డచ్ ఓపెన్‌లో రన్నరప్ జయరామ్
అల్మెరె (నెదర్లాండ్‌స): పీవీ సింధు (మకావు ఓపెన్, 2013, 14, 15) తర్వాత ఒకే అంతర్జాతీయ టోర్నమెంట్‌ను వరుసగా మూడేళ్లపాటు నెగ్గిన రెండో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందాలని ఆశించిన అజయ్ జయరామ్‌కు నిరాశ ఎదురైంది. 2014, 2015లలో డచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన అజయ్ జయరామ్ ఈసారి మాత్రం రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.
ఆదివారం జరిగిన డచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జయరామ్ 10-21, 21-17, 18-21తో వాంగ్ జు వీ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. గతంలో వాంగ్ జు వీపై రెండుసార్లు నెగ్గిన జయరామ్ మూడో పర్యాయంలో మాత్రం ఓటమిని ఎదుర్కొన్నాడు. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జయరామ్‌కు గట్టిపోటీ ఎదురైంది. నిర్ణాయక మూడో గేమ్‌లో వాంగ్ ఆరంభంలోనే 4-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత జయరామ్ స్కోరును సమం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోరుుంది.