కాంస్యం నెగ్గిన హారిక
ఆసియా కాంటినెంటల్ చెస్
అల్ అయిన్ (యూఏఈ): ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల ర్యాపిడ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక కాంస్య పతకాన్ని సాధించగా... భారత్‌కే చెందిన తానియా సచ్‌దేవ్ రజత పతకాన్ని దక్కించుకుంది. నిర్ణీత ఏడు రౌండ్ల తర్వాత హారిక 5.5 పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించగా... తానియా ఆరు పాయింట్లతో తాన్ జోంగి (చైనా)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది.
అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా తాన్ జోంగి విజేతగా, తానియా రన్నరప్‌గా నిలిచారు. ఇదే టోర్నీ ఓపెన్ విభాగంలో భారత ఆటగాళ్లు సందీపన్ చందా, దేబాశిష్ దాస్ రజత, కాంస్య పతకాలను సాధించారు. బుధవారం జరిగిన బ్లిట్జ్ ఈవెంట్ మహిళల విభాగంలో భక్తి కులకర్ణి, తానియా సచ్‌దేవ్, హారిక వరుసగా 4, 5, 6వ స్థానాలను దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు ర్యాపిడ్ ఈవెంట్‌లో 13వ, బ్లిట్జ్ ఈవెంట్‌లో 12వ స్థానాలను సంపాదించాడు. క్లాసిక్ విభాగంలో మాత్రం లలిత్ బాబు ఏడో స్థానంలో నిలిచి వచ్చే నెలలో అజర్‌బైజాన్‌లో జరిగే ప్రపంచ కప్ పోటీలకు అర్హత సాధించాడు.