ఆర్థిక సాయమందిస్తే... | National Badminton Champion Saurabh Verma requested for financial support | Sakshi
Sakshi News home page

ఆర్థిక సాయమందిస్తే...

Published Tue, Feb 19 2019 4:41 AM | Last Updated on Tue, Feb 19 2019 4:41 AM

National Badminton Champion Saurabh Verma requested for financial support - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ ర్యాంకు మెరుగవ్వాలంటే అంతర్జాతీయ టోర్నీలే దిక్కని, దీని కోసం తనకు ఆర్థిక సాయమందించాలని జాతీయ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ సౌరభ్‌ వర్మ అభ్యర్థించాడు. 26 ఏళ్ల వర్మ ఎనిమిదేళ్ల క్రితమే 2011లో సీనియర్‌ జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. కానీ ఖరీదైన శిక్షణకు నోచుకోకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, గాయాలు తదితర కారణాలతో అతను తరచూ టోర్నీలకు దూరమవుతున్నాడు. దీంతో 2012లో కెరీర్‌ బెస్ట్‌ 30వ ర్యాంకుకు చేరుకున్న సౌరభ్‌ ఇప్పుడు 55వ ర్యాంకుకు పడిపోయాడు. మీడియాతో అతను మాట్లాడుతూ ‘అంతర్జాతీయ టోర్నీలు ఆడేంత స్థోమత నాకు లేదు. ఆర్థిక ఇబ్బందులున్నాయి. దీనికి తోడు కొత్త నిబంధన నాకు శాపమైంది. కేవలం టాప్‌–25 ర్యాంకర్లకు మాత్రమే భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ఆర్థిక సాయం చేస్తుంది. దీంతో నాకు అంతర్జాతీయ టోర్నీలు ఆడే అవకాశం కష్టమైంది.

దాంతోపాటే ర్యాంకింగ్‌ కూడా దిగజారింది’ అని అన్నాడు. దేశవాళీ టోర్నీల్లో నా ప్రతిభ చూసిన ‘బాయ్‌’ డచ్‌ ఓపెన్‌ ఆడేందుకు సాయపడిందని... అయితే మరిన్ని అంతర్జాతీయ టోర్నీలు ఆడేందుకు మరింత చేయూత కావాలని సౌరభ్‌ వర్మ కోరాడు. కనీసం 10 నుంచి 12 టోర్నీలు ఆడితేనే ర్యాంకింగ్‌ పాయింట్లు లభిస్తాయన్నాడు. గతేడాది మోకాలి గాయం బాధించడంతో ఆటకు దూరమయ్యానని, ఇప్పుడైతే టోర్నీలను నా సొంత డబ్బులతోనే ఆడుతున్నానని చెప్పాడు. ఇది తనకు పెనుభారమవుతోందని తెలిపాడు. ‘త్వరలో స్విస్‌ ఓపెన్, ఒర్లియన్స్‌ ఓపెన్‌ ఆడేందుకు వెళుతున్నా. దీనికి అయ్యే ఖర్చంతా నాదే’ అని అన్నాడు. గాయం నుంచి కోలుకున్నాక గతేడాది సౌరభ్‌... రష్యా ఓపెన్, డచ్‌ ఓపెన్‌లలో టైటిల్స్‌ గెలిచాడు. ఇటీవలే గువాహటిలో ముగిసిన జాతీయ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచాడు. ఈ సీనియర్‌ టోర్నీలో అతను మూడో టైటిల్‌ గెలుచుకున్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement