మౌనంగా ఎదిగింది...
‘ఇది ఖరీదైన ఇండోర్ గేమ్. శిక్షణ తీసుకోవాలన్నా, విదేశాల్లో టోర్నమెంట్స్ ఆడాలన్నా బోలెడన్ని డబ్బులుండాలి. మీ దగ్గర అంత డబ్బులేనప్పుడు ఇదంతా మీకు అవసరమా?’ అని కొందరి ఎద్దేవా...
‘మరీ డాబు కాకపోతే ఉన్నదాంట్లో చూసుకోవాలి గాని ఎగిరెగిరి పడడమెందుకు?’ అని చెవులు కొరుక్కునే బంధువులు మరికొందరు. చాలీ చాలని కుటుంబ సంపాదన మరోపక్క... ఇవన్నీ ఆ యువతిని రాటుదేల్చాయి. దీంతోపాటు కొందరు ప్రముఖుల స్ఫూర్తిదాయక కథనాలు, మరికొందరి ఆపన్న హస్తం, కఠోరశ్రమ ఆమెను ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్‌ను చేసాయి. ఆమే గుంటూరుకు చెందిన పందొమ్మిదేళ్ల బొమ్మిని మౌనిక అక్షయ. ఈ నెల 9న స్పెయిన్‌లో జరిగిన రొటేఖాస్ చెస్ ఫెస్టివల్లో 3వ విమ్ నార్మ్ (మహిళా అంతర్జాతీయ మాస్టర్) సాధించిన ఆమె విజయ ప్రస్థానం ఆమె మాటల్లోనే...
‘‘అమ్మా నాన్నలు స్కూలు నడిపేటప్పుడు చిన్న పిల్లలతో చెస్ ఆడేవారు. ముఖ్యంగా అమ్మ ఇష్టంగా ఆడే చెస్ అంటే నాకు కూడా ఇష్టమేర్పడింది. అలా అమ్మానాన్నలు నాకు తొలి గురువులయ్యారు. తర్వాత రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించడంతో ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా అమ్మ నాతో వచ్చేది. అమ్మ బిఎస్సీ, బిఎడ్ చదివారు. రెండు మూడు ప్రభుత్వ ఉద్యోగవకాశాలను నా కోసం వదిలేసారు. నాన్న అయితే తదుపరి మ్యాచ్‌లకు డబ్బులు ఎలా సమకూర్చాలా అని ఆలోచిస్తూ చాలా సరదాలు మా కోసం త్యాగం చేశారని చెప్పాలి.
వారానికొక గంటే శిక్షణ
నేను సుమారు 20 దేశాల్లో అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్స్‌లో ఆడాను. ప్రస్తుతం తమిళనాడుకు చెందిన శ్యామ్ సుందర్, ఒడిషాకు చెందిన స్వయంశ్ మిశ్రాల వద్ద వారానికి గంటసేపు ఆన్లైన్ శిక్షణ తీసుకుంటున్నాను. ఒక్క గంట నేర్చుకుంటే రూ.1500 చెల్లించాలి. కనీసం వారానికి మూడు గంటల శిక్షణ తీసుకుంటూ, అంతర్జాతీయ టోర్నీలు ఆడితే ఏడాదిలోనే గ్రాండ్ మాస్టర్ హోదా సాధిస్తాననే నమ్మకముంది. కోనేరు హంపి నాకు స్ఫూర్తి. ఆమె ఆడే స్టైల్ బాగా నచ్చుతుంది. 2003 తర్వాత జిల్లాలోనే ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను సాధించాను.
ఆ కసి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది!
తొలినాళ్లలో నేను జిల్లా స్థాయి పోటీల్లో తీవ్ర ఒత్తిడికి లోనయ్యేదానిని. దానివల్ల గేమ్‌లు చేజారిపోయేవి. అటువంటి సమయంలో ‘విజయం నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తే, అపజయం నిన్ను నీకు పరిచయం చేస్తుంది. అప్పుడు నీ నిశ్శబ్దంతో అపజయాలను ఛేదించాలి’ అన్న కొందరి స్ఫూర్తిదాయక మాటలు, పుస్తకాలు నన్ను చాలా మార్చేసాయి. ఒత్తిడిలోనూ విజయం వైపు ఎలా అడుగులు వేయాలో నేర్పించాయి. ఇక వెనుతిరగలేదు.
అండర్–7 నుంచి అండర్–20 వరకు రాష్ట్ర స్థాయిలో అన్ని విభాగాల్లోనూ విజేతగా నిలిచాను. మూడుసార్లు సీనియర్ ఉమెన్స్‌లోనూ టైటిల్ నెగ్గాను. ఈ క్రమంలోనే 2019లో ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్‌లో తొలి విమ్ నార్మ్, 2021 హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్‌లో రెండో విమ్ నార్మ్, ఈ నెల 9న స్పెయిన్‌లో జరిగిన రొటేఖాస్ చెస్ ఫెస్టివల్లో 3వ విమ్ నార్మ్ సాధించడం ద్వారా ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యాను. నా అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను’’ అని చెబుతోంది మౌనిక.
– మురమళ్ళ శ్రీనివాసరావు, సాక్షి స్పోర్ట్స్, గుంటూరు
ఫోటోలు: గజ్జల రామ్‌గోపాల్ రెడ్డి
అమ్మానాన్న ఏమంటున్నారు?
కట్టుబాట్లు ఉన్న కుటుంబం కావడంతో బంధువులు చాలా మంది ఆడపిల్లను బయటకు పంపడాన్ని ఇష్టపడలేదు. చదువు పాడైపోతుందని కొందరన్నారు. కొందరు మాట్లాడడం మానేసారు. ఇవి మాకు సవాలుగా మారాయి. పాప చిన్నప్పటి నుంచి చదువులోని అన్ని విభాగాల్లోనూ అగ్రస్థానంలోనే ఉండేది. ఇటీవల బీటెక్ ప్రథమ సంవత్సరం లోనూ 8.6 శాతం స్కోర్ చేసింది. క్రీడల వల్ల చదువు పాడవుతుందంటే మేము నమ్మం. మన దేశంలో గత రెండేళ్ళ నుంచి అంతర్జాతీయ టోర్నీలు పెద్దగా జరగడంలేదు. ఎలో రేటింగ్స్, నార్మ్స్ రావాలంటే ఇతర దేశాల్లో జరిగే టోర్నీల్లో ఆడాలి. ఒక్క టోర్నీకి కనీసం రూ.3 లక్షలు అవుతుంది. ఆమె కల నెరవేరేందుకు ఎన్ని సంతోషాలు దూరమైనా అవి మాకు ఆనందమే. తను ఈ దేశం గర్వించే స్థాయికి రావాలన్నదే మా లక్ష్యం. ప్రభుత్వం కూడా సహకరిస్తుందని ఆశిస్తున్నాం..
– నాన్న రామారావు, అమ్మ లక్ష్మి.
తండ్రి రామారావు, చెల్లెలు హరిణి, తల్లి లక్ష్మిలతో మౌనిక అక్షయ