వెంకటరెడ్డిని అభినందిస్తున్న జార్జి బుష్, వైఎస్ రాజశేఖరరెడ్డి (ఫైల్)
అల్వాల్: మట్టిలో పుట్టి.. మట్టిలో పెరిగి.. చివరికి మట్టిలోనే కలవడం మానవుడి జీవన పరిణామం. కృత్రిమ రసాయనాలు వాడకుండా కేవలం మట్టినే ఎరువుగా ఉపయోగించి పోషక విలువలు ఉన్న పంటలు పండిస్తు ప్రపంచానికే ఆదర్శ రైతుగా నిలుస్తున్న అల్వాల్‌కు చెందిన చింతల వెంకటరెడ్డిని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించనుంది. కోటి పనులు కూటి కోసమే.. కానీ తినే ఆహారమే విషపూరితమైతే ఎలా అని భావించిన వెంకటరెడ్డి క్రిమి సంహారక మందులు ఉపయోగించకుండా కేవలం సేంద్రియ ఎరువులే వాడి పంటను పండించి బలవర్ధకమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో తనకున్న వ్యవసాయ భూమిని పరిశోధక కేంద్రంగా మార్చి తానే ఓ శాస్త్రవేత్తగా నిరంతరం ప్రయోగాలు నిర్వహించి సఫలీకృతుడయ్యారు.
పలు మార్లు పంటను పండించి నిస్సారంగా మారిన నేలను సారవంతంగా చేయడం కోసం తన పొలంలో 2 అడుగులు వెడల్పు, 4 అడుగుల లోతు, 380 అడుగుల పొడవు కందకం తవ్వారు. తవ్విన మట్టిని పొలం పైభాగంలో చల్లారు. పొలం పైభాగం మట్టిని తవ్విన కందకం పూడ్చడానికి వినియోగించారు. ఇలాంటి పద్ధతులు అవలంబించి ఖర్చు గణనీయంగా తగ్గించారు. సేంద్రియ విధానాలను పాటించి, అధిక దిగుబడులను సాధించారు. వెంకటరెడ్డి కనుగొన్న విధానాన్ని పంజాబ్, హరియాణా రాష్ట్రాలలో గోధుమ పంటకు అనుసరించి.. అధిక దిగుబడులను సాధించారు. అనంతరం వెంకటరెడ్డి లక్ష రూపాయల ఖర్చుతో అంతర్జాతీయ పేటెంట్ సాధించగలిగారు. మరోవంక వ్యవసాయంలో విశేష కృషి చేసిన వెంకటరెడ్డికి అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హైదరాబాద్ సందర్శనకు వచ్చినప్పుడు నేరుగా మాట్లాడే అవకాశం దక్కింది. వ్యవసాయ శాస్త్ర వేత్తలు నార్మన్ బోర్లాగ్, ఎం.ఎస్ స్వామినాథన్‌లు వెంకటరెడ్డి వ్యవసాయంలో అనుసరిస్తున్న మెలకువలను అడిగి తెలుసుకున్నారు.
విశేష కృషికి ఉత్తమ గుర్తింపు
⇒ రైతు సేవలను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో వెంకటరెడ్డికి ఆదర్శ రైతు పురస్కారాన్ని అందించి ప్రోత్సహించారు. ఆహార ఉత్పత్తిని పెంచడానికి ఆయన కృషిని ప్రశంసించారు.
⇒ సేంద్రియ ఎరువులను ఉపయోగించి వరి, గోధుమ, ద్రాక్ష పంటల దిగుబడి రెట్టింపు చేశారు వెంకటరెడ్డి.
⇒ దేనికీ పనికి రాని చెట్టు ఆకులను ఎరువుగా ఉపయోగించి పంట దిగుబడి పెంచడానికి కృషి చేస్తున్నారాయన.
⇒ నారు పోయడం, నాటు వేయడం, కలుపుతీయడం వంటి పనులు లేకుండా ఒకేసారి వరి, ఇతర ఆరు రకాల పంటలను సాగు చేసేందుకు వీలుగా ఓ యంత్రాన్ని తయారు చేసి వ్యవసాయ శాస్త్రవేత్తలకు వివరించారు. ఇందుకు పేటెంట్ హక్కు పొందడం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
⇒ ’దేశంలోని పలు వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వెంకట్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వచ్చి అధ్యయనం చేస్తుంటారు.
⇒ 1990లో మాజీ గవర్నర్ కుముద్‌బెన్ జోషి ద్రాక్ష తోటను సందర్శించి వెంకట్‌రెడ్డిని అభినందించారు.
⇒ ఐసీఎఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్) డైరెక్టర్ జనరల్ పరోడా, డైరెక్టర్ మిశ్రాలు వెంకటరెడ్డిని కలిసి వ్యవసాయ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి ప్రశంసించారు.
భవిష్యత్ లక్ష్యాలు ఇవీ..
⇒ భారత దేశం పంటలు ప్రపంచంలోనే గుర్తింపు పొందాలి.
⇒ తినే ఆహారంలో పోషక పదార్థాలే ఉండాలి.
⇒ రైతు వ్యవసాయ ఉత్పత్తి ఖర్చు, సమయం తగ్గించాలి.
⇒ తాను చేసే ప్రతి పరిశోధన భారతీయులకే సొంతం కావాలి.
జీవన ప్రస్థానం ఇదీ..
1950 డిసెంబర్ 22న అల్వాల్‌లో చింతల వెంకటరెడ్డి జన్మించారు. ప్రీ యూనివర్సిటీ కోర్సు (పీయూసీ) బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివారు. స్వతహాగా రైతు కుటుంబం నుంచి
వచ్చిన వెంకటరెడ్డి వ్యవసాయంపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించేవారు. ఆంధ్రపదేశ్ ద్రాక్ష రైతు అభివృద్ధి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. జాతీయ పరిశోధన సంస్థ పుణే విభాగంలో సభ్యుడిగా ఉన్నారు. 1990లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్రాక్ష రత్న అవార్డు ప్రదానం చేసింది. ఆయన సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు వచ్చాయి. దీంతోపాటు పద్మశ్రీ అవార్డు వరించడం పట్ల వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు, స్నేహితులు, రైతు మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయమంటే ప్రాణం..
రైతు బిడ్డగా జన్మించిన నేను వ్యవసాయాన్నే నమ్ముకున్నాను. పది మందికి ఆహారం అందించే రైతే అందరికన్నా మిన్నా. నేలను సారవంతంగా మార్చడానికి అనుసరించాల్సిన పద్ధతి, సేంద్రియ ఎరువులతోనే పంటను పండించి పోషక పదార్థాలున్న ఆహారాన్ని అందించాలన్నదే తన లక్ష్యం. భూమిలోనే అన్ని రకాల పోషక పదర్థాలు ఉన్నాయి. కృత్రిమంగా తయారు చేసిన రసాయన మందులు, ఎరువులు ఉపయోగించి సారవంతమైన నేలను పాడు చేయడంతోపాటు దానితో పండిన పంట సైతం విషతుల్యంగా మార్చుతున్నాం. రసాయన ఎరువులు వాడడం వలన రైతుకు పెట్టుబడి పెరగడంతో వ్యవసాయం భారంగా మారుతుంది. ఇకనైనా మన వ్యవసాయ పద్ధతి మారాలి. ఇందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి. భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంతో నా బాధ్యత మరింత పెరిగింది. – చింతల వెంకటరెడ్డి, రైతు (శాస్త్రవేత్త)
Comments
Please login to add a commentAdd a comment