ఇన్ఫోసిస్, విప్రోలాంటి పెద్ద సంస్థల నుంచి మంచి ప్యాకేజీతో ఉద్యోగం వెదుక్కుంటూ వస్తే... ఏ అమ్మాయికైనా సంతోషమే. అయితే సౌమ్య మాత్రం ఆ సంతోషాన్ని కాదనుకుంది. కారణం... పోలిస్ ఉద్యోగంపై ఆమెకు ఉన్న ఇష్టం. ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. సౌమ్య ఉద్యోగ ఎంపిక చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే ఆమె మాత్రం... ‘ఇది తొలి అడుగు. ఐపీఎస్ నా లక్ష్యం’ అంటుంది....
జనగామ జిల్లా తిరుమలగిరికి చెందిన ఉప్పునూతల సౌమ్య ఒకవైపు చదువులో రాణిస్తూనే దుక్కి దున్నడం, పురుగు మందు పిచికారీ చేయడం, కలుపు తీయడంలాంటి వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేది. కానిస్టేబుల్ శిక్షణ సమయంలో బెస్ట్ ఆల్‌రౌండర్, ఇండోర్ ట్రోఫీలను గెలుచుకున్న సౌమ్య 2024 బ్యాచ్ స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసింగ్ అవుట్ పరేడ్‌లో 1,211 మంది మహిళా ట్రైనీలకు పరేడ్ కమాండర్‌గా వ్యవహరించింది.
అమ్మ బడిలో...
‘మా అమ్మకు చదువుకోవాలని ఉండేది. కానీ కుటుంబ సమస్యలతో సాధ్యపడలేదు. అందుకే మా చదువులపై ఎప్పటికీ రాజీపడలేదు. మాకు రోజూ లెక్కలు చెప్పేది. గూడూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నేషనల్ క్యాడెట్ కార్పస్‌ను ప్రవేశపెట్టినప్పుడు పోలీస్ యూనిఫాం పట్ల ఇష్టం ఏర్పడింది. నేను పదవ తరగతి చదివే సమయానికి నా స్నేహితుల్లో చాలామందికి పెళ్లి జరిగింది. అయితే పెళ్లి విషయంలో తల్లిదండ్రులు నన్ను ఎప్పుడూ బలవంతం చేయలేదు. నేను ఎంత చదివితే వారికి అంత సంతోషం.
మా గ్రామం నుంచి ఎవరూ పాఠశాల స్థాయి దాటి ముందుకు సాగలేదు’ అంటుంది బీటెక్ చేసిన సౌమ్య. తెలంగాణలో కానిస్టేబుల్‌గా పనిచేయడానికి ముందు సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికైంది సౌమ్య. ఢిల్లీలో కొంత కాలం పాటు పనిచేసింది. ఎలాంటి కోచింగ్‌లపై ఆధారపడకుండా స్వతంత్రంగా పారామిలిటరీ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించడం తన మీద తనకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది.
ఢిల్లీ నుంచి తిరిగి ఇంటికి...
‘తల్లిదండ్రులకు చాలా దూరంగా ఉంటున్నాను. వారు ఎలా ఉన్నారో ఏమిటో!’ అనే దిగులుతో తిరిగి సొంత ఊరికి వచ్చింది సౌమ్య.
మళ్లీ..ఎంతోమందికి ఆశ్చర్యం!
‘బంగారంలాంటి ఉద్యోగాన్ని వదిలి ఇలా వచ్చావేమిటి’ అని అడిగిన వాళ్లకు సౌమ్య ఏం జవాబు చెప్పిందో తెలియదుగానీ... అదే సమయంలో మరో అవకాశం ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇంట్లోనే ఉంటూ రాత్రింబవళ్లు కష్టపడి చదువుకుని కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది. ‘ఐపీఎస్ కచ్చితంగా సాధిస్తాను. ఇది గొప్ప కోసం చెబుతున్న మాట కాదు. ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మాట’ అంటుంది సౌమ్య స్వరంతో ఉప్పునూతల సౌమ్య.
నా బిడ్డ సాధించింది... ఇంకా ఎంతో సాధిస్తుంది!
పోలిస్ అకాడమీలో మహిళా ట్రైనీలకు పరేడ్ కమాండర్‌గా వ్యవహరించిన సౌమ్యను చూసి పొంగిపోయాను. నాలాగా నా పిల్లలు చదువుకు దూరం కావద్దు అనుకున్నాను. చదువులోనే కాదు వ్యవసాయ పనుల్లోనూ కూడా సౌమ్య కష్టపడి పనిచేస్తుంది. నా బిడ్డ సాధించింది. ఇంకా ఎంతో సాధిస్తుంది.
– అరుణ, సౌమ్య తల్లి
– కొత్తపల్లి కిరణ్ కుమార్, సాక్షి, జనగామ
ఫొటోలు: గోవర్ధనం వేణుగోపాల్
Comments
Please login to add a commentAdd a comment