
ద్రోణవల్లి హారిక (PC: Chessbaseindia)
Asian Games 2023- Chess: ఆసియా క్రీడల టీమ్ చెస్ ఈవెంట్‌లో భారత పురుషుల, మహిళల జట్లు మూడో రౌండ్‌లో గెలుపొందాయి. ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, గుకేశ్, పెంటేల హరికృష్ణలతో కూడిన భారత జట్టు 3–1తో కజకిస్తాన్‌ను ఓడించింది.
మరోవైపు... కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వంతిక అగర్వాల్, వైశాలిలతో కూడిన భారత జట్టు 3.5–0.5తో ఇండోనేసియాపై గెలిచింది. మూడో రౌండ్ తర్వాత భారత మహిళల జట్టు ఆరు పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో... ఐదు పాయింట్లతో భారత పురుషుల జట్టు రెండో ర్యాంక్‌లో ఉన్నాయి.
భారత్, కొరియా మ్యాచ్ ‘డ్రా’
ఆసియా క్రీడల మహిళల హాకీ ఈవెంట్‌లో భారత జట్టు తొలి ‘డ్రా’ నమోదు చేసింది. ఆదివారం దక్షిణ కొరియాతో జరిగిన పూల్ ‘ఎ’ మూడో లీగ్ మ్యాచ్‌ను భారత్ 1–1 గోల్‌తో ‘డ్రా’ చేసుకుంది. కొరియా తరఫున చో హైజిన్ (12వ ని.లో), భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.
ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల తర్వాత భారత్, కొరియా ఏడు పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన గోల్స్ అంతరం కారణంగా భారత్ టాప్ ర్యాంక్‌లో, కొరియా రెండో ర్యాంక్‌లో ఉంది. లీగ్ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను హాంకాంగ్‌తో మంగళవారం ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment