Womens Chess Championship
-
హంపికి ఆరో స్థానం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య మహిళల గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఆరో స్థానంతో ముగించింది. గొర్యాక్చినా (రష్యా)తో బుధవారం జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హంపి 32 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఓవరాల్‌గా హంపి 4.5 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక 3.5 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో నిలిచింది. షువలోవా (రష్యా)తో జరిగిన చివరి గేమ్‌లో హారిక 66 ఎత్తుల్లో ఓటమి చవిచూసింది. భారత్‌కే చెందిన వైశాలి రెండు పాయింట్లతో పదో ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. -
భారత్, కజకిస్తాన్ క్వార్టర్స్ తొలి మ్యాచ్ ‘డ్రా’
సిట్‌గెస్ (స్పెయిన్): ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం కజకిస్తాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ తొలి మ్యాచ్‌ను భారత్ 2–2తో ‘డ్రా’గా ముగించింది. జన్సయ అబ్దుమాలిక్తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక 80 ఎత్తుల్లో... దినార సదువాకసోవాతో గేమ్‌ను ఆర్ వైశాలి 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. అనంతరం భక్తి కులకర్ణి 52 ఎత్తుల్లో కమలిదెనోవా చేతిలో ఓడింది. చివరగా జరిగిన గేమ్‌లో మేరీఆన్ గోమ్స్ 85 ఎత్తుల్లో గుల్మిరాపై నెగ్గడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. చదవండి: టీ20 ప్రపంచకప్‌లో భారత తుది జట్టులో అతడికి చోటు దక్కకపోవచ్చు.. -
సెమీ ఫైనల్లో హంపి
చెన్నై: ‘ఫిడే’ మహిళల స్పీడ్ చెస్ చాంపియన్‌షిప్ గ్రాండ్‌ప్రి చివరిదైన నాలుగో అంచె పోటీల్లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి, ప్రపంచ మహిళల రాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపి సెమీ ఫైనల్లో ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో హంపి 6–5తో వాలెంటినా గునినా (రష్యా)పై విజయం సాధించింది. సెమీస్ పోరులో ప్రపంచ నంబర్‌వన్ హూ యిఫాన్ (చైనా)తో హంపి తలపడుతుంది. హూ యిఫాన్ తన క్వార్టర్స్ మ్యాచ్‌లో 7.5–3.5తో జన్సయ అబ్దుమాలిక్ (కజకిస్తాన్)పై గెలుపొందింది. -
ప్రిక్వార్టర్స్‌లో ఓడిన హారిక
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక ఆశాకిరణం, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. వరుసగా గత మూడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2012, 2015, 2017) కాంస్య పతకాలు సాధించిన హారిక ఈసారి మాత్రం రిక్తహస్తాలతో వెనుదిరిగింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో హారిక 2.5–3.5 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు ఆదివారం టైబ్రేక్ నిర్వహించారు. టైబ్రేక్ తొలి గేమ్‌లో కొస్టెనిక్ 64 ఎత్తుల్లో గెలిచి 2–1తో ముందంజ వేసింది. అయితే టైబ్రేక్ రెండో గేమ్‌లో హారిక 82 ఎత్తుల్లో నెగ్గి స్కోరును 2–2తో సమం చేసింది. స్కోరు సమం కావడంతో మళ్లీ రెండు గేమ్‌ల టైబ్రేక్‌ను ఆడించారు. ఇందులో తొలి గేమ్‌లో కొస్టెనిక్ 65 ఎత్తుల్లో గెలిచి 3–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన రెండో గేమ్‌ను హారిక 61 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోవడంతో కొస్టెనిక్ 3.5–2.5తో విజయాన్ని ఖాయం చేసుకుంది. తొలి రెండు రౌండ్లలో టైబ్రేక్స్‌లో విజయాలు దక్కించుకున్న హారిక మూడోసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. హారికతోపాటు ఈ మెగా ఈవెంట్లో భారత్ తరఫున పాల్గొన్న కోనేరు హంపి రెండో రౌండ్లో... పద్మిని రౌత్, భక్తి కులకర్ణి తొలి రౌండ్లో ఓడిపోయారు. -
హంపి పరాజయం
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి పోరాటం ముగిసింది. జొ లాంటా జవద్జా్క (పోలాండ్)తో జరిగిన రెండో రౌండ్‌లోని తొలి గేమ్‌ను డ్రా చేసుకున్న హంపి రెండో గేమ్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్‌లో నల్ల పావులతో ఆడిన హంపి రెండో గేమ్‌ను తెల్ల పావులతో ఆడి 78 ఎత్తుల్లో పరాజయం పాలైంది. మరో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. బేలా ఖొటెనాష్విలి (జార్జియా)తో రెండో రౌండ్ రెండో గేమ్‌ను కూడా హారిక ‘డ్రా’ చేసుకుంది. దీంతో విజేతను తేల్చేందుకు టైబ్రేక్ నిర్వహించగా... అందులో గెలిచి మూడో రౌండ్‌కు అర్హత సాధించింది. ప్రస్తుతం ఈ టోర్నీలో భారత్ తరఫున హారిక మాత్రమే బరిలో మిగిలింది. -
రెండో రౌండ్లో హారిక
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): తాడో పేడో తేల్చే టైబ్రేక్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మెరిసింది. ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్లోకి ప్రవేశించింది. సోపికో ఖుఖాష్‌విలి (జార్జియా)తో జరిగిన తొలి రౌండ్లో హారిక 2.5–1.5తో విజయం సాధించింది. నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో... సోమవారం విజేతను నిర్ణయించేందుకు రెండు టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. తొలి గేమ్‌ను 57 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హారిక రెండో గేమ్‌లో మాత్రం 72 ఎత్తుల్లో గెలిచి రెండో రౌండ్ బెర్త్‌ను దక్కించుకుంది. భారత్‌కే చెందిన పద్మిని రౌత్ మాత్రం 1.5–2.5తో జన్సాయా అబ్దుమలిక్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయింది. టైబ్రేక్‌లోని తొలి గేమ్‌ను 69 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించిన పద్మిని... రెండో గేమ్‌లో మాత్రం 60 ఎత్తుల్లో ఓడిపోయింది. నేడు జరిగే రెండో రౌండ్ తొలి గేమ్‌లో జొలాంటా జవద్జా్క (పోలాండ్)తో కోనేరు హంపి; బేలా ఖొటెనాష్విలి (జార్జియా)తో హారిక తలపడతారు. -
కాంస్యం నెగ్గిన హారిక
ఆసియా కాంటినెంటల్ చెస్ అల్ అయిన్ (యూఏఈ): ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల ర్యాపిడ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక కాంస్య పతకాన్ని సాధించగా... భారత్‌కే చెందిన తానియా సచ్దేవ్ రజత పతకాన్ని దక్కించుకుంది. నిర్ణీత ఏడు రౌండ్ల తర్వాత హారిక 5.5 పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించగా... తానియా ఆరు పాయింట్లతో తాన్ జోంగి (చైనా)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా తాన్ జోంగి విజేతగా, తానియా రన్నరప్‌గా నిలిచారు. ఇదే టోర్నీ ఓపెన్ విభాగంలో భారత ఆటగాళ్లు సందీపన్ చందా, దేబాశిష్ దాస్ రజత, కాంస్య పతకాలను సాధించారు. బుధవారం జరిగిన బ్లిట్జ్ ఈవెంట్ మహిళల విభాగంలో భక్తి కులకర్ణి, తానియా సచ్దేవ్, హారిక వరుసగా 4, 5, 6వ స్థానాలను దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు ర్యాపిడ్ ఈవెంట్లో 13వ, బ్లిట్జ్ ఈవెంట్లో 12వ స్థానాలను సంపాదించాడు. క్లాసిక్ విభాగంలో మాత్రం లలిత్ బాబు ఏడో స్థానంలో నిలిచి వచ్చే నెలలో అజర్బైజాన్లో జరిగే ప్రపంచ కప్ పోటీలకు అర్హత సాధించాడు. -
భారత మహిళల క్లీన్‌స్వీప్
చెంగ్డూ (చైనా) : బరిలోకి దిగిన నలుగురు క్రీడాకారిణులూ గెలుపొందడంతో... ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్ రెండో విజయాన్ని సాధించింది. ఈజిప్టుతో శనివారం జరిగిన ఆరో రౌండ్ మ్యాచ్‌లో భారత్ 4-0 పాయింట్ల తేడాతో గెలిచింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 65 ఎత్తుల్లో అయా మొతాజ్పై, పద్మిని రౌత్ 58 ఎత్తుల్లో షాహెందా వఫాపై, సౌమ్య స్వామినాథన్ 30 ఎత్తుల్లో అమీనా షరీఫ్‌పై, మేరీ ఆన్‌గోమ్స్ 62 ఎత్తుల్లో ష్రూక్ వఫాపై నెగ్గారు. ఆరో రౌండ్ తర్వాత భారత్ ఆరు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు ఆర్మేనియాలో జరుగుతున్న పురుషుల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆరో రౌండ్లో భారత్ 1.5-2.5 పాయింట్ల తేడాతో రష్యా చేతిలో ఓడిపోయింది. పెంటేల హరికృష్ణ, శశికిరణ్, విదిత్ గుజరాతి తమ ప్రత్యర్థులతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... సేతురామన్ ఓడిపోవడంతో భారత ఓటమి ఖాయమైంది.