హారిక సంచలనం
► యురాసియన్ బ్లిట్జ్ కప్ టైటిల్ సొంతం
► ప్రపంచ నంబర్‌వన్ హు ఇఫాన్‌కు రెండో స్థానం
సాక్షి, హైదరాబాద్: పలువురు మేటి గ్రాండ్‌మాస్టర్లు పాల్గొన్న యురాసియన్ బ్లిట్జ్ కప్ అంతర్జాతీయ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక సంచలనం సృష్టించింది. కజకిస్తాన్ రాజధాని అల్మాటీ నగరంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో హారిక 12.5 పాయింట్లతో మహిళల విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ నంబర్‌వన్, క్లాసిక్ విభాగంలో ప్రపంచ చాంపియన్ హు ఇఫాన్ (చైనా) కూడా 12.5 పాయింట్లు సాధించినప్పటికీ... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా హారికకు టాప్ ర్యాంక్ లభించింది. ఇఫాన్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ప్రపంచ బ్లిట్జ్ మాజీ చాంపియన్ వాలెంటినా గునీనా (రష్యా) 12 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
నిర్ణీత 22 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హారిక 11 గేముల్లో గెలిచి, ఎనిమిది గేముల్లో ఓడి, మిగతా మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. ఈ టోర్నీలో హారిక చేతిలో ఓడిన గ్రాండ్‌మాస్టర్ల జాబితాలో విక్టర్ బోలోగన్ (మాల్డొవా), జాన్ ఎల్‌వెస్ట్ (అమెరికా), బోరిస్ సావ్‌చెంకో (రష్యా), అలెక్సీ ద్రీవ్ (రష్యా) ఉన్నారు. ఓపెన్ విభాగంలో తజకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ అమనతోవ్ ఫారూఖ్ (16 పాయింట్లు) చాంపియన్‌గా నిలిచాడు. రెండు వారాల క్రితం హంగేరిలో జరిగిన జలకారోస్ చెస్ టోర్నీలోనూ హారిక మహిళల విభాగంలో విజేతగా నిలిచింది.