శభాష్‌ రిత్విక్‌ | Ritwik Chaudhary won the first ATP Tour doubles title in his career | Sakshi
Sakshi News home page

శభాష్‌ రిత్విక్‌

Published Mon, Oct 21 2024 2:53 AM | Last Updated on Mon, Oct 21 2024 2:53 AM

Ritwik Chaudhary won the first ATP Tour doubles title in his career

కెరీర్‌లో తొలి ఏటీపీ టూర్‌ డబుల్స్‌ టైటిల్‌ సొంతం

అర్జున్‌ ఖడేతో కలిసి అల్మాటీ ఓపెన్‌ కైవసం 

సాక్షి, హైదరాబాద్‌: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా ఐదు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకొని హైదరాబాద్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరీ–అర్జున్‌ ఖడే (భారత్‌) ద్వయం తమ కెరీర్‌లో గొప్ప విజయాన్ని అందుకుంది. కజకిస్తాన్‌లో ఆదివారం ముగిసిన అల్మాటీ ఓపెన్‌ అసోసియేన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ)–250 టోర్నీలో రిత్విక్‌–అర్జున్‌ జోడీ డబుల్స్‌ టైటిల్‌ను దక్కించుకుంది. 

వీరిద్దరి కెరీర్‌లో ఇదే తొలి ఏటీపీ–250 టోర్నీ టైటిల్‌ కావడం విశేషం. ఒక గంటా 41 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో రిత్విక్‌–అర్జున్‌ జంట 3–6, 7–6 (7/3), 14–12తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో నికోలస్‌ బారింటోస్‌ (కొలంబియా)–స్కాండర్‌ మన్సూరి (ట్యూనిషియా) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన రిత్విక్‌–అర్జున్‌లకు 54,780 డాలర్ల (రూ. 46 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  

6–9తో వెనుకబడి... 
తొలి సెట్‌ను కోల్పోయిన రిత్విక్‌–అర్జున్‌రెండో సెట్‌ను టైబ్రేక్‌లో నెగ్గి నిలిచింది. నిర్ణాయక ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఒకదశలో రిత్విక్‌–అర్జున్‌ 6–9తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచారు. అయితే పట్టుదలతో పోరాడిన రిత్విక్‌–అర్జున్‌ స్కోరును సమం చేశారు. చివరకు 14–12తో విజయాన్ని అందుకున్నారు. సాధారణ టైబ్రేక్‌లో తొలుత ఏడు పాయింట్లు సాధించిన వారికి సెట్‌ లభిస్తుంది. 

‘సూపర్‌ టైబ్రేక్‌’లో మాత్రం తొలుత పది పాయింట్లు నెగ్గిన వారికి విజయం దక్కుతుంది. ఒకవేళ స్కోరు 9–9తో సమమైతే రెండు పాయింట్ల ఆధిక్యం లభించినపుడు గెలుపు ఖరారవుతుంది. 23 ఏళ్ల రిత్విక్‌ ఈ ఏడాది మూడు ఏటీపీ–250 టోర్నీల్లో (హాంగ్జౌ, అట్లాంటా, న్యూపోర్ట్‌) ఆడినా తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. 

అయితే నాలుగో ఏటీపీ–250 టోర్నీలో మాత్రం టైటిల్‌ను అందుకున్నాడు. ఇంతకుముందు రిత్విక్‌ 10 ఏటీపీ చాలెంజర్‌ టోర్నీల్లో డబుల్స్‌ విభాగంలో ఫైనల్‌కు చేరుకున్నాడు. మూడింటిలో టైటిల్స్‌ నెగ్గి, ఏడింటిలో రన్నరప్‌గా నిలిచాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement