25 నుంచి గ్రాండ్ మాస్టర్స్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: మీ పిల్లలను చెస్ ప్లేయర్‌ను చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకు చాలా ముఖ్యం. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ భారత్‌లో జరుగుతున్నందున... దేశంలో నాలుగు చెస్ టోర్నీలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఒకటి హైదరాబాద్‌లో ఈ నెల 25 నుంచి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న చెస్ క్రీడాకారులందరికీ ఉపయోగపడేలా ఈ టోర్నీని ఒక పండుగలా నిర్వహించబోతున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్ లంక రవి, ఆంధ్రప్రదేశ్ చెస్ సంఘం కార్యదర్శి కన్నారెడ్డి ఈ వివరాలు తెలిపారు.
ఈ నెల 24న జార్జియా గ్రాండ్ మాస్టర్ సనికెడ్జె... పిల్లలకుచెస్‌లో మెళకువలు నేర్పుతారు. పదో తరగతి, ఇంటర్ చదువుకునే పిల్లలెవరైనా... తమ ఐడీ కార్డ్ తీసుకుని హైదరాబాద్ శివార్లలోని బహదూర్‌పల్లిలో ఉన్న టెక్ మహీంద్ర ఆఫీస్‌కు వెళితే చాలు. ప్రవేశం ఉచితం. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 11 గంటల నుంచి సాయంత్రం వరకు క్లాస్ ఉంటుంది.
25న గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నీ ప్రారంభమవుతుంది. ఇందులో 15 దేశాల నుంచి సుమారు 90 మంది క్రీడాకారులు పాల్గొంటారు. 1900 రేటింగ్ కంటే ఎక్కువ ఉన్నవారు ఇందులో పాల్గొంటారు. ఈ టోర్నీ డిసెంబరు 3 వరకు జరుగుతుంది. లలిత్‌బాబు, దీప్‌సేన్ గుప్తా తదితర గ్రాండ్ మాస్టర్లు ఇందులో ఆడతారు.
టోర్నీ జరిగే కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో 25న సైబర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ర్యాపిడ్ చెస్ టోర్నీ నిర్వహిస్తారు. వయసుతో సంబంధం లేకుండా ఔత్సాహికులంతా పాల్గొనవచ్చు. ఈ టోర్నీలో పాల్గొనాలనుకుంటే 24న సాయంత్రం 6 గంటల్లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వివరాలకు 9959988766 ఫోన్ నంబర్లో సంప్రదించాలి.
25న ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్ ‘చార్మినార్ చాలెంజ్’ కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనాలంటే 24న రాత్రి 8 గంటల్లోగా రూ.200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. స్కూల్ ఐడీ, యూనిఫామ్, చెస్ బోర్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. వివరాలకు 9247188018, 9032455655 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి.
26 నుంచి 2100 రేటింగ్ కంటే తక్కువ ఉన్న ఆటగాళ్ల కోసం టోర్నీ ప్రారంభమవుతుంది. రేటింగ్ పాయింట్లు లేని రాష్ట్ర క్రీడాకారులు పలువురు పాల్గొంటున్నారు.
భాగ్యనగరంలో చెస్ పండుగ
Published Sat, Nov 23 2013 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM
Advertisement