ఏడాదంతా కాసే మామిడి!
రాజస్తాన్‌లోని కోట జిల్లా గిరిధర్ పురాకు చెందిన రైతు శాస్త్రవేత్త కిషన్ సుమన్... ఏడాదంతా కాయలు కాసే ‘సదాబహర్’ మామిడి రకాన్ని అభివృద్ధి చేశాడు. పేదరికం కారణంగా కిషన్ రెండో తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పి తోటమాలిగా పనిలో చేరాడు. 2000 సంవత్సరంలో తన అరెకరం మామిడి తోటలో ఒక చెట్టు ఏడాదంతా పండ్లు కాయటాన్ని కిషన్ గమనించాడు. మూడు రుతువుల్లోనూ ఆ చెట్టుకు కాయలు కాచేవి.
దాంతో ఆ చెట్టు నుంచి కొమ్మలను సేకరించి అంటు కట్టడం ప్రారంభించారు. 15 ఏళ్లు కష్టపడి ఈ రకాన్ని అభివృద్ధి చేశారు. అంటు కట్టిన మొక్కలు మంచి ఏపుగా పెరగటం, రెండో ఏడాది నుంచే కాపు రావటంతో దాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. రాజస్తాన్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతులకు అంటు మొక్కలను విక్రయిస్తున్నారు. ‘సదాబహర్’ మామిడి రకంపై పేటెంట్ కోసం కిషన్ దరఖాస్తు చేశారు. సదాబహర్ రకం మామిడి మొక్కలు వేగంగా పెరుగుతాయి. అంటుకట్టిన రెండో ఏడాది నుంచి కాయలు కాస్తాయి. కాయలు తీయగా ఉంటాయి.
గుజ్జులో పీచు శాతం తక్కువగా ఉంటుంది. ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మూడు కాలాల్లోనూ కాపు కాస్తుంది. జనవరి–ఫిబ్రవరి, జూన్– జూలై, సెప్టెంబర్– అక్టోబర్ నెలల్లో పూతకొచ్చి ఏడాదంతా కాపునిస్తాయి. పొట్టిగా ఉండటం వల్ల అధిక సాంద్ర పద్ధతిలో మామిడి తోటల సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఇంటిపట్టున కుండీల్లోనూ పెంచుకోవవచ్చు. సాధారణంగా మామిడి పంటను ఆశించే వివిధ రకాల వ్యాధులు, తెగుళ్లను తట్టుకునే శక్తి సదాబహర్ రకానికి ఉందని కిషన్ తెలిపారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ కిషన్‌ను జాతీయ స్థాయి అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచన మేరకు మొఘల్ గార్డెన్‌లోనూ సదాబహర్ మొక్కలను పెంచుతున్నారు.
ఈ మామిడి మొక్కలు కావలసిన రైతులు సంప్రదించవలసిన చిరునామా:
కిషన్ సుమన్, గిరిధర్‌పురా, వార్డ్ నంబర్ –1, లాద్‌పూరా తాలూకా, కోట జిల్లా, రాజస్తాన్. ఫోన్: 098291 42509 లేదా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, గ్రామ్‌భారతి, అమ్రాపూర్, గాంధీనగర్– మహూదీ రోడ్ గాంధీనగర్, గుజరాత్– 382650.
ఫోన్స్: 02764 261131/32/38/39.