
సాక్షి, హైదరాబాద్: ఊహించని సమయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ‘పద్మశ్రీ’ పురస్కారం రావడంపట్ల ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక సంతోషాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయస్థాయిలో మరిన్ని గొప్ప విజయాలు సాధించేందుకు ఈ అవార్డు నూతనోత్సాహాన్ని ఇస్తుందని ఆమె వ్యాఖ్యానించింది. ప్రస్తుతం స్పెయిన్‌లోని జిబ్రాల్టర్ ఓపెన్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న ఆమె ఆలస్యంగానైనా పద్మశ్రీ పురస్కారం వచ్చినందుకు ఆనందంతో ఉన్నానని తెలిపింది. ‘గత రెండేళ్లుగా ఈ అవార్డు కోసం దరఖాస్తు చేశాను.
చివరి నిమిషంలో నా పేరు లేదని తెలుసుకొని నాతోపాటు తల్లిదండ్రులు నిరాశకు లోనయ్యారు. అయితే ఏనాటికైనా ఈ పురస్కారం వస్తుందని వారికి చెప్పి దీని కోసం వేచి చూడొద్దని కోరాను. ఈసారి అవార్డు వస్తుందని ఊహించని సమయంలో నా పేరు కూడా జాబితాలో ఉండటంతో అమితానందం కలిగింది. ఈ పురస్కారం నాలో మరింత బాధ్యతను పెంచింది. నా జీవిత లక్ష్యమైన ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణాన్ని అందుకునే దిశగా మరింత పట్టుదలతో కృషి చేసేందుకు కావాల్సిన విశ్వాసాన్ని ఇచ్చింది. నేనీస్థాయికి చేరుకోవడానికి సహాయపడిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను’ అని 28 ఏళ్ల హారిక పేర్కొంది.