లోపలి మట్టిలో పోషకాలపై త్వరలో అధ్యయనం
పీజేటీఎస్‌ఏయూ స్పెషల్ ఆఫీసర్ డా. ప్రవీణ్‌రావు వెల్లడి
చింతల వెంకటరెడ్డి వినూత్న సేద్య పద్ధతికి ప్రశంసలు
సమస్య ఎక్కడ ఉందో పరిష్కారమూ అక్కడే ఉంటుందనేది అక్షర సత్యం. రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి తన తెలివి తేటలతో రుజువు చేశారు. భూమి లోపలి నుంచి తీసి ఎండబెట్టిన మట్టిని పంటలకు దఫదఫాలుగా వేస్తే చాలని, రసాయనిక ఎరువుల అవసరం లేనేలేదంటూ తన ఆవిష్కరణ ద్వారా చింతల వెంకటరెడ్డి కొన్నేళ్ల క్రితమే చాటిచెప్పారు. ఈ పూర్వరంగంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ) స్పెషల్ ఆఫీసర్ డా. ప్రవీణ్‌రావు ఇటీవల కీసర మండలం కుందనపల్లిలోని వెంకటరెడ్డి ద్రాక్ష తోటను సందర్శించి ముగ్ధుడయ్యారు. ఈ ద్రాక్ష పండ్ల నాణ్యత నమ్మశక్యం కాకుండా ఉందని, తియ్యదనం (22% బ్రిక్స్), కాయ పెళుసుతనం చాలా బాగుందన్నారు.
కాయలు ఒకే సైజులో ఉండటం, ఆకులు బాగా ఆకుపచ్చగా ఉండటం అరుదైన విషయమన్నారు. ప్రకృతికి అనుగుణమైన రీతిలో సాగుతున్న వినూత్నమైన ఈ సాగు పద్ధతిపై శాస్త్రవేత్తల బృందంతో త్వరలోనే లోతైన అధ్యయనం చేయిస్తానని డా. ప్రవీణ్‌రావు తెలిపారు. ఈ సాగు పద్ధతి అనుసరించదగినదేనని ఇతర రైతులకు తమ యూనివర్సిటీ సిఫారసు చేయాలంటే.. తొలుత శాస్త్రీయ అధ్యయనం చేయడం తప్పనిసరన్నారు. ఎరువుగా వేస్తున్న మట్టి, పంటలకు వాడుతున్న నీరు తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేసి.. దీనిపై తుది నిర్ణయానికొస్తామన్నారు. ద్రాక్ష పరిశోధనా కేంద్రం మాజీ ముఖ్య శాస్త్రవేత్త డా. జీ సత్యనారాయణ, డా. చింతల రాజ్‌నరసింహారెడ్డి పాల్గొన్నారు. వెంకటరెడ్డి వినూత్న సేద్య పద్ధతిని ‘లోపలి మట్టిలోనే పోషకాల లోగుట్టు’ అనే శీర్షికన గత ఏడాది ‘సాగుబడి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ‘ప్రపంచ భూముల పరిరక్షణ సంవత్సరం’లో ఈ సాంకేతికతపై అధ్యయనం చేయాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించుకోవటం ఆనందించదగిన, అభినందించదగిన విషయం.
చెరువు మట్టిని ఎండబెట్టి ఎరువుగా వాడొచ్చు
చెరువుల్లో పూడిక తీసిన మట్టిలో భూమి లోపలి పొరల్లో(సబ్ సాయిల్‌లో) మాదిరిగానే పోషకాలుంటాయి. కాబట్టి, చెరువులో తవ్వి తీసిన మట్టిని కూడా ఎండబెట్టి బస్తాల్లో నిల్వ చేసుకొని.. ఏ పంటకైనా దఫదఫాలుగా వేసుకుంటే నాణ్యమైన, సకల పోషకాలతో కూడిన చక్కని దిగుబడులు సాధించవచ్చని రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి తెలిపారు.