ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక ఆశాకిరణం, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. వరుసగా గత మూడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2012, 2015, 2017) కాంస్య పతకాలు సాధించిన హారిక ఈసారి మాత్రం రిక్తహస్తాలతో వెనుదిరిగింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో హారిక 2.5–3.5 పాయింట్ల తేడాతో ఓడిపోయింది.
నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు ఆదివారం టైబ్రేక్ నిర్వహించారు. టైబ్రేక్ తొలి గేమ్‌లో కొస్టెనిక్ 64 ఎత్తుల్లో గెలిచి 2–1తో ముందంజ వేసింది. అయితే టైబ్రేక్ రెండో గేమ్‌లో హారిక 82 ఎత్తుల్లో నెగ్గి స్కోరును 2–2తో సమం చేసింది. స్కోరు సమం కావడంతో మళ్లీ రెండు గేమ్‌ల టైబ్రేక్‌ను ఆడించారు. ఇందులో తొలి గేమ్‌లో కొస్టెనిక్ 65 ఎత్తుల్లో గెలిచి 3–2తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన రెండో గేమ్‌ను హారిక 61 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోవడంతో కొస్టెనిక్ 3.5–2.5తో విజయాన్ని ఖాయం చేసుకుంది. తొలి రెండు రౌండ్‌లలో టైబ్రేక్స్‌లో విజయాలు దక్కించుకున్న హారిక మూడోసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. హారికతోపాటు ఈ మెగా ఈవెంట్‌లో భారత్ తరఫున పాల్గొన్న కోనేరు హంపి రెండో రౌండ్‌లో... పద్మిని రౌత్, భక్తి కులకర్ణి తొలి రౌండ్‌లో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment