ద్రాక్ష తోటలో మట్టి ద్రావణం పిచికారీ, పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన మట్టి ద్రావణం ఆవిష్కర్త చింతల వెంకటరెడ్డి
పంట భూమికి పోషకాలను అందించాలన్నా.. చీడపీడల బెడద నుంచి పంటలను కాపాడుకోవాలన్నా కావాల్సిందేమిటి? రసాయనిక ఎరువులు, పురుగుమందులు, చివరకు కషాయాలు కూడా అవసరం లేదు.. కేవలం మట్టి ద్రావణం ఉంటే చాలు. ఇది రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి ఆవిష్కరించిన గొప్ప సంగతి. 12–13 ఏళ్ల నుంచి ద్రాక్ష, వరి, గోధుమ, కూరగాయ పంటలకు ఎరువుగా వేయడం, మట్టి ద్రావణాన్ని ద్రవరూప ఎరువుగా, పురుగుల మందుగా పిచికారీ చేయడం విశేషం. ఆయన పండించిన బియ్యంలో విటమిన్ ఎ ఉందని రుజువైంది.
అంతేకాదు.. ప్రపంచ మేధోహక్కుల సంస్థ(వైపో)ను మెప్పించి, 2008లోనే 28 ఐరోపా దేశాల్లో పేటెంట్లు పొందారు. చింతల వెంటకటరెడ్డి ఆవిష్కరణ గురించి ఏప్రిల్ 7, 2014న ‘లోపలి మట్టిలోనే పోషకాల లోగుట్టు’ శీర్షికన సాక్షి ‘సాగుబడి’ సమగ్ర కథనాన్ని ప్రచురించింది. తదనంతరం పత్రికలు, టీవీలు, డిజిటల్ మీడియా ద్వారా చింతల వెంకట రెడ్డి(సి.వి.ఆర్.) సాగు పద్ధతి ఇటీవల విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పలువురు రైతులు వివిధ పంటలపై మట్టి ద్రావణాన్ని వాడుతూ మండే ఎండల్లోనూ చక్కని పంట దిగుబడులు పొందుతుండడం హర్షదాయకం! ఈ ఏడాది పద్మశ్రీ అవార్డుకు చింతల వెంకటరెడ్డి ఎంపికైన సందర్భంగా ఆయన ఆవిష్కరణ విశేషాలు మరోసారి..
మట్టి ద్రావణం.. కొన్ని మెలకువలు!
నేలతల్లి అన్నపూర్ణ. అన్ని పోషకాలకూ నిలయం. అటువంటి మట్టిని సేకరించి పంటల సాగులో పోషకాల కోసం, చీడపీడల సమర్థ నివారణ కోసం వినియోగించుకునే వేర్వేరు పద్ధతులు, ఈ క్రమంలో రైతులు పాటించాల్సిన మెలకువలను రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి (సీవీఆర్) ‘సాగుబడి’కి వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక పంటలపై రైతులు మట్టి ద్రావణాన్ని ద్రాక్ష, బొప్పాయి, ఆపిల్ బెర్, దానిమ్మ, బత్తాయి, నిమ్మ, టమాటో, వంగ, బీర, కాకర, దొండ, పూల తోటల్లో వాడుతూ సత్ఫలితాలు పొందుతున్నారన్నారు. అయితే, మల్బరీ తోటపై మట్టి ద్రావణం పిచికారీ చేయరాదని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మట్టి ద్రావణం చల్లిన ఆకులు తింటే పట్టుపురుగులు కూడా చనిపోతాయన్నారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..
‘పై మట్టి’ అంటే?
సీజనల్ పంటలు లేదా తోటలను తాము సాగు చేసుకుంటున్న భూముల్లో నుంచే మట్టిని సేకరించుకోవాలి. ఇతర భూముల నుంచి సేకరించడం ప్రారంభిస్తే.. ఇతర సమస్యలు తలెత్తుతాయి. భూమి పైన 3–4 అంగుళాల లోతు వరకు ఉన్న మట్టిని ‘పై మట్టి’(టాప్ సాయిల్) అని పిలుస్తున్నాం. దీన్ని వర్షాకాలం ప్రారంభానికి ముందే యంత్రాల సాయంతో సేకరించి, వర్షానికి తడవకుండా నిల్వ చేసుకోవాలి. ఇది అత్యంత సారవంతమైనది కాబట్టి.. పంటల పోషణకు ఉపయోగపడుతుంది.
‘లోపలి మట్టి’ అంటే?
పైమట్టిని తొలగించిన తర్వాత అదే భూమిలో మీటరు వెడల్పున 4 అడుగుల లోతు వరకు కందకం తవ్వాలి. ఇలా తవ్వి తీసిన మట్టి మొత్తాన్ని ‘లోపలి మట్టి’ (సబ్ సాయిల్) అని పిలుస్తున్నాం. ఈ మట్టిని కుప్పపోసి, కలియదిప్పాలి. ఆ మట్టి మొత్తాన్నీ లోపలి మట్టిగా వాడుకోవచ్చు. లోపలి మట్టిలో(నల్ల రేగడి మట్టిలో మరింత ఎక్కువ) జిగట ఉంటుంది. ఈ జిగట చీడపీడలను సమర్థవంతంగా అరికట్టడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి, లోపలి మట్టిని ఎండబెట్టి వాడితే పోషకాల శాతం పెరుగుతుంది. ఎండబెట్టకుండానే మట్టి ద్రావణం తయారీలో వాడినా పర్వాలేదు.
పంటల పోషణ కోసం పిచికారీ ఇలా..
ఎకరానికి 200 లీ. నీరు+ 15 కిలోల పైమట్టి+ 15 కిలోల లోపలి మట్టిని బాగా కలియదిప్పి.. 45 నిమిషాలు ఉంచాలి. పై తేట నీటిని మాత్రమే వడకట్టి పంటలపై సాయంత్రం 4.30 తర్వాత చల్లపూట పిచికారీ చేయాలి. అడుగుకు చేరిన బురదను మొక్కల మొదళ్ల వద్ద వేసుకుంటే బలం. పంటలకు పోషకాలు అందించడానికి వాడే మట్టి నల్ల రేగడి మట్టి అయితే ఎక్కువ ప్రయోజనకరం. పోషకాల కోసం పైమట్టికి బదులుగా క్వారీల దగ్గర నుంచి సేకరించే రాయిపొడిని వాడితే మరీ మంచిది.
చీడపీడల నివారణ కోసం పిచికారీ ఇలా..
► చీడపీడల నివారణకు జిగట ఉన్న ‘లోపలి మట్టి’ని మాత్రమే నీటిలో కలిపి వాడాలి. ఎర్ర మట్టి అయినా, నల్ల మట్టి అయినా అందులో జిగట ఉంటేనే చీడపీడలు పోతాయి. 200 లీ. నీటిలో 20 కిలోల లోపలి మట్టిని వేసి బాగా కలపాలి. అర గంట తర్వాత పైకి తేరుకున్న 170 లీటర్ల నీటిని పంటలపై పిచికారీ చేయాలి. అడుగుకు చేరిన బురదను పంట మొక్కలు, చెట్ల మొదళ్లలో వేసుకోవచ్చు. పైమట్టిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పైమట్టిని కూడా కలిపితే చీడపీడలు త్వరగా కంట్రోల్ కావు.
► మట్టి ద్రావణంతోపాటు ఎకరానికి 2 కిలోల ఆవు పేడ, 2 కిలోల ఆవు మూత్రం లేదా లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా, చేప అమినో ఆమ్లం కలిపితే.. ఉదయం / సాయంత్రం చల్లని వేళ్లల్లో మాత్రమే పిచికారీ చేయాలి.
► పంటల పోషణకు లేదా చీడపీడల నివారణకు కేవలం మట్టి ద్రావణాన్నే పిచికారీ చేయదలచుకుంటే.. 44 డిగ్రీల ఎండకాసేటప్పుడు మిట్ట మధ్యాహ్నమైనా పిచికారీ చేయొచ్చు.
► కూరగాయ తోటలకైతే మట్టి ద్రావణాన్ని 3–4 రోజులకోసారి పిచికారీ చేయాలి. టమాటో, వంగ, బీర తోటలకు వారానికోసారి కొట్టొచ్చు.
► పంటల పోషణ కోసమైతే మట్టి ద్రావణాన్ని కలిపిన అరగంట తర్వాత వడకట్టి వాడాలి. కలిపిన అరగంట తర్వాత 3–4 గంటలలోపు ఎంత తొందరగా వాడితే అంత మంచిది.
► చీడపీడల నివారణ కోసం కలిపిన లోపలి మట్టి ద్రావణమైతే వడకట్టి నిల్వపెట్టుకొని ఎన్నాళ్ల తర్వాతయినా కలియదిప్పి పిచికారీ చేసుకోవచ్చు.
► ఇతర వివరాల కోసం సికింద్రాబాద్‌లోని ఓల్డ్ ఆల్వాల్ వాస్తవ్యుడైన చింతల వెంకటరెడ్డిని 98668 83336 నంబరులో లేదా e-mail: cvreddyind@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.
మట్టి ద్రావణం
మట్టి ఎరువు, ద్రావణంతో సాగైన ద్రాక్ష తోట
Comments
Please login to add a commentAdd a comment