టెక్నాలజీ పెరిగి ఎంతో ముందుకు వెళ్లిపోతున్నప్పటికీ లింగ వివక్షత మాత్రం అలానే ఉంది. మహిళలు కూడా తాము మగవాళ్లకు ఎందులోనూ తీసిపోము అన్నట్లుగా ప్రతీ రంగంలో దూసుకుపోతున్నా.. 'ఆడపిల్ల' అనంగానే చాలా మంది తల్లిదండ్రులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు ఉంటుంది. వారసుడుగా కొడుకుకి ఉన్నంత ఆదరణ కూతుళ్లకు ఎందుకు ఉండదనేది తరతరాలుగా వేధిస్తున్న చిక్కు ప్రశ్న. అందులోనూ ఇద్దరు ఆడపిల్లలున్న తల్లిదండ్రులంటే సమాజం సైతం తెగ జాలి చూపించేస్తుంది. అమ్మో! ఇద్దరూ ఆడపిల్లలే!.. అంటూ పదేపదే గుర్తు చేసి ఆయా తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. దీంతో ఆయా తల్లిదండ్రుల కూడా తాము కన్నది ఆడపిల్లలు కదా! అని భయంభయంగా గడుపుతారు. కానీ ఇక్కడొక తండ్రి అందుకు విరుద్ధంగా ఆలోచించడమే గాదు, శభాష్ ఇలా పెంచాలి ఆడపిల్ల అని అందరిచేత ప్రశంసలందుకున్నాడు. ఈ తండ్రి గాథ కచ్చితంగా ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది, గొప్ప మార్పు తెప్పిస్తుంది.
వివరాల్లోకెళ్తే...బిహార్‌లోని సరన్ జిల్లాకు చెందిన రాజ్‌కుమార్ సింగ్ పిండి మిల్లు కార్మికుడు. ఆయన కూడా అందరిలా తనకి వారుసుడు పుట్టాలని ఎంతగానో అనుకున్నాడు. అయితే మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టడంతో ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందనుకున్నాడు. ఆ తర్వాత రెండవ కాన్పులో వారసుడు పుడతాడని కొండంత ఆశతో ఎదురుచూడగా మళ్లీ ఆడపిల్లే జన్మించింది. అయినప్పటికీ రాజ్ కుమార్ సింగ్ బాధపడలేదు. ఇలా ఏడుగురు పిల్లల్ని కన్నాడు. అయితే అందరూ ఆడపిల్లలే పుట్టారు. అయితే ఏంటీ? మంచి చదువులు చెప్పించి శివంగుల్లా పెంచాలనుకున్నాడు.
అందరిలా ఇతను కూడా తన కూతుళ్లను ఓ వయసు వచ్చాక ఓ అయ్య చేతిలో పెట్టేయాలనుకోలేదు. తన తాహతకు మించి ఏడుగుర్ని ఉన్నత చదువులు చదివించాడు. ఇక్కడ రాజసింగ్ సింగ్‌ని కూతుళ్ల పెళ్లిళ్ల గురించి ఇరుగుపొరుగు వారు పదేపదే గుర్తు చేస్తూ భయపెడుతూనే ఉండేవారు. కానీ ఆ తండ్రి మాత్రం కూతుళ్లను వాళ్ల కాళ్లమీద నిలబడి గలిగేలా పెంచితే చాలు అనే సూత్రాన్ని గట్టిగా నమ్మేవాడు. అదే నిజమయ్యేలా చేశారు ఏడుగురు కూతుళ్లు కూడా. వారంతా పోలీసు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వోద్యోగాలు సాధించి తండ్రి ఆలోచనను నిజం చేశారు.
ఇక పెద్ద కూతురు రాణి బీహార్ ఉమెన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా చేస్తోంది. రెండవ కూతురు హాని ఎస్ ఎస్ బి లో ఉద్యోగం చేస్తోంది. మూడవ కూతురు సోనీ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. నాలుగవ కూతురు ప్రీతి క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ఐదవ కూతురు పింకీ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ఆరవ కూతురు బీహార్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా పని చేస్తోంది. ఏడవ కూతురు రైల్వే శాఖలో కానిస్టేబుల్ గా పని చేస్తోంది.
ఇలా ఏడుగురు కూతుర్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గొప్ప విషయం అయితే.. వారిని ఆ దిశగా ప్రేరేపించడం మరింత గొప్ప విషయం. ఇన్నాళ్లు రాజ్ కుమార్‌ని ఆడిపిల్లలు అని భయపెట్టే ఇరుగుపొరుగు అంతా అతన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. పైగా పెంచితే అతడిలా పెంచాలి అని మెచ్చుకుంటున్నారు. కూతురిని భారంగా భావించే వారికి ఈ తండ్రి కథ తగిన సమాధానమిస్తుంది.
(చదవండి: నవజాత శిశువులకు బ్లడ్ ఎక్కించాల్సి వస్తే.. ఏ గ్రూప్ రక్తాన్ని ఇస్తారంటే..!)
Comments
Please login to add a commentAdd a comment