ప్రజల కోసమే ఒక మెట్టు దిగా.. రాజకీయాల కోసం కాదు: రేవంత్‌ | Cm Revanth Laying Foundation Stone for Elevated Corridor Alwal | Sakshi
Sakshi News home page

అభివృద్ధి కోసం మెట్టు దిగడంలో తప్పు లేదు: రేవంత్‌

Published Thu, Mar 7 2024 2:57 PM | Last Updated on Thu, Mar 7 2024 3:49 PM

Cm Revanth Laying Foundation Stone for Elevated Corridor Alwal - Sakshi

ఎన్నికలప్పుడే రాజకీయాలు. తరువాత అభివృద్ధే మా లక్ష్యం

గత ప్రభుత్వం కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుని ప్రాజెక్టును పక్కనబెట్టింది

మేం అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించాం

ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఎలివేటేడ్ కారిడార్ పూర్తవ్వాలి

కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతాం

సీఎం రేవంత్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాజీవ్ ర‌హ‌దారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్‌లోని అల్వాల్ టిమ్స్ (TIMS) స‌మీపంలో సీఎం భూమిపూజ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

రాజీవ్ ర‌హ‌దారిపై 11 కిలోమీట‌ర్ల పొడ‌వుతో 6 లేన్ల‌తో భారీ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించ‌నున్నారు. రూ. 2,232 కోట్ల‌తో ఈ ప‌నుల‌ను చేప‌ట్ట‌నున్నారు. ఈ కారిడార్ పూర్త‌యితే.. హైద‌రాబాద్ నుంచి సిద్దిపేట‌, క‌రీంన‌గ‌ర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వైపు వెళ్లే వారికి ప్ర‌యాణం సుల‌భం కానుంది.  ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. దీని ద్వారా మేడ్చల్, కుత్బుల్లాపూర్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందన్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణతో ఈ ప్రాజెక్టు ఆలస్యమైందని రేవంత్‌ విమర్శించారు. ప్రజల అవసరాన్ని మర్చిపోయి గత ప్రభుత్వం కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుని ప్రాజెక్టును పక్కనబెట్టిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని చెప్పారు. ప్రధాని మోదీని, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి ప్రాజెక్టు అవసరాన్ని వివరించామని చెప్పారు.
చదవండి: 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు

భైముల కేటాయింపు, చాంద్రాయణగుట్ట రక్షణశాఖ భూముల లీజ్ రెన్యూవల్ చేయకుండా గత ప్రభుత్వం జాప్యం చేసిందన్నారు సీఎం రేవంత్‌. తమ ప్రభుత్వమే అధికారులతో సమీక్షించి రక్షణ శాఖకు భూములు అప్పగించామని తెలిపారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో కేంద్రం రాష్ట్రానికి సహకరించిందన్నారు.  పదేళ్ల బీఆర్‌ఎస్‌ దిక్కుమాలిన విధానాలతో ప్రజలకు శిక్ష పడిందని దుయ్యబట్టారు.

‘ఈ ఎలివేటేడ్  కారిడార్ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారం. ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఎలివేటేడ్ కారిడార్ పూర్తవ్వాలి. ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగా.. రాజకీయాల కోసం కాదు.  అభివృద్ధి కోసం మెట్టు దిగడంలో తప్పు లేదు. బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్‌లో ఏదైనా ఒక శాశ్వత అభివృద్ధి చేశారా? ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ పాలనలోనే.  కేసీఆర్‌ హయాంలో గంజాయి, డ్రగ్స్, పబ్బులు తప్ప ఏం రాలేదు. 

అభివృద్ధి కోసం భవిష్యత్తులోనూ కేంద్రాన్ని అడుగుతూనే ఉంటాం. కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతాం. ఈ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తాం. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు. ఎన్నికలు ముగిశాక అభివృద్ధి మా లక్ష్యం. రాబోయే రోజుల్లో కంటోన్మెంట్  ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. మా పోరాటం ఫలించిందని  కేటీఆర్ అంటుండు.. ఏం పోరాటం చేసిండు. ట్విట్టర్‌లో పోస్టులు పెట్టుడా? 

మేం అనుమతులు తీసుకొస్తే ఆయన పోరాటం అని చెప్పుకుంటుండు.ఈ వేదికగా కేటీఆర్‌కు నేను సూచన చేస్తున్నా. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఇందిరా పార్కు వద్ద కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలి. కేటీఆర్ చచ్చుడో అభివృద్ధికి నిధులు వచ్చుడో తేలే వరకు దీక్ష చేయాలి. ఆయన దీక్షకు దిగితే మా కార్యకకర్తలే ఆయన్ను కంచె వేసి కాపాడుతారు.’ అని రేవంత్‌ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement