ఆ ఏడు దేశాల క్రీడాకారులు అమెరికాకు రావచ్చు
యూఎస్‌ఓసీ ప్రకటన
డెన్వర్: తమ దేశంలో జరిగే అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో పాల్గొనేందుకు నిషేధిత ఏడు ఇస్లామిక్ దేశాల క్రీడాకారులు అమెరికాకు రావడంలో ఎలాంటి ఇబ్బంది లేదని యూఎస్ ఒలింపిక్ కమిటీ (యూఎస్‌ఓసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు తమ ప్రభుత్వం హామీ ఇచ్చిందని పేర్కొంది. ఏడు ఇస్లామిక్ దేశాలకు (ఇరాన్, ఇరాక్, సుడాన్, సోమాలియా, లిబియా, యెమెన్, సిరియా) చెందిన వారిని అమెరికా భూభాగంలో అడుగుపెట్టనీయమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 10 నుంచి లాస్ వెగాస్‌లో ప్రపంచ కప్ ఆర్చరీ జరగనుంది.
ఇందులో నిషేధిత జాబితాలో ఉన్న ఇరాన్ నుంచి కూడా ఆర్చర్లు పాల్గొనాల్సి ఉంది. అందుకే యూఎస్‌ఓసీ ఈ విషయంలో స్పష్టతనిచ్చింది. అయితే ఇరాన్ ప్రాతినిధ్యంపై ఇప్పటిదాకా స్పందన లేదు. అలాగే అమెరికా రెజ్లింగ్ టీమ్ కూడా ప్రపంచకప్ కోసం ఇరాన్ వెళ్లాల్సి ఉంది.