తరిమిన అవసరం.. మెరిసిన సృజన!
తక్కువ ఖర్చుతో చిన్న ట్రాక్టర్‌ను రూపొందించిన పత్తి రైతు మస్తాన్ వలీ
ప్రశంసలతో సరిపెట్టిన అమాత్యులు.. ఆర్థిక స్థోమత లేక రెంటికి మించి తయారు చేయలేకపోయిన వైనం
కొత్త మోడల్ మినీ ట్రాక్టర్ తయారీకి తాజాగా యత్నాలు
రాష్ట్రంలోని రైతాంగంలో నూటికి 80 శాతం వరకు సన్న, చిన్నకారు రైతులే. రూ. లక్షల ఖరీదుండే పెద్ద ట్రాక్టర్లను వీరు కొనుగోలు చేసుకోలేరు. కాడి, మేడి వదిలి పెట్టిన రైతు పొలం దున్నుకోవడానికి, అంతర సేద్యానికి అద్దె ట్రాక్టర్ల కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. అవసరమైనప్పుడు అద్దె ట్రాక్టర్లు దొరక్క అదనుతప్పి సేద్యం చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పత్తి, మిరప వంటి వాణిజ్య పంటలను తొలినాళ్ల నుంచే విస్తారంగా సాగు చేస్తున్న గుంటూరు, కృష్టా తదితర కోస్తా జిల్లాల్లో ఈ ఇబ్బంది మరీ ఎక్కువ. ఏడేళ్ల క్రితం అటువంటి పరిస్థితుల్లో గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన రైతు మస్తాన్ వలీ మనసులో ఈ గడ్డు సమస్యకు పరిష్కారం వెతకాలనే ఆలోచన మొలిచింది. ఈ సృజనాత్మక ఆలోచనకు మెకానిక్‌గా తనకున్న అనుభవాన్ని జోడించి దుక్కికి, అంతర కృషికి ఉపయోగపడే విధంగా చిన్న ట్రాక్టర్‌ను రూపొందించాడు. అలాగని మస్తాన్‌వలీ పెద్ద చదువులు చదువుకున్నవాడేమీ కాదు.
తండ్రి పుల్లాసాహెబ్, తల్లి అల్లాబీలవి వ్యవసాయాధారిత జీవితాలే. పేదరికం వల్ల మస్తాన్ చదువు రెండో తరగతిలోనే ఆగింది. బతుకు బండిని ఈదడానికి ఉన్న ఊళ్లోనే పదేళ్లు సైకిల్ రిపేరింగ్‌షాప్ నడిపాడు. తర్వాత గుంటూరులోని ఓ లారీ వర్క్‌షాపులో మెకానిక్‌గా చేరాడు. మాంచి పనితనం ఉన్న మెకానిక్‌గా పేరు సంపాదించినా చేతిలో రూకలకు ఇంట్లో నూకలకు కటకట పరిస్థితినే ఎదుర్కొన్నాడు. చివరకు ఉన్న ఊరే కన్నతల్లి అని తలచి పొన్నెకల్లు చేరాడు. తిరిగి సైకిల్ షాప్ నడుపుతూనే పత్తి సాగు ప్రారంభించాడు. పత్తి పంటలో నిర్ణీత కాల వ్యవధిలో అంతరకృషి చేసి కలుపును తొలగించాలి. అదునుకు కూలీలు దొరకరు. దొరికినా, ఖర్చు బారెడు.. లాభం జానెడు అనే పరిస్థితి. ఈ పరిస్థితిలో తనకున్న మెకానిక్ అనుభవంతో దుక్కులు దున్నుకోవడానికి, కలుపు తీసుకోవడానికి ఒక చిన్న ట్రాక్టరు తయారు చేయాలని తలపెట్టాడు. పత్తి సాళ్ల వరుసలకు అనుకూలంగా 31 అంగుళాల వెడల్పు, మూడు అడుగుల ఎత్తు ఉండేలా ప్రణాళిక రూపొందించుకున్నాడు. ఆటో చాసిస్‌తో పాటు ఇతర విడిభాగాలను సమకూర్చుకొని వాటికి 10.2 హెచ్‌పి సామర్థ్యపు ఇంజన్ అమర్చాడు. 2007లో తొలి ప్రయత్నం ప్రారంభించాడు. ట్రాక్టరు రూపొందినా కొన్ని సమస్యలు వచ్చాయి. తరువాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక సంవత్సరం ఆగి 2009లో పూర్తిస్థాయిలో మార్చులు, చేర్పులు చేసి రెండు మినీ ట్రాక్టర్లను రూపొందించారు. ఫలితంగా అప్పట్లో రైతులకు ఒకింత ఊరటనిచ్చే మినీ ట్రాక్టరు రూపొందించగలిగాడు.
డ్రెవర్ ఇతరుల సహాయం లేకుండా కల్టివేటర్, గుంటక వంటి పనిముట్లను తగిలించుకొని సాధారణ ట్రాక్టర్‌లాగే నడుపుకోవచ్చు. మస్తాన్ సృష్టించిన ఈ చిన్న ట్రాక్టర్ చూడముచ్చటగా ఉండడమే కాకుండా అన్ని పనులకు అనువుగా ఉండడంతో అప్పట్లో రైతులను ఆకట్టుకొంది. ఆయన తయారు చేసిన రెండు ట్రాక్టర్లలో ఒకటి ఆయన వద్ద ఇప్పటికీ వినియోగంలో ఉంది. అనేక మంది రైతులు ఆసక్తితో ముందుకొచ్చి మస్తాన్‌ను తమ కోసం కూడా ఒక ట్రాక్టర్ తయారు చేసి ఇవ్వమని అడిగారు. తగిన పెట్టుబడి సమకూరక తయారు చేయలేకపోయాడు. మస్తాన్‌వలీ తయారు చేసిన ట్రాక్టరు మంత్రుల ప్రశంసలందుకుంది. పల్లెసృజన స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు విశ్రాంత బ్రిగేడియర్ పి. గణేశం ఈ మినీ ట్రాక్టర్‌ను పరిశీలించి మస్తాన్‌వలీ సృజన శీలతను ప్రశంసించారు. ఈ ఆవిష్కరణను నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్ దృష్టికి తీసుకెళ్లి నమోదు చేయించారు. ఎవరైనా వ్యాపారవేత్త చొరవ తీసుకొని మస్తాన్‌వలీకి రాయల్టీ చెల్లించి ఈ మినీ ట్రాక్టర్లను పెద్దమొత్తంలో ఉత్పత్తి చేయగలిగితే.. ఇప్పటికైనా మరింత తక్కువ ధరకే రైతులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని గణేశం ఆశాభావం వ్యక్తం చేశారు.
- జిట్టా బాల్‌రెడ్డి, ‘సాగుబడి’ డెస్క్
కొత్త మోడల్ మినీ ట్రాక్టర్‌ను తయారు చేస్తా!
పొలాల్లో సకాలంలో కలుపుతీతకు ఉపయోగపడేవిధంగా 10.2 అశ్వశక్తి గల ఇంజన్‌తో మినీ ట్రాక్టర్‌ను ఐదేళ్ల క్రితం తయారు చేశాను. మొదటి దానికి దాదాపు రూ. 1.5 లక్షల ఖర్చయింది. పత్తి, మిర్చి తోటల్లో అంతర కృషికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అయితే, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో వీటిని తయారు చేయలేకపోయాను. ఈ ట్రాక్టర్‌ను వ్యవసాయ శాఖ ప్రదర్శనలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు చూసి ప్రశంసించారు. అంతేతప్ప ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందలేదు. అప్పుడు తయారు చేసిన దానికంటే మరింత శక్తివంతమైన మినీ ట్రాక్టర్‌ను తయారు చేయాలనే ఆలోచనతో పనిముట్లు, పరికరాలు సమకూర్చుకున్నాను. కొత్త మోడల్ మినీ ట్రాక్టర్‌ను తయారు చేస్తా.
- మస్తాన్‌వలీ (91607 42192), పొన్నెకల్లు గ్రామం, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా