ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు మరో బిగ్‌ వికెట్‌ డౌన్‌ | Lockie Ferguson Has Been Ruled Out Of Champions Trophy 2025 Due To Injury, Kyle Jamieson Named As His Replacement | Sakshi
Sakshi News home page

ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు మరో బిగ్‌ వికెట్‌ డౌన్‌

Published Tue, Feb 18 2025 12:49 PM | Last Updated on Tue, Feb 18 2025 1:08 PM

Lockie Ferguson Has Been Ruled Out Of Champions Trophy 2025 Due To Injury, Kyle Jamieson Named As His Replacement

ఛాంపియన్స్‌ ట్రోఫీ (Champions Trophy-2025) ప్రారంభానికి ముందు మరో పెద్ద వికెట్‌ పడింది. న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ లోకీ ఫెర్గూసన్‌ (Lockie Ferguson) గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఫెర్గూసన్‌ కుడికాలి పాదంపై గాయమైంది. ఫెర్గూసన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనడంపై ముందు నుంచి అనుమానంగా ఉండింది. ప్రస్తుతం అదే నిజమైంది. 

ఫెర్గూసన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ మొత్తానికి దూరం కానున్నాడని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఫెర్గూసన్‌కు రీప్లేస్‌మెంట్‌గా కైల్‌ జేమీసన్‌ను (Kyle Jamieson) ఎంపిక చేశారు న్యూజిలాండ్‌ సెలెక్టర్లు. గాయాల కారణంగా ఛాంపియన్స్‌ ట్రోఫీకి దూరమైన 11వ ప్లేయర్‌ ఫెర్గూసన్‌.

ఇదివరకే స్టార్‌ ప్లేయర్లు పాట్‌ కమిన్స్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మిచెల్‌ స్టార్క్‌, అన్రిచ్‌ నోర్జే, గెరాల్డ్‌ కొయెట్జీ, సైమ్‌ అయూబ్‌, జేకబ్‌ బేతెల్‌, అల్లా ఘజన్‌ఫర్‌, బెన్‌ సియర్స్‌ గాయాల కారణంగా ఛాంపియన్స్‌ ట్రోఫీకి దూరమయ్యారు. స్టార్‌ ఆటగాళ్లు.. ముఖ్యంగా పేసర్లు దూరం కావడంతో మెగా టోర్నీ కళ తప్పే అవకాశముంది. 

ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు గాయం బారిన పడిన రెండో ఆటగాడు ఫెర్గూసన్‌. కొద్ది రోజుల ముందు పేసర్‌ బెన్‌ సియర్స్‌ కూడా గాయం బారిన పడ్డాడు. అతని స్థానంలో జేకబ్‌ డఫీ జట్టులోకి వచ్చాడు. తాజాగా ఫెర్గూసన్‌ కూడా గాయపడటంతో న్యూజిలాండ్‌ పేస్‌ విభాగం బలహీనపడినట్లు కనిపిస్తుంది. ఆ జట్టు పేస్‌ విభాగంలో మ్యాట్‌ హెన్నీ ఒక్కడే అనుభవజ్ఞుడు.

కాగా, ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 పాకిస్తాన్‌, దుబాయ్‌ వేదికలుగా ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్‌ పాకిస్తాన్‌తో తలపడనుంది. కరాచీలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ జట్లు గ్రూప్‌-ఏలో ఉండగా.. గ్రూప్‌-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు పోటీపడుతున్నాయి.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న ఆడనుంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా.. బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరుగనుంది. మార్చి 2న భారత్‌.. న్యూజిలాండ్‌తో తమ చివరి గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ ఆడుతుంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో న్యూజిలాండ్‌ షెడ్యూల్‌..
ఫిబ్రవరి 19న పాకిస్తాన్‌తో
ఫిబ్రవరి 24న బంగ్లాదేశ్‌తో
మార్చి 2న టీమిండియాతో

ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం న్యూజిలాండ్‌ జట్టు..
మార్క్‌ చాప్‌మన్‌, విల్‌ యంగ్‌, కేన్‌ విలియమ్సన్‌, డారిల్‌ మిచెల్‌, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, మిచెల్‌ సాంట్నర్‌ (కెప్టెన్‌), నాథన్‌ స్మిత్‌, డెవాన్‌ కాన్వే, టామ్‌ లాథమ్‌, విలియమ్‌ ఓరూర్కీ, మ్యాట్‌ హెన్రీ, జేకబ్‌ డఫీ, కైల్‌ జేమీసన్‌

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement