
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో ప్రతిభ చూపినవారు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాకు చెందిన హరిమాన్ శర్మ ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికై రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేశారు.
ఉద్యానవన రంగంలో కొత్త ప్రయోగాలు చేపట్టినందుకు హరిమాన్ శర్మను పద్మశ్రీ అవార్డుకు ఎంపికచేశారు. మైదాన ప్రాంతాల్లో ఆపిల్‌ను పండించడం ద్వారా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ నేపధ్యంలోనే ఆయనను ‘ఆపిల్ చక్రవర్తి’(సేబ్ సమ్రాట్) అని కూడా పిలుస్తారు. హరిమాన్ శర్మ 1998లో తన తోటలో ఆపిల్స్‌ను పండించడంపై ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. మొదట్లో శర్మ ప్లం చెట్టుకు ఆపిల్ చెట్టును అంటుకట్టారు.
ఆపిల్ తోటల పెంపకంలో ఆయన చూపిన అంకితభావం ఈరోజు ఆయన ‘పద్మశ్రీ’ అందుకునేలా చేసింది. హరిమాన్ శర్మ గతంలో జాతీయ వినూత్న వ్యవసాయవేత్త అవార్డును కూడా అందుకున్నారు. 2017లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డుతో ఆయనను సత్కరించారు. ఆపిల్ పండ్లను చల్లని ప్రాంతాలలోనే కాకుండా వెచ్చని వాతావరణంలో కూడా పండించవచ్చని హరిమాన్ శర్మ నిరూపించారు.
హరిమాన్ శర్మ హెచ్‌ఆర్‌ఎంఎన్-99 రకం ఆపిల్‌ను అభివృద్ధి చేశారు. ఇది దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలలో కూడా ప్రసిద్ధి చెందింది. ఆయన అభివృద్ధి చేసిన రకాన్ని పంజాబ్, బెంగళూరు, తెలంగాణలతో పాటు నేపాల్, దక్షిణాఫ్రికా, జర్మనీ, బంగ్లాదేశ్ మొదలైన రాష్ట్రాలలో కూడా పండిస్తున్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ రకాన్ని పెంచడంలో కూడా ఆయన సహాయం చేశారు. ఈ ఆపిల్ ప్రత్యేకత ఏమిటంటే ఈ రకం జూన్ నెలలో అందుబాటులోకి వస్తుంది. ఈ సమయంలో మార్కెట్లలో సిమ్లా ఆపిల్స్ అందుబాటులో ఉండవు. ఫలితంగా హెచ్‌ఆర్‌ఎంఎన్-99 రకం ఆపిల్ మంచి డిమాండ్‌ను అందుకుంటుంది.
ఇది కూడా చదవండి: ట్రంప్ నిర్ణయం: అమాంతం పెరిగిన గుడ్ల ధరలు
Comments
Please login to add a commentAdd a comment