రైతు శాస్త్రవేత్త నువిమన
ఈ ఫొటోలో ఉన్న రైతు శాస్త్రవేత్త పేరు నువిమన. అతను ఆఫ్రికా దేశం బురుండిలోని కబుయెంగె కొండ ప్రాంతంలో తన తోటి రైతులతో పాటు టమాటాలను ఎక్కువగా పండిస్తుంటారు. సీజన్‌లో కొనే వారే లేక పండించిన సగం టమాటాలను పారబోస్తుంటారు. ఆ తర్వాత ధర బాగా పెరుగుతుంది. కోల్డ్ స్టోరేజ్ సదుపాయం లేదు. అటువంటి పరిస్థితుల్లో టమాటాలను ఏవిధంగా నిల్వ చేయగలమని అనేక పద్ధతుల్లో ప్రయత్నిస్తూనే ఉండగా.. ఒకానొక రోజు చక్కని పరిష్కారం దొరికింది. అనుకోకుండా చెట్టు కింద బూడిదలో ఉండిపోయిన టమాటాలు నెలల తరబడి చెడిపోకుండా ఉండటాన్ని గుర్తించి ఎగిరి గంతేశాడు. టమాటాలను అట్టపెట్టెల్లో నింపి.. ఆపైన బూడిద పోసి నిల్వ చేశాడు. ఐదు, ఆరు నెలల పాటు చెడిపోకుండా అలాగే ఉంటున్నాయి!
ఈ ఆవిష్కరణ రైతు నువిమన జీవితాన్నే మార్చేసింది. పండించిన ప్రతి టమాటానూ అమ్ముకోగలుగుతున్నాడు. అన్‌సీజన్‌లో టమాటాలను హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు. తానే ఒక చిన్నపాటి హోటల్ నడుపుతున్నాడు. ట్రక్కు కొని నలుగురికి ఉపాధి కల్పిస్తానని గర్వంగా చెబుతున్నాడు రైతు శాస్త్రవేత్త. ఈ టెక్నిక్‌ను టమాటా సాగుకు ప్రసిద్ధిచెందిన సిబిటొకె ప్రాంతంలో రైతులు చాలామంది ఉపయోగిస్తున్నారు. నువిమనకు జేజేలు పలుకుతున్నారు. విత్తనాలను బూడిదలో భద్రపరుచుకోవడం తరతరాలుగా తెలిసిందే. బూడిదలో ఉంచిన టమాటాలు ఆరోగ్యానికి మంచిదేనా? బురుండికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త జీన్ నివ్యబండిని అడిగితే.. ‘ఏం పర్వాలేదు. బూడిద వల్ల టమాటాలపై ఎటువంటి దుష్ప్రభావం ఉండదు. నిస్సంకోచంగా తినొచ్చు. అయితే, ప్రభుత్వ వ్యవసాయ విభాగం లోతైన అధ్యయనం చేయటం మంచిది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment