mini tractor
-
రూ. 40 వేలతో మినీ ట్రాక్టర్ , ఇంట్రస్టింగ్ స్టోరీ
పెద్దగా చదువుకోకపోయినా సృజనాత్మక ఆలోచన, పట్టుదలతో కూడి కృషితో అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పటానికి ఈ మినీ ట్రాక్టర్ ఓ ఉదాహరణ. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన పెంచల నారాయణ (25) వెల్డింగ్ పనిచేస్తూ జీవిస్తున్నారు. 9వ తరగతి వరకు చదువుకున్న నారాయణ చిన్న రైతుల కోసం కేవలం రూ.40 వేల ఖర్చుతో మినీ ట్రాక్టర్‌ను తయారు చేసి ప్రశంసలు పొందుతున్నారు. ఆటో ఇంజన్ తదితర విడిభాగాలను జత చేసి మినీ ట్రాక్టర్‌ను రూపొందించారు. 2 లీటర్ల డీజిల్‌తో ఎకరా పొలం దున్నేయ వచ్చునని నిరూపించారు. ΄ పొలం దున్నడంతో పాటు నిమ్మ, జామ వంటి పండ్ల తోటల్లో అంతర సేద్య పనులను ఈ మినీ ట్రాక్టర్‌తో అవలీలగా చేసుకోవచ్చని నారాయణ వివరించారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే రైతులకు తక్కువ ఖర్చుతో కూడిన మినీ ట్రాక్టర్‌ను అందిస్తానని పెంచల నారాయణ అంటున్నారు. కాన్సెప్ట్ బాగుంది: గణేశంపల్లెసృజన అధ్యక్షులు బ్రిగేడియర్ పోగుల గణేశం మాట్లాడుతూ.. ‘కాన్సెప్ట్ బాగుంది. ఏమీ తెలియని ఒక అబ్బాయి నడిచే మోటరు వాహనాన్ని తయారు చేయడం సులభం కాదు అన్నారు. ‘రోడ్డు మీద బాగానే నడుస్తోంది. చిన్న ఇంజన్‌తో దుక్కిచేయటం వంటి శక్తితో కూడుకున్న పనులను ఏయే రకాల భూముల్లో ఈ చిన్న టాక్టర్ ఎంతవరకు చేయగలుగుతుందో చూడాలి’ అన్నారాయన. – కే.మధుసూధన్, సాక్షి, పొదలకూరు -
ట్రాక్టరు చిన్నది.. పనితనం పెద్దది!
రైతుల్లో చిన్న రైతులు 80% మంది ఉన్నప్పటికీ.. వీరికి అనువైనవి, అందుబాటులో ఉండే వ్యవసాయ యంత్ర పరికరాలు మాత్రం తక్కువే! ఈ కొరత తీర్చడానికి చిన్నపాటి ట్రాక్టర్‌ను ఒక గ్రామీణ రైతు శాస్త్రవేత్త తయారు చేశాడు. చదువు తక్కువే అయినా గొప్ప ప్రజ్ఞ చూపారు. పత్తి, మిరప, అపరాలు, కూరగాయ పందిరి తోటల్లో.. ఇంకా చెప్పాలంటే 40 అంగుళాల వెడల్పు సాళ్లుండే మెట్ట, ఆరుతడి పంటలు, పండ్ల తోటలన్నిటిలోనూ సేద్యపు పనులకు చక్కగా ఉపయోగపడుతుంది. దుక్కి, పైపాటు చేయటం, బోదెలు తోలటం, ఎరువులు వేయటం, కషాయాలు/జీవామృతం పిచికారీ చేయటం, 6 క్వింటాళ్ల వరకు సరుకు రవాణా.. ఈ అన్ని పనులకూ ఉపయోగపడే అతి చిన్న ట్రాక్టరు రైతులకు అందుబాటులోకి వచ్చింది. చాలా తక్కువ బరువు(200 కిలోలు) ఉండటం, ముందు – వెనక్కి వెళ్లేందుకు గేర్లు కూడా ఉండటం విశేషం. ఇటువంటి రైతు శాస్త్రవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తే చిన్న రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. జిల్లోజు సైదాచారి స్వస్థలం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలోని కందగట్ల గ్రామం. చదివింది ఏడో తరగతే. అయితే, చిన్న రైతులకు ఉపయోగపడే వ్యవసాయ పరికరాలను తయారు చేయటంలో దిట్ట. ఇనుప ఎడ్లబండ్లు, ఇనుప నాగళ్లు, ఎడ్లతో ఉపయోగించే రోటవేటర్‌ను తయారు చేసి ఆ ప్రాంత రైతుల అభిమానాన్ని చూరగొన్న సైదాచారి.. మరో అడుగు ముందుకేసి చిన్న రైతుకు ఉపయోగపడే చిన్నపాటి ట్రాక్టరును తయారు చేసి అందర్నీ ఆకర్షిస్తున్నారు. కూలీల కొరతతో సాగు కనాకష్టంగా మారుతున్న తరుణంలో ఖరీదైన వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేసే స్థోమత లేని కొద్దిపాటి వ్యవసాయం ఉన్న రైతులకు సైదాచారి తయారు చేసే యంత్రపరికరాలు అక్కరకొస్తున్నాయి. మెట్ట పంటల సాగుకు అన్నివిధాలా ప్రయోజనకారిగా ఉండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. సైదాచారి తండ్రి గ్రామంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు తయారు చేయడంతోపాటు మరమ్మతులు చేసేవారు. ఏడో తరగతి వరకు చదువుకున్న సైదాచారి అప్పట్లో కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కార్పెంటర్ పని నేర్చుకున్నారు. సాదాసీదా పనిముట్లతో సరిపెట్టుకోకుండా తక్కువ ఖర్చుతో చిన్న రైతులకు ఉపయోగపడే సరికొత్త యంత్రాలు తయారు చేయాలన్న తపనతో తాజాగా మినీ ట్రాక్టరును ఆవిష్కరించారు. ఆయన చేపట్టిన వినూత్న ప్రయోగాలకు భార్య జ్యోతి తోడూ నీడగా నిలుస్తున్నారు. మినీ ట్రాక్టరును రూపొందించే క్రమంలో రెండేళ్ల క్రితం టిల్లర్‌ను రూపొందించారు. దానికి మంచిపేరే వచ్చినా రైతులు స్వయంగా వాటిని నెడుతూ బలాన్ని ప్రయోగించాల్సి ఉండడంతో.. ఆ ఇబ్బందులు లేని మినీ ట్రాక్టరును లక్ష్యంగా పెట్టుకొని, పట్టుదలతో సాధించారు. మినీ ట్రాక్టరు తయారీ ఇలా.. 5 హెచ్‌పీ సామర్ధ్యం గల చైనా ఇంజిన్, రెండు టిల్లర్ టైర్లు, మరో రెండు ఆటో టైర్లను, సామిల్లులో వాడే బేరింగ్లను సైదాచారి మినీ ట్రాక్టరు తయారీలో వాడారు. బెల్టుల సాయంతో టైర్లు తిరిగేలా రూపకల్పన చేశారు. ఇనుప అబ్బులు, డిస్క్‌లను సొంతంగా తీర్చిదిద్దారు. ముందుకు, వెనక్కి వెళ్లేలా గేర్లను అమర్చి చిన్న ట్రాక్టరును ప్రయోజనకరంగా, అందంగా ఆవిష్కరించారు. ఈ క్రమంలో సైదాచారికి జీవిత భాగస్వామి జ్యోతి ప్రోద్భలం ఎంతో ఉంది. సైదాచారి ఒక మనిషి సహాయంతో రూ.70 వేల ఖర్చుతో 15 రోజులకు ఒక ట్రాక్టరును శ్రద్ధగా తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు మినీ ట్రాక్టర్లను రూ. 90 వేల చొప్పున విక్రయించారు. మినీ ట్రాక్టరుతో పాటు దీనికి జోడించి (20 కిలోల)ఎరువులు వేసే డబ్బా, గొర్రు, గుంటక, కూరగాయ తోటలకు బోదెలు పోసే పరికరాన్ని కూడా ఇస్తున్నారు. ట్రాలీని విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది. 6 క్వింటాళ్ల వరకు బరువు లాగే శక్తి ఈ మినీ ట్రాక్టరుకు ఉంది. మినీ ట్రాక్టరు గురించి ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న రైతులు అనేక జిల్లాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. లీటరు డీజిల్‌తో ఎకరం దుక్కి 3 అడుగుల ఎత్తు, 27 అంగుళాల వెడల్పు, 50 అంగుళాల పొడవుతో.. కేవలం 200 కిలోల కన్నా తక్కువ బరువుండే తన మినీ ట్రాక్టర్.. మెట్ట/ఆరుతడి పంటల సాగుకు ఎంతో ప్రయోజనకారని సైదాచారి చెబుతున్నారు. 10 ఎకరాలు సాగుచేస్తున్న రైతు అవసరాలన్నింటినీ తీర్చగలద.ని, లీటర్ డీజిల్‌తో సుమారు ఎకరం దున్నుకునేందుకు వీలుంది. పత్తి పంట 5 అడుగుల ఎత్తు పెరిగే వరకు పాటు చేసేందుకు, మందు చల్లేందుకు సులువుగా ఉంటుంది. మిర్చి, చెరకు, పసుపు, మల్బరీ, నిమ్మ తోటలతో పాటు కూరగాయల సాగులో దున్నకానికి అనుకూలంగా ఉంటుంది. 20 కిలోల డబ్బాతో ఎరువు వేసుకోవచ్చు. స్ప్రే పంపును అనుసంధానం చేసుకుంటే 50 లీటర్ల ట్యాంకుతో పురుగుమందులను, కషాయాలను, ద్రవరూప ఎరువులను అరగంటలో ఎకరానికి పిచికారీ చేయవచ్చు. బోరులో మోటారు రిపేరు వస్తే.. ఒక్క మనిషే ఈ ట్రాక్టరు సాయంతో మోటారును బయటకు తీయవచ్చు. ఇలాంటి గ్రామీణ ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రొత్సాహం అందిస్తే తమకు తక్కువ ధరకు వ్యవసాయానుకూల ట్రాక్టరు దొరకుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. – జలగం మల్లయ్య, సాక్షి, ఆత్మకూర్(ఎస్), సూర్యాపేట జిల్లా ప్రభుత్వం ప్రొత్సహిస్తే తక్కువ ధరకే మినీ ట్రాక్టరు అందిస్తా! చిన్న రైతుల వ్యవసాయావసరాలకు అనుగుణంగా పనిముట్లను తయారు చేస్తున్నాను. అందులో భాగంగానే మినీ ట్రాక్టరును తయారు చేశాను. దీనికి రిపేర్లు రావు. చైన్లు మార్చుకోవాల్సి వస్తే, రైతులే కొత్త చైన్లు తెచ్చి మార్చుకోవచ్చు. ఇదెలాగో రైతుకు నేనే నేర్పిస్తా. ఒక వేళ బేరింగ్ పోతే మెకానెక్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. కేవలం 200 కిలోల బరువుండే ఇంత చిన్నదైన, ఇన్ని పనులు చేసే చిన్న ట్రాక్టరు నాకు తెలిసి దేశంలోనే మరెక్కడా లేదు. కూరగాయ పందిరి తోటల్లో కూడా నిశ్చింతగా దీన్ని ఉపయోగించవచ్చు. చిన్న, సన్నకారు రైతులు మెట్ట పొలాల్లో దీంతో సాగు చేసుకోవచ్చు. మామిడి, నిమ్మ తోటలతో పాటు పత్తి, మిర్చి, చెరుకు, పసుపు, కూరగాయల తోటల రైతులకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుతో ఫలితం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం ప్రొత్సహిస్తే చిన్న ట్రాక్టరును రూ. 90 వేల కన్నా తక్కువ ధరకే ఇవ్వగలుగుతా. చిన్న రైతులకు ఉపయోగపడే మరిన్ని పనిముట్లను తయారుచేసి తక్కువ ధరకు అందిస్తా. – జిల్లోజు సైదాచారి (99512 52280), కందగట్ల, ఆత్మకూర్(ఎస్) మండలం, సూర్యాపేట జిల్లా జాతీయ స్థాయి గుర్తింపునకు కృషి సైదాచారి గ్రామీణ ఆవిష్కర్తగా 20 ఏళ్ల నుంచి స్థానిక రైతుల అవసరాలకు అనుగుణంగా యంత్రపరికరాలు తయారు చేస్తున్నారు. మొదటి నమూనాను పాత విడి భాగాలతో తయారు చేయటం ద్వారా ఖర్చును, వనరులను ఆదా చేయటం.. తాను రూపొందించిన యంత్ర పరికరాలను మొదట తాను ఉపయోగించిన తర్వాతే ఇతరులకు ఇవ్వటం.. తక్కువ ఖర్చుతో చిన్న రైతులకు మెట్ట సేద్యంలో ఉపయోగపడే మినీ ట్రాక్టర్‌ను తయారు చేయటం ఆయన సృజనాత్మకతకు నిదర్శనాలు. పల్లెసృజన, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా ఈయన ఆవిష్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడానికి కృషి చేస్తాం. మార్చిలో రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసే ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్‌లో సైదాచారి మినీ ట్రాక్టర్‌ను ప్రదర్శింపజేయడానికి ప్రయత్నిస్తున్నాం. – విశ్రాంత బ్రిగేడియర్ పోగుల గణేశం (98660 01678), అధ్యక్షులు, పల్లెసృజన, సైనిక్‌పురి, సికింద్రాబాద్. మినీ ట్రాక్టర్‌తో అంతర సేద్యం మినీ ట్రాక్టర్‌కు అనుసంధానించిన ట్రాలీ రైతు శాస్త్రవేత్త సైదాచారి కుటుంబాన్ని అభినందిస్తున్న పల్లెసృజన అధ్యక్షులు గణేశం, ఉపాధ్యక్షులు శ్రీకర్ -
చింత తీర్చుతున్న చిన్న ట్రాక్టర్!
కాడెద్దుల స్థానాన్ని ట్రాక్టర్లు ఆక్రమించాయి. కానీ ట్రాక్టర్ల ధరలు అధికంగా ఉండటంతో చిన్న రైతులు కొనలేని పరిస్థితి. పెద్ద రైతులు తమ పనులయ్యాక అద్దెకిచ్చే వరకు అదను దాటుతున్నా.. వేచి ఉండక తప్పని పరిస్థితి చిన్న రైతులను వేధిస్తోంది. ఈ సమస్యకు యువ రైతు రమేష్ తనకు తోచిన పరిష్కారం వెతికాడు. విడి భాగాలను కొని తెచ్చి తన అవసరాలకు సరిపోయే చిన్న ట్రాక్టర్‌ను రూపొందించుకొని ఉపయోగిస్తూ పదుగురి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. విత్తనం విత్తేందుకు పొలాన్ని సిద్ధం చేసేందుకు మొదలుకొని, చేతికొచ్చిన పంటను తడవకుండా ఇంటికి చేర్చేవరకూ ప్రతి పనిలోనూ ట్రాక్టర్ అత్యవసరంగా మారింది. దీంతో చిన్న రైతులు తమ పనులు మానుకొని ట్రాక్టర్ల కోసం తిరగాల్సిన పరిస్థితి. ఈ సవాళ్లను అధిగమిస్తూ.. బహుళ ప్రయోజనాలు గల మినీ ట్రాక్టర్ ను రూపొందించా డు గుంటూరు జిల్లా మాచవరం గ్రామానికి చెందిన రైతు శాస్త్రవేత్త పేరం రమేష్. రమేష్‌ది వ్యవసాయ కుటుంబం. ఐటీఐ(ఎలక్ట్రీషియన్) పూర్తిచేసి తనకున్న రెండెకరాల పొలంలో పత్తి సాగు చేస్తున్నాడు. ఖాళీ సమయంలో ఇతరుల ట్రాక్టర్‌పై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన పొలం ఊరికి 13 కి.మీ. దూరంలో ఉండటంతో ఎద్దులను తోలుకెళ్లడానికి చాలా సమయం పట్టేది. ఎద్దులు కూడా అలసిపోయేవి. ఆ ఇబ్బందులను అధిగమించే ప్రయత్నంలో మినీ ట్రాక్టర్ తయారీకి సంబంధించిన ఆలోచన రమేష్ మదిలో మెదిలింది. ఆ ఆలోచన ఏడాది కాలంలో కార్యరూపం దాల్చింది. విడిభాగాలు కొనితెచ్చి తొలుత హ్యాండిల్‌తో నడిచే ట్రాక్టర్‌ను తయారు చేశాడు. కొన్ని మార్పులు చేసిన తర్వాత సంతృప్తికరమైన మినీ ట్రాక్టర్ సిద్ధమైందని రమేష్ ఆనందంగా చెప్పాడు. రూ. 40 వేల ఖర్చయింది. రోజూ ఈ ట్రాక్టర్‌ను నడుపుకుంటూ వెళ్లి, పొలం పనులు చక్కబెట్టుకొని వస్తున్నాడు. ఆటో ఇంజిన్‌తో డీజిల్ ఆదా ఈ మినీ ట్రాక్టర్ వంద కిలోల బరువుంటుంది. వెడల్పు 26 1/2 అంగుళాలు, ఎత్తు రెండున్నర అడుగులు, పొడవు 3 1/2 అడుగులు ఉంటుంది. ఇది రోడ్డుపై గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని తయారీలో 7.5 హెచ్.పీ ఆటో ఇంజిన్‌ను వాడటంతో మంచి మైలేజీ వస్తున్న దంటున్నాడు రమేష్. ట్రాక్టర్‌కు ముందువైపు స్కూటర్ టైర్లను, వెనుక వైపు ఆటో టైర్లను బిగించాడు. డీజిల్ ఇంజిన్ ట్యాంక్‌ను, ఇంజిన్‌తో గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయడానికి బుల్లెట్ చైన్ స్పాకెట్ను వాడాడు. సెల్ఫ్ రేజ్‌పై పొలం దున్నడం దీని ప్రత్యేకత! రూ. 50 ఖర్చుతో ఎకరంలో పైపాటు రమేష్ అనుభవం ప్రకారం.. ఈ మినీ ట్రాక్టర్‌తో మెట్ట పైర్లలో విత్తనాలు విత్తేందుకు అచ్చు తోలవచ్చు. గొర్రు, గుంటకలను ఉపయోగించి పైపాటు చేయవచ్చు. నీళ్లు పారించేందుకు బోదెలు తోలవచ్చు. మినీ ట్రాక్టర్ రూ. 50ల డీజిల్ ఖర్చుతో ఎకరంలో పైపాటు చేసుకోవచ్చు. బత్తాయి, జామ, నిమ్మ వంటి ఉద్యాన పంటల్లోని పాదుల్లో కలుపును తొలగించవచ్చు. ఒక బ్రేక్‌ను తొక్కిపట్టి ట్రాక్టర్‌ను చెట్టు చుట్టూ తిప్పుతూ.. కలుపును నిర్మూలించవచ్చు. దీని ఎత్తు తక్కువగా ఉండటం వల్ల పందిరి కూరగాయల తోటల్లోనూ పైపాటు చేయవచ్చు. పెద్ద ట్రాక్టర్కుమల్లే ఎక్కువ లోతు దున్నకం చేయవచ్చు. పంప్‌సెట్ బిగించి బావి నుంచి నీరు తోడవచ్చు. ఎకరం పత్తిలో గొర్రు దున్నేందుకు పెద్ద ట్రాక్టర్‌కు మూడు లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. ఈ మినీ ట్రాక్టర్‌కు లీటర్ డీజిల్ సరిపోతుంది. గుంటక తోలడానికి మాత్రం ముప్పావు లీటరు డీజిల్ చాలు. గంటకు ఎకరంన్నర పొలంలో పైపాటు చేయవచ్చు. ఇంజిన్ ఆయిల్ మార్చుకోవటం తప్ప నిర్వహణ ఖర్చు పెద్దగా ఏమీ లేదు. సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటున్న రమేష్ అభినందనీయుడు. - మస్తాన్ వలీ, మాచవరం, గుంటూరు జిల్లా. వ్యవసాయ పనులన్నీ చేసుకోవచ్చు..! పెద్ద ట్రాక్టర్లతో పోలిస్తే ఇది చాలా చవక. దాదాపు అన్ని రకాల సేద్యపు పనులు చేసుకోవచ్చు. రైతులెవరైనా కావాలంటే తయారు చేసి ఇస్తాను. స్టీరింగ్, హైడ్రాలిక్ వ్యవస్థను ఏర్పాటు చేయటానికి మరో రూ. 30 వేలు అవసరమవుతుంది. దమ్ము చక్రాలు, సరుకు రవాణా కోసం ట్రక్కుతో పాటు మనుషుల అవసరం లేకుండా విత్తనం, ఎరువులు ఎదబెట్టే పరికరాలను తయారు చేయాలనుకుంటున్నాను. - పేరం రమేష్ (99899 83705), యువ రైతు శాస్త్రవేత్త, మాచవరం, గుంటూరు జిల్లా. -
‘వీఎస్టీ’ మినీ ట్రాక్టరు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : చిన్న, సన్న కారు రైతులకు ఉపయోగపడే నాలుగు చక్రాల మినీ ట్రాక్టరును వీఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ లిమిటెడ్ సోమవారం ఇక్కడ ప్రదర్శించింది. వ్యవసాయ యంత్రాలకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 25న హొసూరులో కర్మాగారాన్ని స్థాపించనున్న సందర్భాన్ని పురస్కరించుకుని సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బీసీఎస్. అయ్యంగార్ ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 14.6 ఎకరాల్లో రూ.70 కోట్ల వ్యయంతో ఈ కర్మాగారాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రెండు మోడళ్లలో లభ్యమయ్యే ఈ ట్రాక్టర్లు చిన్న, సన్న కారు రైతులకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. వ్యవసాయ కార్మికులు దొరకని ప్రస్తుత తరుణంలో ఈ ట్రాక్టర్ల ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చని తెలిపారు. మహారాష్ట్రలో వైన్ యార్డులలో, గుజరాత్ పత్తి పంటలపై పిచికారీకి వినియోగించడం ద్వారా ఈ ట్రాక్టర్లు రైతుల ఆదరణ పొందాయని చెప్పారు. విభిన్న స్వభావం కలిగిన వీటి ద్వారా వ్యవసాయంలో వివిధ పనులకు వినియోగించుకోవచ్చని చెప్పారు. -
తరిమిన అవసరం.. మెరిసిన సృజన!
తక్కువ ఖర్చుతో చిన్న ట్రాక్టర్‌ను రూపొందించిన పత్తి రైతు మస్తాన్ వలీ ప్రశంసలతో సరిపెట్టిన అమాత్యులు.. ఆర్థిక స్థోమత లేక రెంటికి మించి తయారు చేయలేకపోయిన వైనం కొత్త మోడల్ మినీ ట్రాక్టర్ తయారీకి తాజాగా యత్నాలు రాష్ట్రంలోని రైతాంగంలో నూటికి 80 శాతం వరకు సన్న, చిన్నకారు రైతులే. రూ. లక్షల ఖరీదుండే పెద్ద ట్రాక్టర్లను వీరు కొనుగోలు చేసుకోలేరు. కాడి, మేడి వదిలి పెట్టిన రైతు పొలం దున్నుకోవడానికి, అంతర సేద్యానికి అద్దె ట్రాక్టర్ల కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. అవసరమైనప్పుడు అద్దె ట్రాక్టర్లు దొరక్క అదనుతప్పి సేద్యం చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పత్తి, మిరప వంటి వాణిజ్య పంటలను తొలినాళ్ల నుంచే విస్తారంగా సాగు చేస్తున్న గుంటూరు, కృష్టా తదితర కోస్తా జిల్లాల్లో ఈ ఇబ్బంది మరీ ఎక్కువ. ఏడేళ్ల క్రితం అటువంటి పరిస్థితుల్లో గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన రైతు మస్తాన్ వలీ మనసులో ఈ గడ్డు సమస్యకు పరిష్కారం వెతకాలనే ఆలోచన మొలిచింది. ఈ సృజనాత్మక ఆలోచనకు మెకానిక్‌గా తనకున్న అనుభవాన్ని జోడించి దుక్కికి, అంతర కృషికి ఉపయోగపడే విధంగా చిన్న ట్రాక్టర్‌ను రూపొందించాడు. అలాగని మస్తాన్‌వలీ పెద్ద చదువులు చదువుకున్నవాడేమీ కాదు. తండ్రి పుల్లాసాహెబ్, తల్లి అల్లాబీలవి వ్యవసాయాధారిత జీవితాలే. పేదరికం వల్ల మస్తాన్ చదువు రెండో తరగతిలోనే ఆగింది. బతుకు బండిని ఈదడానికి ఉన్న ఊళ్లోనే పదేళ్లు సైకిల్ రిపేరింగ్షాప్ నడిపాడు. తర్వాత గుంటూరులోని ఓ లారీ వర్క్‌షాపులో మెకానిక్‌గా చేరాడు. మాంచి పనితనం ఉన్న మెకానిక్‌గా పేరు సంపాదించినా చేతిలో రూకలకు ఇంట్లో నూకలకు కటకట పరిస్థితినే ఎదుర్కొన్నాడు. చివరకు ఉన్న ఊరే కన్నతల్లి అని తలచి పొన్నెకల్లు చేరాడు. తిరిగి సైకిల్ షాప్ నడుపుతూనే పత్తి సాగు ప్రారంభించాడు. పత్తి పంటలో నిర్ణీత కాల వ్యవధిలో అంతరకృషి చేసి కలుపును తొలగించాలి. అదునుకు కూలీలు దొరకరు. దొరికినా, ఖర్చు బారెడు.. లాభం జానెడు అనే పరిస్థితి. ఈ పరిస్థితిలో తనకున్న మెకానిక్ అనుభవంతో దుక్కులు దున్నుకోవడానికి, కలుపు తీసుకోవడానికి ఒక చిన్న ట్రాక్టరు తయారు చేయాలని తలపెట్టాడు. పత్తి సాళ్ల వరుసలకు అనుకూలంగా 31 అంగుళాల వెడల్పు, మూడు అడుగుల ఎత్తు ఉండేలా ప్రణాళిక రూపొందించుకున్నాడు. ఆటో చాసిస్‌తో పాటు ఇతర విడిభాగాలను సమకూర్చుకొని వాటికి 10.2 హెచ్‌పి సామర్థ్యపు ఇంజన్ అమర్చాడు. 2007లో తొలి ప్రయత్నం ప్రారంభించాడు. ట్రాక్టరు రూపొందినా కొన్ని సమస్యలు వచ్చాయి. తరువాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక సంవత్సరం ఆగి 2009లో పూర్తిస్థాయిలో మార్చులు, చేర్పులు చేసి రెండు మినీ ట్రాక్టర్లను రూపొందించారు. ఫలితంగా అప్పట్లో రైతులకు ఒకింత ఊరటనిచ్చే మినీ ట్రాక్టరు రూపొందించగలిగాడు. డ్రెవర్ ఇతరుల సహాయం లేకుండా కల్టివేటర్, గుంటక వంటి పనిముట్లను తగిలించుకొని సాధారణ ట్రాక్టర్లాగే నడుపుకోవచ్చు. మస్తాన్ సృష్టించిన ఈ చిన్న ట్రాక్టర్ చూడముచ్చటగా ఉండడమే కాకుండా అన్ని పనులకు అనువుగా ఉండడంతో అప్పట్లో రైతులను ఆకట్టుకొంది. ఆయన తయారు చేసిన రెండు ట్రాక్టర్లలో ఒకటి ఆయన వద్ద ఇప్పటికీ వినియోగంలో ఉంది. అనేక మంది రైతులు ఆసక్తితో ముందుకొచ్చి మస్తాన్‌ను తమ కోసం కూడా ఒక ట్రాక్టర్ తయారు చేసి ఇవ్వమని అడిగారు. తగిన పెట్టుబడి సమకూరక తయారు చేయలేకపోయాడు. మస్తాన్‌వలీ తయారు చేసిన ట్రాక్టరు మంత్రుల ప్రశంసలందుకుంది. పల్లెసృజన స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు విశ్రాంత బ్రిగేడియర్ పి. గణేశం ఈ మినీ ట్రాక్టర్‌ను పరిశీలించి మస్తాన్‌వలీ సృజన శీలతను ప్రశంసించారు. ఈ ఆవిష్కరణను నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్ దృష్టికి తీసుకెళ్లి నమోదు చేయించారు. ఎవరైనా వ్యాపారవేత్త చొరవ తీసుకొని మస్తాన్‌వలీకి రాయల్టీ చెల్లించి ఈ మినీ ట్రాక్టర్లను పెద్దమొత్తంలో ఉత్పత్తి చేయగలిగితే.. ఇప్పటికైనా మరింత తక్కువ ధరకే రైతులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని గణేశం ఆశాభావం వ్యక్తం చేశారు. - జిట్టా బాల్‌రెడ్డి, ‘సాగుబడి’ డెస్క్ కొత్త మోడల్ మినీ ట్రాక్టర్‌ను తయారు చేస్తా! పొలాల్లో సకాలంలో కలుపుతీతకు ఉపయోగపడేవిధంగా 10.2 అశ్వశక్తి గల ఇంజన్‌తో మినీ ట్రాక్టర్‌ను ఐదేళ్ల క్రితం తయారు చేశాను. మొదటి దానికి దాదాపు రూ. 1.5 లక్షల ఖర్చయింది. పత్తి, మిర్చి తోటల్లో అంతర కృషికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అయితే, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో వీటిని తయారు చేయలేకపోయాను. ఈ ట్రాక్టర్‌ను వ్యవసాయ శాఖ ప్రదర్శనలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు చూసి ప్రశంసించారు. అంతేతప్ప ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందలేదు. అప్పుడు తయారు చేసిన దానికంటే మరింత శక్తివంతమైన మినీ ట్రాక్టర్‌ను తయారు చేయాలనే ఆలోచనతో పనిముట్లు, పరికరాలు సమకూర్చుకున్నాను. కొత్త మోడల్ మినీ ట్రాక్టర్‌ను తయారు చేస్తా. - మస్తాన్‌వలీ (91607 42192), పొన్నెకల్లు గ్రామం, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా