన కుమారుడి చిరునవ్వు ముందు దిగదుడుపే అంటుంది ఏక్తా. తన తండ్రి జితేంద్రతో (అసలు పేరు రవికపూర్) ఉండే విపరీతమైన అనుబంధం వల్ల ఆమె తన కుమారుడికి ఆయన అసలు పేరు ‘రవి కపూర్’ అని పెట్టుకుంది. న్యూమరాలజీని విపరీతంగా విశ్వసించే ఏక్తా కొడుకు స్పెల్లింగ్‌లో 'ravi' అని కాకుండా 'ravie' అనే అక్షరాలను ఉంచింది. ముంబై శివార్లలో జరిగిన ఈ పుట్టిన రోజువేడుకలకు జితేంద్ర, తుషార్‌లతో పాటు రితేష్–జెనీలియా, హేమమాలిని కుమార్తె ఈషా డియోల్‌లతో పాటు టెలివిజన్ రంగం నుంచి తారలు చాలామంది హాజరయ్యారు. -
‘మట్టి’ పద్మం!
పంట భూమికి పోషకాలను అందించాలన్నా.. చీడపీడల బెడద నుంచి పంటలను కాపాడుకోవాలన్నా కావాల్సిందేమిటి? రసాయనిక ఎరువులు, పురుగుమందులు, చివరకు కషాయాలు కూడా అవసరం లేదు.. కేవలం మట్టి ద్రావణం ఉంటే చాలు. ఇది రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి ఆవిష్కరించిన గొప్ప సంగతి. 12–13 ఏళ్ల నుంచి ద్రాక్ష, వరి, గోధుమ, కూరగాయ పంటలకు ఎరువుగా వేయడం, మట్టి ద్రావణాన్ని ద్రవరూప ఎరువుగా, పురుగుల మందుగా పిచికారీ చేయడం విశేషం. ఆయన పండించిన బియ్యంలో విటమిన్ ఎ ఉందని రుజువైంది. అంతేకాదు.. ప్రపంచ మేధోహక్కుల సంస్థ(వైపో)ను మెప్పించి, 2008లోనే 28 ఐరోపా దేశాల్లో పేటెంట్లు పొందారు. చింతల వెంటకటరెడ్డి ఆవిష్కరణ గురించి ఏప్రిల్ 7, 2014న ‘లోపలి మట్టిలోనే పోషకాల లోగుట్టు’ శీర్షికన సాక్షి ‘సాగుబడి’ సమగ్ర కథనాన్ని ప్రచురించింది. తదనంతరం పత్రికలు, టీవీలు, డిజిటల్ మీడియా ద్వారా చింతల వెంకట రెడ్డి(సి.వి.ఆర్.) సాగు పద్ధతి ఇటీవల విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పలువురు రైతులు వివిధ పంటలపై మట్టి ద్రావణాన్ని వాడుతూ మండే ఎండల్లోనూ చక్కని పంట దిగుబడులు పొందుతుండడం హర్షదాయకం! ఈ ఏడాది పద్మశ్రీ అవార్డుకు చింతల వెంకటరెడ్డి ఎంపికైన సందర్భంగా ఆయన ఆవిష్కరణ విశేషాలు మరోసారి.. మట్టి ద్రావణం.. కొన్ని మెలకువలు! నేలతల్లి అన్నపూర్ణ. అన్ని పోషకాలకూ నిలయం. అటువంటి మట్టిని సేకరించి పంటల సాగులో పోషకాల కోసం, చీడపీడల సమర్థ నివారణ కోసం వినియోగించుకునే వేర్వేరు పద్ధతులు, ఈ క్రమంలో రైతులు పాటించాల్సిన మెలకువలను రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి (సీవీఆర్) ‘సాగుబడి’కి వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక పంటలపై రైతులు మట్టి ద్రావణాన్ని ద్రాక్ష, బొప్పాయి, ఆపిల్ బెర్, దానిమ్మ, బత్తాయి, నిమ్మ, టమాటో, వంగ, బీర, కాకర, దొండ, పూల తోటల్లో వాడుతూ సత్ఫలితాలు పొందుతున్నారన్నారు. అయితే, మల్బరీ తోటపై మట్టి ద్రావణం పిచికారీ చేయరాదని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మట్టి ద్రావణం చల్లిన ఆకులు తింటే పట్టుపురుగులు కూడా చనిపోతాయన్నారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. ‘పై మట్టి’ అంటే? సీజనల్ పంటలు లేదా తోటలను తాము సాగు చేసుకుంటున్న భూముల్లో నుంచే మట్టిని సేకరించుకోవాలి. ఇతర భూముల నుంచి సేకరించడం ప్రారంభిస్తే.. ఇతర సమస్యలు తలెత్తుతాయి. భూమి పైన 3–4 అంగుళాల లోతు వరకు ఉన్న మట్టిని ‘పై మట్టి’(టాప్ సాయిల్) అని పిలుస్తున్నాం. దీన్ని వర్షాకాలం ప్రారంభానికి ముందే యంత్రాల సాయంతో సేకరించి, వర్షానికి తడవకుండా నిల్వ చేసుకోవాలి. ఇది అత్యంత సారవంతమైనది కాబట్టి.. పంటల పోషణకు ఉపయోగపడుతుంది. ‘లోపలి మట్టి’ అంటే? పైమట్టిని తొలగించిన తర్వాత అదే భూమిలో మీటరు వెడల్పున 4 అడుగుల లోతు వరకు కందకం తవ్వాలి. ఇలా తవ్వి తీసిన మట్టి మొత్తాన్ని ‘లోపలి మట్టి’ (సబ్ సాయిల్) అని పిలుస్తున్నాం. ఈ మట్టిని కుప్పపోసి, కలియదిప్పాలి. ఆ మట్టి మొత్తాన్నీ లోపలి మట్టిగా వాడుకోవచ్చు. లోపలి మట్టిలో(నల్ల రేగడి మట్టిలో మరింత ఎక్కువ) జిగట ఉంటుంది. ఈ జిగట చీడపీడలను సమర్థవంతంగా అరికట్టడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి, లోపలి మట్టిని ఎండబెట్టి వాడితే పోషకాల శాతం పెరుగుతుంది. ఎండబెట్టకుండానే మట్టి ద్రావణం తయారీలో వాడినా పర్వాలేదు. పంటల పోషణ కోసం పిచికారీ ఇలా.. ఎకరానికి 200 లీ. నీరు+ 15 కిలోల పైమట్టి+ 15 కిలోల లోపలి మట్టిని బాగా కలియదిప్పి.. 45 నిమిషాలు ఉంచాలి. పై తేట నీటిని మాత్రమే వడకట్టి పంటలపై సాయంత్రం 4.30 తర్వాత చల్లపూట పిచికారీ చేయాలి. అడుగుకు చేరిన బురదను మొక్కల మొదళ్ల వద్ద వేసుకుంటే బలం. పంటలకు పోషకాలు అందించడానికి వాడే మట్టి నల్ల రేగడి మట్టి అయితే ఎక్కువ ప్రయోజనకరం. పోషకాల కోసం పైమట్టికి బదులుగా క్వారీల దగ్గర నుంచి సేకరించే రాయిపొడిని వాడితే మరీ మంచిది. చీడపీడల నివారణ కోసం పిచికారీ ఇలా.. ► చీడపీడల నివారణకు జిగట ఉన్న ‘లోపలి మట్టి’ని మాత్రమే నీటిలో కలిపి వాడాలి. ఎర్ర మట్టి అయినా, నల్ల మట్టి అయినా అందులో జిగట ఉంటేనే చీడపీడలు పోతాయి. 200 లీ. నీటిలో 20 కిలోల లోపలి మట్టిని వేసి బాగా కలపాలి. అర గంట తర్వాత పైకి తేరుకున్న 170 లీటర్ల నీటిని పంటలపై పిచికారీ చేయాలి. అడుగుకు చేరిన బురదను పంట మొక్కలు, చెట్ల మొదళ్లలో వేసుకోవచ్చు. పైమట్టిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పైమట్టిని కూడా కలిపితే చీడపీడలు త్వరగా కంట్రోల్ కావు. ► మట్టి ద్రావణంతోపాటు ఎకరానికి 2 కిలోల ఆవు పేడ, 2 కిలోల ఆవు మూత్రం లేదా లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా, చేప అమినో ఆమ్లం కలిపితే.. ఉదయం / సాయంత్రం చల్లని వేళ్లల్లో మాత్రమే పిచికారీ చేయాలి. ► పంటల పోషణకు లేదా చీడపీడల నివారణకు కేవలం మట్టి ద్రావణాన్నే పిచికారీ చేయదలచుకుంటే.. 44 డిగ్రీల ఎండకాసేటప్పుడు మిట్ట మధ్యాహ్నమైనా పిచికారీ చేయొచ్చు. ► కూరగాయ తోటలకైతే మట్టి ద్రావణాన్ని 3–4 రోజులకోసారి పిచికారీ చేయాలి. టమాటో, వంగ, బీర తోటలకు వారానికోసారి కొట్టొచ్చు. ► పంటల పోషణ కోసమైతే మట్టి ద్రావణాన్ని కలిపిన అరగంట తర్వాత వడకట్టి వాడాలి. కలిపిన అరగంట తర్వాత 3–4 గంటలలోపు ఎంత తొందరగా వాడితే అంత మంచిది. ► చీడపీడల నివారణ కోసం కలిపిన లోపలి మట్టి ద్రావణమైతే వడకట్టి నిల్వపెట్టుకొని ఎన్నాళ్ల తర్వాతయినా కలియదిప్పి పిచికారీ చేసుకోవచ్చు. ► ఇతర వివరాల కోసం సికింద్రాబాద్‌లోని ఓల్డ్ ఆల్వాల్ వాస్తవ్యుడైన చింతల వెంకటరెడ్డిని 98668 83336 నంబరులో లేదా e-mail: cvreddyind@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. మట్టి ద్రావణం మట్టి ఎరువు, ద్రావణంతో సాగైన ద్రాక్ష తోట -
మట్టి మనిషి.. మహాకృషి
అల్వాల్: మట్టిలో పుట్టి.. మట్టిలో పెరిగి.. చివరికి మట్టిలోనే కలవడం మానవుడి జీవన పరిణామం. కృత్రిమ రసాయనాలు వాడకుండా కేవలం మట్టినే ఎరువుగా ఉపయోగించి పోషక విలువలు ఉన్న పంటలు పండిస్తు ప్రపంచానికే ఆదర్శ రైతుగా నిలుస్తున్న అల్వాల్‌కు చెందిన చింతల వెంకటరెడ్డిని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించనుంది. కోటి పనులు కూటి కోసమే.. కానీ తినే ఆహారమే విషపూరితమైతే ఎలా అని భావించిన వెంకటరెడ్డి క్రిమి సంహారక మందులు ఉపయోగించకుండా కేవలం సేంద్రియ ఎరువులే వాడి పంటను పండించి బలవర్ధకమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో తనకున్న వ్యవసాయ భూమిని పరిశోధక కేంద్రంగా మార్చి తానే ఓ శాస్త్రవేత్తగా నిరంతరం ప్రయోగాలు నిర్వహించి సఫలీకృతుడయ్యారు. పలు మార్లు పంటను పండించి నిస్సారంగా మారిన నేలను సారవంతంగా చేయడం కోసం తన పొలంలో 2 అడుగులు వెడల్పు, 4 అడుగుల లోతు, 380 అడుగుల పొడవు కందకం తవ్వారు. తవ్విన మట్టిని పొలం పైభాగంలో చల్లారు. పొలం పైభాగం మట్టిని తవ్విన కందకం పూడ్చడానికి వినియోగించారు. ఇలాంటి పద్ధతులు అవలంబించి ఖర్చు గణనీయంగా తగ్గించారు. సేంద్రియ విధానాలను పాటించి, అధిక దిగుబడులను సాధించారు. వెంకటరెడ్డి కనుగొన్న విధానాన్ని పంజాబ్, హరియాణా రాష్ట్రాలలో గోధుమ పంటకు అనుసరించి.. అధిక దిగుబడులను సాధించారు. అనంతరం వెంకటరెడ్డి లక్ష రూపాయల ఖర్చుతో అంతర్జాతీయ పేటెంట్ సాధించగలిగారు. మరోవంక వ్యవసాయంలో విశేష కృషి చేసిన వెంకటరెడ్డికి అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హైదరాబాద్ సందర్శనకు వచ్చినప్పుడు నేరుగా మాట్లాడే అవకాశం దక్కింది. వ్యవసాయ శాస్త్ర వేత్తలు నార్మన్ బోర్లాగ్, ఎం.ఎస్ స్వామినాథన్లు వెంకటరెడ్డి వ్యవసాయంలో అనుసరిస్తున్న మెలకువలను అడిగి తెలుసుకున్నారు. విశేష కృషికి ఉత్తమ గుర్తింపు ⇒ రైతు సేవలను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో వెంకటరెడ్డికి ఆదర్శ రైతు పురస్కారాన్ని అందించి ప్రోత్సహించారు. ఆహార ఉత్పత్తిని పెంచడానికి ఆయన కృషిని ప్రశంసించారు. ⇒ సేంద్రియ ఎరువులను ఉపయోగించి వరి, గోధుమ, ద్రాక్ష పంటల దిగుబడి రెట్టింపు చేశారు వెంకటరెడ్డి. ⇒ దేనికీ పనికి రాని చెట్టు ఆకులను ఎరువుగా ఉపయోగించి పంట దిగుబడి పెంచడానికి కృషి చేస్తున్నారాయన. ⇒ నారు పోయడం, నాటు వేయడం, కలుపుతీయడం వంటి పనులు లేకుండా ఒకేసారి వరి, ఇతర ఆరు రకాల పంటలను సాగు చేసేందుకు వీలుగా ఓ యంత్రాన్ని తయారు చేసి వ్యవసాయ శాస్త్రవేత్తలకు వివరించారు. ఇందుకు పేటెంట్ హక్కు పొందడం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ⇒ ’దేశంలోని పలు వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వెంకట్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వచ్చి అధ్యయనం చేస్తుంటారు. ⇒ 1990లో మాజీ గవర్నర్ కుముద్‌బెన్ జోషి ద్రాక్ష తోటను సందర్శించి వెంకట్‌రెడ్డిని అభినందించారు. ⇒ ఐసీఎఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్) డైరెక్టర్ జనరల్ పరోడా, డైరెక్టర్ మిశ్రాలు వెంకటరెడ్డిని కలిసి వ్యవసాయ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి ప్రశంసించారు. భవిష్యత్ లక్ష్యాలు ఇవీ.. ⇒ భారత దేశం పంటలు ప్రపంచంలోనే గుర్తింపు పొందాలి. ⇒ తినే ఆహారంలో పోషక పదార్థాలే ఉండాలి. ⇒ రైతు వ్యవసాయ ఉత్పత్తి ఖర్చు, సమయం తగ్గించాలి. ⇒ తాను చేసే ప్రతి పరిశోధన భారతీయులకే సొంతం కావాలి. జీవన ప్రస్థానం ఇదీ.. 1950 డిసెంబర్ 22న అల్వాల్‌లో చింతల వెంకటరెడ్డి జన్మించారు. ప్రీ యూనివర్సిటీ కోర్సు (పీయూసీ) బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివారు. స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వెంకటరెడ్డి వ్యవసాయంపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించేవారు. ఆంధ్రపదేశ్ ద్రాక్ష రైతు అభివృద్ధి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. జాతీయ పరిశోధన సంస్థ పుణే విభాగంలో సభ్యుడిగా ఉన్నారు. 1990లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్రాక్ష రత్న అవార్డు ప్రదానం చేసింది. ఆయన సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు వచ్చాయి. దీంతోపాటు పద్మశ్రీ అవార్డు వరించడం పట్ల వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు, స్నేహితులు, రైతు మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయమంటే ప్రాణం.. రైతు బిడ్డగా జన్మించిన నేను వ్యవసాయాన్నే నమ్ముకున్నాను. పది మందికి ఆహారం అందించే రైతే అందరికన్నా మిన్నా. నేలను సారవంతంగా మార్చడానికి అనుసరించాల్సిన పద్ధతి, సేంద్రియ ఎరువులతోనే పంటను పండించి పోషక పదార్థాలున్న ఆహారాన్ని అందించాలన్నదే తన లక్ష్యం. భూమిలోనే అన్ని రకాల పోషక పదర్థాలు ఉన్నాయి. కృత్రిమంగా తయారు చేసిన రసాయన మందులు, ఎరువులు ఉపయోగించి సారవంతమైన నేలను పాడు చేయడంతోపాటు దానితో పండిన పంట సైతం విషతుల్యంగా మార్చుతున్నాం. రసాయన ఎరువులు వాడడం వలన రైతుకు పెట్టుబడి పెరగడంతో వ్యవసాయం భారంగా మారుతుంది. ఇకనైనా మన వ్యవసాయ పద్ధతి మారాలి. ఇందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి. భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంతో నా బాధ్యత మరింత పెరిగింది. – చింతల వెంకటరెడ్డి, రైతు (శాస్త్రవేత్త) -
నా అంత ధనవంతుడు ఎవరైనా ఉంటారా?
‘‘కళలన్నింటిలో తలమానికమైన కళ సాహిత్యం. సాహిత్యం అనేది అనేక రూపాల్లో ఉంటుంది. వాటిలో మొదటిది నాటకం. కవులు ఎంత బాగా రాసినా దాన్ని ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపేది నాటకం. ఆ నాటకానికి సాంకేతిక రూపమే సినిమా’’ అన్నారు ప్రముఖ పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘తెలుగు సినీ రచయితల సంఘం’ బుధవారం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికి సత్కార సభ ఏర్పాటు చేసింది. సిరివెన్నెల, ఆయన సతీమణి పద్మావతిని సన్మానించారు. ఈ సమావేశానికి ‘తెలుగు సినీ రచయితల సంఘం’ అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆకెళ్ల అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ‘సిరివెన్నెల’ మాట్లాడుతూ– ‘‘పద్మశ్రీ’ అవార్డు విలువ, ప్రాముఖ్యత ఎంత అనే విషయాన్ని పక్కనపెడితే ఇంత మంది అభిమానం, ప్రేమ, ఐశ్వర్యం పొందడం చాలా సంతోషంగా ఉంది. నా శ్రీమతి పద్మతో అంటుంటాను.. ‘నా అంత ధనవంతుడు ఎవరైనా ఉంటారా?’ అని. నేను సినిమా రంగాన్ని దేవాలయంలా భావిస్తాను. నా పాటల ద్వారా సంస్కారవంతమైన భావాలని చెబుతున్నా. గతంలో ఎంతోమంది ‘పద్మశ్రీ’ అవార్డులు తీసుకున్నారు. వారు ఎంత సంతోషపడ్డారో తెలియదు కానీ, ఈ అవార్డు మాత్రం నాకు ప్రత్యేకమైనది. రామాయణాన్ని 5 మాటల్లో చెప్పమంటే ఎలా చెబుతాం? అయితే పాట ద్వారా చెప్పే అవకాశం సినిమా ద్వారానే వస్తుంది. అది నాకు వచ్చింది. 30ఏళ్లుగా సమాజానికి ఉపయోగపడే ఎన్నో మంచి పాటలు రాసే అవకాశం ఆ పరమేశ్వరుడు నాకే ఇచ్చాడేమో అనిపిస్తోంది. సినిమా అన్నది జీవితానికి అతీతంగా ఉంటుందనుకోను. సమాజం పట్ల బాధ్యత పెంచేది సినిమా. మొదటిసారి నాకు ‘నంది’ అవార్డు వచ్చినప్పుడు కన్నీళ్లు వచ్చాయి. మీరందరూ అన్నట్టు ‘భారతరత్న’ అవార్డు నాకు వస్తుందా? రాదా? అన్నది కాదు. భారతీయులంతా మంచి మనసుతో జీవించి, మేమంతా భారతీయులం అని ఇతర దేశాలవారికి సగర్వంగా చాటిచెప్పినప్పుడే మనందరికీ ‘భారతరత్న’ అవార్డు వచ్చినట్లు. ఇంతమంది అభిమానులు, ఆశీస్సులు, ఆత్మీయతను అందించిన ‘పద్మశ్రీ’ అవార్డుకి ధన్యవాదాలు. ప్రతి పురుషుడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందంటారు. కానీ, నా శ్రీమతి పద్మ మాత్రం ముందుండి నన్ను నడిపిస్తున్నారు’’ అన్నారు. రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘సిరివెన్నెల’గారు రాసిన పాటలన్నీ అద్భుతం. అయితే నాకు ప్రత్యేకించి ‘మహాత్మ’ సినిమాలోని ‘ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా గాంధీ...’ పాట అంటే చాలా ఇష్టం. మేం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో శ్రీశ్రీగారి పక్కన కూర్చున్నప్పుడు ఎంత గర్వంగా ఫీలయ్యామో ‘సిరివెన్నెల’తో కలిసి ఉన్నప్పుడూ అలాగే ఫీలయ్యాం’’ అన్నారు. రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ– ‘‘‘సిరివెన్నెల’ అన్నయ్యకి ‘పద్మశ్రీ’ అవార్డు ఆలస్యంగా వచ్చిందంటున్నారు.. నిజానికి రచయితకి ‘పద్మశ్రీ’ తెచ్చిన మొదటి వ్యక్తి ఆయనే. పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో పాటు ‘భారతరత్న’ అవార్డు కూడా రావాలని కోరుకుందాం’’ అన్నారు. ‘‘తొలిసారి ఓ సినిమా రచయితకి ‘పద్మశ్రీ’ అవార్డు రావడం సినిమా పాటకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. రచయితలందరికీ ‘సిరివెన్నెల’ గర్వకారణం’’ అన్నారు రచయిత వడ్డేపల్లి కృష్ణ. ‘‘ఇండస్ట్రీకి వచ్చేముందు గురువుగారివద్ద (సిరివెన్నెల) శిష్యరికం చేయడం గొప్ప వరంగా భావిస్తాను’’ అన్నారు రచయిత రామజోగయ్య శాస్త్రి. ‘‘సిరి వెన్నెలగారిని ‘గ్రంథసాంగుడు’ అంటారు. అంటే గ్రంథంలో చెప్పలేని విషయాన్ని కూడా సాంగ్‌లో చెబుతారు’’ అన్నారు రచయిత భాస్కరభట్ల. ‘‘ఎవరికైనా ‘పద్మశ్రీ’ అవార్డు వస్తే డబ్బులిచ్చి కొనుక్కుని ఉంటారులే అని కామెంట్లు చేసేవారు. కానీ, గురువుగారికి ఈ అవార్డుని ప్రకటించాక అర్హతగల వ్యక్తికి ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు’’ అని రచయిత సాయిమాధవ్ బుర్రా అన్నారు. ఈ సత్కార సభలో విజయేంద్రప్రసాద్, గుణ్ణం గంగరాజు, బల్లెం వేణుమాధవ్, బలభద్రపాత్రుని రమణి, గొట్టిముక్కల రాంప్రసాద్, కేఎల్ నారాయణ, వైవీఎస్ చౌదరి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, భీమనేని శ్రీనివాసరావు, ఆర్పీ పట్నాయక్, ఆచంట గోపీనాథ్, కాసర్ల శ్యామ్‌తో పాటు పలువురు రచయితలు పాల్గొన్నారు. -
పద్మశ్రీ’ నాది కాదు.. వారందరిదీ!
‘‘చెంబోలు సీతారామశాస్త్రిని ‘సిరివెన్నెల’ చిత్రంతో సిరివెన్నెల సీతారామశాస్త్రిని చేసి, సినీ రంగంలో జన్మనిచ్చి ప్రోత్సహించిన దర్శకులు కె. విశ్వనాథ్‌గారిని ఎప్పటికీ మర్చిపోలేను. నా ఈ అభ్యున్నతికి కారణం నాకు జన్మనిచ్చిన తల్లితండ్రులు, సినీ జన్మనిచ్చిన విశ్వనాథ్‌గారు, పెంచిపోషించిన సినిమా తల్లి, ఇన్నేళ్లు నా వెన్నంటి ఉండి కలసి ప్రయాణించిన నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, గాయకులు, నా కుటుంబ సభ్యులు. అందుకే తెలుగులో సినీ గేయకవితా రచన విభాగానికి తొలిసారి వచ్చిన ఈ ‘పద్మశ్రీ’ అవార్డు నాది కాదు.. వారందరిదీ! అందుకే, ఇది నాకు అభినందన కాదు ఆశీర్వాద సభగా భావిస్తున్నా’’ అని సినీ గీత రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అన్నారు. భారత ప్రభుత్వం సిరివెన్నెలకు ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించిన సందర్భంగా కళాత్మక చిత్రాల దర్శకుడు కె. విశ్వనాథ్ స్వగృహంలో ‘చిరువెన్నెలలో సిరిమల్లెలు’ పేరిట ఆత్మీయ అభినందన సభ జరిగింది. సీతారామశాస్త్రి దంపతులను, ఆయన మాతృమూర్తిని విశ్వనాథ్ కుటుంబం సాదరంగా సత్కరించింది. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘పద్మశ్రీ’ పురస్కారం రావడం ఆలస్యమైందా, ముందుగా వచ్చిందా లాంటి మాటలను అటుంచితే రావాల్సిన వ్యక్తికి రావడం ఆనందంగా ఉంది. స్వయంకృషి, సాధనతో ఈ స్థాయికి ఎదిగిన సీతారామశాస్త్రి తన మొదటి చిత్రం ‘సిరివెన్నెల’ రోజులలానే ఇప్పటికీ నిగర్వంగా ఉండటం విశేషం. సాహితీ మానస పుత్రుడైన శాస్త్రి మరిన్ని ఉన్నతశిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదిస్తున్నా’’ అన్నారు. విశ్వనాథ్, సీతారామశాస్త్రి కలయికలోని వివిధ చిత్రాల్లోని పాటలను గాయనీ గాయకులు ఉష, శశికళ, హరిణి, సాయిచరణ్ గానం చేశారు. వేణుగాన విద్వాంసుడు నాగరాజు, నటి, నాట్యకళాకారిణి ఆశ్రిత వేముగంటి, ‘సప్తపది’ ఫేమ్ సబిత కొన్ని పాటలకు తమ కళా ప్రదర్శనతో మరింత రక్తి కట్టించారు. సంగీత దర్శకుడు మణిశర్మ, నటుడు గుండు సుదర్శన్ పాల్గొన్నారు. దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, దశరథ్, వీఎన్ ఆదిత్య, ఇంద్రగంటి, కాశీ విశ్వనాథ్, బీవీఎస్ రవి, రచయితలు జనార్దన మహర్షి, రామజోగయ్య శాస్త్రి, బుర్రా సాయిమాధవ్, అబ్బూరి రవి, నిర్మాతలు రాజ్ కందుకూరి, ఏడిద శ్రీరామ్, నటుడు జిత్‌మోహన్ మిత్రా, ‘మా’ శర్మ, యాంకర్ ఝాన్సీ తదితరులు ‘సిరివెన్నెల’తో తమ అనుభవాలను పంచుకున్నారు. ∙సిరివెన్నెల, పద్మ, విశ్వనాథ్ -
అవార్డులు కొత్తేమీ కాదు ఆదుకోండి..
సాక్షి, చెన్నై: పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన చిన్నపిళ్లైని పేదరికం వెంటాడుతోంది. తనను ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. తనకు అవార్డులు కొత్తేమీ కాదని, పద్మశ్రీ అవార్డు ఆనందమేనని చిన్నపిళ్లై వ్యాఖ్యానించారు.దక్షిణ తమిళనాడు అన్ని రంగాల్లో ఒకప్పుడు వెనుక బడి ఉండేది. ప్రధానంగా మదురై, తిరునల్వేలి, విరుదుగనర్ జిల్లాల్లో కందువడ్డి వేధింపులు మరీ ఎక్కువే. వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉన్న దృష్ట్యా, రైతు కూలీలు మరీ ఎక్కువే. ఈ సమయంలో 1990లో మహిళలు స్వయం ఉపాధి కల్పన, వారి జీవితాల్లో వెలుగు లక్ష్యంగా మదురైకు చెందిన చిన్నపిళ్లై (67) కదిలారు. కళంజియం పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు. స్వయం సహాయక బృందాల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. కందువడ్డి వేధింపుల భారి నుంచి గ్రామీణ ప్రజల్ని రక్షించేందుకు ఉపాధి అవకాశాల మెరుగుకు చర్యలు తీసుకున్నారు. స్వయం సహాయక బృందాలకు రుణాల్ని ఇప్పించి, వృత్తి శిక్షణతో బలోపేతం చేశారు. వారి కాళ్లపై వాళ్లే నిలబడే స్థాయికి గ్రామీణ మహిళల్లో చైతన్యం తీసుకొచ్చారు. అలాగే, మద్యపానానికి వ్యతిరేకంగా గళాన్ని విప్పినా, మద్దతు కరువే. బాల్య వివాహాల్ని అడ్డుకోవడంలో చిన్నపిళ్లై సఫలీకృతులయ్యారు. ఆమె సామాజిక సేవలకు గుర్తింపుగా కేంద్రం పద్మశ్రీని ప్రకటించింది. ఇంత వరకు అంతా బాగానే ఉన్నా, వ్యక్తిగతం చిన్నపిళ్లై ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ప్రస్తుతం పేదరికంలో ఉన్న ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఇస్తున్న రూ. వెయ్యి వితంతువు పింఛన్ ఒక్కటే ఆదరణగా మారింది. వాజ్‌పేయి ఆశీర్వాదం: పద్మశ్రీ అవార్డుకు ఎంపి కైన చిన్నపిళ్లైని మీడియా కదిలించగా, తనకు వచ్చిన అవార్డులు, పేదరికం, ఆరోగ్య సమస్యలను వివరించారు. తనకు అవార్డులు కొత్తేమీ కాదన్నారు. అప్పట్లో దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి తన కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకునిమరి బిరుదును ప్రదానం చేశారన్నారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అవ్వయార్ బిరుదును ప్రదానం చేసిందన్నారు. బిరుదులు వస్తుంటాయని, అయితే, గ్రామీణ మహిళలు మరింత ఆర్థిక ప్రగతి సాధించాలన్నదే తన తపనగా పేర్కొన్నారు. ఇప్పుడు మద్యం రక్కసి గ్రామాల్లో అనేక కుటుంబాల్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంపాదనను మద్యానికి తగలబెడుతున్నారని, మహిళలు దాచుకున్న నాలుగు రాళ్లను లాక్కెళ్తున్న వాళ్లు ఎక్కువగానే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవ్వయార్ బిరుదు అందుకునే సమయంలో మద్యం దుకాణాల్ని మూసి వేయాలని సీఎంకు విజ్ఞప్తి చేయడానికి ప్రయత్నించానని, అయితే, ఆయన దారిదాపుల్లోకి వెళ్లకుండా అధికారులు తనను అడ్డుకోవడం జరిగిందన్నారు. మహిళా సంక్షేమంపై చిత్త శుద్ధి ఉంటే, మద్యం దుకాణాల్ని మూసి వేయడానికి సీఎం పళనిస్వామి చర్యలు చేపట్టాలని కోరారు. పేదరికంలో ఉన్నా : సామాజిక సేవ అన్నది ఓ వైపు ఉన్నా, దానిని కొనసాగించేందుకు తగ్గ బలం ఇప్పటికీ ఉందన్నారు. అయితే, వ్యక్తిగతంగా తాను పేదరికంలో ఉన్నట్టు, ఆరోగ్య సమస్యలూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు రూ.వెయ్యి వితంతు పెన్షన్‌ను అందిస్తోందని, ఇది మందులకు సరిపోతున్నట్టు చెమ్మగిళ్లుతున్న కళ్లను తుడుచుకుంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పేదరికంతో తాను కొట్టుమిట్టాడుతున్నానని, ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, పేద విద్యార్థులకు ఉపాధి కల్పన అవకాశాలు మెరుగు పరచాలని, బాల్య వివాహాలు అడ్డుకునేందుకు విస్తృతంగా ముందుకు సాగాలన్న తపనతో కళంజియం ఉందన్నారు. -
పేదరికంలో ఉన్నా.. ఆదుకోండి
సాక్షి, చెన్నై: ఇటీవల పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన మదురైకి చెందిన చిన్నపిళ్లై(67) కటిక పేదరికంలో కాలం వెళ్లదీస్తున్నారు. రెండున్నర దశాబ్దాలకు పైగా గ్రామీణ మహిళాభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతూ తమిళనాట కోరలు చాచిన కంతు వడ్డీకి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తున్నారు. కళంజియం పేరిట సంస్థను స్థాపించి మహిళల్ని ఏకంచేసి బాల్య వివాహాల్ని అడ్డుకుంటున్నారు. పద్మశ్రీకి ఎంపికైన సందర్భంగా మీడియా పలకరించగా.. తాను పేదరికంలో ఉన్నానని, ప్రభుత్వం అందించే వితంతు పింఛను రూ.వెయ్యితో కాలం నెట్టుకు వస్తున్నట్టు ఆవేదన వ్యక్తంచేశారు.తనకు స్త్రీ శక్తి పురస్కారం అందజేసిన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి తనకు పాదాభివందనం చేశారని ఆమె గుర్తు చేశారు. అ‘సామాన్యుల’కు గుర్తింపు న్యూఢిల్లీ: సమాజ సేవ చేస్తున్న పలువురు సామాన్యులను ఈ ఏడాది పద్మ అవార్డులు వరించాయి. అందులో టీ విక్రేత, రూపాయికే పేదలకు వైద్యం అందిస్తున్న డాక్టర్ దంపతులు, దళితుల కోసం పాఠశాలను నెలకొల్పిన రిటైర్డ్ ఐపీఎస్ తదితరులున్నారు. ఒడిశాలో 100 ఎకరాలను సాగుచేసేందుకు ఒంటరిగా 3 కి.మీ మేర కాలువ తవ్విన గ్రామస్తుడు, మథురలో వేయికి పైగా ముసలి, జబ్బుపడిన ఆవుల బాగోగులు చూస్తున్న జర్మన్ పౌరురాలు కూడా తమ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులను గెలుచుకున్నారు. కటక్‌కు చెందిన దేవరపల్లి ప్రకాశరావు టీ అమ్మడం ద్వారా వచ్చిన లాభాలతో మురికివాడల్లో నివసిస్తున్న పేద పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. మహారాష్ట్రలో నక్సల్స్ ప్రభావిత మేల్ఘాట్ జిల్లాలో స్మిత, రవీంద్ర కోల్హె అవే వైద్య దంపతులు స్థానిక గిరిజనులకు మూడేళ్లుగా కేవలం రూ.1, రూ.2 కే వైద్యం అందిస్తున్నారు. ఇక బిహార్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జ్యోతికుమార్ సిన్హా మహాదళిత్ ముసాహర్ కులానికి చెందిన విద్యార్థుల కోసం ఆంగ్ల మాధ్యమ పాఠశాలను స్థాపించారు. రెసిడెన్షియల్ వసతి కూడా ఉన్న ఈ పాఠశాలలో 1 నుంచి 12 తరగతుల వరకు 320 మంది విద్యార్థులు చేరారు. ‘కెనాల్ మ్యాన్ ఆఫ్ ఒడిశా’గా పేరొందిన దైతారి నాయక్..పర్వతాల నుంచి నీటిని పొలాలకు పారించేందుకు బైత్రాని గ్రామంలో ఒక్కడే సుమారు నాలుగేళ్లు శ్రమించి మూడు కి.మీ పొడవైన కాలువను తవ్వి నీటి ఎద్దడి తీర్చారు. ‘గౌ మాతాకీ ఆశ్రయదాత్రి’గా పేరొందిన జర్మనీకి చెందిన ఫ్రెడరిక్ ఇరినా బ్రూనింగ్ మథురలో 1200 గోవులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. పద్మశ్రీకి ఎంపికైన.. అస్సాంకు చెందిన ఇంజినీరింగ్ డ్రాపౌట్ ఉద్ధవ్ కుమార్ భరాలి దానిమ్మ గింజలు తీసే, వెల్లుల్లి పొట్టు తొలిచే యంత్రాలను తయారుచేశారు. -
‘పద్మశ్రీ’తో మరింత ఉత్సాహం: హారిక
సాక్షి, హైదరాబాద్: ఊహించని సమయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ‘పద్మశ్రీ’ పురస్కారం రావడంపట్ల ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక సంతోషాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయస్థాయిలో మరిన్ని గొప్ప విజయాలు సాధించేందుకు ఈ అవార్డు నూతనోత్సాహాన్ని ఇస్తుందని ఆమె వ్యాఖ్యానించింది. ప్రస్తుతం స్పెయిన్‌లోని జిబ్రాల్టర్ ఓపెన్ టోర్నమెంట్లో పాల్గొంటున్న ఆమె ఆలస్యంగానైనా పద్మశ్రీ పురస్కారం వచ్చినందుకు ఆనందంతో ఉన్నానని తెలిపింది. ‘గత రెండేళ్లుగా ఈ అవార్డు కోసం దరఖాస్తు చేశాను. చివరి నిమిషంలో నా పేరు లేదని తెలుసుకొని నాతోపాటు తల్లిదండ్రులు నిరాశకు లోనయ్యారు. అయితే ఏనాటికైనా ఈ పురస్కారం వస్తుందని వారికి చెప్పి దీని కోసం వేచి చూడొద్దని కోరాను. ఈసారి అవార్డు వస్తుందని ఊహించని సమయంలో నా పేరు కూడా జాబితాలో ఉండటంతో అమితానందం కలిగింది. ఈ పురస్కారం నాలో మరింత బాధ్యతను పెంచింది. నా జీవిత లక్ష్యమైన ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణాన్ని అందుకునే దిశగా మరింత పట్టుదలతో కృషి చేసేందుకు కావాల్సిన విశ్వాసాన్ని ఇచ్చింది. నేనీస్థాయికి చేరుకోవడానికి సహాయపడిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను’ అని 28 ఏళ్ల హారిక పేర్కొంది. -
కిడాంబి శ్రీకాంత్‌కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: బాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌కు పద్మ శ్రీ అవార్డు దక్కడం గర్వించదగ్గ విషయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీటర్లో ట్వీట్ చేశారు. ‘బ్యాడ్మింటన్ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్‌కు పద్మశ్రీ అవార్డు ప్రకటించినందున ఆయనకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇవి నిజంగా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా గర్వించదగ్గ క్షణాలని భావిస్తున్నాను’ అని జగన్ ట్వీట్ చేశారు. Congratulations to Badminton champion @srikidambi on being awarded the Padma Shri. This is a proud moment for Telugu people all over the world. — YS Jagan Mohan Reddy (@ysjagan) 26 January 2018 -
మహామాతకు పద్మశ్రీ
సాక్షి, బెంగళూరు: ఆమె ఎన్నో వేల మందికి ప్రసవాలు చేసి తల్లీబిడ్డలకు ప్రాణాలు నిలిపింది. తల్లులకే తల్లిగా ప్రసిద్ధిచెందింది. కర్ణాటక మహామాతగా పేరుగాంచిన సూలగిత్తి నరసమ్మను పద్మశ్రీ పురస్కారం వరించింది. గురువారం ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 97 ఏళ్ల నరసమ్మ స్వస్థలం తుమకూరు జిల్లా పావుగడ తాలుకాలోని కృష్ణాపురం గ్రామం. ఆమె 70 ఏళ్లుగా సుమారు 15 వేల మందికి పైగా గర్భిణిలకు కాన్పులు చేశారు. ఒక్కరి నుంచి కూడా డబ్బు తీసుకోరు. తన చల్లని చేతులతో బిడ్డను తల్లి ఒడిలో పెట్టి మనసు నిండా సంతృప్తితో ఇంటిముఖం పడతారు. ఇటీవలే తుమకూరు విశ్వవిద్యాలయం ఆమెను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఆమె తుమకూరు, చిత్రదుర్గం జిల్లాలతో పాటు అనంతపురం సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామీణ మహిళలకు పురుడు పోయడం గమనార్హం. మహామాత నరసమ్మ చేసిన ఘనమైన సేవలకు గుర్తింపుగా కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. -
జరిగేవన్నీ మంచికనీ...
నేను నా దైవం కొడుకు జారిపడితే.. మనకు నొప్పేస్తుంది. కొడుకు చేయిజారిపోతే.. కడుపు తరుక్కుపోతుంది. కొడుకే లేకపోతే... వాడి బదులు మనం పోతే బాగుండనిపిస్తుంది. తుపాన్‌ను భరించిన చెట్టు.. ఇంకా నిలబడే ఉందంటే దాని వేళ్ళలో దైవబలం ఉన్నట్టే! చెట్టంత కొడుకు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తోటలో మిగిలిన మొక్కలతో గడుపుతున్న కోటశ్రీనివాసరావు కన్నీళ్లలో జీవనవేదన కనిపించింది. ఆయన మాటల్లో.. ‘జరిగేవన్నీ మంచికనీ...’ అన్న స్పృహ ధ్వనించింది. నా కొడుకు పెద్ద దెబ్బ కొట్టాడండీ. ఏమిటో అంతా.. ఆత్రేయగారు అన్నట్టు.. ‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికనీ...’ అనుకోవడమే మన పని. సర్, ఈ విశ్రాంత సమయం దైవాన్ని తలచుకోవడానికి, జీవితాన్ని విశ్లేషించుకోవడానికి అవకాశంగా భావిస్తున్నారా? అంతేకదమ్మా! ఇంక మిగిలింది అదే కదా! దేవుడు ఓ వైపేమో పేరు ప్రఖ్యాతులు బోలెడన్ని ఇచ్చాడు. మరో వైపు జీవితకాలం భరించు.. అనే కష్టం ఇచ్చాడు. (కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ ఏడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు) దేవుడి గొప్పతనం ఏంటంటే ఈ రెండింటినీ తట్టుకునేంత (చేతిని చాతీ మీద పెట్టుకుంటూ) గుండెను ఇచ్చాడు. ఇంకొకరైతే ఏమైపోయేవారో... ఆ కుర్చీలో కూర్చుని (ఇంటి హాల్లో గోడ మీద కోట చేసిన సినిమా పాత్రల ఫొటోలు అతికించి ఉన్నాయి) ఆ ఫొటోల వంక చూస్తుంటాను. జీవితంలో చేసిన తప్పులు, ఒప్పులు అన్నీ జ్ఞాపకం వస్తుంటాయి. కాకపోతే నమ్మేదొకటే.. తప్పొప్పులు ఎక్కడికీ పోవు. ఇక్కడే ఆ ఫలితాన్ని చూస్తాం. మంచి చేస్తే మంచే చూస్తాం, చెడు చేస్తే చెడూ చూస్తాం. కొడుకును దూరం చేశాడని దేవుడి మీద కోపం తెచ్చుకుంటున్నారా? కోపమా?! ఆయన ముందు మనమెంతటి వారం. అయినా మన ఖర్మకు ఆయన మీద కోపం తెచ్చుకోవడం ఎందుకు? అలా ఎప్పుడూ జరగలేదు. కానీ, దుఃఖం. ఇలా రాసిపెట్టి ఉంది. ఏం చేస్తాం...? దైవం గురించి బాగా అర్థం చేసుకున్నట్టు కనిపిస్తోంది.. వృత్తే దైవంగా భావించాను. ఆ వృత్తిని అర్థం చేసుకుంటూ ఎదిగాను. అందులోని మంచి చెడులను ఇప్పుడు విశ్లేషించుకుం టున్నాను. మొదట్లో నేనీ రంగానికి వచ్చినప్పుడు ఉన్న వాతావరణం ఇప్పుడు లేదు. బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడూ సినిమాల కోసం ప్రయత్నించింది లేదు. నాటకాలు వేసేవాడిని. యాదృచ్చికంగా టి.కృష్ణ గారు నా నాటకం చూసి, ‘వందేమాతం’ సినిమాలో చిన్న అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నటనే నా జీవితం అయిపోయింది. బ్యాంకులోనే ఉండి ఉంటే ఓ అధికారిని అయ్యేవాడినేమో. ఆ జీవితానికి ఈ జీవితానికీ ఎక్కడా పోలిక లేదు. ఇదంతా భగవంతుని దయ కాకపోతే మరేముంటుంది. నలుగురు అక్కచెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములం. అన్నగారు పోయారు. మిగతా అందరం ఎప్పుడైనా కలుస్తుంటాం. ఎవరి ప్రాప్తం వారిది. ఇంత జీవితాన్ని ఇచ్చినందుకు దేవునికి ఏవిధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటారు? వేంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాను. ఉదయాన్నే నిద్రలేచినప్పుడు ఆయన్ని తలుచుకొని ఓ దణ్ణం పెట్టుకుంటాను. అంతకు మించి పూజలు ఏమీ చేయను. గుళ్లకు వెళుతుంటాను. దైవం అంటే నా ఒక్కడికే కాదు అందరికీ ఉన్నాడని గట్టిగా నమ్ముతాను. మనసుకు అలసటగా అనిపించినప్పుడు ఓ అరగంట మౌనంగా కూర్చుంటాను. దైవాన్ని తలుచుకుంటూ మౌనంగానే ప్రార్థిస్తుంటాను. మీ పిల్లలు సరే, మనవలకు దైవం గురించి ఎలాంటి విషయాలు చెబుతుంటారు? అప్పుడు పిల్లలకు చెప్పడానికి నాకు టైమ్ లేదు. ఇప్పటి పిల్లలు చాలా బిజీ! నేర్పడానికి, చెప్పడానికేమీ లేదు. పొద్దున ఏడింటికి వెళితే తిరిగి రాత్రి ఏడు దాటాకే వస్తారు. వాళ్ల పుస్తకాలు, వ్యాపకాలతోనే వారికి సరిపోతుంది. మనం ఏదైనా చెబితే చికాకు పడతారు. మార్పు ఎందుకొచ్చింది అని చెప్పలేం. అలా వచ్చిందంతే! వాళ్లకు సమయం దొరికినప్పుడు ‘ఏదో ఒకటి తెలుసుకోండిరా!’ అని అంటుంటాను. వింటే వింటారు, లేకపోతే లేదు. ఈ రోజు ఒకరో ఇద్దరో కాదు ప్రపంచమే అలా ఉంది. ఈ తరాన్ని మార్చండి అని చెప్పలేం. సమాజపరిస్థితులు అలా ఉన్నాయి. భగవంతుడే మార్పు తేవాలి. మీ జ్ఞాపకాలలో దైవం మీకిచ్చిన అదృష్టం గురించి తలుచుకుంటుంటారా? అదే ఇప్పుడు చేస్తున్నది. పుస్తకాలు చదివే అలవాటు లేదు. నా జీవితమే నాకు పెద్ద పుస్తకం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకోవడం అంటే సాధారణ విషయంకాదు. నా కంటే ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. కానీ, ఆ అదృష్టం నన్ను వరించింది. ఇది భగవంతుడిచ్చిందే కదా! మంచైనా చెడైనా నేను చేసిన పాత్రలలో కనీసం 50 క్యారెక్టర్లయినా గుర్తుకు వస్తుంటాయి. అప్పటికీ ఇప్పటికీ నిలిచిపోయే క్యారెక్టర్ ‘అహ నా పెళ్లంట’ సినిమాలోనిది. మహానుభావుడు జంధ్యాలగారి ద్వారా ఆ అదృష్టాన్ని దక్కించాడు దేవుడు. ఎప్పుడైనా ఒక సినిమా గురించి బాధపడతాను. ‘పంజరం’ సినిమాలో యవ్వనంలో ఉన్న హీరోయిన్ని పెళ్లి చేసుకొని, అనుమానంతో ఆ పిల్లను పీడించే స్వభావమున్న పాత్ర అది. 102, 103 డిగ్రీల జ్వరంతో ఉండి కూడా ఆ సీన్ చేశాను. కానీ, ఆ సినిమా రెండు, మూడు రోజుల కన్నా మించి ఆడలేదు. ఇలా మంచి చెడులను తలుచుకుంటూ ఉంటాను. నేనిది కోల్పోయాను స్వామీ.. అని దేవుని ముందు చెప్పుకున్న సందర్భం? రెండున్నాయి. ఒకటి సరైన సమయంలో కుటుంబంతో గడపలేకపోయాను. షూటింగ్స్ ఉండి నెలకి, రెండు నెలలకు ఓసారి ఇంటికి వచ్చిన రోజులున్నాయి. నాకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. పిల్లల చిన్నతనంలో వారి అచ్చటా ముచ్చట పెద్దగా చూసుకుంది లేదు. వారి వెనకాల ఉండి సెట్ చేసింది లేదు. నా అదృష్టం ఏంటంటే పిల్లలు చదువుకుని, బుద్ధిమంతులుయ్యారు. రెండోది– జనరల్ నాలెడ్జి లేకుండా పోయింది. పొద్దున్న ఐదింటికో, ఆరింటికో వెళ్లిపోయేవాడిని. తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి దాటి ఏ రెండో అయ్యేది. ప్రపంచంలో ఏం జరుగుతుంది అని కూడా పట్టించుకోలేదు. ఈ రెండింటి గురించి తలుచుకొని నాలో నేను ఏడుస్తూ ఉంటాను. ఎట్లా అయిపోయిందంటే అప్పుడు తినడానికి టైమ్ లేదు. ఇప్పుడు తిందామంటే తినలేను. అప్పట్లో ఎవరు ఏం చేసేవారో కూడా తెలిసేది కాదు. పుట్టినరోజులు, పెళ్లిరోజులు.. ఏవీ పట్టేవి కావు. ఎవరికైనా టైమ్ వస్తే టైమ్ ఉండదని అర్థమైంది. ఆ రోజులు అలా గడిచిపోయాయి.నా కొడుకు పెద్ద దెబ్బ కొట్టాడండీ. ఏమిటో అంతా.. ఆత్రేయగారు అన్నట్టు.. ‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికనీ...’ అనుకోవడమే మన పని. జీవితం వెళ్లిపోయింది. వెళుతోంది. ఈ వయసులో పితృశోకం భరించవచ్చు. పుత్ర శోకం భరించలేం. తండ్రిగా ఆ బా«దను అనుభవిస్తున్నాను. ఈ దుఃఖాన్ని ఎవరూ పూడ్చలేరు. తెలిసినతను రోగంతో బాధపడుతూ ఇంకో రెండు నెలలో పోతాడనగా వెళ్లి చూసొచ్చాను. ఆయన్ను చూస్తూ ఒకాయన అన్నాడు ‘ఏంటయ్యా! ఇది.. ఇలా అయిపోయావు’ అన్నాడు. అప్పుడు అన్నాను ‘అనుభవించాడు కదా! ఇప్పుడు అనుభవిస్తున్నాడు’ అని. నేనూ అంతేగా! అన్నీ చూశాను. అర్థం చేసుకున్నాను. దేవుడు ఈ కష్టం ఇచ్చాడని ఏడుస్తూ కూర్చుంటే నన్ను నమ్ముకున్నవారు ఉన్నారు. వాళ్లేమై పోతారు. ఎలాగూ తప్పదు కాబట్టి.. నడిపించాలి అంతే! ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకోవడా నికి ఆశ్రమాలకు వెళ్ళాలనుకోవడం లేదా? ఇంతవరకు చేయలేదు. జనరేషన్ మార్పు కారణంగా ఇప్పుడు చాలా మటుకు పిల్లలు ఫారిన్లో ఉంటున్నారు. అక్కణ్ణుంచి డబ్బులు పంపిస్తుంటారు. ఇక్కడ అమ్మానాన్న ఏదో ఉన్నామంటూ దిక్కులేకుండా ఉంటారు. అదంతా విని, చూసి తట్టుకోవడం కష్టం అనిపిస్తుంది. రోజంతా ఎలా గడుపుతుంటారు? మనవలు, మనవరాలు ఉన్నారు. వారి బాగోగులు గమనించడం. కాసేపు టీవీ చూడడం, భోజనం చేయడం, నిద్రపోవడం.. తప్పదు. అంత తీరికలేకుండా ఉండి ఇప్పుడు ఇలా కూర్చోవడం అంటే ఏం చేయగలం... భగవంతుడు అలా రాసిపెట్టాడు. మనుషుల్లో దైవత్వాన్ని చూశారా? ఎదుటివాడికి సాయపడటం అంటే అక్కడ దైవం ఉన్నట్టే! కాలే కడుపుకి ఒక ముద్ద పెట్టినా చాలు కదా. అలాంటివారిని చూస్తూనే ఉంటుంటాం. మీరే దేవుడు అని ఎవరైనా అన్న సందర్భం...? ఎంతమాట. అలా అని మనం చెప్పుకోకూడదు. కొందరు అంటుంటారు కానీ అది నాకు నచ్చదు. నా దగ్గర పనిచేసేవాళ్లు, తెలిసినవాళ్లు కష్టం లేకుండా ఉన్నారా, లేరా! అని చూస్తాను. ఎవరైనా కష్టం ఉంది బాబూ అని వస్తే.. సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఇండస్ట్రీలో పది, పదిహేను లక్షలదాకా ఖర్చు పెట్టి ఉంటాను. అదంతా చెప్పుకోవడం నాకిష్టం లేదు. కష్టం ఉన్నదని వాళ్లు పది అడిగితే నేను పది ఇవ్వలేకపోవచ్చు. కానీ, మూడో నాలుగో ఇచ్చి ఉంటాను. ఈ రోజుకు కూడా ఒకరి ముందు చెయ్యి చాపే అవకాశం రానివ్వలేదు దేవుడు. అంతకు మించి ఏమున్నది. పిల్లలకూ అదే చెబుతుంటాను. మనం బతకాలి. పదిమందిని బతికించేలా ఎదగాలి అని. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
‘పద్మశ్రీ’ అవార్డు ఆశ్చర్యపరిచింది
న్యూఢిల్లీ: ఈసారి పద్మ అవార్డుల్లో భారత క్రికెట్ సూపర్స్టార్లు కెప్టెన్ ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి కూడా రేసులో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరితో పాటు మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఉన్నప్పటికీ వారిని కాదని అవార్డు తనను వరిస్తుందని ఆమె కలలో కూడా అనుకోలేదు. జరిగింది మాత్రం అదే... ఎవరూ ఊహించని రీతిలో కేంద్ర ప్రభుత్వం మిథాలీని ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ అవార్డుకు ఎంపిక చేసింది. దీంతో 32 ఏళ్ల ఈ హైదరాబాదీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఇది నిజంగా ఏమాత్రం ఊహించని పరిణామమని, చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేసింది. 1999లో అరంగేట్రం చేసిన మిథాలీ ఇప్పటిదాకా 153 వన్డేలు, 10 టెస్టులు, 47 టి20 మ్యాచ్‌లు ఆడింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ పురస్కారాన్ని అందుకోనున్న మిథాలీ రాజ్ తన భావాలను మీడియాతో పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.... కోహ్లితో పోటీ అనగానే ఆశ వదులుకున్నా: నిజాయితీగా చెప్పాలంటే పద్మశ్రీ అవార్డుకు క్రికెటర్ల నుంచి నాకు పోటీగా కోహ్లి ఉన్నాడనగానే ఆశలు వదులుకున్నాను. ఎందుకంటే పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మేమెక్కడో ఉంటాం. అందుకే కోహ్లిలాంటి స్టార్‌ను కాదని నాకిస్తారనుకోలేదు. కానీ జాబితాలో నా పేరు చూసి ఎంతగానో ఆశ్చర్యపోయాను. అసలే మాత్రం ఊహించని విషయమిది. ప్రతిభకు తగిన పురస్కారమిది: మన చిత్తశుద్ధిని, అంకితభావాన్ని గుర్తించారనడానికి కేంద్ర అవార్డులు నిదర్శనంగా నిలుస్తాయి. ఎందుకంటే నేను ఆడటం ప్రారంభించే నాటికి మహిళల క్రికెట్‌పై ఎక్కడా అవగాహన లేదు. అసలు మాకు కూడా క్రికెట్ జట్టు ఉందనే విషయం ప్రజలకు తెలీదు. అలాంటి స్థితి నుంచి మహిళల క్రికెట్‌ను కూడా ఫాలో కావాలనే కోరిక ప్రజల్లో కలిగించేలా చేశాం. దీనికి చాలా సమయమే పట్టింది. తల్లిదండ్రులకు అంకితం: నా కెరీర్ కోసం తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడ్డారు. చాలా వాటిని త్యాగం చేయాల్సి వచ్చింది. అందుకే ఈ అవార్డు వారికే అంకితం అని చె ప్పేందుకు సంతోషిస్తున్నాను. ఈ అవార్డు ప్రేరణగా నిలుస్తుంది: భారత్‌లో క్రికెట్‌ను కెరీర్‌గా తీసుకునేందుకు నాకు దక్కిన ఈ అవార్డు యువ క్రీడాకారిణులకు ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నాను. ఇక నుంచి ముఖ్యంగా క్రికెట్ అభిమానులు... మహిళా క్రికెట్‌ను మరింత ఆసక్తిగా అనుసరిస్తారేమో! కొందరిలా నేను డిమాండ్ చేయలేను: కొందరు ఆటగాళ్లు ఫలానా అవార్డుకు, గుర్తింపునకు తాము అర్హులమేనని భావిస్తుం టారు. అయితే నేను మాత్రం ఆ కేటగిరీకి చెందను. నాకు దక్కినప్పుడే తీసుకుంటాను. ప్రస్తుతానికి నాకు అవార్డు వచ్చింది. కాబట్టి సంతోషమే. మాకు మరిన్ని మ్యాచ్‌లు దక్కుతాయి: ఐసీసీ కొత్త ఫార్మాట్ ప్రకారం మేం మరిన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడగలమని అనుకుంటున్నాను. ఇంతకుముందు చాలా తక్కువ అంతర్జాతీయ సిరీస్‌ల గురించి అభిమానులు, మీడియా పట్టించుకునేది. అయితే ఇకనుంచి ఎక్కువగా మ్యాచ్‌లు జరుగుతాయి కాబట్టి ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది.