International Tournament
-
అంతర్జాతీయ టోర్నీలో భారత స్కీయర్‌కు కాంస్యం
మోంటెనిగ్రోలో జరిగిన అంతర్జాతీయ అల్పైన్ స్కీయింగ్ టోర్నీలో భారత క్రీడాకారిణి ఆంచల్ ఠాకూర్ కాంస్య పతకంతో మెరిసింది. గురువారం జరిగిన జెయింట్ స్లాలోమ్ ఈవెంట్‌ను ఆంచల్ 1ని:54.30 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల ఆంచల్ 2018లో టర్కీలో జరిగిన టోర్నీలోనూ కాంస్యం గెలిచింది. గతంలో ఆమె నాలుగుసార్లు ప్రపంచ స్కీయింగ్ చాంపియన్‌షిప్‌లలో పోటీ పడింది. -
మేరీకోమ్‌కు పతకం ఖాయం
కాస్టెలాన్ (స్పెయిన్): ఏడాది విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత మహిళా మేటి బాక్సర్ మేరీకోమ్ పతకాన్ని ఖాయం చేసుకుంది. బాక్సమ్ ఓపెన్ టోర్నీలో మేరీకోమ్ 51 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్లో ఇటలీకి చెందిన జియోర్డానా సొరెన్టినోపై గెలిచింది. సెమీఫైనల్లో అమెరికా బాక్సర్ వర్జీనియాతో మేరీకోమ్ ఆడనుంది. పురుషుల విభాగంలో మనీశ్ (63 కేజీలు) క్వార్టర్ ఫైనల్ చేరాడు. తొలి రౌండ్లో మనీశ్ 5–0తో రడుయెన్ (స్పెయిన్)పై నెగ్గాడు. -
సెమీస్‌కు దూసుకెళ్లిన సానియా జోడీ
హోబర్ట్: పునరాగమనంలో ఆడుతోన్న తొలి టోర్నీలోనే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అదరగొడుతోంది. హోబర్ట్ ఇంటర్నేషనల్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సానియా– నదియా కిచెనోక్ (ఉక్రెయిన్) ద్వయం 6–2, 4–6, 10–4తో అమెరికా ద్వయం క్రిస్టీనా మెక్‌హేల్–వనియా కింగ్‌పై గెలిచింది. గంటా 24 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ అద్భుతంగా ఆడింది. నేడు జరిగే సెమీస్‌లో పోరులో టమరా జిదాన్సెక్ (స్లోవేనియా)– మేరి బౌజ్కోవా (చెక్ రిపబ్లిక్) జోడీతో సానియా– కిచెనోక్ ద్వయం తలపడుతుంది. -
టైటిల్‌కు విజయం దూరంలో...
మరోసారి సాధికారిక ప్రదర్శనతో అలరించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఈ ఏడాది తొలిసారి ఓ అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్‌కు చేరింది. సీజన్లో తొలి టైటిల్ లోటును తీర్చుకునేందుకు మరో విజయం దూరంలో నిలిచింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తుది సమరానికి అర్హత సాధించింది. జకార్తా: నెల రోజులపాటు లభించిన విరామ సమయంలో పక్కా ప్రణాళికతో సాధన చేసిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు అద్భుత ఫలితాలు సాధిస్తోంది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 46 నిమిషాల్లో 21–19, 21–10తో ప్రపంచ మూడో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా)పై గెలిచింది. ఈ ఏడాది సింగపూర్ ఓపెన్, ఇండియా ఓపెన్‌లో సెమీఫైనల్లో వెనుదిరిగిన ఈ తెలుగమ్మాయి తాజా గెలుపుతో సీజన్లో తొలి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 10–4తో యామగుచిపై ఆధిక్యంలో ఉంది. రెండో సెమీఫైనల్లో అకానె యామగుచి 21–9, 21–15తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)ను బోల్తా కొట్టించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్, స్విస్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్స్ సాధించి జోరు మీదున్న చెన్ యుఫె ఆటలు సింధు ముందు సాగలేదు. తొలి గేమ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. నాలుగుసార్లు చెన్ యుఫె ఆధిక్యంలోకి వెళ్లినా దానిని నిలబెట్టుకోలేకపోయింది. సింధు 14–18తో వెనుకబడిన దశలో వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 19–18తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత చెన్ యుఫె ఒక పాయింట్ సాధించగా... ఆ వెంటనే సింధు రెండు పాయింట్లు గెలిచి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్ ఆరంభంలో సింధు తడబడినట్లు కనిపించినా వెంటనే గాడిలో పడింది. 2–5తో వెనుకబడిన దశలో సింధు వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 9–5తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత స్కోరు 10–8తో ఉన్నదశలో సింధు వరుసగా 8 పాయింట్లు సాధించి 18–8తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. అదే జోరులో రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 3 ఇండోనేసియా ఓపెన్‌లో భారత్ తరఫున ఫైనల్ చేరిన మూడో ప్లేయర్‌గా సింధు నిలిచింది. గతంలో సైనా నెహ్వాల్ వరుసగా నాలుగుసార్లు (2009, 2010, 2011, 2012) ఫైనల్ చేరి మూడుసార్లు (2009, 2010, 2012) టైటిల్ గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 2017లో విజేతగా నిలిచాడు. -
ఉరుముతున్న మెరుపు
చారిత్రక పునాదుల మీద జీవించే వర్తమానం రేపటికి చరిత్ర అవుతుంది. చరిత్ర మిగిల్చిన ఆనవాళ్లను, అనుభవాలను ఆధారం చేసుకుని ముందుకు నడిచే వాళ్లు లెక్కకు మించినంత మంది ఉంటారు. చరిత్రను సృష్టించే వాళ్లు కొందరే ఉంటారు. చరిత్ర సృష్టించిన కొందరిలో ఒకమ్మాయి గుగులోత్ సౌమ్య. మహిళల ఫుట్‌బాల్ విభాగంలో ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఆడిన తొలి తెలంగాణ అమ్మాయి సౌమ్య. తండాలోని ఈ మెరుపు అంతర్జాతీయంగా ఉరుముతోంది. సౌమ్య సొంతూరు నిజామాబాద్ జిల్లాలోని కిషన్‌తండా. సౌమ్య తల్లిదండ్రుల కల ఆమెను క్రీడాకారిణిని చేసింది. అయితే వాళ్లు కలగన్నది ఆమె క్రీడాకారిణి కావాలని కాదు. ఆమె క్రీడాకారిణి అవుతుందని వాళ్లు కలలో కూడా అనుకోలేదు. వాళ్లుండే తండాలో ఆడపిల్లల చదువు.. కంటికి కనిపిస్తూ కురవకుండా తేలిపోయే మేఘమే. సౌమ్య తండ్రి గోపి సెకండరీ గ్రేడ్ టీచర్. ఆమె తల్లి ధనలక్ష్మి చదువుకోలేదు. వాళ్లకు సౌమ్యకంటే ముందు ఇద్దరమ్మాయిలున్నారు. సౌమ్య తర్వాత ఒక అబ్బాయి. మొత్తం నలుగురు పిల్లలు. ఆ అమ్మానాన్నల కల... పిల్లలందర్నీ చదివించి తీరాలని. అందుకోసం వాళ్లు పడిన శ్రమ చిన్నదేమీ కాదు. సౌమ్య తండ్రి తనకు పోస్టింగ్ ఉన్న చోట ఉద్యోగానికి వెళ్లాలి. సొంతూర్లో ఉన్న పొలం పనులు చూసుకోవాలి. వాటి చుట్టూ జీవితాన్ని అల్లుకుంటే పిల్లలను చదివించడం కుదరని పని. అందుకే ధైర్యం చేసి ఓ నిర్ణయానికి వచ్చారా దంపతులు. ధనలక్ష్మి నిజామాబాద్‌లో ఓ చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని నలుగురు పిల్లలను స్కూలుకు పంపించింది. గోపి తన ఉద్యోగం, సొంతూర్లో పనులు చూసుకుంటూ వారానికోసారి నిజామాబాద్‌కు వచ్చి భార్యాపిల్లలను చూసుకునేవాడు. అమ్మానాన్నల కష్టం పిల్లలకు తెలుస్తూనే ఉంది. సంపన్నులు కాకపోయినప్పటికీ తమ కోసం వాళ్లు అమరుస్తున్న సౌకర్యాలను అర్థం చేసుకున్నారు పిల్లలు. చక్కగా చదువుకుంటున్నారు. అప్పుడు జరిగిందో మిరకిల్. కాలం నిర్ణయించింది సౌమ్య సిక్స్›్త క్లాస్ వరకు నిజామాబాద్ జిల్లా నవీపేటలోని జిల్లా పరిషత్ స్కూల్లో చదివింది. సెవెన్త్ క్లాస్‌కి నిజామాబాద్‌లోని రాఘవ స్కూల్లో చేరింది. జూన్‌లో చేరింది. జూలైలో ఇంటర్ స్కూల్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ టోర్నమెంట్‌కు సెలక్షన్ జరగాలి. వరుసగా వర్షాలు. స్టూడెంట్స్ సెలక్షన్స్‌కి కూడా తెరిపినివ్వడం లేదు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ నాగరాజుకు టెన్షన్ పెరిగిపోతోంది. పాత స్టూడెంట్స్ కొందరుంటారు, మరికొందరు కొత్త వారిని సెలెక్ట్ చేస్తే బావుంటుంది, వాతావరణం సహకరించడం లేదు. తోటి టీచర్లతో పిచ్చాపాటి కబుర్లలో మనసులో మాట బయటకొచ్చింది. అప్పుడు ఓ టీచర్ ‘కొత్తగా చేరిన ఓ అమ్మాయి పీఈటీ క్లాసుల్లేనప్పుడు కూడా గ్రౌండ్లో పరుగెడుతుంటుంది. పరుగులో ఒడుపు కూడా ఉంద’ని చెప్పారు. అలా సౌమ్య కోచ్ నాగరాజు దృష్టిలోకి వచ్చింది. వాళ్లు ఊహించినట్లే ఆమె ఆ ఏడాది జరిగిన వంద మీటర్లు, రెండు వందలు, నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాలందుకుంది. కోచింగ్ ఇస్తే మంచి క్రీడాకారిణి అవుతుందనిపించింది నాగరాజుకి. స్కూల్లో అన్ని రకాల ఆటలనూ ప్రాక్టీస్ చేయిస్తున్నప్పుడు సౌమ్య ఫుట్‌బాల్ కిక్ చాలా మెళుకువగా ఇస్తోందని గమనించారాయన. సౌమ్య ఫుట్‌బాల్ క్రీడాకారిణి కావడానికి అది తొలి ఘట్టం. అయితే... అసలైన ట్విస్ట్‌లు కూడా అక్కడే మొదలయ్యాయి. అమ్మ ‘ససేమిరా’ ‘మీ అమ్మాయి బాగా ఆడుతోంది. రొటీన్‌గా స్కూల్లో అందరితో కలిపి ఓ గంటసేపు ఆడించడం కాదు, ఆమెకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తాను’ అని సౌమ్య తల్లి ధనలక్ష్మితో చెప్పారు నాగరాజు. ఆయన మాట పూర్తయ్యేలోపే ఆమె వీల్లేదంటే వీల్లేదని ఖండితంగా చెప్పేసింది. ఆమె ఆందోళన కూడా సమంజసమే. పిల్లల్ని చదివించుకోవడానికి సొంత ఊరు కాదని, భర్త ఉద్యోగం చేసే ఊరు కూడా కాదని నిజామాబాద్‌కి వచ్చింది. నలుగురిలో ముగ్గురు ఆడపిల్లలు. ఇప్పటి దాకా సాకింది ఒక ఎత్తయితే, ఇక ముందు సంరక్షణ ఒక ఎత్తు. వయసొచ్చిన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తమ దారిన తాము నడిచి పోతున్న ఆడపిల్లలకు.. తమ దారిలో ఎన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయో తెలియదు. తల్లిగా తనకు తెలుసు. అందుకే ఆమె అంత కచ్చితంగా వ్యతిరేకించింది. పైగా ఏ పొరపాటు జరిగినా... తండాలో ఉన్న అందరిలా గోప్యంగా బతుకు వెళ్లదీయకుండా చదువులంటూ పట్టణం బాట పట్టారని నలుగురూ నాలుగు మాటలు అంటారేమోననే భయం. సౌమ్య ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేయడానికి సౌమ్య తల్లి ఏ మాత్రం సుముఖంగా లేదని నిర్ధారణ అయిన తర్వాత సౌమ్య తండ్రి నిజామాబాద్‌కి వచ్చే వరకు ఎదురు చూశారు కోచ్. ధనలక్ష్మి చెప్పినంత ఖండితంగా చెప్పలేదు కానీ గోపి కూడా దాదాపుగా అదే మాట చెప్పారు. ఆ మాటతో నాగరాజుకి ఆశ వదులుకోక తప్పలేదు. అయితే... తన ఆశ స్టేడియంలోకి వస్తుందని అతడు ఊహించలేదు. బ్యాగ్ వదిలేసి పరుగెత్తింది సౌమ్య కళ్ల ముందే అంతా జరుగుతోంది. కోచ్ ఇంటికి వచ్చి తల్లిని, తండ్రిని అడగడం చూసింది. తల్లి ఒప్పుకోకపోయినా తండ్రి ఒప్పుకుంటాడేమోనని ఆశపడింది. అమ్మానాన్నలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమూ విన్నది. ఫుట్‌బాల్ కోచింగ్‌కి అన్ని దారులూ మూసుకుపోతున్నట్లు అర్థమైంది. ఓ రోజు ఉదయం స్కూలుకి రెడీ అవుతోంది. ఆమె ఇంటి ముందు నుంచే పొరుగున ఉంటున్న ముగ్గురు అక్కచెల్లెళ్లు స్నేహ, నమ్రత, మేఘన వెళ్తున్నారు. వాళ్లు వెళ్తున్నది స్పోర్ట్స్ స్టేడియంకేనని, ఫుట్‌బాల్ ప్రాక్టీస్కేనని సౌమ్యకు తెలుసు. వాళ్లను రోజూ చూస్తూనే ఉంటుంది. ఆ రోజు ఎప్పటిలా చూస్తూ ఊరుకోవడం సాధ్యం కాలేదామెకి. స్కూలు బ్యాగ్ ఇంట్లోనే వదిలేసి, వాళ్లమ్మ అరుస్తున్నా పట్టించుకోకుండా స్టేడియానికి పరుగెత్తింది. కోచ్ ముందు నిలబడి ‘నేను ప్రాక్టీస్ చేస్తా’నని చెప్పింది. ఇంతటి సినీఫక్కీలో మొదలైంది సౌమ్య ఫుట్‌బాల్ ప్రస్థానం.అండర్ ఫోర్టీన్తో మొదలైన సౌమ్య ఫుట్‌బాల్ కెరీర్ అండర్ సిక్స్టీన్లను దాటి అండర్ నైన్టీన్కి చేరింది. కోల్‌కతా టోర్నమెంట్లో మంచి స్కోర్ చేసింది. ముంబయిలో జరిగిన ఉమెన్ ఇండియన్ లీగ్ టోర్నమెంట్‌తోపాటు దేశంలో అనేక టోర్నమెంట్లు ఆడింది. సౌతాఫ్రికాలోని జోహన్నాస్బెర్గ్లో జరిగిన బ్రిక్స్ అండర్ సెవెంటీన్లో ఆడింది. బ్రెజిల్, రష్యా, చైనాలతో పోటీ పడింది. అండర్ ఎయిటీన్ సాఫ్ (సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్) కప్ టోర్నమెంట్లో ఆడింది. ఆ పోటీలో మనదేశానికి కాంస్య పతకం వచ్చిది. భారత మహిళల ఫుట్‌బాల్ టీమ్ గెలుచుకున్న తొలి ఇంటర్నేషనల్ మెడల్ అది.ఈ మే నెల ఐదు నుంచి 22 వరకు పంజాబ్‌లో నేషనల్ లెవెల్ టోర్నమెంట్లు జరగనున్నాయి. మెరుపువేగంతో కదిలి తల అడ్డం వేసి బంతిని ఆపి ప్రత్యర్థి జట్టుని నిలువరించడానికి సౌమ్య సిద్ధంగానే ఉంది. పాదరసంలా కదులుతూ బంతిని గోల్ చేయడానికి ఆమె పాదాలు చురుగ్గా ఉన్నాయి. ఎటొచ్చీ ధర్మసంకటం పరీక్షల రూపంలో ఎదురైంది. ఆమెకు డిగ్రీ ఫస్టియర్ పరీక్షలు కూడా అప్పుడే ఉన్నాయి. ‘‘స్కూల్లో అయితే టోర్నమెంట్‌కు అనుమతించి పరీక్షలు మళ్లీ పెట్టేవాళ్లు. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు’’ అన్నది సౌమ్య. ప్రకృతి పరీక్షనూ నెగ్గింది సౌమ్య ఇష్టంతో, తల్లిదండ్రుల అయిష్టంతో మొదలైన ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌కు అన్నీ అనుకూలంగా ఏమీ కలిసి రాలేదు. ప్రకృతి కూడా తనవంతు పరీక్ష పెట్టింది. అది 2015. నేపాల్‌లో అండర్ ఫోర్టీన్ టోర్నమెంట్‌కి వెళ్లింది సౌమ్య. ఖాట్మండులోని దశరథ స్టేడియంలో ఆడాలి. ఆటకు అంతా సిద్ధమవుతున్నారు. ఒక్కసారిగా పెళపెళమంటూ పెద్ద శబ్దం. ‘ఏమై ఉంటుందీ’ అని అందరూ దిక్కులు చూశారు. కాళ్ల కింద భూమి కదులుతోంది. స్టేడియం ఉయ్యాలలా ఊగుతోంది. అది భూకంపం అని తెలిసింది. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ‘భూకంపం ఎలా ఉంటుందో నేపాల్కెళ్లి చూసొచ్చాను’ అని నవ్వుతూ అంది సౌమ్య. ‘‘భూకంపం కారణంగా ఆ టోర్నమెంట్ ఆగిపోయింది. మా టీమ్‌లో ఎవరికీ ఏమీ కాలేదు. నిజామాబాద్‌కి వచ్చిన తర్వాత తెలిసిన వాళ్లంతా వచ్చి, మేము క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషించారు’’ అన్నది. భూకంపం కారణంగా సౌమ్య అప్పుడు ఆడలేకపోయింది. ఇప్పుడు మళ్లీ కాలం పరీక్ష పెట్టిందామెకు. పుస్తకాలా, ఫుట్‌బాలా తేల్చుకోమంటోంది. ఆమె తండ్రి గోపికి కూతురు పరీక్షలు రాస్తే బావుణ్ననే ఉంది. సౌమ్య పెద్దక్క స్వప్న బీటెక్ చేసి సివిల్స్‌కి ప్రిపేరవుతోంది. రెండో అక్క స్వర్ణ బీఎస్సీ నర్సింగ్ చేసి పారామెడికల్ కోచింగ్ తీసుకుంటోంది. సౌమ్యను ఐపీఎస్‌గా చూడాలని ఆ తండ్రి కల. సౌమ్యకు మాత్రం ఉమెన్ ఫుట్‌బాల్ టీమ్‌లో సీనియర్ లెవెల్లో దేశం తరఫున ఆడాలని ఉంది. క్రిస్టియానో రోనాల్డ్ ఆమెకు ఇష్టమైన ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఆమె కెరీర్ కల క్రీడల చుట్టూ తిరుగుతోంది. మహిళల క్రికెట్ అనగానే మిథాలీరాజ్ గుర్తుకు వచ్చినట్లే భవిష్యత్తు తరానికి మహిళల ఫుట్‌బాల్ అంటే గుగులోత్ సౌమ్య గుర్తుకు రావాలని ఆశిద్దాం. వాకా మంజులారెడ్డి ఫొటోలు: రాజ్‌కుమార్, సాక్షి, నిజామాబాద్ వాళ్లమ్మగారి కోపం తగ్గింది సౌమ్య పేరెంట్స్ ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌కి ఎంతకీ ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయి ఫీజు మాఫీ చేయమని స్కూల్ ప్రిన్సిపల్‌ని రిక్వెస్ట్ చేశాను. ఆయన ఒప్పుకున్నారు కూడా. అప్పటికే ఎయిత్ క్లాస్ ఫీజు కట్టేశారు వాళ్ల నాన్న. నైన్త్, టెన్త్ క్లాసులకు ఫీజు రద్దు చేశారు ప్రిన్సిపల్. అలా ఏదో ఒక ప్రోత్సాహకం ఉంటేనయినా ఆ అమ్మాయిని ప్రాక్టీస్‌కి పంపిస్తారని నా ప్రయత్నం. నేషనల్స్‌కి సెలెక్ట్ అయిన తర్వాత కానీ వాళ్లమ్మగారు ప్రసన్నం కాలేదు. అప్పటి వరకు కోపంగానే ఉన్నారామె. సౌమ్య టోర్నమెంట్స్‌కి వెళ్తూనే టెన్త్ క్లాస్‌లో 7.3 జీపీఏ, ఇంటర్లో 902 మార్కులు తెచ్చుకుంది. ఇప్పుడు బీఎస్సీ ఫస్టియర్. కేర్ అకాడమీ కూడా ఆమెకు ప్రోత్సహిస్తోంది. ఫీజు మాఫీ చేయడమే కాకుండా స్పోర్ట్స్ ఎక్స్పెండిచర్ కోసం ఏటా పాతికవేలిస్తోంది. వచ్చే నెలలో పంజాబ్‌లో టోర్నమెంట్ ఉంది. ఇప్పటికే ఒరిస్సా రైజింగ్ స్టార్, కోలాపూర్ ఎఫ్‌సి క్లబ్‌లు ఆమెకు ఆఫర్ ఇచ్చాయి. నాగరాజు, కోచ్, కేర్ ఫుట్‌బాల్ అకాడమీ, నిజామాబాద్ -
ఆర్థిక సాయమందిస్తే...
న్యూఢిల్లీ: ప్రపంచ ర్యాంకు మెరుగవ్వాలంటే అంతర్జాతీయ టోర్నీలే దిక్కని, దీని కోసం తనకు ఆర్థిక సాయమందించాలని జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ సౌరభ్ వర్మ అభ్యర్థించాడు. 26 ఏళ్ల వర్మ ఎనిమిదేళ్ల క్రితమే 2011లో సీనియర్ జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. కానీ ఖరీదైన శిక్షణకు నోచుకోకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, గాయాలు తదితర కారణాలతో అతను తరచూ టోర్నీలకు దూరమవుతున్నాడు. దీంతో 2012లో కెరీర్ బెస్ట్ 30వ ర్యాంకుకు చేరుకున్న సౌరభ్ ఇప్పుడు 55వ ర్యాంకుకు పడిపోయాడు. మీడియాతో అతను మాట్లాడుతూ ‘అంతర్జాతీయ టోర్నీలు ఆడేంత స్థోమత నాకు లేదు. ఆర్థిక ఇబ్బందులున్నాయి. దీనికి తోడు కొత్త నిబంధన నాకు శాపమైంది. కేవలం టాప్–25 ర్యాంకర్లకు మాత్రమే భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఆర్థిక సాయం చేస్తుంది. దీంతో నాకు అంతర్జాతీయ టోర్నీలు ఆడే అవకాశం కష్టమైంది. దాంతోపాటే ర్యాంకింగ్ కూడా దిగజారింది’ అని అన్నాడు. దేశవాళీ టోర్నీల్లో నా ప్రతిభ చూసిన ‘బాయ్’ డచ్ ఓపెన్ ఆడేందుకు సాయపడిందని... అయితే మరిన్ని అంతర్జాతీయ టోర్నీలు ఆడేందుకు మరింత చేయూత కావాలని సౌరభ్ వర్మ కోరాడు. కనీసం 10 నుంచి 12 టోర్నీలు ఆడితేనే ర్యాంకింగ్ పాయింట్లు లభిస్తాయన్నాడు. గతేడాది మోకాలి గాయం బాధించడంతో ఆటకు దూరమయ్యానని, ఇప్పుడైతే టోర్నీలను నా సొంత డబ్బులతోనే ఆడుతున్నానని చెప్పాడు. ఇది తనకు పెనుభారమవుతోందని తెలిపాడు. ‘త్వరలో స్విస్ ఓపెన్, ఒర్లియన్స్ ఓపెన్ ఆడేందుకు వెళుతున్నా. దీనికి అయ్యే ఖర్చంతా నాదే’ అని అన్నాడు. గాయం నుంచి కోలుకున్నాక గతేడాది సౌరభ్... రష్యా ఓపెన్, డచ్ ఓపెన్లలో టైటిల్స్ గెలిచాడు. ఇటీవలే గువాహటిలో ముగిసిన జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచాడు. ఈ సీనియర్ టోర్నీలో అతను మూడో టైటిల్ గెలుచుకున్నాడు. -
'గ్రాండ్‌మాస్టర్' అర్జున్
భారత చెస్‌లో అద్భుతం చోటు చేసుకుంది. రోజు తేడాలో ముగ్గురు భారత ఆటగాళ్లు గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా సంపాదించారు. అబుదాబి మాస్టర్స్ అంతర్జాతీయ టోర్నమెంట్లో తెలంగాణకు చెందిన 14 ఏళ్ల ఎరిగైసి అర్జున్... కేరళకు చెందిన 14 ఏళ్ల నిహాల్ సరీన్ జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను సొంతం చేసుకున్నారు. మరోవైపు ఇటలీలో జరిగిన స్పిలిమ్బెర్గో ఓపెన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల కార్తీక్ వెంకటరామన్ మూడో జీఎం నార్మ్ గెల్చుకున్నాడు. ఈ క్రమంలో నిహాల్ భారత్ నుంచి 53వ గ్రాండ్‌మాస్టర్‌గా... అర్జున్ 54వ గ్రాండ్‌మాస్టర్‌గా... కార్తీక్ 55వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించారు. అబుదాబి టోర్నీలో తెలంగాణకే చెందిన మరో ప్లేయర్ హర్ష భరతకోటి కూడా మూడో జీఎం నార్మ్ దక్కించుకున్నాడు. అయితే జీఎం హోదా ఖాయం కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌కు 26 పాయింట్ల దూరంలో ఉండటంతో ఈ ఘనత అందుకోవడానికి హర్ష మరికొంత కాలం వేచి చూడనున్నాడు. సాక్షి, హైదరాబాద్: ఊహకందని ఎత్తులు వేస్తూ... తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను చిత్తు చేస్తూ... చిరుప్రాయంలోనే ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న ఆ కుర్రాడు తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేసి చూపెట్టాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి గ్రాండ్‌మాస్టర్ (జీఎం)గా అవతరించి అబ్బురపరిచాడు. ఏదో సరదా కోసం చెస్ ఆడటం మొదలుపెట్టిన అతను ఆ తర్వాత ఆ ఆటనే తన కెరీర్‌గా మల్చుకున్నాడు. ఇప్పుడు అందరూ గర్వపడేలా చేస్తూ... చెస్ క్రీడాకారుల జీవిత లక్ష్యమైన గ్రాండ్‌మాస్టర్ హోదాను 14 ఏళ్ల 11 నెలల 13 రోజుల వయస్సులోనే సాధించి ఔరా అనిపించిన ఆ కుర్రాడే ఎరిగైసి అర్జున్. వరంగల్‌లోని హన్మకొండకు చెందిన అర్జున్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో బుధవారం ముగిసిన అబుదాబి మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో 17వ స్థానంలో నిలిచి జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో అర్జున్ 6 పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా అతనికి 17వ స్థానం లభించింది. అర్జున్ నలుగురు గ్రాండ్‌మాస్టర్స్ పెట్రోసియాన్ (అర్మేనియా), అహ్మద్ (ఈజిప్ట్), అమీన్ బాసెమ్ (ఈజిప్ట్), సనన్ (రష్యా)లతో జరిగిన వరుస గేమ్‌లను ‘డ్రా’ చేసుకోవడం విశేషం. టోర్నీ మొత్తంలో ఒక గేమ్‌లో మాత్రమే ఓడిన అర్జున్ నాలుగు గేముల్లో గెలిచి, మిగతా నాలుగింటిని ‘డ్రా’గా ముగించాడు. ఈ టోర్నీలో మంగళవారమే జీఎం మూడో నార్మ్ అందుకొని జీఎం హోదా ఖాయం చేసుకున్న నిహాల్ సరీన్ 5.5 పాయింట్లతో 24వ స్థానంలో నిలిచాడు. ఎనిమిది నెలల్లోనే... ఈ ఏడాది జనవరిలో అర్జున్ ఖాతాలో కనీసం అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా కూడా లేదు. కానీ ఎనిమిది నెలల్లో అర్జున్ అద్భుతమే చేశాడు. జనవరిలో జరిగిన ఐఐఎఫ్ఎల్ ముంబై అంతర్జాతీయ టోర్నీలో తొలి ఐఎం నార్మ్... ఏరోఫ్లోట్ ఓపెన్‌లో రెండో ఐఎం నార్మ్... మార్చిలో హెచ్డీ బ్యాంక్ వియత్నాం టోర్నీలో మూడో ఐఎం నార్మ్ దక్కించుకొని ఐఎం హోదా ఖాయం చేసుకున్నాడు. మేలో జరిగిన కోల్‌కతా ఓపెన్ టోర్నీలో తొలి జీఎం నార్మ్ సాధించడంతోపాటు 2500 ఎలో రేటింగ్‌ను అందుకున్నాడు. జూలైలో సెర్బియాలో జరిగిన థర్డ్ శాటర్డే–80 టోర్నీలో రెండో జీఎం నార్మ్‌ను పొందిన అతను బుధవారం అబుదాబి మాస్టర్స్ టోర్నమెంట్లో చివరిదైన మూడో జీఎం నార్మ్‌ను సాధించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ... వరంగల్‌లో కోచ్ బొల్లం సంపత్ వద్ద ఎనిమిదేళ్ల ప్రాయంలో చెస్‌లో ఓనమాలు నేర్చుకున్న అర్జున్ ఆ తర్వాత మరో కోచ్ సుదర్శన్ వద్ద తన ఆటతీరుకు మెరుగులు దిద్దుకున్నాడు. అనంతరం రెండేళ్లపాటు కోచ్ రామరాజు వద్ద శిక్షణ పొందిన అర్జున్ గుజరాత్లో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో అండర్–13 విభాగంలో స్వర్ణం నెగ్గాడు. ఆ తర్వాత భారత జట్టులోకి ఎంపికైకొరియాలో జరిగిన ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచి తొలి అంతర్జాతీయ పతకం సొంతం చేసుకున్నాడు. అర్జున్ నిలకడగా విజయాలు సాధిస్తుండటంతో అతని తల్లిదండ్రులు డాక్టర్ శ్రీనివాసరావు, జ్యోతి కూడా తమవంతుగా ప్రోత్సాహం అందించారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ గ్రాండ్‌మాస్టర్ విక్టర్ మిఖాలెవ్‌స్కీ వద్ద శిక్షణ తీసుకుంటున్న అర్జున్... గతేడాది ఆసియా చాంపియన్ షిప్లో స్వర్ణం, ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో రజతం... కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచాడు. అబుదాబి టోర్నీలో తెలంగాణకే చెందిన మరో ప్లేయర్ హర్ష 6.5 పాయింట్లతో మరో పది మందితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్ వర్గీకరించగా హర్షకు 13వ స్థానం దక్కింది. 9వ రౌండ్లో 18 ఏళ్ల హర్ష 42 ఎత్తుల్లో జార్జియా గ్రాండ్‌మాస్టర్ లెవాన్పై... 8వ రౌండ్లో 49 ఎత్తుల్లో ఇటలీ గ్రాండ్‌మాస్టర్ వొకాటురో డానియల్‌ను ఓడించాడు. ఈ ప్రదర్శనతో హర్షకు మూడో జీఎం నార్మ్ దక్కింది. అయితే 2500 ఎలో రేటింగ్‌కు హర్ష దూరంగా ఉండటంతో అతనికి జీఎం హోదా రావడానికి కాస్త సమయం పట్టే అవకాశముంది. తిరుపతికి చెందిన 19 ఏళ్ల కార్తీక్ ఇటలీలో జరిగిన స్పిలిమ్బెర్గో ఓపెన్‌లో 6 పాయింట్లు సాధించి తొమ్మిదో ర్యాంక్‌ను పొందాడు. ఈ క్రమంలో మూడో జీఎం నార్మ్ కూడా పొంది జీఎం హోదా ఖాయం చేసుకున్నాడు. గతేడాది ఆగస్టులో బార్సిలోనాలో జరిగిన సాంట్స్ ఓపెన్‌లో తొలి జీఎం నార్మ్... ఈ ఏడాది జూన్‌లో భువనేశ్వర్‌లో జరిగిన కిట్ అంతర్జాతీయ టోర్నీలో రెండో జీఎం నార్మ్ సాధించాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి జీఎం అయిన ఐదో ప్లేయర్ కార్తీక్. ఇంతకుముందు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, లలిత్ బాబు ఈ ఘనత సాధించారు. -
చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్
న్యూఢిల్లీ: రెండేళ్ల విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌లోనే భారత మహిళా అగ్రశ్రేణి జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పసిడి పతకంతో సత్తా చాటింది. టర్కీ లో జరిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ చాలెంజ్ కప్‌లో దీపా వాల్ట్ ఈవెంట్లో స్వర్ణం చేజిక్కించుకుంది. ఫైనల్లో ఆమె 14.150 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో 13.400 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ ప్రదర్శనతో దీపా కర్మాకర్ ప్రపంచకప్ చరిత్రలో పతకం నెగ్గిన రెండో భారతీయ జిమ్నాస్ట్‌గా, స్వర్ణ పతకం నెగ్గిన తొలి జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది. ఈ ఏడాదే తెలంగాణ జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి మెల్బోర్న్లో జరిగిన ప్రపంచకప్‌లో కాంస్యం సాధించింది. -
క్వార్టర్స్‌లో మేరీకోమ్
హో చి మిన్ సిటీ (వియత్నాం): తన పాత వెయిట్ కేటగిరికి మారిపోయాక బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ శుభారంభం చేసింది. గురువారం మొదలైన ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మేరీకోమ్ (48 కేజీలు)తోపాటు శిక్ష (54 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. తొలి రౌండ్లో 35 ఏళ్ల మేరీకోమ్ వియత్నాం బాక్సర్ దియెమ్ తి ట్రిన్ కియుపై... ఒయున్ ఎర్డెన్ నెర్గుయి (మంగోలియా)పై శిక్ష విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో మెంగ్ చియె పింగ్ (చైనీస్ తైపీ)తో మేరీకోమ్; కొషిమోవాతో శిక్ష తలపడతారు. -
ఆ ఏడు దేశాల క్రీడాకారులు అమెరికాకు రావచ్చు
యూఎస్ఓసీ ప్రకటన డెన్వర్: తమ దేశంలో జరిగే అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు నిషేధిత ఏడు ఇస్లామిక్ దేశాల క్రీడాకారులు అమెరికాకు రావడంలో ఎలాంటి ఇబ్బంది లేదని యూఎస్ ఒలింపిక్ కమిటీ (యూఎస్ఓసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు తమ ప్రభుత్వం హామీ ఇచ్చిందని పేర్కొంది. ఏడు ఇస్లామిక్ దేశాలకు (ఇరాన్, ఇరాక్, సుడాన్, సోమాలియా, లిబియా, యెమెన్, సిరియా) చెందిన వారిని అమెరికా భూభాగంలో అడుగుపెట్టనీయమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 10 నుంచి లాస్ వెగాస్‌లో ప్రపంచ కప్ ఆర్చరీ జరగనుంది. ఇందులో నిషేధిత జాబితాలో ఉన్న ఇరాన్ నుంచి కూడా ఆర్చర్లు పాల్గొనాల్సి ఉంది. అందుకే యూఎస్ఓసీ ఈ విషయంలో స్పష్టతనిచ్చింది. అయితే ఇరాన్ ప్రాతినిధ్యంపై ఇప్పటిదాకా స్పందన లేదు. అలాగే అమెరికా రెజ్లింగ్ టీమ్ కూడా ప్రపంచకప్ కోసం ఇరాన్ వెళ్లాల్సి ఉంది. -
అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీకి నిఖత్
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ బల్గేరియాలో జరిగే అంతర్జాతీయ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపికైంది. ఫిబ్రవరి 20న మొదలయ్యే ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులుగల భారత జట్టును ప్రకటించారు. మహిళల విభాగంలో ఐదుగురు, పురుషుల విభాగంలో పదిమంది బాక్సర్లు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో పోటీపడుతుంది. మీనా కుమారి (54 కేజీలు), ప్రీతి బెనివాల్ (60 కేజీలు), జ్యోతి (64 కేజీలు), మోనికా సౌన్ (75 కేజీలు) మిగతా సభ్యులుగా ఉన్నారు. పురుషుల విభాగంలో గువాహటిలో గత నెలలో జరిగిన సీనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు నెగ్గిన వారిని ఈ టోర్నీకి ఎంపిక చేశారు. పది మందితో కూడిన జట్టులో రియో ఒలింపియన్స్ శివ థాపా (60 కేజీలు), మనోజ్ కుమార్ (69 కేజీలు) ఉన్నారు. -
డచ్ ఓపెన్‌లో రన్నరప్ జయరామ్
అల్మెరె (నెదర్లాండ్స): పీవీ సింధు (మకావు ఓపెన్, 2013, 14, 15) తర్వాత ఒకే అంతర్జాతీయ టోర్నమెంట్‌ను వరుసగా మూడేళ్లపాటు నెగ్గిన రెండో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందాలని ఆశించిన అజయ్ జయరామ్‌కు నిరాశ ఎదురైంది. 2014, 2015లలో డచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన అజయ్ జయరామ్ ఈసారి మాత్రం రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన డచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జయరామ్ 10-21, 21-17, 18-21తో వాంగ్ జు వీ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. గతంలో వాంగ్ జు వీపై రెండుసార్లు నెగ్గిన జయరామ్ మూడో పర్యాయంలో మాత్రం ఓటమిని ఎదుర్కొన్నాడు. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జయరామ్‌కు గట్టిపోటీ ఎదురైంది. నిర్ణాయక మూడో గేమ్‌లో వాంగ్ ఆరంభంలోనే 4-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత జయరామ్ స్కోరును సమం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోరుుంది. -
విజయ ‘సౌరభం’...
చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రి టైటిల్ నెగ్గిన సౌరభ్ వర్మ తైపీ సిటీ: వరుసగా రెండు అంతర్జాతీయ టోర్నమెంట్లలో (బెల్జియం, పోలాండ్ ఓపెన్) రన్నరప్‌తో సరిపెట్టుకున్న భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సౌరభ్ వర్మకు మూడో టోర్నమెంట్ కలిసొచ్చింది. చైనీస్ తైపీ మాస్టర్స్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరభ్ వర్మ 12-10, 12-10, 3-3తో డారెన్ లూ (మలేసియా)పై గెలిచాడు. తొలి రెండు గేమ్‌లు ముగిసిన తర్వాత మూడో గేమ్‌లో స్కోరు 3-3 వద్ద ఉన్నపుడు డారెన్ లూ భుజం గాయం కారణంగా వైదొలిగాడు. 28 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో తొలి రెండు గేముల్లోనూ సౌరభ్ ఒకదశలో వెనుకబడ్డాడు. కానీ వరుస పారుుంట్లతో చెలరేగి వాటిని సొంతం చేసుకున్నాడు. తొలి గేమ్‌లో 7-10తో వెనుకంజలో ఉన్న సౌరభ్ వరుసగా ఐదు పారుుంట్లు... రెండో గేమ్‌లో 6-10తో వెనుకబడ్డపుడు వరుసగా ఆరు పారుుంట్లు గెలిచాడు. గతేడాది మోకాలి, మోచేతి గాయాలతో బాధపడిన 23 ఏళ్ల సౌరభ్ వర్మ ఈ సీజన్లో పునరాగమనం చేసి నిలకడగా రాణిస్తున్నాడు. ‘నాకిది గొప్ప విజయం. అవసరమైన సమయంలో ఈ టైటిల్ లభించింది. గత రెండు టోర్నీల ఫైనల్స్‌లో ఓడిపోయాను. ఈసారి గత ఫైనల్స్‌లో చేసిన తప్పిదాలను పునరావృతం చేయకుండా ఆడాను. విజయం సాధించాను’ అని సౌరభ్ వ్యాఖ్యానించాడు. విజేతగా నిలిచిన సౌరభ్ వర్మకు 4,125 డాలర్ల (రూ. 2 లక్షల 75 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5,500 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. -
హారికకు అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: జలకారోస్ చెస్ ఫెస్టివల్ అంతర్జాతీయ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మహిళల విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. హంగేరిలోని జలకారోస్ పట్టణంలో ముగిసిన ఈ టోర్నమెంట్లో ఓపెన్ కేటగిరిలో పాల్గొన్న హారిక మొత్తం ఆరు పాయింట్లు సాధించి పదో స్థానంలో నిలిచింది. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హారిక మూడు గేముల్లో గెలిచి, మిగతా ఆరింటిని ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. సెర్బియాకు చెందిన ఇవాన్ ఇవానిసెవిచ్ ఏడు పాయిం ట్లతో టైటిల్ సాధించాడు. ఓపెన్ విభాగంలో హారిక పాల్గొన్నప్పటికీ... మహిళల విభాగంలోనూ ప్రత్యేక పురస్కారాలు ఉండటంతో హారికకు టాప్ ర్యాంక్ దక్కింది. -
జట్టులో నల్లజాతీయులేరీ!
దక్షిణాఫ్రికా బోర్డుకు ప్రభుత్వ శిక్ష కేప్‌టౌన్: జాతీయ క్రికెట్ జట్టులో ఎక్కువ మంది నల్ల జాతివారికి అవకాశం ఇవ్వాలనే ప్రభుత్వ నిబంధనను తగిన రీతిలో అమలుపరచనందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డును ప్రభుత్వం శిక్షించింది. రాబోయే రోజుల్లో దక్షిణాఫ్రికా ఎలాంటి అంతర్జాతీయ టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వకుండా, టోర్నీ నిర్వహణ కోసం బిడ్ వేయకుండా ఆ దేశ క్రీడా మంత్రి ఫికిల్ ఎంబులా నిషేధం విధించారు. ఏడాది క్రితం అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం జాతీయ జట్టులో కనీసం 60 శాతం మంది నల్లజాతివారు ఉండాలి. -
సానియా, పేస్ జోడీల ఓటమి
ఎగాన్ అంతర్జాతీయ టోర్నీ ఈస్ట్బౌర్నీ (యూకే): భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడికి... ఎగాన్ అంతర్జాతీయ టోర్నీలో చుక్కెదురైంది. మహిళల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో మూడోసీడ్ సానియా-బ్లాక్ 1-6, 6-3, 7-10తో అన్‌సీడ్ హో చింగ్ చాన్-యంగ్ జాన్ చాన్ (తైపీ) జంట చేతిలో పరాజయం చవిచూశారు. తొలిసెట్లో వెనుకబడిన సానియా ద్వయం రెండో సెట్లో ఆకట్టుకుంది. కానీ నిర్ణయాత్మక మూడో సెట్లో మళ్లీ తడబడటంతో ఓటమి తప్పలేదు. పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో రెండోసీడ్ లియాండర్ పేస్-ఐజాముల్ ఖురేషి (పాకిస్థాన్) 3-6, 4-6తో ట్రీట్ హుయే (ఫిలిప్పిన్స్)-డొమినిక్ ఇంగ్లాంట్ (బ్రిటన్)ల చేతిలో ఓటమిపాలయ్యారు -
ఐబీఎల్-2 వాయిదా!
జనవరికి మార్చే అవకాశం న్యూఢిల్లీ: ప్రారంభమైన తొలి ఏడాదే సూపర్ సక్సెస్ సాధించినా.. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) రెండో సీజన్‌ను ఈ ఏడాది నిర్వహించే అవకాశాలు దాదాపు లేనట్లుగానే కనిపిస్తోంది. గత ఏడాది ఆగస్టులో ఆరంభ టోర్నీ నిర్వహించిన భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఐబీఎల్-2ను ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించాలని భావించింది. కానీ, పలు అంతర్జాతీయ టోర్నీల కారణంగా దీన్ని వాయిదా వేసే సూచనలు కనిపిస్తున్నాయి. జూలైలో కామన్వెల్త్ క్రీడలు, సెప్టెంబర్‌లో ఆసియా క్రీడలు జరగనున్న నేపథ్యంలో పలువురు అగ్రశ్రేణి క్రీడాకారులు ఐబీఎల్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని, దీంతో టోర్నీకి గ్లామర్ తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే ఈ విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోయినా.. వచ్చే ఏడాది ఆరంభంలో నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు బాయ్ ఉపాధ్యక్షుడు టీపీఎస్ పురి తెలిపారు. -
విశాఖకు క్రికెట్ సందడి
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియం వేదికగా మరో అంతర్జాతీయ టోర్నీకి తెరలేచింది. ఈసారి మొత్తం సిరీస్ అంతా విశాఖలోనే సాగనుంది. న్యూజిలాండ్ దేశ ఫస్ట్‌క్లాస్ జట్టు ఈ సిరీస్ ఆడేందుకు నగరానికి చేరుకుంది. ఆదివారం రాత్రి సింగపూర్ నుంచి నేరుగా న్యూజిలాండ్ -ఎ జట్టు విశాఖ రాగా, మధ్యాహ్నానికే భారత్-ఎ జట్టు నగరానికి చేరుకుంది. ఈ రెండు జట్ల క్రీడాకారులు జాతీయ జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న వారే కావడంతో విశాఖ క్రీడాభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. రెండు వారాలకు పైగా ఇరుజట్లు రెండు టెస్ట్ మ్యాచ్‌లతో పాటు మూడు వన్డేలు ఆడనున్నాయి. తొలుత మూడు రోజుల టెస్ట్ మ్యాచ్ ఈ నెల 28నుంచి పోర్ట్ స్టేడియంలో ప్రారంభం కానుండగా, రెండోది నాలుగురోజుల టెస్ట్ మ్యాచ్. ఇది వైఎస్ఆర్ స్టేడియంలో జరగనుంది. ఇక్కడే మూడు వన్డేలు జరగనున్నాయి. పురుషుల జట్టు సిరీస్ అంతా విశాఖ వేదికగా జరగడం ఇదే తొలిసారికాగా గతంలో మహిళా జట్టు ఈ వేదికగానే సిరీస్ ఆడింది. నేడు ఇరుజట్ల ప్రాక్టీస్ : విశాఖ చేరుకున్న భారత్-ఎ జట్టుకు ఘన స్వాగతం లభించింది. ఇక్కడి గ్రాండ్బేలో ఆదివారం విశ్రాంతి తీసుకున్న జట్టు సోమవారం వైఎస్ఆర్ స్టేడియం-బి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయనుంది. ఆహ్వాన జట్టు న్యూజిలాండ్-ఎ ఉదయం 10 గంటలకు ప్రాక్టీస్ మొదలు పెట్టనుండగా, ఆతిథ్య జట్టు భారత్-ఎ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రాక్టీస్ చేయనుంది. టెస్ట్‌లకు వన్డేల్లో జట్టు మార్పు : భారత్-ఎ జట్టుకు అభిషేక్ నాయర్, న్యూజిలాండ్-ఎ జట్టుకు టామ్ లతమ్ నాయకత్వం వహించనున్నారు. వీరిద్దరూ టెస్ట్ మ్యాచ్‌లకే కెప్టెన్లుగా ఉండనున్నారు. భారత్-ఎ ఆడే వన్డేలకు ఉన్ముక్త్‌చంద్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇరుజట్లు వన్డేలకు మూడేసి మార్పుల్ని చేయనున్నారు.