Farmer scientist
-
వికసించిన వ్యవసాయ పద్మాలు
వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త సుభాష్ శర్మ (మహారాష్ట్ర)తో పాటు హారిమన్ శర్మ (హిమాచలప్రదేశ్), ఎస్. హాంగ్‌థింగ్ (నాగాలాండ్)లకు కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. సుభాష్ శర్మ పత్తి రైతుల ఆత్మహత్యలకు నిలయమైన యవత్మాల్ జిల్లాలో అనేక దశాబ్దాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ, రైతులకు ఆచరణాత్మక శిక్షణ ఇస్తున్నారు. హిమాచలప్రదేశ్‌కు చెందిన హారిమన్ శర్మ ఆపిల్ సాగును కొండప్రాంతాల నుంచి మైదానప్రాంతాల్లోకి తీసుకొచ్చారు. సాధారణ ఉష్ణోగ్రతలోనూ పండే ఆపిల్ వంగడాలను అభివృద్ధి చేశారు. నాగాలాండ్‌కు చెందిన హాంగ్‌థింగ్ అధికాదాయాన్నిచ్చే కొత్త పంటలను అక్కడి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోబోతున్న ఈ భూమిపుత్రులకు తెలుగు రైతుల తరఫున శుభాకాంక్షలు చెబుతోంది ‘సాక్షి సాగుబడి’. వారి కృషి గురించి కొన్ని వివరాలు.కరువు సీమలో కాంతిరేఖ.. సుభాష్ శర్మ! మహారాష్ట్ర.. విదర్భ.. యవత్మాల్.. ఈ పేరు వినగానే అప్పుల్లో కూరుకుపోయి బలవన్మరణాల పాలైన ఎందరో పత్తి రైతుల విషాద గాథలు మదిని బరువెక్కిస్తాయి. అయితే, యవత్మాల్ వ్యవసాయ కథ అంతటితో ముగిసిపోలేదు. ఎడారిలో ఒయాసిస్సు మాదిరిగా సేద్యాన్ని ఆనందమయంగా మార్చుకున్న ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త, సీనియర్ ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్ శర్మ కూడా అక్కడ దీర్ఘకాలంగా సేద్యం చేస్తున్నారు. యవత్మాల్ జిల్లా వితస గ్రామ వాస్తవ్యుడైన శర్మ.. నేలతల్లికి ప్రణమిల్లుతూ భూసారాన్ని పరిరక్షించుకుంటూనే అధిక దిగుబడులు సాధిస్తున్నారు. సుభాష్ శర్మకు 67 ఏళ్లు. ఆరుతడి పంటల సాగులో 47 ఏళ్ల అనుభవం ఉన్న రైతు. రసాయనిక సేద్యపు చేదు అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని దిశను మార్చుకున్నారు. సేద్యంలో గడ్డు సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను వెదికిన తలపండిన ప్రకృతి వ్యవసాయదారుడాయన. అంతేకాదు, నల్లరేగడి పొలాల్లో అనేక వినూత్న సుస్థిర వ్యవసాయ పద్ధతులను స్వీయానుభవంలో కనుగొని, అనుసరిస్తున్న విశిష్ట రైతు శాస్త్రవేత్త కూడా. క్షేత్రస్థాయిలో వ్యవసాయ సమస్యలను లోతుగా పరిశీలిస్తూ.. తన అనుభవంతో, ప్రజ్ఞతో మెట్టప్రాంతాల్లో ప్రకృతి సేద్యానికి అనుగుణమైన సాగు పద్ధతులను సుభాష్ శర్మ రూపొందించుకున్నారు. 30 ఏళ్లుగా ప్రకృతి సేద్యంసుభాష్ శర్మకు 13 ఎకరాల నల్లరేగడి భూమి ఉంది. 1975 నుంచి వ్యవసాయం చేస్తున్న ఆయనకు 20 ఏళ్ల పాటు రసాయనిక ఎరువులు, పురుగుమందులతోనే వ్యవసాయం చేశారు. ఫలితంగా ఆర్థికంగా నష్టాలపాలవటమే కాకుండా భూసారం సర్వనాశనమైపోయింది. 1986 తర్వాత ఖర్చులు పెరుగుతున్నా దిగుబడులు తగ్గిపోతూ వచ్చాయి. ఆ దశలో రసాయనిక వ్యవసాయ పద్ధతే నష్టదాయకమైనదన్న సత్యాన్ని గ్రహించారు. 1994 నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వైపు మళ్లారు. నిశిత పరిశీలనతో ప్రకృతికి అనుగుణమైన ఆచరణాత్మక సుస్థిర వ్యవసాయ పద్ధతులను రూపొందించుకొని అనుసరిస్తూ మంచి నికరాదాయాన్ని పొందుతున్నారు. 13 ఎకరాల నల్లరేగడి భూమిలో 3 ఎకరాలను ఆవులు, ఎద్దుల మేతకు కేటాయించి మిగతా పది ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కంది, పత్తి, కూరగాయలు, ఆకుకూరలను ఏడాది పొడవునా సాగు చేస్తుంటారు. మార్కెట్లో ఎప్పుడు, ఏయే పంట ఉత్పత్తులకు గిరాకీ ఉంటుందో గమనించుకుంటూ రైతులు బహుళ పంటలు సాగుకు ప్రణాళికను రూపొందించుకుంటే మంచి ఆదాయం పొందవచ్చంటారాయన.పత్తి సాగులో వినూత్న పద్ధతిప్రకృతి వ్యవసాయంలో ఆచ్ఛాదన అతి ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే, ఆచ్ఛాదనగా వేయడానికి గడ్డీ గాదం ఎక్కడ దొరుకుతుంది అని రైతులు ప్రశ్నిస్తుంటారు. ఈ సమస్యకు సుభాష్ శర్మ అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. రెండు సాళ్లు పత్తి వేస్తారు (కందిని కూడా ఇలాగే సాగు చేయవచ్చు). ఆ పక్కనే 3 సాళ్లలో పచ్చిరొట్ట మొక్కలు పెంచి, వాటినే కత్తిరించి ఆచ్ఛాదనగా వేస్తారు. పత్తిని, కందిని కూడా ఈ పద్ధతిలోనే సాగు చేయడం ఆయన ప్రత్యేకత. అధిక దిగుబడిని సాధించే ఈ వినూత్న పద్ధతిని గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయదారుడిగా, పరిశోధకుడిగా ప్రయోగాలు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న సుభాష్ శర్మ పై ప్రత్యేక కథనాన్ని 2018 డిసెంబర్లోనే ‘సాక్షి సాగుబడి’ ప్రచురించింది. సుభాష్ శర్మ తన యూట్యూబ్ చానల్లో వీడియోలు అందుబాటులో ఉంచారు.@naturalfarmingbysubhashsharma9@KrishiTVఅధిక దిగుబడి, అధిక నికరాదాయం!ప్రకృతి సేద్యంలోని శాస్త్రీయతను అర్థం చేసుకొని రైతులు అనుసరించినప్పుడే సత్ఫలితాలు సాధించగలుగుతారు. పత్తి 2 సాళ్లు వేసి.. ఆ పక్కనే 3 సాళ్లలో పచ్చిరొట్ట పంటలను సాగు చేస్తే.. భూసారంతో పాటు దిగుబడి కూడా పెరగడం, బెట్టను తట్టుకోవడం వంటి ఎన్నో ప్రయోజనాలు నెరవేరతాయి. చీడపీడల బెడద కూడా తీరిపోతుంది. పచ్చిరొట్ట సాగుకు స్థలం వృథా అవుతున్నదని పొరబడకూడదు, శాస్త్రీయతను అర్థం చేసుకోవాలి. ప్రకృతి సేద్యంలో అధిక దిగుబడి, అధిక నికరాదాయం పొందటం ముమ్మాటికీ సాధ్యమే. – సుభాష్ శర్మ, ప్రకృతి వ్యవసాయ నిపుణులు, మహారాష్ట్రకొత్త పంటల హాంగ్థింగ్నాగాలాండ్లోని కోక్లక్కు చెందిన ఎల్. హాంగ్‌థింగ్ అనే 58 ఏళ్ల రైతు శాస్త్రవేత్త అధికాదాయాన్నిచ్చే కొత్త ఉద్యాన పంటలను రైతులకు అందుబాటులోకి తేవటంలో విశేష కృషి చేశారు. ఆప్రాంత రైతాంగానికి తెలియని లిచి, నారింజ వంటి కొత్త పండ్ల రకాలను వారికి అందుబాటులోకి తెచ్చారు. 30 ఏళ్లుగా ఉద్యాన తోటలను సాగు చేస్తున్నారు. ఆయన కృషి వల్ల 40 గ్రామాల్లో 200 మంది రైతులు కొత్త రకాల పండ్ల చెట్ల పెంపకం ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోగలిగారు. తిని పారేసిన పండ్ల విత్తనాలను సేకరించి మొలకెత్తించటం వంటి ప్రయోగాలను ఆయన బాల్యం నుంచే చేపట్టటం విశేషం. ఆయన రూపొందించిన అనేక మెళకువలను వందలాది మంది రైతులు అనుసరిస్తూ ఆదాయం పెంచుకుంటున్నారు.ఆపిల్ సాగును దేశవ్యాప్తం చేసిన హారిమన్ఆపిల్ పండ్ల తోటలను హారిమన్ శర్మ మంచు కొండల మీద నుంచి మైదానప్రాంతాల్లోకి తీసుకొచ్చారు. హిమాచల్ ప్రదేశ్‌లోని గల్లసిన్ గ్రామంలో 1956లో ఆయన పుట్టారు. మూడేళ్ల వయసులో తల్లిని కోల్పోయిన ఆయన వ్యవసాయ పనులు చేస్తూ పెరిగారు. కష్టాల్లో పెరిగినప్పటికీ వ్యవసాయంలో కొత్తపోకడలను కనిపెట్టాలన్న తపన ఆయనలో ఉండేది. 1992లో విపరీతమైన మంచు వల్ల ఆప్రాంతంలో మామిడి చెట్లు నాశనమైనప్పుడు ఆపిల్ సాగు గురించి ఆలోచించారు. చల్లని కొండప్రాంతాల్లో మాత్రమే ఆపిల్ చెట్లు పెరుగుతాయని మనకు తెలుసు. అయినా, తమప్రాంతంలో వాటిని ఎందుకు పెంచకూడదన్న ఆలోచనతో హారిమన్ ప్రయోగాలు చేయటంప్రారంభించారు.పట్టువిడవకుండా కృషి చేసి సముద్రతలం నుంచి 700 మీటర్ల ఎత్తులోని మైదానప్రాంతాల్లో, వేసవిలో 40–45 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వాతవరణంలో కూడా, ఆపిల్ పండ్లను సాగు చేయవచ్చని రుజువు చేశారు. 2007లో హెఆర్‌ఎంఎన్–99 అనే గ్రాఫ్టెడ్ ఆపిల్ వంగడాన్ని రూపొందించారు. అప్పటి ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ ధుమల్ దృష్టికి వెళ్లటంతోప్రాచుర్యంలోకి వచ్చారు. ఈ రకం ఆపిల్ పండ్లను ఇప్పుడు దేశంలో తెలుగు రాష్ట్రాలు సహా 29 రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, జర్మనీలోనూ సాగు చేస్తున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు అనుబంధంగా ఉన్న నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జాతీయ పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అందుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో రైతులకు శిక్షణ ఇవ్వటంతో పాటు లక్ష గ్రాఫ్టెడ్ ఆపిల్ మొక్కలను అందించిన ఘనత ఆయనది. -
రైతు శాస్త్రవేత్త విజయకుమార్‌కు ‘సృష్టి సమ్మాన్’ పురస్కారం!
చిరుధాన్య పంటల జీవవైవిధ్యానికి విశేష కృషి చేస్తున్న వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ప్రముఖ సేంద్రియ రైతు శాస్త్రవేత్త కొమ్మూరి విజయకుమార్(60)కు ప్రతిష్టాత్మక ‘సృష్టి సమ్మాన్’ పురస్కారం లభించింది. అహ్మదాబాద్‌లోని భగవత్ విద్యాపీఠంలో ఈ నెల 23 నుంచి 26 వరకు జరుగుతున్న సాత్విక్ సంప్రదాయక ఆహారోత్సవంలో సోమవారం విజయకుమార్‌కు గుజరాత్ మాజీ ప్రధాన కార్యదర్శి పి.కె. లహరి, ఐఐఎం అహ్మదాబాద్ డైరెక్టర్ భరత్ భాస్కర్, అహ్మదాబాద్ ఐఐఎం మాజీ ఆచార్యులు ప్రొ. అనిల్ కె గుప్తా జీవవైవిధ్యం విభాగంలో సృష్టి సమ్మాన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రొ.అనిల్ కె గుప్తా నెలకొల్పిన సొసైటీ ఫర్ రీసెర్చ్ అండ్ ఇనీషియేటివ్స్ ఫర్ సస్టయినబుల్ టెక్నాలజీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ (సృష్టి) సంస్థ 1995 నుంచి ప్రతి ఏటా గ్రామీణ రైతు శాస్త్రవేత్తలు, జీవవైవిధ్యం పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు జాతీయ స్థాయిలో సృష్టి సమ్మాన్ పురస్కారాలు ప్రదానం చేస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలోని ఈవీ పల్లె గ్రామంలో పుట్టిన కొమ్మూరి విజయకుమార్ వర్షాధార భూముల్లో సేంద్రియ పద్ధతుల్లో చిరుధాన్యాల సాగును పునరుద్ధరించటానికి విశేష కృషి చేస్తున్నారు. చిరుధాన్యాల విత్తనాలను అనేక రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులకు ఉచితంగా పంపిణీ చేయటం ద్వారా తిరిగి చిరుధాన్యాల సంప్రదాయ సేంద్రియ సాగు వ్యాప్తికి కృషి చేశారు. స్థానికంగా లభించే అనేక మొక్కల వినూత్న కషాయాలను రూపొందించి రైతులకు అందిస్తూ సేంద్రియ వ్యవసాయంలో అనేక పంటలను ఆశించే చీడపీడల నియంత్రణకు విజయకుమార్ కృషి చేస్తున్నారు. ఆయన కృషిపై గత దశాబ్దకాలంగా అనేక కథనాలు ‘సాక్షి సాగుబడి’ పాఠకులకు సుపరిచితమే. ఆయనకు గతంలో బళ్లారికి చెందిన సఖి ట్రస్ట్, రైతునేస్తం ఫౌండేషన్ పురస్కారాలు లభించాయి. గతంలో ‘సృష్టి సమ్మాన్’ పురస్కారం అందుకున్న వారిలో ఖమ్మంకు చెందిన పర్యావరణ ఉద్యమకారుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత దరిపల్లి రామయ్య కూడా ఉన్నారు. (చదవండి: అరుదుగా కనిపించే భారీ నిమ్మకాయలు.. చూసేందుకు క్యూ కడుతున్న జనాలు!) -
‘మట్టి’ పద్మం!
పంట భూమికి పోషకాలను అందించాలన్నా.. చీడపీడల బెడద నుంచి పంటలను కాపాడుకోవాలన్నా కావాల్సిందేమిటి? రసాయనిక ఎరువులు, పురుగుమందులు, చివరకు కషాయాలు కూడా అవసరం లేదు.. కేవలం మట్టి ద్రావణం ఉంటే చాలు. ఇది రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి ఆవిష్కరించిన గొప్ప సంగతి. 12–13 ఏళ్ల నుంచి ద్రాక్ష, వరి, గోధుమ, కూరగాయ పంటలకు ఎరువుగా వేయడం, మట్టి ద్రావణాన్ని ద్రవరూప ఎరువుగా, పురుగుల మందుగా పిచికారీ చేయడం విశేషం. ఆయన పండించిన బియ్యంలో విటమిన్ ఎ ఉందని రుజువైంది. అంతేకాదు.. ప్రపంచ మేధోహక్కుల సంస్థ(వైపో)ను మెప్పించి, 2008లోనే 28 ఐరోపా దేశాల్లో పేటెంట్లు పొందారు. చింతల వెంటకటరెడ్డి ఆవిష్కరణ గురించి ఏప్రిల్ 7, 2014న ‘లోపలి మట్టిలోనే పోషకాల లోగుట్టు’ శీర్షికన సాక్షి ‘సాగుబడి’ సమగ్ర కథనాన్ని ప్రచురించింది. తదనంతరం పత్రికలు, టీవీలు, డిజిటల్ మీడియా ద్వారా చింతల వెంకట రెడ్డి(సి.వి.ఆర్.) సాగు పద్ధతి ఇటీవల విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పలువురు రైతులు వివిధ పంటలపై మట్టి ద్రావణాన్ని వాడుతూ మండే ఎండల్లోనూ చక్కని పంట దిగుబడులు పొందుతుండడం హర్షదాయకం! ఈ ఏడాది పద్మశ్రీ అవార్డుకు చింతల వెంకటరెడ్డి ఎంపికైన సందర్భంగా ఆయన ఆవిష్కరణ విశేషాలు మరోసారి.. మట్టి ద్రావణం.. కొన్ని మెలకువలు! నేలతల్లి అన్నపూర్ణ. అన్ని పోషకాలకూ నిలయం. అటువంటి మట్టిని సేకరించి పంటల సాగులో పోషకాల కోసం, చీడపీడల సమర్థ నివారణ కోసం వినియోగించుకునే వేర్వేరు పద్ధతులు, ఈ క్రమంలో రైతులు పాటించాల్సిన మెలకువలను రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి (సీవీఆర్) ‘సాగుబడి’కి వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక పంటలపై రైతులు మట్టి ద్రావణాన్ని ద్రాక్ష, బొప్పాయి, ఆపిల్ బెర్, దానిమ్మ, బత్తాయి, నిమ్మ, టమాటో, వంగ, బీర, కాకర, దొండ, పూల తోటల్లో వాడుతూ సత్ఫలితాలు పొందుతున్నారన్నారు. అయితే, మల్బరీ తోటపై మట్టి ద్రావణం పిచికారీ చేయరాదని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మట్టి ద్రావణం చల్లిన ఆకులు తింటే పట్టుపురుగులు కూడా చనిపోతాయన్నారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. ‘పై మట్టి’ అంటే? సీజనల్ పంటలు లేదా తోటలను తాము సాగు చేసుకుంటున్న భూముల్లో నుంచే మట్టిని సేకరించుకోవాలి. ఇతర భూముల నుంచి సేకరించడం ప్రారంభిస్తే.. ఇతర సమస్యలు తలెత్తుతాయి. భూమి పైన 3–4 అంగుళాల లోతు వరకు ఉన్న మట్టిని ‘పై మట్టి’(టాప్ సాయిల్) అని పిలుస్తున్నాం. దీన్ని వర్షాకాలం ప్రారంభానికి ముందే యంత్రాల సాయంతో సేకరించి, వర్షానికి తడవకుండా నిల్వ చేసుకోవాలి. ఇది అత్యంత సారవంతమైనది కాబట్టి.. పంటల పోషణకు ఉపయోగపడుతుంది. ‘లోపలి మట్టి’ అంటే? పైమట్టిని తొలగించిన తర్వాత అదే భూమిలో మీటరు వెడల్పున 4 అడుగుల లోతు వరకు కందకం తవ్వాలి. ఇలా తవ్వి తీసిన మట్టి మొత్తాన్ని ‘లోపలి మట్టి’ (సబ్ సాయిల్) అని పిలుస్తున్నాం. ఈ మట్టిని కుప్పపోసి, కలియదిప్పాలి. ఆ మట్టి మొత్తాన్నీ లోపలి మట్టిగా వాడుకోవచ్చు. లోపలి మట్టిలో(నల్ల రేగడి మట్టిలో మరింత ఎక్కువ) జిగట ఉంటుంది. ఈ జిగట చీడపీడలను సమర్థవంతంగా అరికట్టడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి, లోపలి మట్టిని ఎండబెట్టి వాడితే పోషకాల శాతం పెరుగుతుంది. ఎండబెట్టకుండానే మట్టి ద్రావణం తయారీలో వాడినా పర్వాలేదు. పంటల పోషణ కోసం పిచికారీ ఇలా.. ఎకరానికి 200 లీ. నీరు+ 15 కిలోల పైమట్టి+ 15 కిలోల లోపలి మట్టిని బాగా కలియదిప్పి.. 45 నిమిషాలు ఉంచాలి. పై తేట నీటిని మాత్రమే వడకట్టి పంటలపై సాయంత్రం 4.30 తర్వాత చల్లపూట పిచికారీ చేయాలి. అడుగుకు చేరిన బురదను మొక్కల మొదళ్ల వద్ద వేసుకుంటే బలం. పంటలకు పోషకాలు అందించడానికి వాడే మట్టి నల్ల రేగడి మట్టి అయితే ఎక్కువ ప్రయోజనకరం. పోషకాల కోసం పైమట్టికి బదులుగా క్వారీల దగ్గర నుంచి సేకరించే రాయిపొడిని వాడితే మరీ మంచిది. చీడపీడల నివారణ కోసం పిచికారీ ఇలా.. ► చీడపీడల నివారణకు జిగట ఉన్న ‘లోపలి మట్టి’ని మాత్రమే నీటిలో కలిపి వాడాలి. ఎర్ర మట్టి అయినా, నల్ల మట్టి అయినా అందులో జిగట ఉంటేనే చీడపీడలు పోతాయి. 200 లీ. నీటిలో 20 కిలోల లోపలి మట్టిని వేసి బాగా కలపాలి. అర గంట తర్వాత పైకి తేరుకున్న 170 లీటర్ల నీటిని పంటలపై పిచికారీ చేయాలి. అడుగుకు చేరిన బురదను పంట మొక్కలు, చెట్ల మొదళ్లలో వేసుకోవచ్చు. పైమట్టిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పైమట్టిని కూడా కలిపితే చీడపీడలు త్వరగా కంట్రోల్ కావు. ► మట్టి ద్రావణంతోపాటు ఎకరానికి 2 కిలోల ఆవు పేడ, 2 కిలోల ఆవు మూత్రం లేదా లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా, చేప అమినో ఆమ్లం కలిపితే.. ఉదయం / సాయంత్రం చల్లని వేళ్లల్లో మాత్రమే పిచికారీ చేయాలి. ► పంటల పోషణకు లేదా చీడపీడల నివారణకు కేవలం మట్టి ద్రావణాన్నే పిచికారీ చేయదలచుకుంటే.. 44 డిగ్రీల ఎండకాసేటప్పుడు మిట్ట మధ్యాహ్నమైనా పిచికారీ చేయొచ్చు. ► కూరగాయ తోటలకైతే మట్టి ద్రావణాన్ని 3–4 రోజులకోసారి పిచికారీ చేయాలి. టమాటో, వంగ, బీర తోటలకు వారానికోసారి కొట్టొచ్చు. ► పంటల పోషణ కోసమైతే మట్టి ద్రావణాన్ని కలిపిన అరగంట తర్వాత వడకట్టి వాడాలి. కలిపిన అరగంట తర్వాత 3–4 గంటలలోపు ఎంత తొందరగా వాడితే అంత మంచిది. ► చీడపీడల నివారణ కోసం కలిపిన లోపలి మట్టి ద్రావణమైతే వడకట్టి నిల్వపెట్టుకొని ఎన్నాళ్ల తర్వాతయినా కలియదిప్పి పిచికారీ చేసుకోవచ్చు. ► ఇతర వివరాల కోసం సికింద్రాబాద్‌లోని ఓల్డ్ ఆల్వాల్ వాస్తవ్యుడైన చింతల వెంకటరెడ్డిని 98668 83336 నంబరులో లేదా e-mail: cvreddyind@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. మట్టి ద్రావణం మట్టి ఎరువు, ద్రావణంతో సాగైన ద్రాక్ష తోట -
మట్టి మర్మమెరిగిన మహా రైతు!
సేంద్రియ వ్యవసాయంలో ఆరితేరిన సుప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త డాక్టర్ ఎల్. నారాయణరెడ్డి. కర్ణాటక దొడ్డబళ్లాపూర్ దగ్గరలోని మరలేనహళ్లిలోని తన కలల పంట అయిన సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని అంతర్జాతీయ రైతు శిక్షణా కేంద్రంగా మలిచారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులతో వ్యవసాయం ప్రారంభించిన ఆయన విదేశీ యాత్రికుడి ద్వారా కొన్ని దశాబ్దాల క్రితమే జపాన్‌కు చెందిన ప్రకృతి వ్యవసాయోద్యమకారుడు డాక్టర్ మసనోబు ఫుకుఓకా రచించిన ‘వన్ స్ట్రా రెవెల్యూషన్’ (గడ్డి పరకతో విప్లవం) చేతికి వచ్చిన తర్వాత ప్రకృతి వ్యవసాయం చేపట్టి 40 ఏళ్లు సుభిక్షంగా కొనసాగించారు. ఇటీవల 84 ఏళ్ల వయసులో తన వ్యవసాయ క్షేత్రంలో ఈనెల 14న రాత్రి నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. మన భూముల్లో సేంద్రియ కర్బనం 0.3 శాతం ఉందని అంచనా. అయితే, నారాయణరెడ్డి తన 4.5 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ కర్బనాన్ని 5 మేరకు పెంచారంటే నేలతల్లిని ఆయన ఎంతగా గుండెలకు హత్తుకున్నారో అర్థమవుతుంది. మట్టి మర్మమెరిగి మెసలిన ఆ మహా రైతు, మహోపాధ్యాయుడిని ‘సాక్షి’ దినపత్రిక 2012 జూలైలో తెలుగు రైతులకు తొలిసారి పరిచయం చేసింది. రానున్న కాలం సేంద్రియ రైతుదేనని గొప్ప దార్శనికతతో ప్రకటించిన నారాయణరెడ్డితో ‘సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు అప్పట్లో జరిపిన సంభాషణను పునర్ముద్రిస్తూ ప్రకృతి వ్యవసాయ యోధుడికి అక్షరాంజలి ఘటిస్తున్నాం.. ► వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని మీరెలా చూస్తున్నారు? రైతు శ్రమకు సరైన ప్రతిఫలం దక్కటం లేదు. గిట్టుబాటు ధర దొరకటం లేదు. ప్రభుత్వమే రైతుకు మొదటి శత్రువు. మంచినీటికి ఉన్న ధర పాలకు లేదు. 1960లో రూ. 18 వేలున్న ట్రాక్టర్ ధర ఇప్పుడు(ఏడేళ్ల క్రితం) రూ. 3.5 లక్షలు. వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర దానికి తగ్గట్టు ఎందుకు పెంచటం లేదు? గ్రామాల నుంచి 40 శాతం మంది యువకులు ఏటా పట్టణాలకు వలసపోతున్నారు. వాళ్లను కూడా తప్పుపట్టలేం. వృద్ధులం ఆత్మగౌరవం చంపుకోలేక ఊరు వదల్లేకపోతున్నాం. ► ఈ దుస్థితి ఎక్కడికి దారితీస్తుంది? రాసిపెట్టుకోండి. కొద్ది ఏళ్లలోనే దేశంలో తినడానికేమీ ఉండదు. రెండో హరిత విప్లవం, జన్యుమార్పిడి సాంకేతికత.. వీటి వల్ల ఒరిగేదేమీ ఉండదు. ప్రభుత్వం చేసిన ద్రోహం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. సమాజం రైతులను చిన్నచూపు చూస్తోంది. పదెకరాలుండి ఏటా రూ. 5 లక్షలు సంపాదించే తమిళ బ్రాహ్మణ రైతుకు 42 ఏళ్లొచ్చినా వధువు దొరకడం లేదు. ► మీ వ్యవసాయం గురించి చెప్పండి? బయటి నుంచి కొని తెచ్చిన రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేయం. చెరువు మట్టితో పాటు వానపాములు, ఆకులు ఆలములతో కంపోస్టు తయారు చేసి వేస్తాను. నా పొలంలో 18 ఏళ్ల క్రితం భూసారానికి నిదర్శనమైన జీవన ద్రవ్యం (హ్యూమస్) 0.4 శాతం ఉండేది. ఇప్పుడు(ఆరేళ్ల క్రితం) 3.2 శాతం ఉంది (ఇటీవల ఇది 5 శాతానికి పెరిగింది). ఎండు ఆకు గాలికి పోతుంటే రూ. 5 పోయినట్టేనని బాధపడతాను. మా పొలంలో ఇప్పటికి ఒక్కసారి కూడా చెత్తకు నిప్పు పెట్టలేదు. టేకు, మద్ది, పనస, చింత, సపోట, బటర్ ఫ్రూట్, కొబ్బరి చెట్లను పెంచడంతో పాటు కూరగాయలు, ధాన్యాలు పండిస్తాను. రాగులు, దండిగా కూరగాయలు, పండ్లు తింటాం. మా జీవితం, మా వైభవం రాష్ట్రపతికి కూడా దొరకదు. నేను వ్యవసాయం ప్రారంభించిన మొదట్లో (1972లో) రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడి నష్టపోయా. పొలం అమ్మేసి వ్యాపారం చేదా ్దమనుకున్నాను. సేంద్రియ రైతుగా మారిన నాసా సైంటిస్టు మాట సాయంతో.. మసనోబు ఫుకుఓకా ‘గడ్డి పరకతో విప్లవం’ పుస్తకం చదివి ప్రకృతి వ్యవసాయం చేపట్టి, రెండేళ్లలోనే నిలదొక్కుకున్నాను. ► రసాయనిక వ్యవసాయం ఎందుకు వద్దో వివరంగా చెబుతారా? ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ శాస్త్రం ఒక మిథ్య. చైనాలో వాడుతున్న ఎరువుల్లో 35 శాతం మానవ విసర్జితాల నుంచి వచ్చిన సేంద్రియ ఎరువే. భూమి పైపొరలోని ఒక గ్రాము మట్టిలో 2 కోట్ల 90 లక్షల సూక్ష్మజీవులుంటాయి. రసాయనాల వాడకం వల్ల మన భూముల్లో జీవం నశించింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఎ.ఆర్.) సహాయ సంచాలకుడుగా పనిచేసిన శైలేంద్రనాథ్ 1972లోనే రసాయనిక ఎరువులు పూర్తిగా మాని సేంద్రియ ఎరువులు వాడాలని చెప్పాడు. కానీ, వ్యవసాయంపై టాస్క్‌ఫోర్స్ చైర్మన్ డా. స్వామినాథన్ రసాయనాల్లేకుండా జానానికి తిండి ఎలా పెడతామని ఇప్పటికీ అడుగుతూనే ఉన్నాడు. ప్రభుత్వం చెబుతున్న పద్ధతిలో ఎకరానికి 12 క్వింటాళ్లు పండుతున్న రాగులను నేను 23 క్వింటాళ్లు పండించాను. నిజంగా దిగుబడి పెరగటమే కావాలంటే.. నేను చెప్పిన పద్ధతిని అనుసరించవచ్చు కదా? ► భూసార పరీక్షలు చేశాకే గదా ఎరువులు వేయమంటున్నారు? రసాయనిక ఎరువులు వేసే ముందు భూసార పరీక్షలు చేయించమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏ పోషకం లోపిస్తే ఆ ఎరువును ఎక్కువగా వేస్తున్నారు. బాగానే ఉంది. అయితే, పోషకాలు ఒక పొలంలో ఒక చోట ఉన్నట్లు మరో చోట ఉండవు. పైగా రుతువును బట్టి మట్టిలో పోషకాల స్థాయి మారుతూ ఉంటుంది. అందుకే భూసార పరీక్షలు అసంబద్ధమైనవి. నేను బడిలో చదువుకున్నది నాలుగో తరగతే. వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్లను కూడా నోరు మూయించగలను. మట్టిలో పుట్టి పెరిగిన వాళ్లం. మట్టి రుచి చూసి, చెప్పుల్లేకుండా పొలంలో నడిచి వచ్చి ఆ భూమి గుణగణాలు గ్రహిస్తాం. ► ఎరువుల ద్వారా కాకుండా మరే విధంగా పోషకాలు అందుతాయి? ప్రకృతి సిద్ధంగా పోషకాలు అందే మార్గాలున్నాయి. ఒక చదరపు మీటరు వాతావరణంలో 8 టన్నుల నత్రజని ఉంటుంది. మైకోరైజా అనే సూక్ష్మజీవి వాతావరణంలోని నత్రజనిని గ్రహించి భూమికిస్తుంది. మెరుపు మెరిసినప్పుడు 2,600 సెంటీగ్రేడ్ ఉష్ణం వస్తుంది. మెరుపు నత్రజనిని అమోనియా వాయువుగా మార్చి వర్షంతో కలిపి ఇస్తుంది. కంపోస్టు వేస్తే 26 రోజులకు, యూరియా వేస్తే 35 గంటలకు, మెరుపుల ద్వారా 4 గంటలకే పోషకాలు అంది, పంటల రంగు ముదురు ఆకుపచ్చగా మారుతుంది. దీని లెక్కేమైనా ఉందా ఈ సైంటిస్టుల దగ్గర? గ్రాము వరి మొక్క వేరును ఆశ్రయించి వంద కోట్ల సూక్ష్మజీవులుంటాయి. వేళ్లు స్రవించే ఆమ్లం మట్టిలో 70 శాతం మేర ఉండే ఇసుక, రాళ్ల ముక్కలను కరిగిస్తుంది. కిలో ఇసుక, రాళ్ల ముక్కల్లో మొక్కలకు అవసరమైన 453 గ్రాముల పోషకాలుంటాయి. ► రసాయనిక ఎరువుల వల్ల ప్రయోజనం లేదా..? రసాయనిక ఎరువులో 16 శాతమే పంటకు ఉపకరిస్తుంది. అది కూడా తగుమాత్రంగా తేమ ఉంటేనే. దాని ప్రభావం వేసిన తర్వాత 4 రోజులే ఉంటుంది. రసాయనిక ఎరువులు నేలను విషపూరితం చేస్తాయి. గట్టిపరుస్తాయి. భూమిని గుల్లబరుస్తూ సారవంతం చేసే వానపాములు, సూక్ష్మజీవులు, చెద పురుగులు, చీమలను రసాయనిక ఎరువులు చంపేస్తాయి. గత 60 ఏళ్లుగా రసాయనిక ఎరువులు వేయడం వల్ల మన పొలాల్లో ఏటా ఎకరంలో 16 నుంచి 20 టన్నుల జీవన ద్రవ్యం జీవం కోల్పోయి గట్టిపడిపోతుంటుంది. గుల్లగా ఉండి పంటలకు పోషకాలు అందించే జీవన ద్రవ్యం నీటి తేమను పట్టి ఉంచే శక్తిని కోల్పోయి, రాయి మాదిరిగా మారిపోతుంది. రసాయనిక ఎరువుల వల్ల గట్టిపడిపోయిన పొలాన్ని అరకతో దున్నలేం. ట్రాక్టర్ పెట్టి దున్నాల్సి వస్తుంది. 4 టన్నుల బరువున్న ట్రాక్టర్ తిరిగితే పొలం మరింత గట్టిపడక ఏమవుతుంది? పంజాబ్ రైతులు 75 హెచ్.పి. ట్రాక్టర్ వాడేవాళ్లు. ఇప్పుడు 135 హెచ్.పి. ట్రాక్టర్ వాడుతున్నారు. పొలాల్లో మానులను కొట్టేశారు. భూమికి ఆచ్ఛాదన ఏమీ లేకుండా పోయింది. పంట నూర్చిన తర్వాత చెత్తకు నిప్పు పెడుతున్నారు. ఇది చాలా తప్పు. గట్టిపడిపోయిన నేలకు నీడలేక, గాలి ఆడక, నీరు అందక నిస్సారమైపోతోంది. ► భూసారం అందుకే తగ్గిపోతోందా..? దక్కన్ పీఠభూమిలో 1960లో పొలాల్లో జీవన ద్రవ్యం 3 శాతం ఉండేది. హరిత విప్లవం ఫలితంగా గత 58 సంవత్సరాల రసాయనిక కృషి వల్ల మన భూముల్లో 3% ఉన్న సేంద్రియ కర్బనం ఇప్పుడు 0.3%కు తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. పైన జానెడు మన్నులో ఎకరానికి 90 టన్నులు ఉండాల్సిన సేంద్రియ కర్బనం 3 టన్నులకు వచ్చిందంటే మనం భూమికి ఎంత ద్రోహం చేశామో, మనకెంత ద్రోహం చేసుకున్నామో తెలుస్తుంది. అనంతపురం జిల్లాలో 0.27 శాతానికి తగ్గిపోయింది. వర్షానికి పొలంలో నుంచి ఎర్రనీళ్లు పారుతూ ఉంటాయి కదా. అదే భూమికి బలాన్నిచ్చే జీవన ద్రవ్యం. పూర్వీకులు పెంచిన పెద్ద చెట్లు కొట్టేయడం, రసాయనిక ఎరువులు వాడటం వల్ల సాగునీటి అవసరం పది రెట్లు పెరిగింది. భూమి గట్టిపడిపోవటం వల్ల వేర్లకు ప్రాణవాయువు కూడా అందటం లేదు. ► రైతు సోదరులకు ఇంకేమైనా చెప్తారా? జీవన శైలిని మార్చుకోవాలి. ఒకర్ని చూసి మరొకరు ఏదీ చేయకూడదు. ఇంకొకరి కోసం బతకకూడదు. మనకి తగినట్టుగానే మనం బతకాలి. ఎవరికీ భయపడకూడదు. సంగటి తింటామని చెప్పుకోవటం నామోషీ కాకూడదు. సంస్కృతి, సంప్రదాయక ఆహారం అంతరించిపోయాయి. ఈ రెంటినీ కాపాడుకుంటున్న జపాన్ వంటి దేశాలు ఎన్ని సునామీలొచ్చినా కూలిపోవు. ఉత్పాదక భూములు(ప్రొడక్టివ్ సాయిల్స్), ఉత్పాదక ప్రజలు (ప్రొడక్టివ్ పీపుల్) ఉన్న దేశమే బాగుంటుంది. కానీ, ఇప్పుడు మనుషులు వ్యాధిగ్రస్తులై పనిచేసే మనుషులు, శక్తివంతులుగా ఉండే మనుషులు ఎందరున్నారన్నది ప్రశ్న. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే మొదట భూమి ఆరోగ్యం బాగుండాలి. సాయిల్ హెల్త్ బాగుంటే మంచి ఆహారం దొరుకుతుంది. ఆరోగ్యం దొరుకుతుంది. మన రాజకీయ నాయకులు అందరూ సేంద్రియ వ్యవసాయం గురించి ఆలోచించాలి. పెరిగిన జనాభాకు సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆహారం పండించగలమా అని అడుగుతూ ఉంటారు. నేను చెబుతున్నాను.. నిస్సందేహంగా పండించగలం. నేలతల్లిని మనం ప్రేమించి సేంద్రియ కర్బనం పెంచుకుంటే మనకు, ముందు తరాలకూ ఆరోగ్యం, ఆనందం, సంపద కూడా దొరుకుతుంది. ► రైతులు చేయాల్సిందేమిటి? నారాయణరెడ్డి: రైతులు చేయాల్సిన పనులు ఐదు ఉన్నాయి. 1. మల్చింగ్ : పొలానికి ఆచ్ఛాదన కల్పించాలి. ఇందుకోసం ఎకరానికి 25 చెట్లు.. 4,5 రకాలు పెంచుకోవాలి. చెట్లలో 20 శాతం మల్చింగ్ రొట్ట కోసం (సుబాబుల్, అవిశ, గిరిపుష్పం లేదా గ్లైరిసీడియా వంటి చెట్లు), 20 శాతం (జిల్లేడు, వయ్యారిభామ – దీని పువ్వు రాక ముందే కోసెయ్యాలి – కానుగ, వేప వంటి చెట్లు), 40 శాతం మెట్ట నేలల్లో పెరిగే (చింత, మామిడి, నేరేడు, సీతాఫలం, సపోట, పనస వంటివి) చెట్లు, మిగతా 20 శాతం (టేకు, మలబారు వేప వంటి) కలప చెట్లు పెంచాలి. 20 ఏళ్ల చెట్టు రోజుకు 40 లీటర్ల నీటి తేమను వాతావరణంలోకి వదులుతుంది. చెట్లు పొలంలో ఉండటం వల్ల సూక్ష్మ వాతావరణం ఏర్పడుతుంది. అత్యంత ఖరీదైన వ్యవసాయ ఉపకరణం సూర్యరశ్మి. పెద్ద చెట్లున్న ఎకరంలో సూర్యరశ్మిని, గాలిని 3 రెట్లు ఎక్కువగా వినియోగించుకోవచ్చు. 2. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడకుండా ఉండటం. 3.వర్మీ కంపోస్టు కొనకుండా స్వయంగా తయారు చేసుకొని వాడటం. 4. చెరువు మట్టి తోలుకోవటం. 5. పురుగుమందులకు బదులు ఆకుల కషాయాలు, పశువుల మూత్రం వాడటం. దేశవాళీ ఆవు విసర్జితాల్లో ఔషధ గుణాలున్నాయి. జెర్సీ ఆవైనా దాని తల్లి మన ఊళ్లో పుట్టినదై ఉంటే ఫర్వాలేదు. మన వేప గింజల ద్రావణానికి మించిన పురుగుమందు లేదు. రైతు అన్ని విధాలా స్వయం సమృద్ధి సాధిస్తేనే మనుగడ సాధ్యమని రుడాల్స్ స్టైనర్ వంటి వాళ్లు 90 ఏళ్ల క్రితమే చెప్పారు. డాక్టర్ లక్ష్మయ్య నారాయణరెడ్డి బడిలో చదివింది 4వ తరగతే అయినా, పొలాన్ని అనుదినం అధ్యయనం చేస్తున్న నిత్య విద్యార్థి. బయటి నుంచి ఏదీ కొనే పని లేకుండా వ్యవసాయం చేస్తూ బతికి బట్టకట్టడం ఎలాగో ఆయనను చూసి నేర్చుకోవాల్సిందే. ‘లీసా ఇండియా’ ఆంగ్ల మాసపత్రికలో రైతుగా తన అనుభవాలను ఆయన రాస్తుంటారు. హంపీ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది. నలభయ్యేళ్లుగా సేద్యం చేస్తున్న ఆయన ముగ్గురు కుమారులూ రైతులే. ఆయన తన పొలంలో ‘పరాశర కృషి గురుకులం’ నడుపుతున్నారు. కాలేజీల్లో వ్యవసాయ శాస్త్రం చదివిన వాళ్ల ఆలోచనా విధానాల వల్లే దేశం గుల్లయ్యిందని, రాబోయే కాలం తనలాంటి రైతు శాస్త్రవేత్తలదేనని నారాయణరెడ్డి నిండైన ఆత్మవిశ్వాసంతో ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు. ఆ సంభాషణ ముఖ్యాంశాలు.. -
బూడిద.. ఆ రైతు జీవితాన్నే మార్చేసింది!
ఈ ఫొటోలో ఉన్న రైతు శాస్త్రవేత్త పేరు నువిమన. అతను ఆఫ్రికా దేశం బురుండిలోని కబుయెంగె కొండ ప్రాంతంలో తన తోటి రైతులతో పాటు టమాటాలను ఎక్కువగా పండిస్తుంటారు. సీజన్లో కొనే వారే లేక పండించిన సగం టమాటాలను పారబోస్తుంటారు. ఆ తర్వాత ధర బాగా పెరుగుతుంది. కోల్డ్ స్టోరేజ్ సదుపాయం లేదు. అటువంటి పరిస్థితుల్లో టమాటాలను ఏవిధంగా నిల్వ చేయగలమని అనేక పద్ధతుల్లో ప్రయత్నిస్తూనే ఉండగా.. ఒకానొక రోజు చక్కని పరిష్కారం దొరికింది. అనుకోకుండా చెట్టు కింద బూడిదలో ఉండిపోయిన టమాటాలు నెలల తరబడి చెడిపోకుండా ఉండటాన్ని గుర్తించి ఎగిరి గంతేశాడు. టమాటాలను అట్టపెట్టెల్లో నింపి.. ఆపైన బూడిద పోసి నిల్వ చేశాడు. ఐదు, ఆరు నెలల పాటు చెడిపోకుండా అలాగే ఉంటున్నాయి! ఈ ఆవిష్కరణ రైతు నువిమన జీవితాన్నే మార్చేసింది. పండించిన ప్రతి టమాటానూ అమ్ముకోగలుగుతున్నాడు. అన్‌సీజన్‌లో టమాటాలను హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు. తానే ఒక చిన్నపాటి హోటల్ నడుపుతున్నాడు. ట్రక్కు కొని నలుగురికి ఉపాధి కల్పిస్తానని గర్వంగా చెబుతున్నాడు రైతు శాస్త్రవేత్త. ఈ టెక్నిక్‌ను టమాటా సాగుకు ప్రసిద్ధిచెందిన సిబిటొకె ప్రాంతంలో రైతులు చాలామంది ఉపయోగిస్తున్నారు. నువిమనకు జేజేలు పలుకుతున్నారు. విత్తనాలను బూడిదలో భద్రపరుచుకోవడం తరతరాలుగా తెలిసిందే. బూడిదలో ఉంచిన టమాటాలు ఆరోగ్యానికి మంచిదేనా? బురుండికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త జీన్ నివ్యబండిని అడిగితే.. ‘ఏం పర్వాలేదు. బూడిద వల్ల టమాటాలపై ఎటువంటి దుష్ప్రభావం ఉండదు. నిస్సంకోచంగా తినొచ్చు. అయితే, ప్రభుత్వ వ్యవసాయ విభాగం లోతైన అధ్యయనం చేయటం మంచిది’ అన్నారు. -
ట్రాక్టరు చిన్నది.. పనితనం పెద్దది!
రైతుల్లో చిన్న రైతులు 80% మంది ఉన్నప్పటికీ.. వీరికి అనువైనవి, అందుబాటులో ఉండే వ్యవసాయ యంత్ర పరికరాలు మాత్రం తక్కువే! ఈ కొరత తీర్చడానికి చిన్నపాటి ట్రాక్టర్‌ను ఒక గ్రామీణ రైతు శాస్త్రవేత్త తయారు చేశాడు. చదువు తక్కువే అయినా గొప్ప ప్రజ్ఞ చూపారు. పత్తి, మిరప, అపరాలు, కూరగాయ పందిరి తోటల్లో.. ఇంకా చెప్పాలంటే 40 అంగుళాల వెడల్పు సాళ్లుండే మెట్ట, ఆరుతడి పంటలు, పండ్ల తోటలన్నిటిలోనూ సేద్యపు పనులకు చక్కగా ఉపయోగపడుతుంది. దుక్కి, పైపాటు చేయటం, బోదెలు తోలటం, ఎరువులు వేయటం, కషాయాలు/జీవామృతం పిచికారీ చేయటం, 6 క్వింటాళ్ల వరకు సరుకు రవాణా.. ఈ అన్ని పనులకూ ఉపయోగపడే అతి చిన్న ట్రాక్టరు రైతులకు అందుబాటులోకి వచ్చింది. చాలా తక్కువ బరువు(200 కిలోలు) ఉండటం, ముందు – వెనక్కి వెళ్లేందుకు గేర్లు కూడా ఉండటం విశేషం. ఇటువంటి రైతు శాస్త్రవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తే చిన్న రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. జిల్లోజు సైదాచారి స్వస్థలం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలోని కందగట్ల గ్రామం. చదివింది ఏడో తరగతే. అయితే, చిన్న రైతులకు ఉపయోగపడే వ్యవసాయ పరికరాలను తయారు చేయటంలో దిట్ట. ఇనుప ఎడ్లబండ్లు, ఇనుప నాగళ్లు, ఎడ్లతో ఉపయోగించే రోటవేటర్‌ను తయారు చేసి ఆ ప్రాంత రైతుల అభిమానాన్ని చూరగొన్న సైదాచారి.. మరో అడుగు ముందుకేసి చిన్న రైతుకు ఉపయోగపడే చిన్నపాటి ట్రాక్టరును తయారు చేసి అందర్నీ ఆకర్షిస్తున్నారు. కూలీల కొరతతో సాగు కనాకష్టంగా మారుతున్న తరుణంలో ఖరీదైన వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేసే స్థోమత లేని కొద్దిపాటి వ్యవసాయం ఉన్న రైతులకు సైదాచారి తయారు చేసే యంత్రపరికరాలు అక్కరకొస్తున్నాయి. మెట్ట పంటల సాగుకు అన్నివిధాలా ప్రయోజనకారిగా ఉండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. సైదాచారి తండ్రి గ్రామంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు తయారు చేయడంతోపాటు మరమ్మతులు చేసేవారు. ఏడో తరగతి వరకు చదువుకున్న సైదాచారి అప్పట్లో కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కార్పెంటర్ పని నేర్చుకున్నారు. సాదాసీదా పనిముట్లతో సరిపెట్టుకోకుండా తక్కువ ఖర్చుతో చిన్న రైతులకు ఉపయోగపడే సరికొత్త యంత్రాలు తయారు చేయాలన్న తపనతో తాజాగా మినీ ట్రాక్టరును ఆవిష్కరించారు. ఆయన చేపట్టిన వినూత్న ప్రయోగాలకు భార్య జ్యోతి తోడూ నీడగా నిలుస్తున్నారు. మినీ ట్రాక్టరును రూపొందించే క్రమంలో రెండేళ్ల క్రితం టిల్లర్‌ను రూపొందించారు. దానికి మంచిపేరే వచ్చినా రైతులు స్వయంగా వాటిని నెడుతూ బలాన్ని ప్రయోగించాల్సి ఉండడంతో.. ఆ ఇబ్బందులు లేని మినీ ట్రాక్టరును లక్ష్యంగా పెట్టుకొని, పట్టుదలతో సాధించారు. మినీ ట్రాక్టరు తయారీ ఇలా.. 5 హెచ్‌పీ సామర్ధ్యం గల చైనా ఇంజిన్, రెండు టిల్లర్ టైర్లు, మరో రెండు ఆటో టైర్లను, సామిల్లులో వాడే బేరింగ్లను సైదాచారి మినీ ట్రాక్టరు తయారీలో వాడారు. బెల్టుల సాయంతో టైర్లు తిరిగేలా రూపకల్పన చేశారు. ఇనుప అబ్బులు, డిస్క్‌లను సొంతంగా తీర్చిదిద్దారు. ముందుకు, వెనక్కి వెళ్లేలా గేర్లను అమర్చి చిన్న ట్రాక్టరును ప్రయోజనకరంగా, అందంగా ఆవిష్కరించారు. ఈ క్రమంలో సైదాచారికి జీవిత భాగస్వామి జ్యోతి ప్రోద్భలం ఎంతో ఉంది. సైదాచారి ఒక మనిషి సహాయంతో రూ.70 వేల ఖర్చుతో 15 రోజులకు ఒక ట్రాక్టరును శ్రద్ధగా తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు మినీ ట్రాక్టర్లను రూ. 90 వేల చొప్పున విక్రయించారు. మినీ ట్రాక్టరుతో పాటు దీనికి జోడించి (20 కిలోల)ఎరువులు వేసే డబ్బా, గొర్రు, గుంటక, కూరగాయ తోటలకు బోదెలు పోసే పరికరాన్ని కూడా ఇస్తున్నారు. ట్రాలీని విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది. 6 క్వింటాళ్ల వరకు బరువు లాగే శక్తి ఈ మినీ ట్రాక్టరుకు ఉంది. మినీ ట్రాక్టరు గురించి ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న రైతులు అనేక జిల్లాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. లీటరు డీజిల్‌తో ఎకరం దుక్కి 3 అడుగుల ఎత్తు, 27 అంగుళాల వెడల్పు, 50 అంగుళాల పొడవుతో.. కేవలం 200 కిలోల కన్నా తక్కువ బరువుండే తన మినీ ట్రాక్టర్.. మెట్ట/ఆరుతడి పంటల సాగుకు ఎంతో ప్రయోజనకారని సైదాచారి చెబుతున్నారు. 10 ఎకరాలు సాగుచేస్తున్న రైతు అవసరాలన్నింటినీ తీర్చగలద.ని, లీటర్ డీజిల్‌తో సుమారు ఎకరం దున్నుకునేందుకు వీలుంది. పత్తి పంట 5 అడుగుల ఎత్తు పెరిగే వరకు పాటు చేసేందుకు, మందు చల్లేందుకు సులువుగా ఉంటుంది. మిర్చి, చెరకు, పసుపు, మల్బరీ, నిమ్మ తోటలతో పాటు కూరగాయల సాగులో దున్నకానికి అనుకూలంగా ఉంటుంది. 20 కిలోల డబ్బాతో ఎరువు వేసుకోవచ్చు. స్ప్రే పంపును అనుసంధానం చేసుకుంటే 50 లీటర్ల ట్యాంకుతో పురుగుమందులను, కషాయాలను, ద్రవరూప ఎరువులను అరగంటలో ఎకరానికి పిచికారీ చేయవచ్చు. బోరులో మోటారు రిపేరు వస్తే.. ఒక్క మనిషే ఈ ట్రాక్టరు సాయంతో మోటారును బయటకు తీయవచ్చు. ఇలాంటి గ్రామీణ ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రొత్సాహం అందిస్తే తమకు తక్కువ ధరకు వ్యవసాయానుకూల ట్రాక్టరు దొరకుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. – జలగం మల్లయ్య, సాక్షి, ఆత్మకూర్(ఎస్), సూర్యాపేట జిల్లా ప్రభుత్వం ప్రొత్సహిస్తే తక్కువ ధరకే మినీ ట్రాక్టరు అందిస్తా! చిన్న రైతుల వ్యవసాయావసరాలకు అనుగుణంగా పనిముట్లను తయారు చేస్తున్నాను. అందులో భాగంగానే మినీ ట్రాక్టరును తయారు చేశాను. దీనికి రిపేర్లు రావు. చైన్లు మార్చుకోవాల్సి వస్తే, రైతులే కొత్త చైన్లు తెచ్చి మార్చుకోవచ్చు. ఇదెలాగో రైతుకు నేనే నేర్పిస్తా. ఒక వేళ బేరింగ్ పోతే మెకానెక్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. కేవలం 200 కిలోల బరువుండే ఇంత చిన్నదైన, ఇన్ని పనులు చేసే చిన్న ట్రాక్టరు నాకు తెలిసి దేశంలోనే మరెక్కడా లేదు. కూరగాయ పందిరి తోటల్లో కూడా నిశ్చింతగా దీన్ని ఉపయోగించవచ్చు. చిన్న, సన్నకారు రైతులు మెట్ట పొలాల్లో దీంతో సాగు చేసుకోవచ్చు. మామిడి, నిమ్మ తోటలతో పాటు పత్తి, మిర్చి, చెరుకు, పసుపు, కూరగాయల తోటల రైతులకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుతో ఫలితం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం ప్రొత్సహిస్తే చిన్న ట్రాక్టరును రూ. 90 వేల కన్నా తక్కువ ధరకే ఇవ్వగలుగుతా. చిన్న రైతులకు ఉపయోగపడే మరిన్ని పనిముట్లను తయారుచేసి తక్కువ ధరకు అందిస్తా. – జిల్లోజు సైదాచారి (99512 52280), కందగట్ల, ఆత్మకూర్(ఎస్) మండలం, సూర్యాపేట జిల్లా జాతీయ స్థాయి గుర్తింపునకు కృషి సైదాచారి గ్రామీణ ఆవిష్కర్తగా 20 ఏళ్ల నుంచి స్థానిక రైతుల అవసరాలకు అనుగుణంగా యంత్రపరికరాలు తయారు చేస్తున్నారు. మొదటి నమూనాను పాత విడి భాగాలతో తయారు చేయటం ద్వారా ఖర్చును, వనరులను ఆదా చేయటం.. తాను రూపొందించిన యంత్ర పరికరాలను మొదట తాను ఉపయోగించిన తర్వాతే ఇతరులకు ఇవ్వటం.. తక్కువ ఖర్చుతో చిన్న రైతులకు మెట్ట సేద్యంలో ఉపయోగపడే మినీ ట్రాక్టర్‌ను తయారు చేయటం ఆయన సృజనాత్మకతకు నిదర్శనాలు. పల్లెసృజన, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా ఈయన ఆవిష్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడానికి కృషి చేస్తాం. మార్చిలో రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసే ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్‌లో సైదాచారి మినీ ట్రాక్టర్‌ను ప్రదర్శింపజేయడానికి ప్రయత్నిస్తున్నాం. – విశ్రాంత బ్రిగేడియర్ పోగుల గణేశం (98660 01678), అధ్యక్షులు, పల్లెసృజన, సైనిక్‌పురి, సికింద్రాబాద్. మినీ ట్రాక్టర్‌తో అంతర సేద్యం మినీ ట్రాక్టర్‌కు అనుసంధానించిన ట్రాలీ రైతు శాస్త్రవేత్త సైదాచారి కుటుంబాన్ని అభినందిస్తున్న పల్లెసృజన అధ్యక్షులు గణేశం, ఉపాధ్యక్షులు శ్రీకర్ -
మొక్కల మాంత్రికుడు!
► అత్యాధునిక బ్రీడింగ్ పద్ధతులపై అనితరసాధ్యమైన పట్టు సాధించిన రైతు శాస్త్రవేత్త రెడ్డియార్ ► రైతులకు సిరిసంపదలనందించే విశిష్టమైన సరుగుడు, కనకాంబరం, వంగ, తోటకూర తదితర వంగడాల రూపశిల్పి ► వెతుక్కుంటూ వచ్చిన పద్మశ్రీ పురస్కారం, రెండు డాక్టరేట్లు సహా 40 అవార్డులు అతని చేయి తగిలితే అడవి మొక్కయినా రైతులకు నచ్చే అద్భుత వంగడంగా మారిపోతుంది. ఆయన చదువు నాలుగో తరగతే గానీ.. అకుంఠిత దీక్ష, పట్టుదలతో మైక్రో ప్రోపగేషన్ నుంచి గామా రేడియేషన్ వరకు అసాధారణమైన బ్రీడింగ్ నైపుణ్యాలన్నిటినీ అందిపుచ్చుకొని తనకు తానే సాటని చాటుకున్నారు. సరుగుడు మొక్కలు ఆయన చెప్పినట్టు నెలకో అడుగు చొప్పున చేనంతా ఒకే ఎత్తులో పెరిగి రైతుకు సిరులు కురిపిస్తాయి. కనకాంబరాలు ఆయనకు నచ్చిన రంగుల్లోకి మారి సీతాకోక చిలుకల్లా ఆయన చూపుడువేలిపై వాలుతాయి. ఎక్కువ కాలం వాడిపోకుండా తాజాగా ఉంటాయి. వంగ మొక్కకు ఆయన చేయి తగిలిందంటే.. వంగ చెట్టుగా మారిపోయి.. అనేక ఏళ్ల తరబడి ఒకటికి రెండు, మూడు రకాల వంకాయలను కాస్తుంది! తోటకూర మొక్క నాలుగు నెలల్లో 6 అడుగులు పెరుగుతుంది. ఆయన ముట్టుకున్న మిరప కాయలు కమ్మని నెయ్యి వాసనతో నోరూరిస్తాయి... జన్యుమార్పిడి చేయకుండానే ఇన్ని అద్భుతాలు సృష్టిస్తున్న అద్భుత రైతు శాస్త్రవేత్త పేరు పద్మశ్రీ, డాక్టర్ వెంకడపతి రెడ్డియార్. ఈ విలక్షణ వంగడాలు 7 రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులకు ఆదాయ భద్రతను సమకూర్చుతున్నాయి. కేవలం 30 సెంట్ల స్థలంలో తన నర్సరీ ద్వారా నెలకు 30 లక్షల నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేస్తూ.. ఏటా రూ. 3 కోట్లు ఆర్జిస్తున్నారు! అసామాన్య రైతు శాస్త్రవేత్త రెడ్డియార్ విశేష కృషిపై ‘సాగుబడి’ ప్రత్యేక కథనం.. పాండిచ్చేరిలోని కూడపాకం గ్రామంలో ఓ పేద రైతు కుటుంబంలో పుట్టి నాలుగో తరగతిలోనే బడి మానేసిన టి. వెంకడపతి రెడ్డియార్ (72) పట్టుదల, స్వయంకృషితో అద్భుత వంగడాలను ఆవిష్కరించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. సుమారు 300 ఏళ్ల క్రితం రెడ్డియార్ వంశస్తులు ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చి పాండిచ్చేరిలో స్థిరపడ్డారు. తనకున్న కొద్దిపాటి స్థలంలో నలభయ్యేళ్ల క్రితం జీవనోపాధి కోసం కనకాంబరం పూల సాగు చేపట్టారు. కనకాంబరాలకు గిరాకీ ఉండడంతో నిలదొక్కుకున్నారు. ఆ క్రమంలోనే మెరుగైన మొక్కలను గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో విడిగా పెంచడం నేర్చుకున్నారు. కనకాంబరం పూలరంగును మార్చితే మరింత ప్రయోజనం ఉంటుందన్న ఆకాంక్షతో పెరియకులం హార్టీకల్చర్ సెంటర్ శాస్త్రవేత్తలు డా. సంబంధ మూర్తి, డా. శ్రీరంగస్వామిలను సంప్రదించారు. వారి సలహా మేరకు బ్యాంకు రుణం తీసుకొని మిస్ట్ ఛాంబర్‌ను నిర్మించి 1972 నుంచి ప్రయోగాలను ముమ్మరం చేశారు. మంచి ఆదాయాన్నిచ్చే కనకాంబరాన్ని ఎంచుకున్నారు. అనేక కొత్త వంగడాలను సృష్టించారు. ప్రస్తుతం తన ఇంటి వద్దనే రెండు చిన్న పాలీహౌస్‌లు, రెండు చిన్న మిస్ట్ ఛాంబర్లు ఏర్పాటు చేసుకొని భార్య విజయాళ్ సహకారంతో నెలకు 30 లక్షల వరకు సరుగుడు, కనకాంబరం తదితర మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు. తన కుమార్తె శ్రీలక్ష్మి తోడ్పాటుతో ఆంగ్లంలోని ఉద్యానశాస్త్ర మెలకువలను ఔపోశన పట్టడం విశేషం. ‘ఢిల్లీ’ కనకాంబరానికి అమిత ఆదరణ! రెడ్డియార్ ఇప్పటికి సుమారు 500 రకాల కనకాంబరాలను సృష్టించగా, అందులో ‘సౌందర్య (ఢిల్లీ) కనకాంబరం’ అమిత ఆదరణ పొందిన ఉత్తమ వంగడంగా నిలిచింది. ముదురు నారింజ రంగు, నిల్వ సామర్థ్యం, అధికోత్పత్తి దీని ప్రత్యేకతలు. గోధుమ రంగు చుక్కల తెగులును తట్టుకుంటుంది. జనవరి నుంచి ఆగస్టు వరకు ఎకరానికి రోజుకు 25 కిలోల పూల దిగుబడినిస్తుంది. వర్షాకాలంలో దిగుబడి తక్కువగా ఉంటుంది. పాలీహౌస్లో ఏడాది పొడవునా పూల దిగుబడినిస్తుందని రెడ్డియార్ తెలిపారు. విత్తనాలు రాని ‘స్టెరైల్’ కనకాంబరం రకాలను రూపొందించారు. కిలోకు 60 వేల పూలు తూగుతాయి. 60 మూరల దండ కట్టి మూర రూ. 20 చొప్పున అమ్ముతున్నారని.. సింగపూర్, మలేషియాలకు కూడా ఎగుమతి చేస్తున్నారన్నారు. ఎకరంలో ఇతర పంటలు పండించిన దానికన్నా 10 సెంట్లలో కనకాంబరాలు పండిస్తే అధికాదాయం వస్తుందని రెడ్డియార్ అనుభవపూర్వకంగా చెబుతున్నారు. స్థానిక రకంతో పోల్చితే రెట్టింపు ధర వస్తుండడంతో దేశవ్యాప్తంగా రైతులు ఆసక్తి చూపుతున్నారన్నారు. మోడి, కలాం పేర్లతో కూడా ప్రత్యేక కనకాంబరం వంగడాలను రూపొందించారు. 3–5 ఏళ్లు కాపునిచ్చే వంగ చెట్టు! గామా రేడియేషన్ ప్రక్రియలో రెడ్డియార్ ఆవిష్కరించిన దీర్ఘకాలిక వంగ వంగడం 3–5 ఏళ్ల పాటు ఏడాదికి రెండు విడతలుగా మంచి దిగుబడినిస్తుంది. సిసోరియం విల్ట్, నెమటోడ్ విల్ట్, బ్యాక్టీరియా విల్ట్, వెట్టిసిలి విల్ట్లను ఈ వంగడం తట్టుకుంటుంది. సొలానమ్ ట్రోవమ్ అనే అడవి జాతి మొక్క కాండంపై వంగ కొమ్మలను గ్రాఫ్టింగ్ చేశారు. ఈ వంగడం 12 అడుగుల ఎత్తువరకు పెరుగుతుందని రెడ్డియార్ ‘సాగుబడి’కి తెలిపారు. 6 నెలలకోసారి కొమ్మలు కత్తిరిస్తే కొత్త కొమ్మలకు కాయలు కాస్తాయన్నారు. పాలీహౌస్లో అయితే ఏడాది పొడవునా కాపు వస్తుందన్నారు. అధిక వర్షాల వల్ల పొలంలో నీరు నిలిచినా ఈ వంగ మొక్కలు దెబ్బతినవన్నారు. ఒకే చెట్టుకు రెండు, మూడు రకాల వంకాయ కొమ్మలను కూడా గ్రాఫ్టింగ్ చేస్తున్నారు. వేగంగా పెరిగే సరుగుడు రెడ్డియార్ ప్రతిభా సంపన్నతకు మరో నిదర్శనం ఆయన రూపొందించిన అధిక కలప దిగుబడినిచ్చే సరుగుడు రకాలు. థాయ్‌లాండ్ నుంచి మెరుగైన వంగడాన్ని తెప్పించి, స్థానిక సరుగుడు రకాలతో సంకరం చేసి 14 రకాల సరుగుడు వంగడాలను ఆయన రూపొందించారు. వాటిల్లో ముఖ్యమైనవి మూడు: ఎం.ఐ.క్యు., మోడి (2012), కలాం (2013). మోడి రకం సరుగుడు చెట్లు వేగంగా పెరిగి మూడున్నరేళ్లలో ఎకరానికి 140 టన్నుల దిగుబడినిస్తాయని రెడ్డియార్ తెలిపారు. కలాం రకం 4 ఏళ్లలో 140 టన్నుల దిగుబడినిస్తుంది. రసాయనిక ఎరువులతోపాటు అడపా దడపా నీటి తడులు ఇస్తే ఈ దిగుబడి వస్తుందన్నారు. రసాయనిక ఎరువులు వేయకపోతే 80–100 టన్నుల కలప దిగుబడి వస్తుందన్నారు. సరుగుడు, కనకాంబరం వంటి ఆహారేతర పంటలకు రసాయనిక ఎరువులు తగుమాత్రంగా వాడాలంటున్న రెడ్డియార్.. ఆహార పంటలను సేంద్రియ పద్ధతుల్లో పండించడం మేలంటున్నారు. 15 రోజుల్లో మొక్కలు సిద్ధం.. పొలంలో 8 అడుగుల దూరంలో రెండున్నర అడుగుల లోతున నీటి కాలువలు తీసి.. కాలువ గట్టుపైన 3 అడుగుల దూరంలో సరుగుడు మొక్కలు నాటుకోవాలని ఆయన సూచించారు. 10 సెంట్లలో వరి సాగు చేసే నీటితో 100 ఎకరాల్లో సరుగుడును సాగు చేయొచ్చన్నారు. మొక్క నాటిన 3వ రోజు నీరివ్వాలి. మొదటి, రెండు నెలల్లో వారానికోసారి కాల్వల్లో మాత్రమే నీటిని పారించాలి. కాల్వల మధ్య ప్రదేశంలో నీరు పెట్టనక్కర్లేదు. 3వ నెల నుంచి నెలకోసారి నీరిస్తే చాలు. సముద్ర తీర ప్రాంతాల్లో, భూగర్భ జలాల్లో ఉప్పదనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా సరుగుడు చక్కగా పెరుగుతుందని రెడ్డియార్ వివరించారు. నెలకు అడుగు చొప్పున ఐదేళ్లలో 60 నుంచి 75 అడుగుల ఎత్తు పెరుగుతాయని, రెండున్నర అడుగుల చుట్టుకొలత గల నిటారుగా ఎదిగిన సరుగుడు బాదులు నాటిన మొక్కల్లో 80% వరకు వస్తాయని చెప్పారు. పిహెచ్ 8–9 వరకు ఉన్న నేలల్లోనూ సరుగుడు బాగా పెరుగుతుంది. యూకలిప్టస్ ఆకులు భూమిని పాడుచేస్తాయని, సరుగుడు వేళ్లు నత్రజనిని భూమిలో స్థిరీకరింపజేయడంతోపాటు ఆకులు కూడా భూసారాన్ని పెంచుతాయన్నారు. వెజిటేటివ్ ప్రాపగేషన్ పద్ధతిలో 15 రోజుల్లో సరుగుడు మొక్కలను అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. తన సొంత డిజైన్‌తో స్వల్ప ఖర్చుతో నిర్మించుకున్న రెండు పాలీహౌస్‌లలో నెలకు 30 లక్షల మొక్కలను ఉత్పత్తి చేస్తూ.. ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. ఏటా రూ. 3 కోట్ల ఆదాయం పొందుతున్నట్లు రైతు శాస్త్రవేత్త రెడ్డియార్ సగర్వంగా చెప్పారు. 6 అడుగుల తోటకూర గామా ఎక్స్‌రే యూవీ రేడియేషన్ పద్ధతిలో ఆరు అడుగుల ఎత్తు పెరిగినా కూరగా వండుకోవడానికి అనువుగా ఉండే తోటకూర వంగడాన్ని రెడ్డియార్ రూపొందించారు. ముదిరిన కాండంలో కూడా తగుమాత్రంగా పీచు ఉండటం, రుచికరంగా ఉండడం విశేషం. తోటకూర మొక్క నెలలో అడుగు ఎత్తు పెరిగిన తర్వాత 4 అంగుళాల ఎత్తులో కోస్తే.. చుట్టూ పిలకలు వస్తాయి. 4 నెలల్లో 6 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని కంకి కూడా 2 అడుగులకుపైగా పెరుగుతుందన్నారు. ఇందులో ఆకుపచ్చ, ఎరుపు రంగులున్నాయి. ఇంటిపంటగా పెంచే వారికీ, వాణిజ్యపరంగా సాగు చేసే రైతులకు కూడా ఈ వంగడం మంచి ఆదాయాన్నిస్తుందన్నారు. విలక్షణమైన ఓ పొట్టి మిరప వంగడాన్ని కూడా రెడ్డియార్ రూపొందించారు. దీన్ని కూరలో వేస్తే నెయ్యి వాసన వస్తుంది. కలాం సిఫారసు.. మర్రిచెన్నారెడ్డి తమిళనాడు, పాండిచ్చేరి గవర్నర్‌గా ఉన్నప్పుడే రెడ్డియార్ సేవలను గుర్తించి విద్యుత్ ధరలో రాయితీని ప్రకటించారు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం సిఫారసుతో కల్పాకంలోని ఇందిరాగాంధీ అణు పరిశోధనా స్థానంలోని శాస్త్రవేత్తల సహకారంతో గామా ఎక్స్‌రే యూవీ రేడియేషన్ పద్ధతిలో మేలైన వంగడాల అభివృద్ధికి ఆయన శ్రీకారం చుట్టడం విశేషం. రెడ్డియార్ అభివృద్ధి చేసిన కనకాంబరం, సరుగుడు వంగడాల విశిష్టతలను నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గుర్తించి.. రెండు దఫాలు అవార్డులను ప్రదానం చేసింది. అంతేకాకుండా.. ‘ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ’లో వీటిని ‘రైతు వంగడాలు’గా నమోదు చేయించి రెడ్డియార్‌కు మేధోహక్కులను మంజూరు చేయించింది. 2012లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అమెరికాలోని ఇంటర్నేషనల్ తమిళ యూనివర్సిటీ నుంచి, పెరియార్ మనియమ్మాయ్ యూనివర్సీటీల నుంచి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు. ప్రయోగశీలి అయిన రెడ్డియార్ హైడ్రోపోనిక్స్ కన్నా ఆక్వాపోనిక్స్ పద్ధతి మేలైనదని అంటున్నారు. రసాయనిక ఎరువులతో పెరిగిన మొక్క వేళ్లు నెమటోడ్స్(నులిపురుగుల)కు తియ్యగా, మెత్తగా ఉండి ఆకర్షిస్తాయి. ఆక్వాపోనిక్స్ పద్ధతిలో చేపల ట్యాంకులో వ్యర్థ జలాలను మొక్కలకు అందిస్తే ఈ సమస్య ఉండదన్నారు. రైతు శాస్త్రవేత్తగా అపారమైన అనుభవజ్ఞానంతో తలపండిన రెడ్డియార్.. నేలతల్లి రుణం తీర్చుకుంటున్న అచ్చమైన ముద్దుబిడ్డ! (డా. రెడ్డియార్‌ను ఎల్.ఎన్.టి.సి. 72 ఇన్నోవేషన్ సెంటర్, నంబర్ 6, పెరుమాళ్ కోయిల్ వద్ద, కూడపాకం, పాండిచ్చేరి – 605502 చిరునామాలో సంప్రదించవచ్చు. www.intc71.com) – తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తా! ఏటికి ఎదురీదుతూ వినూత్న ఆవిష్కరణలు చేసే రైతు శాస్త్రవేత్తల అనుభవజ్ఞానాన్ని దేశంలోని రైతులందరికీ పంచిపెట్టడం ద్వారా దారిద్య్రాన్ని, ఆత్మహత్యలను రూపుమాపవచ్చు. రైతు శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త టెక్నాలజీలను రైతులు అంత తేలిగ్గా పట్టించుకోరు. మొదట పిచ్చివాడుగా చూస్తారు. 5–10 పదేళ్లు గడచిన తర్వాత రెడ్డియార్ దేవుడు అంటారు. ఇది నా అనుభవం. రైతు శాస్త్రవేత్తల జ్ఞానాన్ని రైతులందరికీ పంచిపెట్టకపోతే అణుబాంబో, హైడ్రోజన్ బాంబో వేసిన దానికన్నా ఎక్కువగా జాతికి పెను నష్టం వాటిల్లుతుంది. అందువల్లే నాకు తెలిసిన జ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరిస్తే రైతులకు ఉచితంగానే పంచిపెడతాను. నేను ఇవ్వాళ మహారాజులాగా ఉన్నాను. నాతోపాటు రైతులందరూ మహారాజులుగా మారాలి! – పద్మశ్రీ డా. టి. వెంకడపతి రెడ్డియార్, ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త, పాండిచ్చేరి, 094432 26611, 095669 73443 పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు: కె. క్రాంతికుమార్‌రెడ్డి, నేచర్స్‌వాయిస్ -
ఏడాదంతా కాసే మామిడి!
రాజస్తాన్‌లోని కోట జిల్లా గిరిధర్ పురాకు చెందిన రైతు శాస్త్రవేత్త కిషన్ సుమన్... ఏడాదంతా కాయలు కాసే ‘సదాబహర్’ మామిడి రకాన్ని అభివృద్ధి చేశాడు. పేదరికం కారణంగా కిషన్ రెండో తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పి తోటమాలిగా పనిలో చేరాడు. 2000 సంవత్సరంలో తన అరెకరం మామిడి తోటలో ఒక చెట్టు ఏడాదంతా పండ్లు కాయటాన్ని కిషన్ గమనించాడు. మూడు రుతువుల్లోనూ ఆ చెట్టుకు కాయలు కాచేవి. దాంతో ఆ చెట్టు నుంచి కొమ్మలను సేకరించి అంటు కట్టడం ప్రారంభించారు. 15 ఏళ్లు కష్టపడి ఈ రకాన్ని అభివృద్ధి చేశారు. అంటు కట్టిన మొక్కలు మంచి ఏపుగా పెరగటం, రెండో ఏడాది నుంచే కాపు రావటంతో దాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. రాజస్తాన్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతులకు అంటు మొక్కలను విక్రయిస్తున్నారు. ‘సదాబహర్’ మామిడి రకంపై పేటెంట్ కోసం కిషన్ దరఖాస్తు చేశారు. సదాబహర్ రకం మామిడి మొక్కలు వేగంగా పెరుగుతాయి. అంటుకట్టిన రెండో ఏడాది నుంచి కాయలు కాస్తాయి. కాయలు తీయగా ఉంటాయి. గుజ్జులో పీచు శాతం తక్కువగా ఉంటుంది. ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మూడు కాలాల్లోనూ కాపు కాస్తుంది. జనవరి–ఫిబ్రవరి, జూన్– జూలై, సెప్టెంబర్– అక్టోబర్ నెలల్లో పూతకొచ్చి ఏడాదంతా కాపునిస్తాయి. పొట్టిగా ఉండటం వల్ల అధిక సాంద్ర పద్ధతిలో మామిడి తోటల సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఇంటిపట్టున కుండీల్లోనూ పెంచుకోవవచ్చు. సాధారణంగా మామిడి పంటను ఆశించే వివిధ రకాల వ్యాధులు, తెగుళ్లను తట్టుకునే శక్తి సదాబహర్ రకానికి ఉందని కిషన్ తెలిపారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ కిషన్‌ను జాతీయ స్థాయి అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచన మేరకు మొఘల్ గార్డెన్‌లోనూ సదాబహర్ మొక్కలను పెంచుతున్నారు. ఈ మామిడి మొక్కలు కావలసిన రైతులు సంప్రదించవలసిన చిరునామా: కిషన్ సుమన్, గిరిధర్పురా, వార్డ్ నంబర్ –1, లాద్పూరా తాలూకా, కోట జిల్లా, రాజస్తాన్. ఫోన్: 098291 42509 లేదా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, గ్రామ్భారతి, అమ్రాపూర్, గాంధీనగర్– మహూదీ రోడ్ గాంధీనగర్, గుజరాత్– 382650. ఫోన్స్: 02764 261131/32/38/39.