భారత చెస్‌లో అద్భుతం చోటు చేసుకుంది. రోజు తేడాలో ముగ్గురు భారత ఆటగాళ్లు గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా సంపాదించారు. అబుదాబి మాస్టర్స్ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో తెలంగాణకు చెందిన 14 ఏళ్ల ఎరిగైసి అర్జున్... కేరళకు చెందిన 14 ఏళ్ల నిహాల్ సరీన్ జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను సొంతం చేసుకున్నారు. మరోవైపు ఇటలీలో జరిగిన స్పిలిమ్‌బెర్గో ఓపెన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల కార్తీక్ వెంకటరామన్ మూడో జీఎం నార్మ్ గెల్చుకున్నాడు. ఈ క్రమంలో నిహాల్ భారత్ నుంచి 53వ గ్రాండ్‌మాస్టర్‌గా... అర్జున్ 54వ గ్రాండ్‌మాస్టర్‌గా... కార్తీక్ 55వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించారు. అబుదాబి టోర్నీలో తెలంగాణకే చెందిన మరో ప్లేయర్ హర్ష భరతకోటి కూడా మూడో జీఎం నార్మ్ దక్కించుకున్నాడు. అయితే జీఎం హోదా ఖాయం కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌కు 26 పాయింట్ల దూరంలో ఉండటంతో ఈ ఘనత అందుకోవడానికి హర్ష మరికొంత కాలం వేచి చూడనున్నాడు.
సాక్షి, హైదరాబాద్: ఊహకందని ఎత్తులు వేస్తూ... తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను చిత్తు చేస్తూ... చిరుప్రాయంలోనే ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న ఆ కుర్రాడు తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేసి చూపెట్టాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి గ్రాండ్‌మాస్టర్ (జీఎం)గా అవతరించి అబ్బురపరిచాడు. ఏదో సరదా కోసం చెస్ ఆడటం మొదలుపెట్టిన అతను ఆ తర్వాత ఆ ఆటనే తన కెరీర్‌గా మల్చుకున్నాడు. ఇప్పుడు అందరూ గర్వపడేలా చేస్తూ... చెస్ క్రీడాకారుల జీవిత లక్ష్యమైన గ్రాండ్‌మాస్టర్ హోదాను 14 ఏళ్ల 11 నెలల 13 రోజుల వయస్సులోనే సాధించి ఔరా అనిపించిన ఆ కుర్రాడే ఎరిగైసి అర్జున్. వరంగల్‌లోని హన్మకొండకు చెందిన అర్జున్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో బుధవారం ముగిసిన అబుదాబి మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో 17వ స్థానంలో నిలిచి జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో అర్జున్ 6 పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా అతనికి 17వ స్థానం లభించింది. అర్జున్ నలుగురు గ్రాండ్‌మాస్టర్స్ పెట్రోసియాన్ (అర్మేనియా), అహ్మద్ (ఈజిప్ట్), అమీన్ బాసెమ్ (ఈజిప్ట్), సనన్ (రష్యా)లతో జరిగిన వరుస గేమ్‌లను ‘డ్రా’ చేసుకోవడం విశేషం. టోర్నీ మొత్తంలో ఒక గేమ్‌లో మాత్రమే ఓడిన అర్జున్ నాలుగు గేముల్లో గెలిచి, మిగతా నాలుగింటిని ‘డ్రా’గా ముగించాడు. ఈ టోర్నీలో మంగళవారమే జీఎం మూడో నార్మ్ అందుకొని జీఎం హోదా ఖాయం చేసుకున్న నిహాల్ సరీన్ 5.5 పాయింట్లతో 24వ స్థానంలో నిలిచాడు.
ఎనిమిది నెలల్లోనే...
ఈ ఏడాది జనవరిలో అర్జున్ ఖాతాలో కనీసం అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా కూడా లేదు. కానీ ఎనిమిది నెలల్లో అర్జున్ అద్భుతమే చేశాడు. జనవరిలో జరిగిన ఐఐఎఫ్‌ఎల్ ముంబై అంతర్జాతీయ టోర్నీలో తొలి ఐఎం నార్మ్... ఏరోఫ్లోట్ ఓపెన్‌లో రెండో ఐఎం నార్మ్... మార్చిలో హెచ్‌డీ బ్యాంక్ వియత్నాం టోర్నీలో మూడో ఐఎం నార్మ్ దక్కించుకొని ఐఎం హోదా ఖాయం చేసుకున్నాడు. మేలో జరిగిన కోల్‌కతా ఓపెన్ టోర్నీలో తొలి జీఎం నార్మ్ సాధించడంతోపాటు 2500 ఎలో రేటింగ్‌ను అందుకున్నాడు. జూలైలో సెర్బియాలో జరిగిన థర్డ్ శాటర్‌డే–80 టోర్నీలో రెండో జీఎం నార్మ్‌ను పొందిన అతను బుధవారం అబుదాబి మాస్టర్స్ టోర్నమెంట్‌లో చివరిదైన మూడో జీఎం నార్మ్‌ను సాధించాడు.
ఒక్కో మెట్టు ఎక్కుతూ...
వరంగల్‌లో కోచ్ బొల్లం సంపత్ వద్ద ఎనిమిదేళ్ల ప్రాయంలో చెస్‌లో ఓనమాలు నేర్చుకున్న అర్జున్ ఆ తర్వాత మరో కోచ్ సుదర్శన్ వద్ద తన ఆటతీరుకు మెరుగులు దిద్దుకున్నాడు. అనంతరం రెండేళ్లపాటు కోచ్ రామరాజు వద్ద శిక్షణ పొందిన అర్జున్ గుజరాత్‌లో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో అండర్–13 విభాగంలో స్వర్ణం నెగ్గాడు. ఆ తర్వాత భారత జట్టులోకి ఎంపికైకొరియాలో జరిగిన ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచి తొలి అంతర్జాతీయ పతకం సొంతం చేసుకున్నాడు. అర్జున్ నిలకడగా విజయాలు సాధిస్తుండటంతో అతని తల్లిదండ్రులు డాక్టర్ శ్రీనివాసరావు, జ్యోతి కూడా తమవంతుగా ప్రోత్సాహం అందించారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ గ్రాండ్‌మాస్టర్ విక్టర్ మిఖాలెవ్‌స్కీ వద్ద శిక్షణ తీసుకుంటున్న అర్జున్... గతేడాది ఆసియా చాంపియన్ షిప్‌లో స్వర్ణం, ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో రజతం... కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచాడు.
అబుదాబి టోర్నీలో తెలంగాణకే చెందిన మరో ప్లేయర్ హర్ష 6.5 పాయింట్లతో మరో పది మందితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్ వర్గీకరించగా హర్షకు 13వ స్థానం దక్కింది. 9వ రౌండ్‌లో 18 ఏళ్ల హర్ష 42 ఎత్తుల్లో జార్జియా గ్రాండ్‌మాస్టర్ లెవాన్‌పై... 8వ రౌండ్‌లో 49 ఎత్తుల్లో ఇటలీ గ్రాండ్‌మాస్టర్ వొకాటురో డానియల్‌ను ఓడించాడు. ఈ ప్రదర్శనతో హర్షకు మూడో జీఎం నార్మ్ దక్కింది. అయితే 2500 ఎలో రేటింగ్‌కు హర్ష దూరంగా ఉండటంతో అతనికి జీఎం హోదా రావడానికి కాస్త సమయం పట్టే అవకాశముంది.
తిరుపతికి చెందిన 19 ఏళ్ల కార్తీక్ ఇటలీలో జరిగిన స్పిలిమ్‌బెర్గో ఓపెన్‌లో 6 పాయింట్లు సాధించి తొమ్మిదో ర్యాంక్‌ను పొందాడు. ఈ క్రమంలో మూడో జీఎం నార్మ్ కూడా పొంది జీఎం హోదా ఖాయం చేసుకున్నాడు. గతేడాది ఆగస్టులో బార్సిలోనాలో జరిగిన సాంట్స్ ఓపెన్‌లో తొలి జీఎం నార్మ్... ఈ ఏడాది జూన్‌లో భువనేశ్వర్‌లో జరిగిన కిట్ అంతర్జాతీయ టోర్నీలో రెండో జీఎం నార్మ్ సాధించాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి జీఎం అయిన ఐదో ప్లేయర్ కార్తీక్. ఇంతకుముందు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, లలిత్ బాబు ఈ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment