dronavalli Harika
-
భారత చెస్ జట్ల గెలుపు.. హంపి, హారిక, వంతిక, వైశాలి అద్భుతంగా ఆడి..
Asian Games 2023- Chess: ఆసియా క్రీడల టీమ్ చెస్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు మూడో రౌండ్లో గెలుపొందాయి. ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, గుకేశ్, పెంటేల హరికృష్ణలతో కూడిన భారత జట్టు 3–1తో కజకిస్తాన్‌ను ఓడించింది. మరోవైపు... కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వంతిక అగర్వాల్, వైశాలిలతో కూడిన భారత జట్టు 3.5–0.5తో ఇండోనేసియాపై గెలిచింది. మూడో రౌండ్ తర్వాత భారత మహిళల జట్టు ఆరు పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో... ఐదు పాయింట్లతో భారత పురుషుల జట్టు రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. భారత్, కొరియా మ్యాచ్ ‘డ్రా’ ఆసియా క్రీడల మహిళల హాకీ ఈవెంట్లో భారత జట్టు తొలి ‘డ్రా’ నమోదు చేసింది. ఆదివారం దక్షిణ కొరియాతో జరిగిన పూల్ ‘ఎ’ మూడో లీగ్ మ్యాచ్‌ను భారత్ 1–1 గోల్‌తో ‘డ్రా’ చేసుకుంది. కొరియా తరఫున చో హైజిన్ (12వ ని.లో), భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల తర్వాత భారత్, కొరియా ఏడు పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన గోల్స్ అంతరం కారణంగా భారత్ టాప్ ర్యాంక్‌లో, కొరియా రెండో ర్యాంక్‌లో ఉంది. లీగ్ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను హాంకాంగ్‌తో మంగళవారం ఆడుతుంది. -
‘బ్లిట్జ్’ చాంపియన్ అర్జున్
కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ అంతర్జాతీయ టోర్నీ బ్లిట్జ్ ఈవెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచాడు. పది మంది మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో 18 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో వరంగల్‌కు చెందిన 19 ఏళ్ల అర్జున్ 12.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చాంపియన్‌గా నిలిచిన అర్జున్‌కు 7,500 డాలర్ల (రూ. 6 లక్షల 10 వేలు) ప్రైజ్‌మనీతోపాటు ట్రోఫీ లభించింది. 10 గేముల్లో గెలిచిన అర్జున్ ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని మరో మూడు గేముల్లో ఓడిపోయాడు. 11.5 పాయింట్లతో నకముర (అమెరికా) రెండో స్థానంలో, 9.5 పాయింట్లతో షఖిర్యార్ (అజర్బైజాన్) మూడో స్థానంలో నిలిచారు. ఇదే టోర్నీలో ర్యాపిడ్ ఈవెం ట్లో అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. బ్లిట్జ్ ఈవెంట్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో స్థానంలో నిలిచింది. నిర్ణీత 18 రౌండ్ల తర్వాత హారిక 11 పాయింట్లు సాధించింది. ఎనిమిది గేముల్లో గెలిచిన హారిక, ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు గేముల్లో ఓడిపోయింది. ర్యాపిడ్ ఈవెంట్లోనూ హారికకు మూడో స్థానం లభించింది. భారత్‌కే చెందిన వైశాలి 13.5 పాయింట్లతో బ్లిట్జ్ ఈవెంట్లో టైటిల్ దక్కించుకోగా, మరియా (ఉక్రెయిన్) 12 పాయింట్లతో రన్నరప్‌గా నిలి చింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 9.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. విజేత వైశాలికి 7,500 డాలర్లు (రూ. 6 లక్షల 10 వేలు), మూడో స్థానంలో నిలిచిన హారికకు 3 వేల డాలర్లు (రూ. 2 లక్షల 44 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
రన్నరప్ అర్జున్... హారికకు మూడో స్థానం
కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ అంతర్జాతీయ ర్యాపిడ్ టోర్నీలో ఓపెన్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ రన్నరప్‌గా నిలువగా... మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో స్థానాన్ని దక్కించుకుంది. అర్జున్‌కు ఐదు వేల డాలర్లు (రూ. 4 లక్షలు), హారికకు నాలుగు వేల డాలర్లు (రూ. 3 లక్షల 24 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గురువారం ముగిసిన ర్యాపిడ్ టోర్నీ లో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత అర్జున్ 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఏడో రౌండ్లో మగ్సూద్లూ (ఇరాన్)తో 39 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న అర్జున్, ఎనిమిదో రౌండ్లో 56 ఎత్తుల్లో నకముర (అమెరికా)పై, తొమ్మిదో రౌండ్లో 59 ఎత్తుల్లో నిహాల్ సరీన్ (భారత్)పై గెలిచాడు. 6.5 పాయింట్లతో నిహాల్ విజేతగా నిలువగా, భారత్‌కే చెందిన విదిత్ 4.5 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో హారిక 5.5 పాయింట్లతో మూడో స్థానాన్ని సాధించింది. ఏడో రౌండ్ గేమ్‌ను అన్నా ముజిచుక్ (ఉక్రెయిన్) తో 22 ఎత్తుల్లో, ఎనిమిదో రౌండ్ గేమ్‌ను మరియా (ఉక్రెయిన్)తో 25 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హారిక తొమ్మిదో రౌండ్లో 30 ఎత్తుల్లో సవితాశ్రీ (భారత్)పై గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఐదు పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. అనా ఉషెనినా (ఉక్రె యిన్) 6.5 పాయింట్లతో విజేతగా నిలిచింది. -
పతకం రేసులో భారత్ ‘ఎ’
చెన్నై: చెస్ ఒలింపియాడ్ మహిళల విభాగంలో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణిలతో కూడిన భారత ‘ఎ’ జట్టు పతకం రేసులో నిలిచింది. పదో రౌండ్ తర్వాత భారత్ ‘ఎ’ 17 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. పదో రౌండ్లో భారత్ ‘ఎ’ 3.5–0.5తో కజకిస్తాన్‌పై నెగ్గింది. ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’ మూడో స్థానంలో... భారత్ ‘బి’ నాలుగో స్థానంలో ఉన్నాయి. నేడు చివరిదైన 11వ రౌండ్ జరుగుతుంది. -
Chess Olympiad: ఎదురులేని భారత్
చెన్నై: చెస్ ఒలింపియాడ్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్‌లతో కూడిన భారత ‘ఎ’ జట్టు వరుసగా ఆరో విజయంతో టాప్ ర్యాంక్‌లోకి వచ్చింది. జార్జియాతో బుధవారం జరిగిన ఆరో రౌండ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 3–1తో గెలిచి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. నానా జాగ్‌నిద్జెతో జరిగిన గేమ్‌లో హంపి 42 ఎత్తుల్లో...లెలా జావఖిష్‌విలితో గేమ్‌లో వైశాలి 36 ఎత్తుల్లో గెలిచారు. నినో బాత్సియాష్‌విలితో గేమ్‌ను హారిక 33 ఎత్తుల్లో... సలోమితో జరిగిన గేమ్‌ను తానియా 35 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ‘బి’ 3–1తో నెగ్గగా... చెక్ రిపబ్లిక్‌తో మ్యాచ్‌ను భారత్ ‘బి’ 2–2తో ‘డ్రా’గా ముగించింది. ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’–ఉజ్బెకిస్తాన్ మ్యాచ్ 2–2తో ‘డ్రా’కాగా... భారత్ ‘బి’ 1.5–2.5తో అర్మేనియా చేతిలో ఓడిపోయింది. భారత్ ‘సి’ 3.5–0.5తో లిథువేనియాపై గెలిచింది. గురువారం విశ్రాంతి దినం తర్వాత శుక్రవారం ఏడో రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి. -
Dronavalli Harika: ఒకట్రెండుసార్లు ఏడ్చేశాను కూడా.. ఈసారి మాత్రం
సాక్షి, హైదరాబాద్: తన సుదీర్ఘ చెస్ కెరీర్లో ఎంతో కాలంగా ఊరిస్తోన్న లక్ష్యాన్ని సాధించానని ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తెలిపింది. స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ మహిళల టీమ్ చాంపియన్‌షిప్‌లో హారిక, తానియా, వైశాలి, భక్తి కులకర్ణి, మేరీఆన్ గోమ్స్‌లతో కూడిన భారత జట్టు రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్‌కు ఇదే తొలి పతకం. ‘2004 నుంచి టీమ్ ఈవెంట్స్‌లో ఆడుతున్నాను. గతంలో పలుమార్లు పతకానికి చేరువై దూరమయ్యాం. ఒకట్రెండుసార్లు భావోద్వేగానికి లోనై ఏడ్చేశాను కూడా. ఈసారి మాత్రం అనుకున్నది సాధించాం. నా కెరీర్లో ఇది గొప్ప ఫలితం. మా పతకం భవిష్యత్‌లో మరిన్ని విజయాలకు నాంది పలుకుతుందని ఆశిస్తున్నాను. వ్యక్తిగతంగానూ నాకు ఈ టోర్నీ చిరస్మరణీంగా నిలిచింది. ఈ టోర్నీ మొత్తంలో 11 గేమ్‌ల్లో బరిలోకి దిగిన ఏకైక ప్లేయర్ నేనే. చివరకు అజేయంగా నిలిచి వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించినందుకు ఆనందంగా ఉంది’ అని హారిక వ్యాఖ్యానించింది. చదవండి: టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు కాంస్యం.. -
హారిక అద్భుత విజయం.. సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: స్పెయిన్ దేశంలో అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఎఫ్ఐడీఈ) ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ మహిళల టీమ్ చెస్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోటీల్లో రజత పతకం సాధించిన ద్రోణవల్లి హారిక నేతృత్వంలోని భారత జట్టును సీఎం వైఎస్ జగన్ అభినందించారు. టీమ్ ఈవెంట్లో హారిక అద్భుత విజయం సాధించిందని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో హారికతో పాటు ఇండియన్ టీమ్ మరిన్ని పురస్కారాలు సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్..
సిట్‌గెస్ (స్పెయిన్): ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో రాణించిన భారత అమ్మాయిలు ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లారు. జార్జియాతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 2.5–1.5తో విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ తొలి మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. సెమీఫైనల్ రెండో మ్యాచ్‌లో తానియా సచ్దేవ్, వైశాలి తమ ప్రత్యర్థులను ఓడించి భారత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. తానియా 54 ఎత్తుల్లో మేరీ అరాబిద్జెపై... వైశాలి 43 ఎత్తుల్లో గ్రాండ్‌మాస్టర్ నినో బత్సియాష్విలిపై గెలిచారు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 43 ఎత్తుల్లో గ్రాండ్‌మాస్టర్ నానా జాగ్‌నిద్జెతో గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. మేరీఆన్ గోమ్స్ 62 ఎత్తుల్లో లెలా జవాకిషివిలి చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే ఫైనల్లో రష్యాతో భారత్ తలపడుతుంది. అతాను దాస్ విఫలం యాంక్టన్ (అమెరికా): ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నమెంట్ ప్రపంచకప్ ఫైనల్స్ నుంచి భారత క్రీడాకారులు రిక్తహస్తాలతో తిరిగి వస్తున్నారు. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ అతాను దాస్ కాంస్య పతక పోరులో ఓడిపోయాడు. టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ మెట్ గాజోజ్ (టర్కీ)తో జరిగిన మ్యాచ్‌లో అతాను దాస్ 0–6 (27–29, 26– 27, 28–30)తో పరాజయం పాలయ్యాడు. చదవండి: Venkatesh Iyer: అయ్యారే అయ్యర్.. కేకేఆర్ తరపున రెండో బ్యాటర్‌గా -
చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు షాక్
చెన్నై: ఆన్లైన్ వరల్డ్ చెస్ ఒలింపియాడ్‌లో గత ఏడాది సంయుక్త విజేత భారత జట్టుకు చుక్కెదురైంది. అమెరికా జట్టుతో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ ‘బ్లిట్జ్ టైబ్రేక్’లో 1.5–4.5తో పరాజయం పాలైంది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆడిన మూడు గేముల్లోనూ విజయం సాధించినా ఆమె సహచరులు తడబడటంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ముందుగా తొలి రౌండ్ మ్యాచ్‌లో టీమిండియా 5–1తో అమెరికాను ఓడించి 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. హారిక 68 ఎత్తుల్లో అనా జటోన్‌స్కీపై, విశ్వనాథన్ ఆనంద్ 57 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్‌పై, పెంటేల హరికృష్ణ 53 ఎత్తుల్లో దరియజ్పై, వైశాలి 38 ఎత్తుల్లో థలియా లాండిరోపై గెలుపొందారు. కోనేరు హంపి 29 ఎత్తుల్లో ఇరీనా క్రష్‌తో, నిహాల్ సరీన్ 70 ఎత్తుల్లో లియాంగ్ అవండర్లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత్ 2–4తో ఓడిపోయింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. హారిక 51 ఎత్తుల్లో నాజి పైకిద్జెపై నెగ్గగా... హంపి 32 ఎత్తుల్లో ఇరీనా క్రష్‌తో, వైశాలి 60 ఎత్తుల్లో థలియా లాండిరోతో గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. ప్రజ్ఞానంద 54 ఎత్తుల్లో లియాంగ్ చేతిలో, విదిత్ 46 ఎత్తుల్లో రాబ్సన్ రే చేతిలో, ఆనంద్ 35 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్ చేతిలో ఓడిపోయారు. నిర్ణాయక ‘బ్లిట్జ్ టైబ్రేక్’లో హారిక 34 ఎత్తుల్లో నాజి పైకిద్జెపై గెలుపొందగా... నిహాల్ 44 ఎత్తుల్లో లియాంగ్‌తో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. వైశాలి 31 ఎత్తుల్లో థలియా చేతిలో, హరికృష్ణ 35 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్ చేతిలో, హంపి 49 ఎత్తుల్లో ఇరీనా క్రష్ చేతిలో, ఆధిబన్ 33 ఎత్తుల్లో రాబ్సన్ రే చేతిలో ఓటమి చవిచూశారు. మరో సెమీఫైనల్లో రష్యా 2–0తో చైనాను ఓడించి నేడు జరిగే ఫైనల్లో అమెరికాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. -
ఒలింపియాడ్ సెమీస్‌లో భారత్
చెన్నై: ‘ఫిడే’ ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉక్రెయిన్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ ‘బ్లిట్జ్ టైబ్రేక్’లో 5–1తో నెగ్గింది. భారత విజయంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక కీలకపాత్ర పోషించింది. ఆమె ఆడిన మూడు గేముల్లోనూ నెగ్గింది. ముందుగా ఉక్రెయిన్‌తో తొలి మ్యాచ్‌లో భారత్ 4–2తో గెలుపొంది....రెండో మ్యాచ్‌లో 2.5–3.5తో ఓడిపోయింది. దాంతో రెండు జట్ల స్కోరు సమమైంది. విజేతను నిర్ణయించడానికి టైబ్రేక్ నిర్వహించగా భారత్ పైచేయి సాధించింది. టైబ్రేక్ గేముల్లో భారత్ తరఫున ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక, ఆధిబన్, నిహాల్ సరీన్, వైశాలి నెగ్గగా... కోనేరు హంపి, విదిత్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. హారిక 37 ఎత్తుల్లో నటాలియా బుక్సాను ఓడించగా... లులీజా ఉస్మాక్‌తో గేమ్‌ను హంపి 65 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. అంతకుముందు తొలి మ్యాచ్ గేమ్‌లో హారిక 36 ఎత్తుల్లో నటాలియా బుక్సాపై, రెండో మ్యాచ్ గేమ్‌లో 32 ఎత్తుల్లో జుకోవాపై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో అమెరికాతో భారత్ తలపడుతుంది. -
హంపి, హారికలకు నిరాశ
పెంగ్‌షుయె (చైనా): వరల్డ్ మాస్టర్స్ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికల నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి హారిక 3.5 పాయింట్లతో 12వ స్థానంలో, హంపి 2.5 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచారు. ఐదో రౌండ్లో స్టెఫానోవా (బల్గేరియా)తో 64 ఎత్తుల్లో ఓడిన హంపి... ఎలిజబెత్ (జర్మనీ)తో జరిగిన ఆరో గేమ్‌ను 33 ఎత్తుల్లో డ్రా చేసుకుంది. ఏడో రౌండ్ గేమ్‌లో అనస్తాసియా (రష్యా) చేతిలో 23 ఎత్తుల్లో, ఎనిమిదో గేమ్‌లో ఇరినా క్రుష్ (అమెరికా) చేతిలో 40 ఎత్తుల్లో పరాజయం పాలైంది. మరోవైపు ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన ఐదో గేమ్‌ను 90 ఎత్తుల్లో, టింగ్జి (చైనా)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను 67 ఎత్తుల్లో, జనిడ్జె (జార్జియా)తో ఏడో గేమ్‌ను 23 ఎత్తుల్లో డ్రా చేసుకున్న హారిక... జోంగ్యి (చైనా)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో 76 ఎత్తుల్లో ఓటమి పాలైంది. -
హారిక ఐదో ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ అంతర్జాతీయ మహిళల చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక వరుసగా ఐదో ‘డ్రా’ నమోదు చేసింది. అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) అనా జటోన్స్కీ (అమెరికా)తో జరిగిన ఐదో గేమ్‌ను నల్ల పావులతో ఆడిన హారిక 49 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. పది మంది మేటి క్రీడాకారిణుల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత హారిక 2.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. 4.5 పాయింట్లతో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) అగ్ర స్థానంలో ఉంది. -
హారిక ఖాతాలో మూడో ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ అంతర్జాతీయ మహిళల చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక వరుసగా మూడో ‘డ్రా’ నమోదు చేసింది. రష్యా గ్రాండ్‌మాస్టర్ వాలెంటినా గునీనాతో జరిగిన మూడో గేమ్‌ను హారిక 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. అంతకు ముందు మేరీ సెబాగ్ (ఫ్రాన్స్)తో జరిగిన తొలి గేమ్‌ను హారిక 45 ఎత్తుల్లో... నానా జాగ్‌నిద్జే (జార్జియా)తో జరిగిన రెండో గేమ్‌ను 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. పది మంది మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో మూడో రౌండ్ తర్వాత హారిక 1.5 పాయింట్లతో ఐదో ర్యాంక్‌లో ఉంది. పది మందిలో ఆరుగురు గ్రాండ్‌మాస్టర్లు (జీఎం) కాగా, మరో నలుగురు అంతర్జాతీయ మాస్టర్లు (ఐఎం)లు ఉన్నారు. లక్షా 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పది మందికీ ప్రైజ్‌మనీ లభించనుంది. విజేతకు 40 వేల డాలర్లు (రూ. 28 లక్షల 47 వేలు), రన్నరప్‌కు 30 వేల డాలర్లు (రూ. 21 లక్షల 35 వేలు), మూడో స్థానంలో నిలిచిన వారికి 20 వేల డాలర్లు (రూ.14 లక్షల 23 వేలు) అందజేస్తారు. -
‘పద్మశ్రీ’తో మరింత ఉత్సాహం: హారిక
సాక్షి, హైదరాబాద్: ఊహించని సమయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ‘పద్మశ్రీ’ పురస్కారం రావడంపట్ల ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక సంతోషాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయస్థాయిలో మరిన్ని గొప్ప విజయాలు సాధించేందుకు ఈ అవార్డు నూతనోత్సాహాన్ని ఇస్తుందని ఆమె వ్యాఖ్యానించింది. ప్రస్తుతం స్పెయిన్‌లోని జిబ్రాల్టర్ ఓపెన్ టోర్నమెంట్లో పాల్గొంటున్న ఆమె ఆలస్యంగానైనా పద్మశ్రీ పురస్కారం వచ్చినందుకు ఆనందంతో ఉన్నానని తెలిపింది. ‘గత రెండేళ్లుగా ఈ అవార్డు కోసం దరఖాస్తు చేశాను. చివరి నిమిషంలో నా పేరు లేదని తెలుసుకొని నాతోపాటు తల్లిదండ్రులు నిరాశకు లోనయ్యారు. అయితే ఏనాటికైనా ఈ పురస్కారం వస్తుందని వారికి చెప్పి దీని కోసం వేచి చూడొద్దని కోరాను. ఈసారి అవార్డు వస్తుందని ఊహించని సమయంలో నా పేరు కూడా జాబితాలో ఉండటంతో అమితానందం కలిగింది. ఈ పురస్కారం నాలో మరింత బాధ్యతను పెంచింది. నా జీవిత లక్ష్యమైన ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణాన్ని అందుకునే దిశగా మరింత పట్టుదలతో కృషి చేసేందుకు కావాల్సిన విశ్వాసాన్ని ఇచ్చింది. నేనీస్థాయికి చేరుకోవడానికి సహాయపడిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను’ అని 28 ఏళ్ల హారిక పేర్కొంది. -
సిరివెన్నెలకు పద్మశ్రీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు వ్యక్తులకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో ఇద్దరు ఆంధప్రదేశ్‌కు, ఇద్దరు తెలంగాణకు చెందినవారున్నారు. ఏపీ నుంచి ప్రముఖ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, వ్యవసాయ రంగం నుంచి ఎడ్లపల్లి వేంకటేశ్వరరావు, తెలంగాణ నుంచి సిరివెన్నెలతోపాటు భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ ఆటగాడు సునీల్ ఛెత్రిలను పద్మ శ్రీ వరించింది. 2019వ సంవత్సరానికి పౌర పురస్కారాలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. కళలు, సాహిత్యం, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, పరిశ్రమలు, ఆరోగ్యం–వైద్యం, వర్తకం, క్రీడలు, సామాజిక సేవ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి ఆయా రంగాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖలను కేంద్రం పద్మ అవార్డులతో సత్కరించనుంది. మొత్తం 112 మందికి ఈ పురస్కారాలు ప్రకటించింది. వీరిలో నలుగురికి పద్మ విభూషణ్, 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మ శ్రీ పురస్కారాలు దక్కాయి. జానపద గాయకురాలు తీజన్ బాయి, జిబౌటీకి చెందిన ఇస్మాయిల్ ఒమర్ గులేహ్, ఎల్ అండ్ టీ చైర్మన్ ఏఎం నాయక్, మహారాష్ట్రకు చెందిన బల్వంత్ పురందరేలను పద్మ విభూషణ్ విజేతలుగా కేంద్రం ఎంపిక చేసింది. అవార్డులు దక్కించుకున్న వారిలో 21 మంది మహిళలు, 11 మంది విదేశీయులు, ముగ్గురు దివంగతులు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి, ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. సినీ నటుడు మోహన్ లాల్(కేరళ)కు పద్మ భూషణ్, నటుడు, డాన్స్ మాస్టర్ ప్రభుదేవా(కర్ణాటక)కు నృత్యంలో పద్మ శ్రీ లభించింది. నర్తకి నటరాజ్, ఖాదర్ ఖాన్ కరియా ముండా, మోహన్‌లాల్ రైతు నేస్తం వెంకటేశ్వరరావుకు పద్మశ్రీ వట్టిచెరుకూరు(ప్రత్తిపాడు): ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావుకు పద్మశ్రీ లభించింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వెంకటేశ్వరరావు 1994 నుంచి హైదరాబాద్‌లో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నారు. 2001 నుంచి 2004 వరకు రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల కారణంగా ఎంతోమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం చూసి కలత చెందిన వెంకటేశ్వరరావు రైతు రాజులా బతకటానికి తన వంతు ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 2005లో రైతునేస్తం మాసపత్రికను ప్రారంభించారు. మొదటి సంచికను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమ అయిన పాడి పరిశ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2012లో ప«శునేస్తం మాస పత్రికను, ప్రకృతి వ్యవసాయ విధానాలపై విస్తృత ప్రచారం కల్పించే లక్ష్యంతో 2014లో ప్రకృతి నేస్తం మాస పత్రికను ప్రారంభించారు. తన ఆలోచనలను పుస్తక రూపంలో అందిస్తూ వచ్చిన వెంకటేశ్వరరావు రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటుచేసి, రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొర్నెపాడు గ్రామంలో రైతునేస్తం ఫౌండేషన్ ద్వారా రైతు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ఇప్పటివరకు 140 వారాలకు పైగా తరగతులను నిర్వహించి 4000 మంది పైచిలుకు రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి సూచనల ప్రకారం.. చిరుధాన్యాల సాగుపై రైతునేస్తం తరఫున పుస్తకాలు ప్రచురించారు. వెంకటేశ్వరరావుకు పద్మశ్రీ పురస్కారం లభించడంతో ఆయన స్వగ్రామం కొర్నెపాడులో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ తనకిచ్చిన ఈ అవార్డును రైతుకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. సాక్షి ‘సాగుబడి’ తన కార్యక్రమాలకు మద్దతుగా నిలిచిందని ధన్యవాదాలు తెలిపారు. నలుగురికి ‘కీర్తి చక్ర’ దేశ రెండో అత్యున్నత శౌర్య పురస్కారం ‘కీర్తిచక్ర’ను నలుగురు జవాన్లు పొందారు. వీరిలో జాట్ రెజిమెంట్‌కు చెందిన మేజర్ తుషార్ గౌబా, 22వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సోవర్ విజయ్ కుమార్(మరణానంతరం)తోపాటు 2017లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన జవాన్లు ప్రదీప్‌కుమార్ పండా, రాజేంద్ర కుమార్ నైన్ ఉన్నారు. అసిస్టెంట్ కమాండెంట్ జైల్ సింగ్‌తోపాటు 9 మంది సైనికాధికారులకు శౌర్యచక్రను రక్షణ శాఖ ప్రకటించింది. ‘పరమ్ విశిష్ట సేవా పతకం’ ఆర్మీ చీఫ్ జనరల్ రావత్ సహా 19 మంది సైనికాధికారులకు లభించింది. ఎమర్జెన్సీపై గొంతెత్తిన నయ్యర్ ప్రముఖ జర్నలిస్ట్, మానవహక్కుల కార్యకర్త, దౌత్యవేత్త కుల్దీప్ నయ్యర్ అవిభక్త భారత్‌లోని సియాల్ కోట్(ప్రస్తుతం పాకిస్తాన్)లో 1923, ఆగస్టు 14న జన్మించారు. కెరీర్ తొలినాళ్లలో ఉర్దూ పత్రిక అంజామ్ లో రచయితగా పనిచేశారు. ఆ తర్వాత అదే పత్రికలో రిపోర్టర్‌గా చేరారు. దేశవిభజన అనంతరం కుటుంబంతో కలిసి భారత్‌కు వచ్చేశారు. ఆయన ‘ది స్టేట్స్‌మన్’ పత్రిక ఢిల్లీ ఎడిషన్‌కు ఎడిటర్‌గా పనిచేశారు. మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి, కేంద్ర మాజీ హోంమంత్రి గోవింద్ బల్లప్పంత్కు ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా సేవలందించారు. 1975లో ఎమర్జెన్సీ సందర్భంగా పత్రికలపై సెన్సార్షిప్ను వ్యతిరేకించడంతో ఇందిర ప్రభుత్వం ఆయన్ను తీహార్ జైలులో పెట్టింది. కేంద్ర ప్రభుత్వం 1990లో ఆయన్ను లండన్‌లో భారత హైకమిషనర్‌గా నియమించింది. కుల్దీప్ నయ్యర్ 1997లో రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. జర్నలిజంలో ఆయన చేసిన సేవలకు గానూ 2015లో రామ్‌నాథ్ గోయెంకా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. బియాండ్ ది లైన్స్, ఇండియా ఆఫ్టర్ నెహ్రూ, స్కూప్, ఎమర్జెన్సీ కీ ఇన్సైడ్ స్టోరీ, వాల్ ఎట్ వాఘా తదితర పుస్తకాలు రాశారు. న్యుమోనియాతో బాధపడుతూ ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరిన నయ్యర్ 2018, ఆగస్టు 23న 95 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. పాండవని కళలో ప్రసిద్ధురాలు తీజన్ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తీజన్ బాయి (62) ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన జానపద గాయకురాలు. ఆమెకు 1987లోనే పద్మశ్రీ, 2003లో పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి. మహాభారతం నుంచి పాండవుల వీరగాథలను ఆమె ఏకకాలంలో సంగీత వాద్యాలను ఉపయోగిస్తూ, జానపద గేయాలు పాడుతూ వివరిస్తారు. దీనినే పాండవని కళ అంటారు. చిన్నతనంలో ఎన్నో కష్టాలను అనుభవించి, ఎంతో కృషి చేసి ఈ స్థాయికి చేరారు. భిలాయ్ పట్టణానికి సమీపంలోని గణియారి గ్రామంలో గిరిజన తెగకు చెందిన చంక్లాల్ పార్ధి, సుఖవతి దంపతుల ఐదుగురు పిల్లల్లో తొలి సంతానంగా తీజన్ బాయి జన్మించారు. 12 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు అప్పటికే ఇద్దరు పెళ్లాలున్న వ్యక్తికి తీజన్ బాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాతా ఆమె భర్త మరో పెళ్లి చేసుకోవడంతో ఇక ఆమె అత్తారింటిని వదిలి వచ్చేశారు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నా, అదీ ఎంతో కాలం నిలువలేదు. ఛత్తీస్‌గఢ్‌లో లెక్కలేనన్ని గ్రామాల్లో ప్రదర్శనలిచ్చిన ఆమె, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, నాటి యూఎస్ఎస్ఆర్, సైప్రస్, ట్యునీషియా, టర్కీ, మాల్టా తదితర అనేక దేశాల్లోనూ పర్యటించి ఎంతో మందిని తన అభిమానులుగా మార్చుకున్నారు. ఎంత ఎదిగినా ఆమె ఎంతో వినమ్రతతో అణుకువగా ఉంటారు. ఎదురులేని నేత ఒమర్ గులెహ్ ఆఫ్రికా దేశమైన జిబౌటీని గత 20 ఏళ్ల నుంచి అప్రతిహతంగా పాలిస్తున్న ఇస్మాయిల్ ఒమర్ గులెహ్(72) ఇథియోపియాలో 1947, నవంబర్ 27న జన్మించారు. హైస్కూలు చదువు పూర్తయ్యాక జిబౌటీకి వలసవెళ్లారు. ఫ్రెంచ్ పాలనలో ఉన్న జిబౌటీలో 1968లో ప్రభుత్వఉద్యోగిగా చేరారు. రెండేళ్లలోనే పోలీస్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ‘జిబౌటీ టుడే’ వార్తాపత్రికను ప్రారంభించారు. 1977లో స్వాతంత్య్రం పొందాక జిబౌటీ తొలి అధ్యక్షుడు, తన బంధువైన హసన్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఏకంగా 22 ఏళ్లు పనిచేశారు. అయితే 1999 ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న హసన్ తన వారసుడిగా గులెహ్ పేరును ప్రతిపాదించారు. చైనా ఇప్పటికే జిబౌటీలో నౌకా స్థావరాన్ని ఏర్పాటుచేసిన నేపథ్యంలో భారత్ గులెహ్కు పద్మవిభూషణ్‌ను ప్రకటించడం గమనార్హం. మరాఠా నాటక రచయితకు పద్మవిభూషణ్ నాటక–కథా రచయిత, చరిత్రకారుడు బల్వంత్ మోరేశ్వర్ పురందరే(96) మహారాష్ట్రలోని పుణెలో 1922, జూలై 29న జన్మించారు. ఆయన రచనల్లో 17వ శతాబ్దపు మరాఠా రాజు ఛత్రపతి శివాజీ జీవితం, పాలన ఆధారంగా రాసినవే ఎక్కువగా ఉన్నాయి. శివాజీ పాలనపై పురందరే రాసిన ‘జనతా రాజా’ అనే నాటకం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు పొందింది. చరిత్రపై అమితాసక్తి చూపే పురందరే.. రాజా శివ ఛత్రపతి, కేసరి వంటి పుస్తకాలను రాశారు. కళారంగంలో ఆయన అందించిన సేవలకు గానూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2007–08 సంవత్సరానికి కాళిదాస్ సమ్మాన్ అవార్డును ప్రకటించింది. అలాగే 2015లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రపు అత్యున్నత పౌర పురస్కారమైన మహారాష్ట్ర భూషణ్ అవార్డును అందించింది. -
ప్రిక్వార్టర్స్‌లో ఓడిన హారిక
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక ఆశాకిరణం, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. వరుసగా గత మూడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2012, 2015, 2017) కాంస్య పతకాలు సాధించిన హారిక ఈసారి మాత్రం రిక్తహస్తాలతో వెనుదిరిగింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో హారిక 2.5–3.5 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు ఆదివారం టైబ్రేక్ నిర్వహించారు. టైబ్రేక్ తొలి గేమ్‌లో కొస్టెనిక్ 64 ఎత్తుల్లో గెలిచి 2–1తో ముందంజ వేసింది. అయితే టైబ్రేక్ రెండో గేమ్‌లో హారిక 82 ఎత్తుల్లో నెగ్గి స్కోరును 2–2తో సమం చేసింది. స్కోరు సమం కావడంతో మళ్లీ రెండు గేమ్‌ల టైబ్రేక్‌ను ఆడించారు. ఇందులో తొలి గేమ్‌లో కొస్టెనిక్ 65 ఎత్తుల్లో గెలిచి 3–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన రెండో గేమ్‌ను హారిక 61 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోవడంతో కొస్టెనిక్ 3.5–2.5తో విజయాన్ని ఖాయం చేసుకుంది. తొలి రెండు రౌండ్లలో టైబ్రేక్స్‌లో విజయాలు దక్కించుకున్న హారిక మూడోసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. హారికతోపాటు ఈ మెగా ఈవెంట్లో భారత్ తరఫున పాల్గొన్న కోనేరు హంపి రెండో రౌండ్లో... పద్మిని రౌత్, భక్తి కులకర్ణి తొలి రౌండ్లో ఓడిపోయారు. -
హారిక గేమ్ ‘డ్రా’
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మరో ‘డ్రా’ నమోదు చేసింది. తొలి రౌండ్లో, రెండో రౌండ్లో ఆడిన రెండేసి గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని... ‘టైబ్రేక్’లో విజయాలు సాధించి ముందంజ వేసిన హారిక మూడో రౌండ్‌లోని తొలి గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో శుక్రవారం జరిగిన తొలి గేమ్‌ను తెల్లపావులతో ఆడిన హారిక 58 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. శనివారం జరిగే రెండో గేమ్‌లో గెలిచిన వారు తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తారు. ‘డ్రా’ అయితే ఆదివారం టైబ్రేక్ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. -
రెండో రౌండ్లో హారిక
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): తాడో పేడో తేల్చే టైబ్రేక్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మెరిసింది. ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్లోకి ప్రవేశించింది. సోపికో ఖుఖాష్‌విలి (జార్జియా)తో జరిగిన తొలి రౌండ్లో హారిక 2.5–1.5తో విజయం సాధించింది. నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో... సోమవారం విజేతను నిర్ణయించేందుకు రెండు టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. తొలి గేమ్‌ను 57 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హారిక రెండో గేమ్‌లో మాత్రం 72 ఎత్తుల్లో గెలిచి రెండో రౌండ్ బెర్త్‌ను దక్కించుకుంది. భారత్‌కే చెందిన పద్మిని రౌత్ మాత్రం 1.5–2.5తో జన్సాయా అబ్దుమలిక్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయింది. టైబ్రేక్‌లోని తొలి గేమ్‌ను 69 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించిన పద్మిని... రెండో గేమ్‌లో మాత్రం 60 ఎత్తుల్లో ఓడిపోయింది. నేడు జరిగే రెండో రౌండ్ తొలి గేమ్‌లో జొలాంటా జవద్జా్క (పోలాండ్)తో కోనేరు హంపి; బేలా ఖొటెనాష్విలి (జార్జియా)తో హారిక తలపడతారు. -
అమెరికాను నిలువరించిన భారత్
బటూమి (జార్జియా): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లోని ఆరో రౌండ్లో భారత పురుషుల, మహిళల జట్లు ‘డ్రా’తో సరిపెట్టుకున్నాయి. పురుషుల విభాగంలో రెండో సీడ్ రష్యా జట్టుతో జరిగిన మ్యాచ్‌ను భారత్ 2–2తో... మహిళల విభాగంలో అగ్రస్థానంలో ఉన్న అమెరికాతో జరిగిన మ్యాచ్‌ను భారత్ 2–2తో ‘డ్రా’ చేసుకుంది. భారత్, రష్యా జట్ల మధ్య జరిగిన నాలుగు గేమ్‌ల్లో ఫలితం తేలకపోగా... భారత్, అమెరికా జట్ల మధ్య జరిగిన నాలుగు గేముల్లోనూ ఫలితాలు రావడం విశేషం. ఆనంద్–నెపోమ్నియాట్చి గేమ్ 43 ఎత్తుల్లో... హరికృష్ణ–క్రామ్నిక్ గేమ్ 45 ఎత్తుల్లో... విదిత్–విటియుగోవ్ గేమ్ 31 ఎత్తుల్లో... ఆధిబన్–జావోవెంకో గేమ్ 48 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 35 ఎత్తుల్లో జటోన్‌స్కీపై; తానియా 31 ఎత్తుల్లో తతేవ్‌పై నెగ్గారు. అయితే ఏపీ గ్రాండ్‌మాస్టర్ హారిక 57 ఎత్తుల్లో ఇరీనా క్రష్ చేతిలో... ఇషా 55 ఎత్తుల్లో జెన్నిఫర్ చేతిలో ఓడిపోయారు. ఆరో రౌండ్ తర్వాత భారత పురుషుల జట్టు 9 పాయింట్లతో 14వ స్థానంలో... భారత మహిళల జట్టు 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. -
హారిక ఖాతాలో ఆరో ‘డ్రా’
టాటా స్టీల్ చాలెంజర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆరో ‘డ్రా’ నమోదు చేసింది. నెదర్లాండ్స్‌లోని విక్ ఆన్ జీ పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన ఎనిమిదో రౌండ్లో హారిక 32 ఎత్తుల్లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ జియాంగ్ జెఫ్రీని నిలువరించింది. ఇదే వేదికపై జరుగుతున్న మాస్టర్స్ టోర్నీలో పీటర్ స్విద్లెర్ (రష్యా)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 27 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. -
హారిక సంచలనం
► యురాసియన్ బ్లిట్జ్ కప్ టైటిల్ సొంతం ► ప్రపంచ నంబర్‌వన్ హు ఇఫాన్కు రెండో స్థానం సాక్షి, హైదరాబాద్: పలువురు మేటి గ్రాండ్‌మాస్టర్లు పాల్గొన్న యురాసియన్ బ్లిట్జ్ కప్ అంతర్జాతీయ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక సంచలనం సృష్టించింది. కజకిస్తాన్ రాజధాని అల్మాటీ నగరంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో హారిక 12.5 పాయింట్లతో మహిళల విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ నంబర్‌వన్, క్లాసిక్ విభాగంలో ప్రపంచ చాంపియన్ హు ఇఫాన్ (చైనా) కూడా 12.5 పాయింట్లు సాధించినప్పటికీ... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా హారికకు టాప్ ర్యాంక్ లభించింది. ఇఫాన్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ప్రపంచ బ్లిట్జ్ మాజీ చాంపియన్ వాలెంటినా గునీనా (రష్యా) 12 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. నిర్ణీత 22 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హారిక 11 గేముల్లో గెలిచి, ఎనిమిది గేముల్లో ఓడి, మిగతా మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. ఈ టోర్నీలో హారిక చేతిలో ఓడిన గ్రాండ్‌మాస్టర్ల జాబితాలో విక్టర్ బోలోగన్ (మాల్డొవా), జాన్ ఎల్వెస్ట్ (అమెరికా), బోరిస్ సావ్చెంకో (రష్యా), అలెక్సీ ద్రీవ్ (రష్యా) ఉన్నారు. ఓపెన్ విభాగంలో తజకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ అమనతోవ్ ఫారూఖ్ (16 పాయింట్లు) చాంపియన్‌గా నిలిచాడు. రెండు వారాల క్రితం హంగేరిలో జరిగిన జలకారోస్ చెస్ టోర్నీలోనూ హారిక మహిళల విభాగంలో విజేతగా నిలిచింది. -
హారికకు అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: జలకారోస్ చెస్ ఫెస్టివల్ అంతర్జాతీయ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మహిళల విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. హంగేరిలోని జలకారోస్ పట్టణంలో ముగిసిన ఈ టోర్నమెంట్లో ఓపెన్ కేటగిరిలో పాల్గొన్న హారిక మొత్తం ఆరు పాయింట్లు సాధించి పదో స్థానంలో నిలిచింది. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హారిక మూడు గేముల్లో గెలిచి, మిగతా ఆరింటిని ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. సెర్బియాకు చెందిన ఇవాన్ ఇవానిసెవిచ్ ఏడు పాయిం ట్లతో టైటిల్ సాధించాడు. ఓపెన్ విభాగంలో హారిక పాల్గొన్నప్పటికీ... మహిళల విభాగంలోనూ ప్రత్యేక పురస్కారాలు ఉండటంతో హారికకు టాప్ ర్యాంక్ దక్కింది.