మట్టి మర్మమెరిగిన మహా రైతు! | interview about Farmer scientist Dr. l narayana reddy | Sakshi
Sakshi News home page

మట్టి మర్మమెరిగిన మహా రైతు!

Published Tue, Jan 22 2019 5:57 AM | Last Updated on Tue, Jan 22 2019 5:57 AM

interview about Farmer scientist Dr. l narayana reddy - Sakshi

రైతు శాస్త్రవేత్త డాక్టర్‌ ఎల్‌. నారాయణరెడ్డి, యువ రైతులకు శిక్షణ ఇస్తున్న నారాయణరెడ్డి

సేంద్రియ వ్యవసాయంలో ఆరితేరిన సుప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త డాక్టర్‌ ఎల్‌. నారాయణరెడ్డి. కర్ణాటక దొడ్డబళ్లాపూర్‌ దగ్గరలోని మరలేనహళ్లిలోని తన కలల పంట అయిన సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని అంతర్జాతీయ రైతు శిక్షణా కేంద్రంగా మలిచారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులతో వ్యవసాయం ప్రారంభించిన ఆయన విదేశీ యాత్రికుడి ద్వారా కొన్ని దశాబ్దాల క్రితమే జపాన్‌కు చెందిన ప్రకృతి వ్యవసాయోద్యమకారుడు డాక్టర్‌ మసనోబు ఫుకుఓకా రచించిన ‘వన్‌ స్ట్రా రెవెల్యూషన్‌’ (గడ్డి పరకతో విప్లవం) చేతికి వచ్చిన తర్వాత ప్రకృతి వ్యవసాయం చేపట్టి 40 ఏళ్లు సుభిక్షంగా కొనసాగించారు.

ఇటీవల 84 ఏళ్ల వయసులో తన వ్యవసాయ క్షేత్రంలో ఈనెల 14న రాత్రి నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. మన భూముల్లో సేంద్రియ కర్బనం 0.3 శాతం ఉందని అంచనా. అయితే, నారాయణరెడ్డి తన 4.5 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ కర్బనాన్ని 5 మేరకు పెంచారంటే నేలతల్లిని ఆయన ఎంతగా గుండెలకు హత్తుకున్నారో అర్థమవుతుంది. మట్టి మర్మమెరిగి మెసలిన ఆ మహా రైతు, మహోపాధ్యాయుడిని ‘సాక్షి’ దినపత్రిక 2012 జూలైలో తెలుగు రైతులకు తొలిసారి పరిచయం చేసింది. రానున్న కాలం సేంద్రియ రైతుదేనని గొప్ప దార్శనికతతో ప్రకటించిన నారాయణరెడ్డితో ‘సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు అప్పట్లో జరిపిన సంభాషణను పునర్ముద్రిస్తూ ప్రకృతి వ్యవసాయ యోధుడికి అక్షరాంజలి ఘటిస్తున్నాం..

► వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని మీరెలా చూస్తున్నారు?
రైతు శ్రమకు సరైన ప్రతిఫలం దక్కటం లేదు. గిట్టుబాటు ధర దొరకటం లేదు. ప్రభుత్వమే రైతుకు మొదటి శత్రువు. మంచినీటికి ఉన్న ధర పాలకు లేదు. 1960లో రూ. 18 వేలున్న ట్రాక్టర్‌ ధర ఇప్పుడు(ఏడేళ్ల క్రితం) రూ. 3.5 లక్షలు. వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర దానికి తగ్గట్టు ఎందుకు పెంచటం లేదు? గ్రామాల నుంచి 40 శాతం మంది యువకులు ఏటా పట్టణాలకు వలసపోతున్నారు. వాళ్లను కూడా తప్పుపట్టలేం. వృద్ధులం ఆత్మగౌరవం చంపుకోలేక ఊరు వదల్లేకపోతున్నాం.

► ఈ దుస్థితి ఎక్కడికి దారితీస్తుంది?
రాసిపెట్టుకోండి. కొద్ది ఏళ్లలోనే దేశంలో తినడానికేమీ ఉండదు. రెండో హరిత విప్లవం, జన్యుమార్పిడి సాంకేతికత.. వీటి వల్ల ఒరిగేదేమీ ఉండదు. ప్రభుత్వం చేసిన ద్రోహం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. సమాజం రైతులను చిన్నచూపు చూస్తోంది. పదెకరాలుండి ఏటా రూ. 5 లక్షలు సంపాదించే తమిళ బ్రాహ్మణ రైతుకు 42 ఏళ్లొచ్చినా వధువు దొరకడం లేదు.

► మీ వ్యవసాయం గురించి చెప్పండి?
బయటి నుంచి కొని తెచ్చిన రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేయం. చెరువు మట్టితో పాటు వానపాములు, ఆకులు ఆలములతో కంపోస్టు తయారు చేసి వేస్తాను. నా పొలంలో 18 ఏళ్ల క్రితం భూసారానికి నిదర్శనమైన జీవన ద్రవ్యం (హ్యూమస్‌) 0.4 శాతం ఉండేది. ఇప్పుడు(ఆరేళ్ల క్రితం) 3.2 శాతం ఉంది (ఇటీవల ఇది 5 శాతానికి పెరిగింది). ఎండు ఆకు గాలికి పోతుంటే రూ. 5 పోయినట్టేనని బాధపడతాను. మా పొలంలో ఇప్పటికి ఒక్కసారి కూడా చెత్తకు నిప్పు పెట్టలేదు. టేకు, మద్ది, పనస, చింత, సపోట, బటర్‌ ఫ్రూట్, కొబ్బరి చెట్లను పెంచడంతో పాటు కూరగాయలు, ధాన్యాలు పండిస్తాను. రాగులు, దండిగా కూరగాయలు, పండ్లు తింటాం. మా జీవితం, మా వైభవం రాష్ట్రపతికి కూడా దొరకదు. నేను వ్యవసాయం ప్రారంభించిన మొదట్లో  (1972లో) రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడి నష్టపోయా. పొలం అమ్మేసి వ్యాపారం చేదా ్దమనుకున్నాను. సేంద్రియ రైతుగా మారిన నాసా సైంటిస్టు మాట సాయంతో..  మసనోబు ఫుకుఓకా ‘గడ్డి పరకతో విప్లవం’ పుస్తకం చదివి ప్రకృతి వ్యవసాయం చేపట్టి, రెండేళ్లలోనే నిలదొక్కుకున్నాను.

► రసాయనిక వ్యవసాయం ఎందుకు వద్దో వివరంగా చెబుతారా?
ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ శాస్త్రం ఒక మిథ్య. చైనాలో వాడుతున్న ఎరువుల్లో 35 శాతం మానవ విసర్జితాల నుంచి వచ్చిన సేంద్రియ ఎరువే. భూమి పైపొరలోని ఒక గ్రాము మట్టిలో 2 కోట్ల 90 లక్షల సూక్ష్మజీవులుంటాయి. రసాయనాల వాడకం వల్ల మన భూముల్లో జీవం నశించింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఎ.ఆర్‌.) సహాయ సంచాలకుడుగా పనిచేసిన శైలేంద్రనాథ్‌ 1972లోనే రసాయనిక ఎరువులు పూర్తిగా మాని సేంద్రియ ఎరువులు వాడాలని చెప్పాడు. కానీ, వ్యవసాయంపై టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌ డా. స్వామినాథన్‌ రసాయనాల్లేకుండా జానానికి తిండి ఎలా పెడతామని ఇప్పటికీ అడుగుతూనే ఉన్నాడు. ప్రభుత్వం చెబుతున్న పద్ధతిలో ఎకరానికి 12 క్వింటాళ్లు పండుతున్న రాగులను నేను 23 క్వింటాళ్లు పండించాను. నిజంగా దిగుబడి పెరగటమే కావాలంటే.. నేను చెప్పిన పద్ధతిని అనుసరించవచ్చు కదా?

► భూసార పరీక్షలు చేశాకే గదా ఎరువులు వేయమంటున్నారు?
రసాయనిక ఎరువులు వేసే ముందు భూసార పరీక్షలు చేయించమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏ పోషకం లోపిస్తే ఆ ఎరువును ఎక్కువగా వేస్తున్నారు. బాగానే ఉంది. అయితే, పోషకాలు ఒక పొలంలో ఒక చోట ఉన్నట్లు మరో చోట ఉండవు. పైగా రుతువును బట్టి మట్టిలో పోషకాల స్థాయి మారుతూ ఉంటుంది. అందుకే భూసార పరీక్షలు అసంబద్ధమైనవి. నేను బడిలో చదువుకున్నది నాలుగో తరగతే. వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్లను కూడా నోరు మూయించగలను. మట్టిలో పుట్టి పెరిగిన వాళ్లం. మట్టి రుచి చూసి, చెప్పుల్లేకుండా పొలంలో నడిచి వచ్చి ఆ భూమి గుణగణాలు గ్రహిస్తాం.

► ఎరువుల ద్వారా కాకుండా మరే విధంగా పోషకాలు అందుతాయి?
ప్రకృతి సిద్ధంగా పోషకాలు అందే మార్గాలున్నాయి. ఒక చదరపు మీటరు వాతావరణంలో 8 టన్నుల నత్రజని ఉంటుంది. మైకోరైజా అనే సూక్ష్మజీవి వాతావరణంలోని నత్రజనిని గ్రహించి భూమికిస్తుంది. మెరుపు మెరిసినప్పుడు 2,600 సెంటీగ్రేడ్‌ ఉష్ణం వస్తుంది. మెరుపు నత్రజనిని అమోనియా వాయువుగా మార్చి వర్షంతో కలిపి ఇస్తుంది. కంపోస్టు వేస్తే 26 రోజులకు, యూరియా వేస్తే 35 గంటలకు, మెరుపుల ద్వారా 4 గంటలకే పోషకాలు అంది, పంటల రంగు ముదురు ఆకుపచ్చగా మారుతుంది. దీని లెక్కేమైనా ఉందా ఈ సైంటిస్టుల దగ్గర? గ్రాము వరి మొక్క వేరును ఆశ్రయించి వంద కోట్ల సూక్ష్మజీవులుంటాయి. వేళ్లు స్రవించే ఆమ్లం మట్టిలో 70 శాతం మేర ఉండే ఇసుక, రాళ్ల ముక్కలను కరిగిస్తుంది. కిలో ఇసుక, రాళ్ల ముక్కల్లో మొక్కలకు అవసరమైన 453 గ్రాముల పోషకాలుంటాయి.

► రసాయనిక ఎరువుల వల్ల ప్రయోజనం లేదా..?
రసాయనిక ఎరువులో 16 శాతమే పంటకు ఉపకరిస్తుంది. అది కూడా తగుమాత్రంగా తేమ ఉంటేనే. దాని ప్రభావం వేసిన తర్వాత 4 రోజులే ఉంటుంది. రసాయనిక ఎరువులు నేలను విషపూరితం చేస్తాయి. గట్టిపరుస్తాయి. భూమిని గుల్లబరుస్తూ సారవంతం చేసే వానపాములు, సూక్ష్మజీవులు, చెద పురుగులు, చీమలను రసాయనిక ఎరువులు చంపేస్తాయి. గత 60 ఏళ్లుగా రసాయనిక ఎరువులు వేయడం వల్ల మన పొలాల్లో ఏటా ఎకరంలో 16 నుంచి 20 టన్నుల జీవన ద్రవ్యం జీవం కోల్పోయి గట్టిపడిపోతుంటుంది. గుల్లగా ఉండి పంటలకు పోషకాలు అందించే జీవన ద్రవ్యం నీటి తేమను పట్టి ఉంచే శక్తిని కోల్పోయి, రాయి మాదిరిగా మారిపోతుంది. రసాయనిక ఎరువుల వల్ల గట్టిపడిపోయిన పొలాన్ని అరకతో దున్నలేం. ట్రాక్టర్‌ పెట్టి దున్నాల్సి వస్తుంది. 4 టన్నుల బరువున్న ట్రాక్టర్‌ తిరిగితే పొలం మరింత గట్టిపడక ఏమవుతుంది? పంజాబ్‌ రైతులు 75 హెచ్‌.పి. ట్రాక్టర్‌ వాడేవాళ్లు. ఇప్పుడు 135 హెచ్‌.పి. ట్రాక్టర్‌ వాడుతున్నారు. పొలాల్లో మానులను కొట్టేశారు. భూమికి ఆచ్ఛాదన ఏమీ లేకుండా పోయింది. పంట నూర్చిన తర్వాత చెత్తకు నిప్పు పెడుతున్నారు. ఇది చాలా తప్పు. గట్టిపడిపోయిన నేలకు నీడలేక, గాలి ఆడక, నీరు అందక నిస్సారమైపోతోంది.

► భూసారం అందుకే తగ్గిపోతోందా..?
దక్కన్‌ పీఠభూమిలో 1960లో పొలాల్లో జీవన ద్రవ్యం 3 శాతం ఉండేది. హరిత విప్లవం ఫలితంగా గత 58 సంవత్సరాల రసాయనిక కృషి వల్ల మన భూముల్లో 3% ఉన్న సేంద్రియ కర్బనం ఇప్పుడు 0.3%కు తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. పైన జానెడు మన్నులో ఎకరానికి 90 టన్నులు ఉండాల్సిన సేంద్రియ కర్బనం 3 టన్నులకు వచ్చిందంటే మనం భూమికి ఎంత ద్రోహం చేశామో, మనకెంత ద్రోహం చేసుకున్నామో తెలుస్తుంది. అనంతపురం జిల్లాలో 0.27 శాతానికి తగ్గిపోయింది. వర్షానికి పొలంలో నుంచి ఎర్రనీళ్లు పారుతూ ఉంటాయి కదా. అదే భూమికి బలాన్నిచ్చే జీవన ద్రవ్యం. పూర్వీకులు పెంచిన పెద్ద చెట్లు కొట్టేయడం, రసాయనిక ఎరువులు వాడటం వల్ల సాగునీటి అవసరం పది రెట్లు పెరిగింది. భూమి గట్టిపడిపోవటం వల్ల వేర్లకు ప్రాణవాయువు కూడా అందటం లేదు.

► రైతు సోదరులకు ఇంకేమైనా చెప్తారా?
జీవన శైలిని మార్చుకోవాలి. ఒకర్ని చూసి మరొకరు ఏదీ చేయకూడదు. ఇంకొకరి కోసం బతకకూడదు. మనకి తగినట్టుగానే మనం బతకాలి. ఎవరికీ భయపడకూడదు. సంగటి తింటామని చెప్పుకోవటం నామోషీ కాకూడదు. సంస్కృతి, సంప్రదాయక ఆహారం అంతరించిపోయాయి. ఈ రెంటినీ కాపాడుకుంటున్న జపాన్‌ వంటి దేశాలు ఎన్ని సునామీలొచ్చినా కూలిపోవు. ఉత్పాదక భూములు(ప్రొడక్టివ్‌ సాయిల్స్‌), ఉత్పాదక ప్రజలు (ప్రొడక్టివ్‌ పీపుల్‌) ఉన్న దేశమే బాగుంటుంది. కానీ, ఇప్పుడు మనుషులు వ్యాధిగ్రస్తులై పనిచేసే మనుషులు, శక్తివంతులుగా ఉండే మనుషులు ఎందరున్నారన్నది ప్రశ్న.
ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే మొదట భూమి ఆరోగ్యం బాగుండాలి. సాయిల్‌ హెల్త్‌ బాగుంటే మంచి ఆహారం దొరుకుతుంది. ఆరోగ్యం దొరుకుతుంది. మన రాజకీయ నాయకులు అందరూ సేంద్రియ వ్యవసాయం గురించి ఆలోచించాలి. పెరిగిన జనాభాకు సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆహారం పండించగలమా అని అడుగుతూ ఉంటారు. నేను చెబుతున్నాను.. నిస్సందేహంగా పండించగలం. నేలతల్లిని మనం ప్రేమించి సేంద్రియ కర్బనం పెంచుకుంటే మనకు, ముందు తరాలకూ ఆరోగ్యం, ఆనందం, సంపద కూడా దొరుకుతుంది.    

► రైతులు చేయాల్సిందేమిటి?
నారాయణరెడ్డి: రైతులు చేయాల్సిన పనులు ఐదు ఉన్నాయి.
1. మల్చింగ్‌ : పొలానికి ఆచ్ఛాదన కల్పించాలి. ఇందుకోసం ఎకరానికి 25 చెట్లు.. 4,5 రకాలు పెంచుకోవాలి. చెట్లలో 20 శాతం మల్చింగ్‌ రొట్ట కోసం (సుబాబుల్, అవిశ, గిరిపుష్పం లేదా గ్లైరిసీడియా వంటి చెట్లు), 20 శాతం (జిల్లేడు, వయ్యారిభామ – దీని పువ్వు రాక ముందే కోసెయ్యాలి – కానుగ, వేప వంటి చెట్లు), 40 శాతం మెట్ట నేలల్లో పెరిగే (చింత, మామిడి, నేరేడు, సీతాఫలం, సపోట, పనస వంటివి) చెట్లు, మిగతా 20 శాతం (టేకు, మలబారు వేప వంటి) కలప చెట్లు పెంచాలి. 20 ఏళ్ల చెట్టు రోజుకు 40 లీటర్ల నీటి తేమను వాతావరణంలోకి వదులుతుంది. చెట్లు పొలంలో ఉండటం వల్ల సూక్ష్మ వాతావరణం ఏర్పడుతుంది. అత్యంత ఖరీదైన వ్యవసాయ ఉపకరణం సూర్యరశ్మి. పెద్ద చెట్లున్న ఎకరంలో సూర్యరశ్మిని, గాలిని 3 రెట్లు ఎక్కువగా వినియోగించుకోవచ్చు.  
2.    రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడకుండా ఉండటం.
3.వర్మీ కంపోస్టు కొనకుండా స్వయంగా తయారు చేసుకొని వాడటం.
4.    చెరువు మట్టి తోలుకోవటం.
5.    పురుగుమందులకు బదులు ఆకుల కషాయాలు, పశువుల మూత్రం వాడటం. దేశవాళీ ఆవు విసర్జితాల్లో ఔషధ గుణాలున్నాయి. జెర్సీ ఆవైనా దాని తల్లి మన ఊళ్లో పుట్టినదై ఉంటే ఫర్వాలేదు. మన వేప గింజల ద్రావణానికి మించిన పురుగుమందు లేదు. రైతు అన్ని విధాలా స్వయం సమృద్ధి సాధిస్తేనే మనుగడ సాధ్యమని రుడాల్స్‌ స్టైనర్‌ వంటి వాళ్లు 90 ఏళ్ల క్రితమే చెప్పారు.

డాక్టర్‌ లక్ష్మయ్య నారాయణరెడ్డి బడిలో చదివింది 4వ తరగతే అయినా, పొలాన్ని అనుదినం అధ్యయనం చేస్తున్న నిత్య విద్యార్థి. బయటి నుంచి ఏదీ కొనే పని లేకుండా వ్యవసాయం చేస్తూ బతికి బట్టకట్టడం ఎలాగో ఆయనను చూసి నేర్చుకోవాల్సిందే. ‘లీసా ఇండియా’ ఆంగ్ల మాసపత్రికలో రైతుగా తన అనుభవాలను ఆయన రాస్తుంటారు.  హంపీ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ఇచ్చి గౌరవించింది. కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది. నలభయ్యేళ్లుగా సేద్యం చేస్తున్న ఆయన ముగ్గురు కుమారులూ రైతులే. ఆయన తన పొలంలో ‘పరాశర కృషి గురుకులం’ నడుపుతున్నారు. కాలేజీల్లో వ్యవసాయ శాస్త్రం చదివిన వాళ్ల ఆలోచనా విధానాల వల్లే దేశం గుల్లయ్యిందని, రాబోయే కాలం తనలాంటి రైతు శాస్త్రవేత్తలదేనని నారాయణరెడ్డి నిండైన ఆత్మవిశ్వాసంతో ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు. ఆ సంభాషణ ముఖ్యాంశాలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement