Chinthala Venkata Reddy
-
ఆముదం నూనె కలిపిన మట్టితో చీడపీడలకు చెక్
భూమి లోపలి నుంచి తీసి ఎండబెట్టిన 10 కిలోల మెత్తని మట్టి (సబ్ సాయిల్)కి అర లీటరు ఆముదం నూనెను బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని పంట మొక్కల పాదుల్లో లేదా డ్రిప్పర్ల వద్ద పిడికెడు వేసి నీరు అందిస్తే ఆ పంటలకు ఇక చీడపీడల బెడద అసలు ఉండదని రుజువైందని ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట రెడ్డి (సీవీఆర్) తెలిపారు. మొక్క నాటిన/విత్తిన పది రోజులకు మొదటిసారి, అక్కడి నుంచి 15–20 రోజులకు మరోసారి పిడికెడు వేస్తే చాలు. వంగ, టమాటో, బెండ, బీర వంటి పంటలతోపాటు పత్తి, వరి, గోధుమ పంటల్లో సైతం ఈ ప్రయోగం సఫలమైందన్నారు. వంగ వంటి కూరగాయ పంటలకు పురుగు బెడద ఎక్కువ. భూమి లోపలి నుంచి తీసిన మట్టిని ఎండబెట్టి వంగ మొక్కల పాదుల వద్ద వేయడంతోపాటు, ఆ మట్టిని నీటిలో కలిపి 4–5 రోజులకోసారి పిచికారీ చేయటం ద్వారా వంగ పంటలో చీడపీడలు రాకుండా చూసుకోవచ్చని సీవీఆర్ గతంలో చెప్పారు. ఇటీవల లోపలి మట్టికి ఆముదం నూనె కలిపి పాదుల్లో లేదా డ్రిప్లర్ల దగ్గర వేస్తే పచ్చ దోమ, తెల్ల దోమ వంటి రసంపీల్చే పురుగులతోపాటు కాయ తొలిచే పురుగు కూడా ఆయా మొక్కల దరిదాపుల్లోకి రావటం లేదని గుర్తించారు. మొక్కల పెరుగుదల బాగా ఉందని, దిగుబడి కూడా బాగా వచ్చిందని సీవీఆర్ వివరించారు. ఆముదం నూనెను వాడేటప్పుడు ఎమల్సిఫయర్ ద్రావణాన్ని కలపటం పరిపాటి అని అంటూ.. లోపలి మట్టే ఎమల్సిఫయర్‌గా పనిచేస్తోందని.. ఆముదం నూనె వాసనకు చీడపీడలు దరిచేరటం లేదని గుర్తించానని వివరించారు. ఆముదం నూనె కలిపిన మట్టి మిశ్రమం వేసిన తర్వాత కుళ్లింపజేసే పశువుల ఎరువు, ఘనజీవామృతం, వర్మీకంపోస్టు వంటి సేంద్రియ ఎరువులను చెట్ల దగ్గర వేయకూడదని రైతులు గమనించాలన్నారు. అలా వేస్తే మట్టిలో కలిపి వేసిన ఆముదం నూనె (చీడపీడలను తరిమేసే) ప్రభావాన్ని కోల్పోతుందన్నారు. అదేవిధంగా, ద్రవ జీవామృతం, గోకృపామృతం, వేస్ట్ డీకంపోజర్)ను ఆముదం నూనె కలిపిన మట్టి మిశ్రమంపై పోయటం లేదా డ్రిప్ ద్వారా అందించడం కూడా చేయవద్దని సీవీఆర్ హెచ్చరించారు. అయితే, వీటిని ఆయా పంటలపై పిచికారీ చేసుకోవచ్చని సూచించారు. 10 కేజీల భూమి లోపలి నుంచి తీసిన మెత్తని పొడి మట్టికి పావు లీటరు ఆముదం నూనె, మరో పావు లీటరు వేప/కానుగ నూనెను కలిపి కూడా వేసుకోవచ్చని సీవీఆర్ సూచించారు. ఆముదం నూనె కలిపిన మట్టి మిశ్రమం 200 గ్రాములను 20 లీటర్ల నీటిలో కలిపి పంటలపై వారానికోసారి పిచికారీ చేయటం మరీ మంచిదని సీవీఆర్ తెలిపారు. చింతల వెంకట రెడ్డి -
‘మట్టి’ పద్మం!
పంట భూమికి పోషకాలను అందించాలన్నా.. చీడపీడల బెడద నుంచి పంటలను కాపాడుకోవాలన్నా కావాల్సిందేమిటి? రసాయనిక ఎరువులు, పురుగుమందులు, చివరకు కషాయాలు కూడా అవసరం లేదు.. కేవలం మట్టి ద్రావణం ఉంటే చాలు. ఇది రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి ఆవిష్కరించిన గొప్ప సంగతి. 12–13 ఏళ్ల నుంచి ద్రాక్ష, వరి, గోధుమ, కూరగాయ పంటలకు ఎరువుగా వేయడం, మట్టి ద్రావణాన్ని ద్రవరూప ఎరువుగా, పురుగుల మందుగా పిచికారీ చేయడం విశేషం. ఆయన పండించిన బియ్యంలో విటమిన్ ఎ ఉందని రుజువైంది. అంతేకాదు.. ప్రపంచ మేధోహక్కుల సంస్థ(వైపో)ను మెప్పించి, 2008లోనే 28 ఐరోపా దేశాల్లో పేటెంట్లు పొందారు. చింతల వెంటకటరెడ్డి ఆవిష్కరణ గురించి ఏప్రిల్ 7, 2014న ‘లోపలి మట్టిలోనే పోషకాల లోగుట్టు’ శీర్షికన సాక్షి ‘సాగుబడి’ సమగ్ర కథనాన్ని ప్రచురించింది. తదనంతరం పత్రికలు, టీవీలు, డిజిటల్ మీడియా ద్వారా చింతల వెంకట రెడ్డి(సి.వి.ఆర్.) సాగు పద్ధతి ఇటీవల విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పలువురు రైతులు వివిధ పంటలపై మట్టి ద్రావణాన్ని వాడుతూ మండే ఎండల్లోనూ చక్కని పంట దిగుబడులు పొందుతుండడం హర్షదాయకం! ఈ ఏడాది పద్మశ్రీ అవార్డుకు చింతల వెంకటరెడ్డి ఎంపికైన సందర్భంగా ఆయన ఆవిష్కరణ విశేషాలు మరోసారి.. మట్టి ద్రావణం.. కొన్ని మెలకువలు! నేలతల్లి అన్నపూర్ణ. అన్ని పోషకాలకూ నిలయం. అటువంటి మట్టిని సేకరించి పంటల సాగులో పోషకాల కోసం, చీడపీడల సమర్థ నివారణ కోసం వినియోగించుకునే వేర్వేరు పద్ధతులు, ఈ క్రమంలో రైతులు పాటించాల్సిన మెలకువలను రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి (సీవీఆర్) ‘సాగుబడి’కి వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక పంటలపై రైతులు మట్టి ద్రావణాన్ని ద్రాక్ష, బొప్పాయి, ఆపిల్ బెర్, దానిమ్మ, బత్తాయి, నిమ్మ, టమాటో, వంగ, బీర, కాకర, దొండ, పూల తోటల్లో వాడుతూ సత్ఫలితాలు పొందుతున్నారన్నారు. అయితే, మల్బరీ తోటపై మట్టి ద్రావణం పిచికారీ చేయరాదని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మట్టి ద్రావణం చల్లిన ఆకులు తింటే పట్టుపురుగులు కూడా చనిపోతాయన్నారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. ‘పై మట్టి’ అంటే? సీజనల్ పంటలు లేదా తోటలను తాము సాగు చేసుకుంటున్న భూముల్లో నుంచే మట్టిని సేకరించుకోవాలి. ఇతర భూముల నుంచి సేకరించడం ప్రారంభిస్తే.. ఇతర సమస్యలు తలెత్తుతాయి. భూమి పైన 3–4 అంగుళాల లోతు వరకు ఉన్న మట్టిని ‘పై మట్టి’(టాప్ సాయిల్) అని పిలుస్తున్నాం. దీన్ని వర్షాకాలం ప్రారంభానికి ముందే యంత్రాల సాయంతో సేకరించి, వర్షానికి తడవకుండా నిల్వ చేసుకోవాలి. ఇది అత్యంత సారవంతమైనది కాబట్టి.. పంటల పోషణకు ఉపయోగపడుతుంది. ‘లోపలి మట్టి’ అంటే? పైమట్టిని తొలగించిన తర్వాత అదే భూమిలో మీటరు వెడల్పున 4 అడుగుల లోతు వరకు కందకం తవ్వాలి. ఇలా తవ్వి తీసిన మట్టి మొత్తాన్ని ‘లోపలి మట్టి’ (సబ్ సాయిల్) అని పిలుస్తున్నాం. ఈ మట్టిని కుప్పపోసి, కలియదిప్పాలి. ఆ మట్టి మొత్తాన్నీ లోపలి మట్టిగా వాడుకోవచ్చు. లోపలి మట్టిలో(నల్ల రేగడి మట్టిలో మరింత ఎక్కువ) జిగట ఉంటుంది. ఈ జిగట చీడపీడలను సమర్థవంతంగా అరికట్టడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి, లోపలి మట్టిని ఎండబెట్టి వాడితే పోషకాల శాతం పెరుగుతుంది. ఎండబెట్టకుండానే మట్టి ద్రావణం తయారీలో వాడినా పర్వాలేదు. పంటల పోషణ కోసం పిచికారీ ఇలా.. ఎకరానికి 200 లీ. నీరు+ 15 కిలోల పైమట్టి+ 15 కిలోల లోపలి మట్టిని బాగా కలియదిప్పి.. 45 నిమిషాలు ఉంచాలి. పై తేట నీటిని మాత్రమే వడకట్టి పంటలపై సాయంత్రం 4.30 తర్వాత చల్లపూట పిచికారీ చేయాలి. అడుగుకు చేరిన బురదను మొక్కల మొదళ్ల వద్ద వేసుకుంటే బలం. పంటలకు పోషకాలు అందించడానికి వాడే మట్టి నల్ల రేగడి మట్టి అయితే ఎక్కువ ప్రయోజనకరం. పోషకాల కోసం పైమట్టికి బదులుగా క్వారీల దగ్గర నుంచి సేకరించే రాయిపొడిని వాడితే మరీ మంచిది. చీడపీడల నివారణ కోసం పిచికారీ ఇలా.. ► చీడపీడల నివారణకు జిగట ఉన్న ‘లోపలి మట్టి’ని మాత్రమే నీటిలో కలిపి వాడాలి. ఎర్ర మట్టి అయినా, నల్ల మట్టి అయినా అందులో జిగట ఉంటేనే చీడపీడలు పోతాయి. 200 లీ. నీటిలో 20 కిలోల లోపలి మట్టిని వేసి బాగా కలపాలి. అర గంట తర్వాత పైకి తేరుకున్న 170 లీటర్ల నీటిని పంటలపై పిచికారీ చేయాలి. అడుగుకు చేరిన బురదను పంట మొక్కలు, చెట్ల మొదళ్లలో వేసుకోవచ్చు. పైమట్టిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పైమట్టిని కూడా కలిపితే చీడపీడలు త్వరగా కంట్రోల్ కావు. ► మట్టి ద్రావణంతోపాటు ఎకరానికి 2 కిలోల ఆవు పేడ, 2 కిలోల ఆవు మూత్రం లేదా లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా, చేప అమినో ఆమ్లం కలిపితే.. ఉదయం / సాయంత్రం చల్లని వేళ్లల్లో మాత్రమే పిచికారీ చేయాలి. ► పంటల పోషణకు లేదా చీడపీడల నివారణకు కేవలం మట్టి ద్రావణాన్నే పిచికారీ చేయదలచుకుంటే.. 44 డిగ్రీల ఎండకాసేటప్పుడు మిట్ట మధ్యాహ్నమైనా పిచికారీ చేయొచ్చు. ► కూరగాయ తోటలకైతే మట్టి ద్రావణాన్ని 3–4 రోజులకోసారి పిచికారీ చేయాలి. టమాటో, వంగ, బీర తోటలకు వారానికోసారి కొట్టొచ్చు. ► పంటల పోషణ కోసమైతే మట్టి ద్రావణాన్ని కలిపిన అరగంట తర్వాత వడకట్టి వాడాలి. కలిపిన అరగంట తర్వాత 3–4 గంటలలోపు ఎంత తొందరగా వాడితే అంత మంచిది. ► చీడపీడల నివారణ కోసం కలిపిన లోపలి మట్టి ద్రావణమైతే వడకట్టి నిల్వపెట్టుకొని ఎన్నాళ్ల తర్వాతయినా కలియదిప్పి పిచికారీ చేసుకోవచ్చు. ► ఇతర వివరాల కోసం సికింద్రాబాద్‌లోని ఓల్డ్ ఆల్వాల్ వాస్తవ్యుడైన చింతల వెంకటరెడ్డిని 98668 83336 నంబరులో లేదా e-mail: cvreddyind@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. మట్టి ద్రావణం మట్టి ఎరువు, ద్రావణంతో సాగైన ద్రాక్ష తోట -
మట్టి మనిషి.. మహాకృషి
అల్వాల్: మట్టిలో పుట్టి.. మట్టిలో పెరిగి.. చివరికి మట్టిలోనే కలవడం మానవుడి జీవన పరిణామం. కృత్రిమ రసాయనాలు వాడకుండా కేవలం మట్టినే ఎరువుగా ఉపయోగించి పోషక విలువలు ఉన్న పంటలు పండిస్తు ప్రపంచానికే ఆదర్శ రైతుగా నిలుస్తున్న అల్వాల్‌కు చెందిన చింతల వెంకటరెడ్డిని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించనుంది. కోటి పనులు కూటి కోసమే.. కానీ తినే ఆహారమే విషపూరితమైతే ఎలా అని భావించిన వెంకటరెడ్డి క్రిమి సంహారక మందులు ఉపయోగించకుండా కేవలం సేంద్రియ ఎరువులే వాడి పంటను పండించి బలవర్ధకమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో తనకున్న వ్యవసాయ భూమిని పరిశోధక కేంద్రంగా మార్చి తానే ఓ శాస్త్రవేత్తగా నిరంతరం ప్రయోగాలు నిర్వహించి సఫలీకృతుడయ్యారు. పలు మార్లు పంటను పండించి నిస్సారంగా మారిన నేలను సారవంతంగా చేయడం కోసం తన పొలంలో 2 అడుగులు వెడల్పు, 4 అడుగుల లోతు, 380 అడుగుల పొడవు కందకం తవ్వారు. తవ్విన మట్టిని పొలం పైభాగంలో చల్లారు. పొలం పైభాగం మట్టిని తవ్విన కందకం పూడ్చడానికి వినియోగించారు. ఇలాంటి పద్ధతులు అవలంబించి ఖర్చు గణనీయంగా తగ్గించారు. సేంద్రియ విధానాలను పాటించి, అధిక దిగుబడులను సాధించారు. వెంకటరెడ్డి కనుగొన్న విధానాన్ని పంజాబ్, హరియాణా రాష్ట్రాలలో గోధుమ పంటకు అనుసరించి.. అధిక దిగుబడులను సాధించారు. అనంతరం వెంకటరెడ్డి లక్ష రూపాయల ఖర్చుతో అంతర్జాతీయ పేటెంట్ సాధించగలిగారు. మరోవంక వ్యవసాయంలో విశేష కృషి చేసిన వెంకటరెడ్డికి అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హైదరాబాద్ సందర్శనకు వచ్చినప్పుడు నేరుగా మాట్లాడే అవకాశం దక్కింది. వ్యవసాయ శాస్త్ర వేత్తలు నార్మన్ బోర్లాగ్, ఎం.ఎస్ స్వామినాథన్లు వెంకటరెడ్డి వ్యవసాయంలో అనుసరిస్తున్న మెలకువలను అడిగి తెలుసుకున్నారు. విశేష కృషికి ఉత్తమ గుర్తింపు ⇒ రైతు సేవలను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో వెంకటరెడ్డికి ఆదర్శ రైతు పురస్కారాన్ని అందించి ప్రోత్సహించారు. ఆహార ఉత్పత్తిని పెంచడానికి ఆయన కృషిని ప్రశంసించారు. ⇒ సేంద్రియ ఎరువులను ఉపయోగించి వరి, గోధుమ, ద్రాక్ష పంటల దిగుబడి రెట్టింపు చేశారు వెంకటరెడ్డి. ⇒ దేనికీ పనికి రాని చెట్టు ఆకులను ఎరువుగా ఉపయోగించి పంట దిగుబడి పెంచడానికి కృషి చేస్తున్నారాయన. ⇒ నారు పోయడం, నాటు వేయడం, కలుపుతీయడం వంటి పనులు లేకుండా ఒకేసారి వరి, ఇతర ఆరు రకాల పంటలను సాగు చేసేందుకు వీలుగా ఓ యంత్రాన్ని తయారు చేసి వ్యవసాయ శాస్త్రవేత్తలకు వివరించారు. ఇందుకు పేటెంట్ హక్కు పొందడం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ⇒ ’దేశంలోని పలు వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వెంకట్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వచ్చి అధ్యయనం చేస్తుంటారు. ⇒ 1990లో మాజీ గవర్నర్ కుముద్‌బెన్ జోషి ద్రాక్ష తోటను సందర్శించి వెంకట్‌రెడ్డిని అభినందించారు. ⇒ ఐసీఎఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్) డైరెక్టర్ జనరల్ పరోడా, డైరెక్టర్ మిశ్రాలు వెంకటరెడ్డిని కలిసి వ్యవసాయ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి ప్రశంసించారు. భవిష్యత్ లక్ష్యాలు ఇవీ.. ⇒ భారత దేశం పంటలు ప్రపంచంలోనే గుర్తింపు పొందాలి. ⇒ తినే ఆహారంలో పోషక పదార్థాలే ఉండాలి. ⇒ రైతు వ్యవసాయ ఉత్పత్తి ఖర్చు, సమయం తగ్గించాలి. ⇒ తాను చేసే ప్రతి పరిశోధన భారతీయులకే సొంతం కావాలి. జీవన ప్రస్థానం ఇదీ.. 1950 డిసెంబర్ 22న అల్వాల్‌లో చింతల వెంకటరెడ్డి జన్మించారు. ప్రీ యూనివర్సిటీ కోర్సు (పీయూసీ) బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివారు. స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వెంకటరెడ్డి వ్యవసాయంపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించేవారు. ఆంధ్రపదేశ్ ద్రాక్ష రైతు అభివృద్ధి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. జాతీయ పరిశోధన సంస్థ పుణే విభాగంలో సభ్యుడిగా ఉన్నారు. 1990లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్రాక్ష రత్న అవార్డు ప్రదానం చేసింది. ఆయన సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు వచ్చాయి. దీంతోపాటు పద్మశ్రీ అవార్డు వరించడం పట్ల వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు, స్నేహితులు, రైతు మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయమంటే ప్రాణం.. రైతు బిడ్డగా జన్మించిన నేను వ్యవసాయాన్నే నమ్ముకున్నాను. పది మందికి ఆహారం అందించే రైతే అందరికన్నా మిన్నా. నేలను సారవంతంగా మార్చడానికి అనుసరించాల్సిన పద్ధతి, సేంద్రియ ఎరువులతోనే పంటను పండించి పోషక పదార్థాలున్న ఆహారాన్ని అందించాలన్నదే తన లక్ష్యం. భూమిలోనే అన్ని రకాల పోషక పదర్థాలు ఉన్నాయి. కృత్రిమంగా తయారు చేసిన రసాయన మందులు, ఎరువులు ఉపయోగించి సారవంతమైన నేలను పాడు చేయడంతోపాటు దానితో పండిన పంట సైతం విషతుల్యంగా మార్చుతున్నాం. రసాయన ఎరువులు వాడడం వలన రైతుకు పెట్టుబడి పెరగడంతో వ్యవసాయం భారంగా మారుతుంది. ఇకనైనా మన వ్యవసాయ పద్ధతి మారాలి. ఇందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి. భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంతో నా బాధ్యత మరింత పెరిగింది. – చింతల వెంకటరెడ్డి, రైతు (శాస్త్రవేత్త) -
లోపలి మట్టిలో పోషకాలపై త్వరలో అధ్యయనం
పీజేటీఎస్ఏయూ స్పెషల్ ఆఫీసర్ డా. ప్రవీణ్‌రావు వెల్లడి చింతల వెంకటరెడ్డి వినూత్న సేద్య పద్ధతికి ప్రశంసలు సమస్య ఎక్కడ ఉందో పరిష్కారమూ అక్కడే ఉంటుందనేది అక్షర సత్యం. రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి తన తెలివి తేటలతో రుజువు చేశారు. భూమి లోపలి నుంచి తీసి ఎండబెట్టిన మట్టిని పంటలకు దఫదఫాలుగా వేస్తే చాలని, రసాయనిక ఎరువుల అవసరం లేనేలేదంటూ తన ఆవిష్కరణ ద్వారా చింతల వెంకటరెడ్డి కొన్నేళ్ల క్రితమే చాటిచెప్పారు. ఈ పూర్వరంగంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ) స్పెషల్ ఆఫీసర్ డా. ప్రవీణ్‌రావు ఇటీవల కీసర మండలం కుందనపల్లిలోని వెంకటరెడ్డి ద్రాక్ష తోటను సందర్శించి ముగ్ధుడయ్యారు. ఈ ద్రాక్ష పండ్ల నాణ్యత నమ్మశక్యం కాకుండా ఉందని, తియ్యదనం (22% బ్రిక్స్), కాయ పెళుసుతనం చాలా బాగుందన్నారు. కాయలు ఒకే సైజులో ఉండటం, ఆకులు బాగా ఆకుపచ్చగా ఉండటం అరుదైన విషయమన్నారు. ప్రకృతికి అనుగుణమైన రీతిలో సాగుతున్న వినూత్నమైన ఈ సాగు పద్ధతిపై శాస్త్రవేత్తల బృందంతో త్వరలోనే లోతైన అధ్యయనం చేయిస్తానని డా. ప్రవీణ్‌రావు తెలిపారు. ఈ సాగు పద్ధతి అనుసరించదగినదేనని ఇతర రైతులకు తమ యూనివర్సిటీ సిఫారసు చేయాలంటే.. తొలుత శాస్త్రీయ అధ్యయనం చేయడం తప్పనిసరన్నారు. ఎరువుగా వేస్తున్న మట్టి, పంటలకు వాడుతున్న నీరు తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేసి.. దీనిపై తుది నిర్ణయానికొస్తామన్నారు. ద్రాక్ష పరిశోధనా కేంద్రం మాజీ ముఖ్య శాస్త్రవేత్త డా. జీ సత్యనారాయణ, డా. చింతల రాజ్నరసింహారెడ్డి పాల్గొన్నారు. వెంకటరెడ్డి వినూత్న సేద్య పద్ధతిని ‘లోపలి మట్టిలోనే పోషకాల లోగుట్టు’ అనే శీర్షికన గత ఏడాది ‘సాగుబడి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ‘ప్రపంచ భూముల పరిరక్షణ సంవత్సరం’లో ఈ సాంకేతికతపై అధ్యయనం చేయాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించుకోవటం ఆనందించదగిన, అభినందించదగిన విషయం. చెరువు మట్టిని ఎండబెట్టి ఎరువుగా వాడొచ్చు చెరువుల్లో పూడిక తీసిన మట్టిలో భూమి లోపలి పొరల్లో(సబ్ సాయిల్లో) మాదిరిగానే పోషకాలుంటాయి. కాబట్టి, చెరువులో తవ్వి తీసిన మట్టిని కూడా ఎండబెట్టి బస్తాల్లో నిల్వ చేసుకొని.. ఏ పంటకైనా దఫదఫాలుగా వేసుకుంటే నాణ్యమైన, సకల పోషకాలతో కూడిన చక్కని దిగుబడులు సాధించవచ్చని రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి తెలిపారు.