చారిత్రక పునాదుల మీద జీవించే వర్తమానం రేపటికి చరిత్ర అవుతుంది. చరిత్ర మిగిల్చిన ఆనవాళ్లను, అనుభవాలను ఆధారం చేసుకుని ముందుకు నడిచే వాళ్లు లెక్కకు మించినంత మంది ఉంటారు. చరిత్రను సృష్టించే వాళ్లు కొందరే ఉంటారు. చరిత్ర సృష్టించిన కొందరిలో ఒకమ్మాయి గుగులోత్ సౌమ్య. మహిళల ఫుట్‌బాల్ విభాగంలో ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఆడిన తొలి తెలంగాణ అమ్మాయి సౌమ్య. తండాలోని ఈ మెరుపు అంతర్జాతీయంగా ఉరుముతోంది.
సౌమ్య సొంతూరు నిజామాబాద్ జిల్లాలోని కిషన్‌తండా. సౌమ్య తల్లిదండ్రుల కల ఆమెను క్రీడాకారిణిని చేసింది. అయితే వాళ్లు కలగన్నది ఆమె క్రీడాకారిణి కావాలని కాదు. ఆమె క్రీడాకారిణి అవుతుందని వాళ్లు కలలో కూడా అనుకోలేదు. వాళ్లుండే తండాలో ఆడపిల్లల చదువు.. కంటికి కనిపిస్తూ కురవకుండా తేలిపోయే మేఘమే. సౌమ్య తండ్రి గోపి సెకండరీ గ్రేడ్ టీచర్. ఆమె తల్లి ధనలక్ష్మి చదువుకోలేదు. వాళ్లకు సౌమ్యకంటే ముందు ఇద్దరమ్మాయిలున్నారు. సౌమ్య తర్వాత ఒక అబ్బాయి. మొత్తం నలుగురు పిల్లలు. ఆ అమ్మానాన్నల కల... పిల్లలందర్నీ చదివించి తీరాలని. అందుకోసం వాళ్లు పడిన శ్రమ చిన్నదేమీ కాదు.
సౌమ్య తండ్రి తనకు పోస్టింగ్ ఉన్న చోట ఉద్యోగానికి వెళ్లాలి. సొంతూర్లో ఉన్న పొలం పనులు చూసుకోవాలి. వాటి చుట్టూ జీవితాన్ని అల్లుకుంటే పిల్లలను చదివించడం కుదరని పని. అందుకే ధైర్యం చేసి ఓ నిర్ణయానికి వచ్చారా దంపతులు. ధనలక్ష్మి నిజామాబాద్‌లో ఓ చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని నలుగురు పిల్లలను స్కూలుకు పంపించింది. గోపి తన ఉద్యోగం, సొంతూర్లో పనులు చూసుకుంటూ వారానికోసారి నిజామాబాద్‌కు వచ్చి భార్యాపిల్లలను చూసుకునేవాడు. అమ్మానాన్నల కష్టం పిల్లలకు తెలుస్తూనే ఉంది. సంపన్నులు కాకపోయినప్పటికీ తమ కోసం వాళ్లు అమరుస్తున్న సౌకర్యాలను అర్థం చేసుకున్నారు పిల్లలు. చక్కగా చదువుకుంటున్నారు. అప్పుడు జరిగిందో మిరకిల్.
కాలం నిర్ణయించింది
సౌమ్య సిక్స్›్త క్లాస్ వరకు నిజామాబాద్ జిల్లా నవీపేటలోని జిల్లా పరిషత్ స్కూల్‌లో చదివింది. సెవెన్త్ క్లాస్‌కి నిజామాబాద్‌లోని రాఘవ స్కూల్‌లో చేరింది. జూన్‌లో చేరింది. జూలైలో ఇంటర్ స్కూల్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ టోర్నమెంట్‌కు సెలక్షన్ జరగాలి. వరుసగా వర్షాలు. స్టూడెంట్స్ సెలక్షన్స్‌కి కూడా తెరిపినివ్వడం లేదు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ నాగరాజుకు టెన్షన్ పెరిగిపోతోంది. పాత స్టూడెంట్స్ కొందరుంటారు, మరికొందరు కొత్త వారిని సెలెక్ట్ చేస్తే బావుంటుంది, వాతావరణం సహకరించడం లేదు. తోటి టీచర్లతో పిచ్చాపాటి కబుర్లలో మనసులో మాట బయటకొచ్చింది.
అప్పుడు ఓ టీచర్ ‘కొత్తగా చేరిన ఓ అమ్మాయి పీఈటీ క్లాసుల్లేనప్పుడు కూడా గ్రౌండ్‌లో పరుగెడుతుంటుంది. పరుగులో ఒడుపు కూడా ఉంద’ని చెప్పారు. అలా సౌమ్య కోచ్ నాగరాజు దృష్టిలోకి వచ్చింది. వాళ్లు ఊహించినట్లే ఆమె ఆ ఏడాది జరిగిన వంద మీటర్లు, రెండు వందలు, నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాలందుకుంది. కోచింగ్ ఇస్తే మంచి క్రీడాకారిణి అవుతుందనిపించింది నాగరాజుకి. స్కూల్లో అన్ని రకాల ఆటలనూ ప్రాక్టీస్ చేయిస్తున్నప్పుడు సౌమ్య ఫుట్‌బాల్ కిక్ చాలా మెళుకువగా ఇస్తోందని గమనించారాయన. సౌమ్య ఫుట్‌బాల్ క్రీడాకారిణి కావడానికి అది తొలి ఘట్టం. అయితే... అసలైన ట్విస్ట్‌లు కూడా అక్కడే మొదలయ్యాయి.
అమ్మ ‘ససేమిరా’
‘మీ అమ్మాయి బాగా ఆడుతోంది. రొటీన్‌గా స్కూల్లో అందరితో కలిపి ఓ గంటసేపు ఆడించడం కాదు, ఆమెకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తాను’ అని సౌమ్య తల్లి ధనలక్ష్మితో చెప్పారు నాగరాజు. ఆయన మాట పూర్తయ్యేలోపే ఆమె వీల్లేదంటే వీల్లేదని ఖండితంగా చెప్పేసింది. ఆమె ఆందోళన కూడా సమంజసమే. పిల్లల్ని చదివించుకోవడానికి సొంత ఊరు కాదని, భర్త ఉద్యోగం చేసే ఊరు కూడా కాదని నిజామాబాద్‌కి వచ్చింది. నలుగురిలో ముగ్గురు ఆడపిల్లలు. ఇప్పటి దాకా సాకింది ఒక ఎత్తయితే, ఇక ముందు సంరక్షణ ఒక ఎత్తు. వయసొచ్చిన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తమ దారిన తాము నడిచి పోతున్న ఆడపిల్లలకు.. తమ దారిలో ఎన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయో తెలియదు.
తల్లిగా తనకు తెలుసు. అందుకే ఆమె అంత కచ్చితంగా వ్యతిరేకించింది. పైగా ఏ పొరపాటు జరిగినా... తండాలో ఉన్న అందరిలా గోప్యంగా బతుకు వెళ్లదీయకుండా చదువులంటూ పట్టణం బాట పట్టారని నలుగురూ నాలుగు మాటలు అంటారేమోననే భయం. సౌమ్య ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేయడానికి సౌమ్య తల్లి ఏ మాత్రం సుముఖంగా లేదని నిర్ధారణ అయిన తర్వాత సౌమ్య తండ్రి నిజామాబాద్‌కి వచ్చే వరకు ఎదురు చూశారు కోచ్. ధనలక్ష్మి చెప్పినంత ఖండితంగా చెప్పలేదు కానీ గోపి కూడా దాదాపుగా అదే మాట చెప్పారు. ఆ మాటతో నాగరాజుకి ఆశ వదులుకోక తప్పలేదు. అయితే... తన ఆశ స్టేడియంలోకి వస్తుందని అతడు ఊహించలేదు.
బ్యాగ్ వదిలేసి పరుగెత్తింది
సౌమ్య కళ్ల ముందే అంతా జరుగుతోంది. కోచ్ ఇంటికి వచ్చి తల్లిని, తండ్రిని అడగడం చూసింది. తల్లి ఒప్పుకోకపోయినా తండ్రి ఒప్పుకుంటాడేమోనని ఆశపడింది. అమ్మానాన్నలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమూ విన్నది. ఫుట్‌బాల్ కోచింగ్‌కి అన్ని దారులూ మూసుకుపోతున్నట్లు అర్థమైంది. ఓ రోజు ఉదయం స్కూలుకి రెడీ అవుతోంది. ఆమె ఇంటి ముందు నుంచే పొరుగున ఉంటున్న ముగ్గురు అక్కచెల్లెళ్లు స్నేహ, నమ్రత, మేఘన వెళ్తున్నారు. వాళ్లు వెళ్తున్నది స్పోర్ట్స్ స్టేడియంకేనని, ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌కేనని సౌమ్యకు తెలుసు. వాళ్లను రోజూ చూస్తూనే ఉంటుంది. ఆ రోజు ఎప్పటిలా చూస్తూ ఊరుకోవడం సాధ్యం కాలేదామెకి.
స్కూలు బ్యాగ్ ఇంట్లోనే వదిలేసి, వాళ్లమ్మ అరుస్తున్నా పట్టించుకోకుండా స్టేడియానికి పరుగెత్తింది. కోచ్ ముందు నిలబడి ‘నేను ప్రాక్టీస్ చేస్తా’నని చెప్పింది. ఇంతటి సినీఫక్కీలో మొదలైంది సౌమ్య ఫుట్‌బాల్ ప్రస్థానం.అండర్ ఫోర్టీన్‌తో మొదలైన సౌమ్య ఫుట్‌బాల్ కెరీర్ అండర్ సిక్స్‌టీన్‌లను దాటి అండర్ నైన్‌టీన్‌కి చేరింది. కోల్‌కతా టోర్నమెంట్‌లో మంచి స్కోర్ చేసింది. ముంబయిలో జరిగిన ఉమెన్ ఇండియన్ లీగ్ టోర్నమెంట్‌తోపాటు దేశంలో అనేక టోర్నమెంట్‌లు ఆడింది. సౌతాఫ్రికాలోని జోహన్నాస్‌బెర్గ్‌లో జరిగిన బ్రిక్స్ అండర్ సెవెంటీన్‌లో ఆడింది. బ్రెజిల్, రష్యా, చైనాలతో పోటీ పడింది. అండర్ ఎయిటీన్ సాఫ్ (సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్) కప్ టోర్నమెంట్‌లో ఆడింది. ఆ పోటీలో మనదేశానికి కాంస్య పతకం వచ్చిది.
భారత మహిళల ఫుట్‌బాల్ టీమ్ గెలుచుకున్న తొలి ఇంటర్నేషనల్ మెడల్ అది.ఈ మే నెల ఐదు నుంచి 22 వరకు పంజాబ్‌లో నేషనల్ లెవెల్ టోర్నమెంట్‌లు జరగనున్నాయి. మెరుపువేగంతో కదిలి తల అడ్డం వేసి బంతిని ఆపి ప్రత్యర్థి జట్టుని నిలువరించడానికి సౌమ్య సిద్ధంగానే ఉంది. పాదరసంలా కదులుతూ బంతిని గోల్ చేయడానికి ఆమె పాదాలు చురుగ్గా ఉన్నాయి. ఎటొచ్చీ ధర్మసంకటం పరీక్షల రూపంలో ఎదురైంది. ఆమెకు డిగ్రీ ఫస్టియర్ పరీక్షలు కూడా అప్పుడే ఉన్నాయి. ‘‘స్కూల్లో అయితే టోర్నమెంట్‌కు అనుమతించి పరీక్షలు మళ్లీ పెట్టేవాళ్లు. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు’’ అన్నది సౌమ్య.
ప్రకృతి పరీక్షనూ నెగ్గింది
సౌమ్య ఇష్టంతో, తల్లిదండ్రుల అయిష్టంతో మొదలైన ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌కు అన్నీ అనుకూలంగా ఏమీ కలిసి రాలేదు. ప్రకృతి కూడా తనవంతు పరీక్ష పెట్టింది. అది 2015. నేపాల్‌లో అండర్ ఫోర్టీన్ టోర్నమెంట్‌కి వెళ్లింది సౌమ్య. ఖాట్మండులోని దశరథ స్టేడియంలో ఆడాలి. ఆటకు అంతా సిద్ధమవుతున్నారు. ఒక్కసారిగా పెళపెళమంటూ పెద్ద శబ్దం. ‘ఏమై ఉంటుందీ’ అని అందరూ దిక్కులు చూశారు. కాళ్ల కింద భూమి కదులుతోంది. స్టేడియం ఉయ్యాలలా ఊగుతోంది.
అది భూకంపం అని తెలిసింది. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ‘భూకంపం ఎలా ఉంటుందో నేపాల్‌కెళ్లి చూసొచ్చాను’ అని నవ్వుతూ అంది సౌమ్య. ‘‘భూకంపం కారణంగా ఆ టోర్నమెంట్ ఆగిపోయింది. మా టీమ్‌లో ఎవరికీ ఏమీ కాలేదు. నిజామాబాద్‌కి వచ్చిన తర్వాత తెలిసిన వాళ్లంతా వచ్చి, మేము క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషించారు’’ అన్నది. భూకంపం కారణంగా సౌమ్య అప్పుడు ఆడలేకపోయింది. ఇప్పుడు మళ్లీ కాలం పరీక్ష పెట్టిందామెకు. పుస్తకాలా, ఫుట్‌బాలా తేల్చుకోమంటోంది. ఆమె తండ్రి గోపికి కూతురు పరీక్షలు రాస్తే బావుణ్ననే ఉంది.
సౌమ్య పెద్దక్క స్వప్న బీటెక్ చేసి సివిల్స్‌కి ప్రిపేరవుతోంది. రెండో అక్క స్వర్ణ బీఎస్సీ నర్సింగ్ చేసి పారామెడికల్ కోచింగ్ తీసుకుంటోంది. సౌమ్యను ఐపీఎస్‌గా చూడాలని ఆ తండ్రి కల. సౌమ్యకు మాత్రం ఉమెన్ ఫుట్‌బాల్ టీమ్‌లో సీనియర్ లెవెల్‌లో దేశం తరఫున ఆడాలని ఉంది. క్రిస్టియానో రోనాల్డ్ ఆమెకు ఇష్టమైన ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఆమె కెరీర్ కల క్రీడల చుట్టూ తిరుగుతోంది. మహిళల క్రికెట్ అనగానే మిథాలీరాజ్ గుర్తుకు వచ్చినట్లే భవిష్యత్తు తరానికి మహిళల ఫుట్‌బాల్ అంటే గుగులోత్ సౌమ్య గుర్తుకు రావాలని ఆశిద్దాం.
వాకా మంజులారెడ్డి
ఫొటోలు: రాజ్‌కుమార్, సాక్షి, నిజామాబాద్
వాళ్లమ్మగారి కోపం తగ్గింది
సౌమ్య పేరెంట్స్ ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌కి ఎంతకీ ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయి ఫీజు మాఫీ చేయమని స్కూల్ ప్రిన్సిపల్‌ని రిక్వెస్ట్ చేశాను. ఆయన ఒప్పుకున్నారు కూడా. అప్పటికే ఎయిత్ క్లాస్ ఫీజు కట్టేశారు వాళ్ల నాన్న. నైన్త్, టెన్త్ క్లాసులకు ఫీజు రద్దు చేశారు ప్రిన్సిపల్. అలా ఏదో ఒక ప్రోత్సాహకం ఉంటేనయినా ఆ అమ్మాయిని ప్రాక్టీస్‌కి పంపిస్తారని నా ప్రయత్నం. నేషనల్స్‌కి సెలెక్ట్ అయిన తర్వాత కానీ వాళ్లమ్మగారు ప్రసన్నం కాలేదు. అప్పటి వరకు కోపంగానే ఉన్నారామె. సౌమ్య టోర్నమెంట్స్‌కి వెళ్తూనే టెన్త్ క్లాస్‌లో 7.3 జీపీఏ, ఇంటర్‌లో 902 మార్కులు తెచ్చుకుంది. ఇప్పుడు బీఎస్సీ ఫస్టియర్. కేర్ అకాడమీ కూడా ఆమెకు ప్రోత్సహిస్తోంది. ఫీజు మాఫీ చేయడమే కాకుండా స్పోర్ట్స్ ఎక్స్‌పెండిచర్ కోసం ఏటా పాతికవేలిస్తోంది. వచ్చే నెలలో పంజాబ్‌లో టోర్నమెంట్ ఉంది. ఇప్పటికే ఒరిస్సా రైజింగ్ స్టార్, కోలాపూర్ ఎఫ్‌సి క్లబ్‌లు ఆమెకు ఆఫర్ ఇచ్చాయి.
నాగరాజు, కోచ్,
కేర్ ఫుట్‌బాల్ అకాడమీ, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment