
సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ అంతర్జాతీయ మహిళల చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక వరుసగా మూడో ‘డ్రా’ నమోదు చేసింది. రష్యా గ్రాండ్‌మాస్టర్ వాలెంటినా గునీనాతో జరిగిన మూడో గేమ్‌ను హారిక 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. అంతకు ముందు మేరీ సెబాగ్ (ఫ్రాన్స్)తో జరిగిన తొలి గేమ్‌ను హారిక 45 ఎత్తుల్లో... నానా జాగ్‌నిద్జే (జార్జియా)తో జరిగిన రెండో గేమ్‌ను 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది.
పది మంది మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో మూడో రౌండ్ తర్వాత హారిక 1.5 పాయింట్లతో ఐదో ర్యాంక్‌లో ఉంది. పది మందిలో ఆరుగురు గ్రాండ్‌మాస్టర్లు (జీఎం) కాగా, మరో నలుగురు అంతర్జాతీయ మాస్టర్లు (ఐఎం)లు ఉన్నారు. లక్షా 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పది మందికీ ప్రైజ్‌మనీ లభించనుంది. విజేతకు 40 వేల డాలర్లు (రూ. 28 లక్షల 47 వేలు), రన్నరప్‌కు 30 వేల డాలర్లు (రూ. 21 లక్షల 35 వేలు), మూడో స్థానంలో నిలిచిన వారికి 20 వేల డాలర్లు (రూ.14 లక్షల 23 వేలు) అందజేస్తారు.