ట్రాక్టరు చిన్నది.. పనితనం పెద్దది! | formar scientist mini tractors Multiple benefits | Sakshi
Sakshi News home page

ట్రాక్టరు చిన్నది.. పనితనం పెద్దది!

Published Tue, Jan 2 2018 4:40 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

formar scientist mini tractors Multiple benefits - Sakshi

మినీ ట్రాక్టర్‌తో కంది చేనులో అంతర సేద్యం చేస్తున్న సైదాచారి

రైతుల్లో చిన్న రైతులు 80% మంది ఉన్నప్పటికీ.. వీరికి అనువైనవి, అందుబాటులో ఉండే వ్యవసాయ యంత్ర పరికరాలు మాత్రం తక్కువే! ఈ కొరత తీర్చడానికి చిన్నపాటి ట్రాక్టర్‌ను ఒక గ్రామీణ రైతు శాస్త్రవేత్త తయారు చేశాడు. చదువు తక్కువే అయినా గొప్ప ప్రజ్ఞ చూపారు. పత్తి, మిరప, అపరాలు, కూరగాయ పందిరి తోటల్లో.. ఇంకా చెప్పాలంటే 40 అంగుళాల వెడల్పు సాళ్లుండే మెట్ట, ఆరుతడి పంటలు, పండ్ల తోటలన్నిటిలోనూ సేద్యపు పనులకు చక్కగా ఉపయోగపడుతుంది.

దుక్కి, పైపాటు చేయటం, బోదెలు తోలటం, ఎరువులు వేయటం, కషాయాలు/జీవామృతం పిచికారీ చేయటం, 6 క్వింటాళ్ల వరకు సరుకు రవాణా.. ఈ అన్ని పనులకూ ఉపయోగపడే అతి చిన్న ట్రాక్టరు రైతులకు అందుబాటులోకి వచ్చింది. చాలా తక్కువ బరువు(200 కిలోలు) ఉండటం, ముందు – వెనక్కి వెళ్లేందుకు గేర్లు కూడా ఉండటం విశేషం. ఇటువంటి రైతు శాస్త్రవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తే చిన్న రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.


జిల్లోజు సైదాచారి స్వస్థలం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ (ఎస్‌) మండలంలోని కందగట్ల గ్రామం. చదివింది ఏడో తరగతే. అయితే, చిన్న రైతులకు ఉపయోగపడే వ్యవసాయ పరికరాలను తయారు చేయటంలో దిట్ట.  ఇనుప ఎడ్లబండ్లు, ఇనుప నాగళ్లు, ఎడ్లతో ఉపయోగించే రోటవేటర్‌ను తయారు చేసి ఆ ప్రాంత రైతుల అభిమానాన్ని చూరగొన్న సైదాచారి.. మరో అడుగు ముందుకేసి చిన్న రైతుకు ఉపయోగపడే చిన్నపాటి ట్రాక్టరును తయారు చేసి అందర్నీ ఆకర్షిస్తున్నారు. కూలీల కొరతతో సాగు కనాకష్టంగా మారుతున్న తరుణంలో ఖరీదైన వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేసే స్థోమత లేని కొద్దిపాటి వ్యవసాయం ఉన్న రైతులకు సైదాచారి తయారు చేసే యంత్రపరికరాలు అక్కరకొస్తున్నాయి. మెట్ట పంటల సాగుకు అన్నివిధాలా ప్రయోజనకారిగా ఉండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు.

సైదాచారి తండ్రి గ్రామంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు తయారు చేయడంతోపాటు మరమ్మతులు చేసేవారు. ఏడో తరగతి వరకు చదువుకున్న సైదాచారి అప్పట్లో కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కార్పెంటర్‌ పని నేర్చుకున్నారు. సాదాసీదా పనిముట్లతో సరిపెట్టుకోకుండా తక్కువ ఖర్చుతో చిన్న రైతులకు ఉపయోగపడే సరికొత్త యంత్రాలు తయారు చేయాలన్న తపనతో తాజాగా మినీ ట్రాక్టరును ఆవిష్కరించారు. ఆయన చేపట్టిన వినూత్న ప్రయోగాలకు భార్య జ్యోతి తోడూ నీడగా నిలుస్తున్నారు. మినీ ట్రాక్టరును రూపొందించే క్రమంలో రెండేళ్ల క్రితం టిల్లర్‌ను  రూపొందించారు. దానికి మంచిపేరే వచ్చినా రైతులు స్వయంగా వాటిని నెడుతూ బలాన్ని ప్రయోగించాల్సి ఉండడంతో.. ఆ ఇబ్బందులు లేని మినీ ట్రాక్టరును లక్ష్యంగా పెట్టుకొని, పట్టుదలతో సాధించారు.

మినీ ట్రాక్టరు తయారీ ఇలా..
5 హెచ్‌పీ సామర్ధ్యం గల చైనా ఇంజిన్, రెండు టిల్లర్‌ టైర్లు, మరో రెండు ఆటో టైర్లను, సామిల్లులో వాడే బేరింగ్‌లను సైదాచారి మినీ ట్రాక్టరు తయారీలో వాడారు. బెల్టుల సాయంతో టైర్లు తిరిగేలా రూపకల్పన చేశారు. ఇనుప అబ్బులు, డిస్క్‌లను సొంతంగా తీర్చిదిద్దారు. ముందుకు, వెనక్కి వెళ్లేలా గేర్లను అమర్చి చిన్న ట్రాక్టరును ప్రయోజనకరంగా, అందంగా ఆవిష్కరించారు. ఈ క్రమంలో సైదాచారికి జీవిత భాగస్వామి జ్యోతి ప్రోద్భలం ఎంతో ఉంది. సైదాచారి ఒక మనిషి సహాయంతో  రూ.70 వేల ఖర్చుతో 15 రోజులకు ఒక ట్రాక్టరును శ్రద్ధగా తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు మినీ ట్రాక్టర్లను రూ. 90 వేల చొప్పున విక్రయించారు. మినీ ట్రాక్టరుతో పాటు దీనికి జోడించి (20 కిలోల)ఎరువులు వేసే డబ్బా, గొర్రు, గుంటక, కూరగాయ తోటలకు బోదెలు పోసే పరికరాన్ని కూడా ఇస్తున్నారు. ట్రాలీని విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది. 6 క్వింటాళ్ల వరకు బరువు లాగే శక్తి ఈ మినీ ట్రాక్టరుకు ఉంది. మినీ ట్రాక్టరు గురించి ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న రైతులు అనేక జిల్లాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారు.

లీటరు డీజిల్‌తో ఎకరం దుక్కి
3 అడుగుల ఎత్తు, 27 అంగుళాల వెడల్పు, 50 అంగుళాల పొడవుతో.. కేవలం 200 కిలోల కన్నా తక్కువ బరువుండే తన మినీ ట్రాక్టర్‌.. మెట్ట/ఆరుతడి పంటల సాగుకు ఎంతో ప్రయోజనకారని సైదాచారి చెబుతున్నారు. 10 ఎకరాలు సాగుచేస్తున్న రైతు అవసరాలన్నింటినీ తీర్చగలద.ని, లీటర్‌ డీజిల్‌తో సుమారు ఎకరం దున్నుకునేందుకు వీలుంది. పత్తి పంట 5 అడుగుల ఎత్తు పెరిగే వరకు పాటు చేసేందుకు, మందు చల్లేందుకు సులువుగా ఉంటుంది. మిర్చి, చెరకు, పసుపు, మల్బరీ, నిమ్మ తోటలతో పాటు కూరగాయల సాగులో దున్నకానికి అనుకూలంగా ఉంటుంది. 20 కిలోల డబ్బాతో ఎరువు వేసుకోవచ్చు. స్ప్రే పంపును అనుసంధానం చేసుకుంటే 50 లీటర్ల ట్యాంకుతో పురుగుమందులను, కషాయాలను, ద్రవరూప ఎరువులను అరగంటలో ఎకరానికి పిచికారీ చేయవచ్చు. బోరులో మోటారు రిపేరు వస్తే.. ఒక్క మనిషే ఈ ట్రాక్టరు సాయంతో మోటారును బయటకు తీయవచ్చు. ఇలాంటి గ్రామీణ ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రొత్సాహం అందిస్తే  తమకు తక్కువ ధరకు వ్యవసాయానుకూల ట్రాక్టరు దొరకుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
– జలగం మల్లయ్య, సాక్షి, ఆత్మకూర్‌(ఎస్‌), సూర్యాపేట జిల్లా

ప్రభుత్వం ప్రొత్సహిస్తే తక్కువ ధరకే మినీ ట్రాక్టరు అందిస్తా!
చిన్న రైతుల వ్యవసాయావసరాలకు అనుగుణంగా పనిముట్లను తయారు చేస్తున్నాను. అందులో భాగంగానే మినీ ట్రాక్టరును తయారు చేశాను. దీనికి రిపేర్లు రావు. చైన్లు మార్చుకోవాల్సి వస్తే, రైతులే కొత్త చైన్లు తెచ్చి మార్చుకోవచ్చు. ఇదెలాగో రైతుకు నేనే నేర్పిస్తా. ఒక వేళ బేరింగ్‌ పోతే మెకానెక్‌ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. కేవలం 200 కిలోల బరువుండే ఇంత చిన్నదైన, ఇన్ని పనులు చేసే చిన్న ట్రాక్టరు నాకు తెలిసి దేశంలోనే మరెక్కడా లేదు. కూరగాయ పందిరి తోటల్లో కూడా నిశ్చింతగా దీన్ని ఉపయోగించవచ్చు. చిన్న, సన్నకారు రైతులు మెట్ట పొలాల్లో దీంతో సాగు చేసుకోవచ్చు. మామిడి, నిమ్మ తోటలతో పాటు పత్తి, మిర్చి, చెరుకు, పసుపు, కూరగాయల తోటల రైతులకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుతో ఫలితం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం ప్రొత్సహిస్తే చిన్న ట్రాక్టరును రూ. 90 వేల కన్నా తక్కువ ధరకే ఇవ్వగలుగుతా. చిన్న రైతులకు ఉపయోగపడే మరిన్ని పనిముట్లను తయారుచేసి తక్కువ ధరకు అందిస్తా.
– జిల్లోజు సైదాచారి (99512 52280),
కందగట్ల, ఆత్మకూర్‌(ఎస్‌) మండలం, సూర్యాపేట జిల్లా


జాతీయ స్థాయి గుర్తింపునకు కృషి
సైదాచారి గ్రామీణ ఆవిష్కర్తగా 20 ఏళ్ల నుంచి స్థానిక రైతుల అవసరాలకు అనుగుణంగా యంత్రపరికరాలు తయారు చేస్తున్నారు. మొదటి నమూనాను పాత విడి భాగాలతో తయారు చేయటం ద్వారా ఖర్చును, వనరులను ఆదా చేయటం.. తాను రూపొందించిన యంత్ర పరికరాలను మొదట తాను ఉపయోగించిన తర్వాతే ఇతరులకు ఇవ్వటం.. తక్కువ ఖర్చుతో చిన్న రైతులకు మెట్ట సేద్యంలో ఉపయోగపడే మినీ ట్రాక్టర్‌ను తయారు చేయటం ఆయన సృజనాత్మకతకు నిదర్శనాలు. పల్లెసృజన, నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ద్వారా ఈయన ఆవిష్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడానికి కృషి చేస్తాం. మార్చిలో రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసే ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌లో సైదాచారి మినీ ట్రాక్టర్‌ను ప్రదర్శింపజేయడానికి ప్రయత్నిస్తున్నాం.
– విశ్రాంత బ్రిగేడియర్‌ పోగుల గణేశం
(98660 01678), అధ్యక్షులు, పల్లెసృజన, సైనిక్‌పురి, సికింద్రాబాద్‌.

                                                       మినీ ట్రాక్టర్‌తో అంతర సేద్యం

                                                   మినీ ట్రాక్టర్‌కు అనుసంధానించిన ట్రాలీ

  రైతు శాస్త్రవేత్త సైదాచారి కుటుంబాన్ని అభినందిస్తున్న పల్లెసృజన అధ్యక్షులు గణేశం, ఉపాధ్యక్షులు శ్రీకర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement