హారికకు అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: జలకారోస్ చెస్ ఫెస్టివల్ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మహిళల విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. హంగేరిలోని జలకారోస్ పట్టణంలో ముగిసిన ఈ టోర్నమెంట్‌లో ఓపెన్ కేటగిరిలో పాల్గొన్న హారిక మొత్తం ఆరు పాయింట్లు సాధించి పదో స్థానంలో నిలిచింది.
నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హారిక మూడు గేముల్లో గెలిచి, మిగతా ఆరింటిని ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. సెర్బియాకు చెందిన ఇవాన్ ఇవానిసెవిచ్ ఏడు పాయిం ట్లతో టైటిల్ సాధించాడు. ఓపెన్ విభాగంలో హారిక పాల్గొన్నప్పటికీ... మహిళల విభాగంలోనూ ప్రత్యేక పురస్కారాలు ఉండటంతో హారికకు టాప్ ర్యాంక్ దక్కింది.