విశాఖపట్నం, న్యూస్‌లైన్ : వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియం వేదికగా మరో అంతర్జాతీయ టోర్నీకి తెరలేచింది. ఈసారి మొత్తం సిరీస్ అంతా విశాఖలోనే సాగనుంది. న్యూజిలాండ్ దేశ ఫస్ట్‌క్లాస్ జట్టు ఈ సిరీస్ ఆడేందుకు నగరానికి చేరుకుంది. ఆదివారం రాత్రి సింగపూర్ నుంచి నేరుగా న్యూజిలాండ్ -ఎ జట్టు విశాఖ రాగా, మధ్యాహ్నానికే భారత్-ఎ జట్టు నగరానికి చేరుకుంది.
ఈ రెండు జట్ల క్రీడాకారులు జాతీయ జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న వారే కావడంతో విశాఖ క్రీడాభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. రెండు వారాలకు పైగా ఇరుజట్లు రెండు టెస్ట్ మ్యాచ్‌లతో పాటు మూడు వన్డేలు ఆడనున్నాయి. తొలుత మూడు రోజుల టెస్ట్ మ్యాచ్ ఈ నెల 28నుంచి పోర్ట్ స్టేడియంలో ప్రారంభం కానుండగా, రెండోది నాలుగురోజుల టెస్ట్ మ్యాచ్. ఇది వైఎస్‌ఆర్ స్టేడియంలో జరగనుంది. ఇక్కడే మూడు వన్డేలు జరగనున్నాయి. పురుషుల జట్టు సిరీస్ అంతా విశాఖ వేదికగా జరగడం ఇదే తొలిసారికాగా గతంలో మహిళా జట్టు ఈ వేదికగానే సిరీస్ ఆడింది.
నేడు ఇరుజట్ల ప్రాక్టీస్ : విశాఖ చేరుకున్న భారత్-ఎ జట్టుకు ఘన స్వాగతం లభించింది. ఇక్కడి గ్రాండ్‌బేలో ఆదివారం విశ్రాంతి తీసుకున్న జట్టు సోమవారం వైఎస్‌ఆర్ స్టేడియం-బి గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేయనుంది. ఆహ్వాన జట్టు న్యూజిలాండ్-ఎ ఉదయం 10 గంటలకు ప్రాక్టీస్ మొదలు పెట్టనుండగా, ఆతిథ్య జట్టు భారత్-ఎ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రాక్టీస్ చేయనుంది.
టెస్ట్‌లకు వన్డేల్లో జట్టు మార్పు : భారత్-ఎ జట్టుకు అభిషేక్ నాయర్, న్యూజిలాండ్-ఎ జట్టుకు టామ్ లతమ్ నాయకత్వం వహించనున్నారు. వీరిద్దరూ టెస్ట్ మ్యాచ్‌లకే కెప్టెన్‌లుగా ఉండనున్నారు. భారత్-ఎ ఆడే వన్డేలకు ఉన్ముక్త్‌చంద్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇరుజట్లు వన్డేలకు మూడేసి మార్పుల్ని చేయనున్నారు.
విశాఖకు క్రికెట్ సందడి
Published Mon, Aug 26 2013 3:22 AM | Last Updated on Sat, Jul 7 2018 3:42 PM
Advertisement
Advertisement